Sunday, October 11, 2015

ఈ లోకమునకు ఉప్పయి యున్నవారు

మత్తయి 5:13, ''మీరు లోకమునకు ఉప్పయి యున్నారు.  ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును?  అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్క బడుటకేగాని మరి దేనికిని పనికిరాదు.''  లూకా 14:34.
                ఉప్పు రకరకాల రుచులలో ఒకటి.  ఈ లోకములో ఉప్పును సముద్రపు నీటి నుండి తయారు చేయుచున్నారు.  ఇలాంటి ఉప్పును క్రీస్తు ప్రభువు తన బోధలో ఉపయోగించి బోధిస్తూ మనలను ఈ లోకమునకు ఉప్పుగా సంబోధించాడు.  ఇక్కడ మనము ఉప్పు యొక్క లక్షణాన్ని గ్రహించాలి.  ఉప్పు సమపాళ్లలో వేయబడిన ఏ వంటకమైన ఎంతో రుచిగా ఉంటుంది.  అంటే ఉప్పు ఆ వంటకములో మనకు కనిపించదు గాని రుచికరముగా మారి తినువారి నోటిలో లాలాజలమును ఊరునట్లు చేయును.  ఇది నేను తినలేకపోయానే అనే భావన వారిలో కలుగుట సహజము. అలాగే ఇంకా కొంచెము తింటే ఎంతో బాగుండునని కూడ వారి మదిలో కలుగవచ్చును.  దీనికి కారణము సమపాళ్లలో వేయబడిన ఉప్పు.  ఉప్పు ఇన్ని రకాలైన వంటకాలకు కొన్ని రకాల పానీయాలకుఅన్ని రకాల పచ్చళ్లకు ఆధారమైతే ఈ లోకానికి ఆధారము మనము.  మనము లేకపోతే ఈ లోకమే లేదు.  అయితే దేవుడు ఈ లోకమును సృజించి అందులో మనకు సాదృశ్యమైన ఆదాము అను మన పూర్వీకుని చేసి ఈ లోకానికి ఉప్పుగా ఉండమన్నాడు.  ఈ లోకానికి ఆధారము మనమే.  అందుకే నరులు దినదిన ప్రవర్థమానమై అభివృద్ధి చెందుటకు కారణమగుచున్నది.  నాకు తెలిసిన జ్ఞానమును తరువాత తరమునకు అందజేస్తున్నాను అంటే ఉప్పు తాను ఉన్న ప్రాంతమంతా ఒకే రుచిని కలిగిస్తుంది.  ఆ రుచిలో ఎంత వరకైనను పదార్థములో కలిపిన అంతటిని ఒకే రుచిని తెలుపుతుంది.  అలాగే మన జ్ఞానమును మనము ఇచ్చిన కొలది మరింత సారవంతమును జనుల మధ్య కలిగించవచ్చు.  ఇది శాస్త్ర జ్ఞానమునకు ఉపయోగపడు చున్నది.
                మనము క్రైస్తవ నిజదైవ జీవితమును జీవించుట కూడ పై దానికి మాదిరిగా ఉన్నది.  దేవుడు ఎలా ఉంటాడు?  ఆయన మనమధ్య జీవిస్తే ఎలా ఉంటుంది?  అన్న  భావనకు మన జీవితమే ఉదాహరణ కావాలని క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు.  మనతో జీవించు తోటివారు మనలనుండి ఏమి గ్రహించారు?  మనలోని సారమునే కదా!  అంటే నీతి సువార్తకు నిలయమై మనము జీవిస్తే మన తోటివారు మనలనుండి అదే సారమును పొందుతారు.  కీర్తన 1:1-3, ''దుష్టుల ఆలోచన చొప్పున నడువక  పాపుల మార్గమున నిలువక  అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక  యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు  దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.  అతడు నీటి కాలువల యోరను నాటబడినదై  ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును.''  ఈ విధముగా మనము జీవిస్తే మనలను అనుసరించువారు మన తోటివారు కూడ ఇందులోని మాధుర్యమును రుచిగా అనుభవిస్తూ ఆ ఫలమునకు ప్రతిగా తాము కూడ అలాగే జీవించాలని భావిస్తారు.  ఒకవేళ మనము దొంగతనము చేయువారుగా జీవిస్తుంటే మన చుట్టుప్రక్కల వారిని కూడబల్కుకొని వారిని కూడ దొంగతనానికి తీసుకొని ఆ సారము వారికి అందించి గజదొంగలుగా తీర్చుదుము కదా!  ఈనాడు టెర్రరిస్టులుగా మారినవారు ఆ లక్షణములు కలవానితో చెలిమి చేసి వానిలోని  ఉప్పును సారముగా పొంది దాని ఫలితమును వారు ఫలించుచూ నానా భీభత్సవమును సృష్టించుచున్నారు.  అంటే మనము ఏ స్థితిలో జీవిస్తున్నా మన శరీరములలో రహస్య స్థితిలో ఉన్న ఉప్పు యొక్క సారము ఖచ్చితముగా మన చుట్టుప్రక్కల వారికి వ్యాపించి వారిలో కూడ అదే ఫలమును ఫలింపజేస్తుంది.  అందుకే క్రీస్తు ప్రభువు మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారని చెప్పుచున్నాడు.  ఒక్కసారి ఉప్పు నిస్సారమైతే తిరిగి దానిని పొందుట కష్టము కదా!  అందుకే తిరిగి మొదటి స్థితి పొందుట కష్టమనిసారము కోల్పోయినదానిని బయట పారవేయుట ద్వారా అది ఎందుకు పనికిరాక దారిన పోవు మనుష్యులు త్రొక్కుట జరుగునని తెలియజేయుట జరిగింది.  అలాగే నిజదైవముననుసరించి  క్రైస్తవులుగా నీతిలో జీవించవలసిన మనము మన జీవితమును క్రీస్తుకు మాదిరిగా కొనసాగిస్తే కూరలో ఉప్పు ఏ విధముగా పాకుచూ రుచిని కలిగించునో అలాగే చుట్టు ఉన్నవారిలో కూడ మనలోని క్రైస్తవ జీవిత ప్రభావము పడునని గ్రహించాలి. 
                దీని ఫలితము మనతో కూడ మన చుట్టు జీవించువారిని కూడ పరలోక రాజ్య వారసులుగా చేయు అవకాశము కలదు.  అలాగే చెడు స్వభావము కలిగి మన చుట్టు ఉన్నవారిని ఆ స్వభావముతో ప్రేరేపించి అందరిని నాశన మార్గములో నడుపుటకు అవకాశము కలదు.  ఇలా జరిగితే మన జీవితము సారము లేని ఉప్పుగా మారి త్రొక్క బడునని క్రీస్తు ప్రభువు ఉపమానరీతిగా తెలియజేయుట జరిగింది.  ప్రకటన 14:19-20, ''కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసిదేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెనునూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్ళెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.''  ఈ విధముగా దేవుని కోపము సారము కోల్పోయి లోకములో వ్యర్థముగా జీవిస్తున్నవారిని తీర్పు దినమున పట్టణము వెలుపల వేసి త్రొక్కించుదునని చెప్పబడింది.  కనుక మనము చేయు ప్రతీది మన తరువాత తరముపై లేక మన తోటి వారిపై పడునని గ్రహించి చేయు ప్రతి విషయములో అది లోకమునకు ఉప్పుగా ఉన్నదా!  లేక సారము కోల్పోయి పనికిమాలిన స్థితికి ఈ లోకమును నడిపించుటకు ఉపయోగపడునా అని మనలను మనము పరీక్షించుకోవాలి.


                ఒక్కసారి ఆలోచించండి.  క్రీస్తు ప్రభువు తన జీవితములో ఉప్పును కలిగి యుండబట్టే ఆయనను ఈనాటికి నిజదైవముగా గుర్తించి ప్రార్థించుచున్నారు.  సారము కోల్పోయి నిస్సార జీవితములో జీవించువారిని తిరిగి మొదటి సారమును పొందాలంటే ఒకే ఒక అవకాశము మనకు ఉన్నది.  అదే పాపమును ఒప్పుకొని తిరిగి పాపము చేయక నీతిలో జీవిస్తూ క్రీస్తు ప్రభువు సువార్తకు ప్రతిరూపముగా జీవించాలి.  క్రీస్తు ప్రభువు ఈ సారము కోల్పోయిన ఉప్పు వంటి మనలను త్రొక్కుటకు పారవేయుటకు ముందే తన లేఖ ద్వారా హెచ్చరిక దయచేసియున్నాడు.  ప్రకటన 2:4-5, ''అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.  నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము.  అట్లుచేసి నీవు మారుమనస్సు పొందితేనే సరిలేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.''  ఇందులో చెప్పబడిన ప్రకారము మన మొదటి స్థితి పరలోకము అందలి నీతి పరలోక సంబంధమైనవే కదా!  అలాగే ఈ లోకములో జన్మించునాటికి ఎన్ని రకాలుగా మనము జన్మించినను ప్రతి ఒక్కరు ఈ జీవిత కాలములో మొదటి దశలో పాపరహితులుగా ఉన్నారు.  పసిపిల్లలో పాపము సాధారణముగా ఉండదు.  కాని పసిపిల్లలను మన అజ్ఞానముతో మనము మన జీవితము నిస్సారముగా మార్చుకొని విగ్రహారాధననరహత్యదొంగతనమువంటి రకరకాల చెడ్డ తలంపులతో జీవిస్తూ మన జీవితమును నిస్సారము చేయుట ద్వారా ఏ పాపము ఎరుగని పసిబిడ్డ సైతము మనలోని నిస్సారమును సారముగా పొంది మరీ నిస్సారమై పోతున్నారు.  ఒక విగ్రహారాధకుని పిల్లలు తెలిసి తెలియని స్థితి నుండే అదే విగ్రహారాధి కులుగా మారుచున్నారు.  ఇలా అందరు నిస్సారముగా మారుట త్రొక్కబడుటకని అనగా శిక్షను అనుభవించుటకు మాత్రమే అని గ్రహించి మనలోని ఉప్పు అను నీతిని నిస్సారమైన స్థితికి రానీయక ఈ లోకానికి ఆదర్శప్రాయముగా జీవించాలి.  అంటే మన మొదటి స్థితిలో మన జీవితమనే ఉప్పు సారమును కోల్పోక నీతిలోనే నిలిచి ఉన్నది.  కాలక్రమేణా చెడు తలంపులు దుష్‌క్రియలు దురలవాట్లు దానిని పాడుజేస్తూ నిస్సారముగా మార్చుట చేస్తున్నాము.  కనుక మన జీవితమును ఈ లోకమునకు ఉప్పుగా ఉండనిస్తామా!  లేక నిస్సారము చేసి వేరే వారిచే త్రొక్కబడునట్లు శిక్షను పొందుటకు సిద్ధపరచుకొందామా?  మన జీవితములను మనమే పరీక్షించుకోవలసి యున్నది. అంటే మన జీవితములో ఉప్పు మన చుట్టుప్రక్కల జీవించువారిలో ఎంత ప్రభావము చూపినదో ఒక్కసారి పరీక్షించుకోవాలి.  ఆ ప్రభావము నీతి సంబంధమైతే మన జీవితము ధన్యవంతమే!

Taken From: జేసునాధుని దివ్య వాక్కులు
గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసాNo comments :

Post a Comment