పరమగీతము

పరమగీతము
గ్రంథకర్త : శేఖర్‌రెడ్డి వాసా
రచనా సహకారము :  ఇమ్మానుయేల్‌ రెడ్డి  వాసా
(బబులోను జీవితము నుండి పరమయెరూషలేము జీవితములోనికి మారుచున్న షూలమ్మీతీకి క్రీస్తు ప్రభువుకు మధ్య జరిగే మానసిక సంఘర్షణే ఈ పరమగీతము)
మూలము
రెడ్డిపాళెం గ్రామములోని నా ప్రభువు తల్లి ఉపదేశములు మరియు ఆమెను ఆవరించిన పరిశుద్ధాత్మయొక్క జ్ఞాన సహాయమే ఈ పుస్తక రచనకు మూలాధారము.
అంకితము
నిజదైవము ఎవరు?  అనే అన్వేషణలో క్రీస్తు ప్రభువులోనికి అంచెలంచెలుగా నిజ క్రైస్తవ జీవితములోనికి వచ్చు షూలమ్మీతీకి ఈ పుస్తకమును అంకితమిస్తున్నాను.
-  వాసా శేఖర్‌రెడ్డి

గ్రంథ పరిచయము

        ప్రియపాఠకులారా! దేవుడు ఈ లోకమును చేసి అందులో జీవాత్మను సృజించాడు.  ఈ లోకములో సృజించబడిన ఈ ఆత్మలో నుండి ఈనాడు అనేక ఆత్మలు ఒకదాని తరువాత ఒకటి వచ్చుటకు మార్గము ఏర్పడి అలా వచ్చినవారమే మనమందరము.  ఇందులో ఈనాడు క్రైస్తవులు, అన్యులు ఉన్నారు.  క్రైస్తవులను క్రీస్తు ప్రభువు యెరూషలేము కుమార్తెలుగా వర్ణించాడు. అన్యులను సమర భీకర స్వరూపిణియైన స్త్రీగా అనగా బబులోను అను మహావేశ్యతో వర్ణించాడు. ఇక వీరిద్దరు కాక ఇంకొక రకము స్త్రీని వర్ణించుట జరిగింది. ఆ స్త్రీయే నల్లనిదియైన స్త్రీ. ఈ స్త్రీ పేరు షూలమ్మీతీ అని చెప్పబడింది. అంటే జీవాత్మగా ఈ లోకమునకు వచ్చిన తరువాత వారి క్రియలను బట్టి జీవాత్మ ముగ్గురు స్త్రీలుగా విభజింపబడినారు. వీరు నిజానికి వధువు సంఘముగా ఏకసంఘముగా ఉండ వలసినవారు.  క్రీస్తు ప్రభువు ప్రియునిగా ఈ ముగ్గురు స్త్రీల మధ్య జరిగే సంభాషణయే ఈ పరమగీతము.  క్రీస్తు ప్రభువు బబులోను అను స్త్రీ సంఘములో ఉన్న నశించువారిని వర్ణించుటయేగాక వారిలో మార్పును తీసుకొని వచ్చుటకు తాను పడే శ్రమను ఇందులో వర్ణించుట జరిగింది.  అలాగే బబులోను సంఘములో నుండి యెరూషలేము కుమార్తెగా నిజ క్రైస్తవ విశ్వాసములోనికి మారుచున్న విశ్వాసి యొక్క అన్వేషణ, వారిలో నిజమును తెలుసుకోవాలన్న తపన ఇందులో బహుసుందరముగా వర్ణిస్తూనే, పాతనిబంధనలోని యెరూషలేము దేవాలయము, నూతన నిబంధనలో మరియమ్మ యొక్క ఎన్నిక, యేసు తన ప్రేమను సిలువ రూపములో ప్రదర్శించుట, ఈ లోకములో క్రీస్తు ప్రభువు యొక్క బాధ్యతను శిరసావహించి ఆయన కాడిని మోయు సేవకులు వెయ్యి రూపాయలు సంపాదించగా ఈ లోకములో తాము పొందిన శ్రమగా క్రీస్తు ప్రభువు ముందు సమర్పించగా ఆయన వారి క్రియల చొప్పున ప్రకటన 2, 3 అధ్యాయములో వలె తీర్పు దినమున తిరిగి రెండువందల రూపాయలు అనగా అనేక బహుమతులను పొందుట, జీవాత్మలో పరిశుద్ధాత్మ క్రియలు, చివరిగా ఈ లోకములో క్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చిన ఆయన తల్లియైన కన్య మరియమ్మ క్రీస్తు ప్రభువును వరునిగా సిద్ధపరచి ఆయనకు కిరీటమును ధరింపజేయుట, అందుకు యెరూషలేములో వారసత్వము పొందిన విశ్వాసులను చూచుటకు పిలుచుట, మొదలైనటువంటి అద్భుతమైన సంఘటనలతో ఇందులో ఒకే ఒక గీతముగా రచించుట ఇది ఒక అద్భుతము.  దీనిని ఆమూలాగ్రము చదివి ఒక అనుభూతిని మరొకసారి పొందమని గ్రంథకర్తగా నేను ఆపేక్షిస్తున్నాను.  . . .        
నెల్లూరు                                                            ఇట్లు
11.10.2010.                                                 వి. శేఖర్‌ రెడ్డి
Contents

1.  సొలొమోను రచన - పరమగీతము

        పరమగీతము 1:1, ''సొలొమోను రచించిన పరమగీతము.''
        బబులోను జీవితము నుండి పరమయెరూషలేము జీవితములోనికి మారుచున్న షూలమ్మీతీకి క్రీస్తు ప్రభువుకు మధ్య జరిగే మానసిక సంఘర్షణే ఈ పరమగీతము.  ఇందులో సొలొమోను ఈ గీతమును రచించినట్లుగా చెప్పబడింది. ఈ ఎనిమిది అధ్యాయా లుగా చెప్పబడిన ఈ రచన ఒకే ఒక గీతము. అందుకే ఇంగ్లీషులో ''ది సాంగ్‌ ఆఫ్‌ సాంగ్స్‌'' అని చెప్పబడింది.  అంటే గీతాలలో ఉత్తమమైన గీతము.  కనుక ఈ గీతము చాలా విలువైనది.  కనుక బైబిలు గ్రంథములో దీనిని ఉంచుట జరిగింది.  అలాగే క్రీస్తు ప్రభువును గూర్చి - ప్రకటన 19:16, ''-రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడి యున్నది.''  
        ఇందులో . . .
        ''రాజులకు రాజు''  . . .  "King of Kings"
        ''ప్రభువులకు ప్రభువు''  . . .  "Lord of Lords"
        ''పరమగీతము''  . . .  "The Song of Songs"
        ఈ శైలిలో దీనిని తర్జుమా చేసి ఉంటే దీనిని కీర్తనలకు కీర్తన అని వ్రాసి యుండాలి.  కాని పరమగీతముగా దీనిని తర్జుమా చేయుట జరిగింది.  అలాగే ఇంగ్లీషులో కొన్ని వర్షన్స్‌లో "Song of Solomon" అని వ్రాయబడి యున్నది.  కనుక ఈ గీతము సొలొమోను రచించినప్పటికిని ఇది క్రీస్తు ప్రభువుకు సంబంధించిన గీతము.  సొలొమోను లోని జ్ఞానము క్రీస్తు ప్రభువు.  1 రాజులు 4:29-33.  ఇందునుబట్టి సొలొమోనులో జ్ఞానముగా ఉన్న క్రీస్తు ప్రభువు ఒక కీర్తనను రచింపజేశాడు.  ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు  సొలొమోనులో జ్ఞానముగా ఉండి ప్రేరణ ఇచ్చాడో వెంటనే ఎనిమిది అధ్యాయములలో ఈ గీతము రచింపబడినది.
        ప్రకటన గ్రంథము వ్రాసినది ఎవరు?  అని అడిగితే యోహాను అని చెప్పుదురు.  వ్రాయించినది ఎవరు?  అని అడిగితే క్రీస్తు ప్రభువు పత్మాసు ద్వీపములో యోహానుకు దేవుని దూతగా దర్శనమిచ్చి వ్రాయించెనని చెప్పుదురు.  అలాగే పరమగీతము అనగా కీర్తనలకు ఉత్తమమైన కీర్తనను క్రీస్తు ప్రభువు స్వయముగా సొలొమోనులో జ్ఞానముగా ఉండి అతనిని ప్రేరేపించి వ్రాయించుట జరిగింది. కనుక దీనిని మనము ఆత్మీయ అర్థముతోనే గ్రహించాలిగాని శారీరక దృష్టి అనగా కామేచ్ఛలతో దీనినిగూర్చి ఆలోచన చేయకూడదు.  కీర్తన లేక గీతము అంటేనే అలంకార రూపములో చెప్పబడును.  దానిలోని పరమార్థమును గూర్చి ఈ గ్రంథములో వివరముగా తెలుసుకొందము.

2.  నోటి ముద్దులు - ప్రేమ

        పరమగీతము 1:2, ''నోటిముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక  నీ ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము.''
        ప్రేమను అనేక రకములుగా వ్యక్తపరచవచ్చును. అందులో నోటి ముద్దుతో వ్యక్తపరచుట అందులో ఒకటి.  మన మూలవచనములో ప్రియుడు ప్రియురాలిని ముద్దిడి నట్లుగా వ్రాయబడింది. ఈ ముద్దులోని మాధుర్యమును గూర్చి ప్రియురాలు ద్రాక్షారసము లోని మాధుర్యము కన్నా ప్రియమైనదిగా ప్రియుడి ప్రేమ తనకు కనబడుచున్నట్లుగా చెప్పబడింది.  ఇందులో అతడు నన్ను ముద్దుపెట్టుకొనునని ప్రియురాలు చెప్పుచున్నది.  ఇందులో క్రీస్తు ప్రభువు ప్రియురాలైన సంఘమును ఏ విధముగా ముద్దు పెట్టుకొనుట జరుగును? ఎఫెసీ 5:27, ''అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైననులేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తనయెదుట దానని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.''  ఇందులో క్రీస్తు ప్రభువుకు భార్యగా సంఘమును గూర్చి చెప్పబడింది.  ఈ సంఘము పరమయెరూషలేముగా యుగాంతములో మారి క్రీస్తు ప్రభువుకు భార్యగా మారును.  ప్రకటన 21:9-10, ''అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి -ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.''  ఈ విధముగా యుగాంతము తరువాత ఈ సంఘము పరమయెరూషలేముగా మారును గనుక దీనికి ముందు అనగా ఇప్పుడు అనగా ఈ లోక సృష్టి మొదలు యుగాంతము వరకు ఆమె భార్య కాదు కదా!  అంటే ఎవరు కన్య.  కన్య పురుషునికి ప్రియురాలుగా ఉండును.  అంతేగాని భార్య కాదు.  భార్యగా ఎప్పుడు మారును?  వివాహము తరువాత.  కనుక సంఘము క్రీస్తు ప్రభువుకు ప్రియురాలుగాను క్రీస్తు ప్రభువును సంఘమునకు ప్రియుడుగాను ఇందులో వర్ణించుట జరిగింది.
        ఇందులో సంఘము అంటే ఎవరు? పరిశుద్ధులు అనగా జీవాత్మలమైన మనమే!  ఎవరైతే క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుకొని సంఘములో భాగస్థులమై జీవిస్తామో, ఎవరి క్రియలు సంఘములో అంత్య దినములలో పరిశుద్ధాత్మ పరీక్షించినప్పుడు నిలుచునో వారందరు సంఘముగానే నిర్ణయించబడుదురు.  కనుక మనమందరము  ఏకమైనప్పుడు ప్రియురాలుగాను, విడి విడిగా ఉన్నప్పుడు కన్యలుగాను వర్ణించబడింది.  ఎలా?  మనము విడివిడిగా ఉంటే కన్యకలుగా లెక్కింపబడుదుము.  మనమందరము సంఘములో ఏకమైతే పరమయెరూషలేముగా మారుదుము గనుక క్రీస్తు ప్రభువుకు ప్రియురాలుగా మారి చివరకు వివాహానంతరము భార్యగా మారుదుము. ఇందునుగూర్చి ఎఫెసీ 5:22-33 సవివరముగా వివరిస్తున్నది.  అందుకే ఈ పరమగీతములోని వర్ణన చదివేవారికి ఆత్మరీత్యా కొంత ఈ లోకరీత్యా కొంత ఉన్నట్లుగా అర్థమై తికమకకు గురి చేస్తున్నది, ఎందుకంటే క్రీస్తు ప్రభువు ప్రియునిగా నూతన నిబంధన కాలము వరకు అదృశ్యములోఉన్నాడు, నూతన నిబంధనకాలములో ఈ లోకములో భూమిపై యున్నారు. అటుతరువాత మరల అదృశ్య రూపములో ఉన్నారు. యుగాంతము తరువాత రెండవ రాకడగా వచ్చి సంఘమును తన భార్యగా చేసుకొనును. అలాగే ఈ సృష్టి మొదలు సంఘము ఈ లోకములో ఉన్నది.  ఈ సంఘము యుగాంతము వరకు ఈ లోకములో క్రియ జరిగించును.  కాని సంఘము రెండుగా విడిపోయి కొందరు పరదైసులలోను కొందరు ఈ లోకములో ఉన్నారు.  ఎలా?  మనకు ముందు తరములవారు ఈ లోకములో సంఘములో కన్యకలుగా ఉండి వారి మరణానంతరము పరదైసులలో చేర్చబడుచున్నారు. కనుక సంఘము అనగా ప్రియురాలు రెండు ప్రాంతాలలో తన కార్యములు కొనసాగించుచున్నది. అందులో పరదైసులో చీకు చింత లేక ఆనందముగా ఉంటే ఈ లోకములో సాతాను సమాజము క్రీస్తు సంఘముతో నిరంతరము పోరాటము కొనసాగుచున్నది.  ఇలాంటి ప్రియురాలిని క్రీస్తు ప్రభువు తన నోటి ముద్దులుతో తన ప్రేమను ఆమెకు చూపుట బహు ఆశ్చర్యముగా లేదా!
        నూతన నిబంధన కాలములో క్రీస్తు ప్రభువు సంఘమును నూతనపరచుచు ప్రభువు బల్లను ఏర్పరచాడు.  మత్తయి 26:26-29, ''వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి-మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.  మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి-దీనిలోనిది మీరందరు త్రాగుడి.  ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.  నా తండ్రి రాజ్యములో మీతో కూడ నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినమువరకు, ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.''  ఇది పరమగీతములోని ప్రియుని గుర్తు చేసుకొను విధానము.  ఈ ఆరాధనలో రొట్టెను ప్రభువు శరీరముగాను, ద్రాక్షారసమును ప్రభువు రక్తముగాను భావించి మనము దానిని పుచ్చుకొనుట జరుగును.  రొట్టెను ద్రాక్షారసమును పుచ్చుకొంటే క్రీస్తు శరీర రక్తములను పుచ్చుకొన్నట్టే.  ఆ రూపములో ప్రియురాలుగా ఉన్న కన్యకలైన మన మధ్యకు ప్రియుడుగా క్రీస్తు ప్రభువు మన ఆరాధనలో వచ్చినట్లుగా లెక్క.  ఏ రూపములో?  రొట్టెగాను ద్రాక్షారసముగాను వచ్చాడు.  ఈ విధముగా వచ్చిన క్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరి నోటికి రొట్టెగా, ద్రాక్షారసముగా అందించబడుట ద్వారా అవి మన నోటిని తాకుతాయి.  ఈ విధముగా క్రైస్తవ విశ్వాస సంఘస్థులు అనగా కన్యకల నోటిని తాకుట ద్వారా ప్రియురాలిని క్రీస్తు ప్రభువు ముద్దు పెట్టుకొన్నట్లుగా ఆధార పూర్వకముగా వ్రాయుట జరిగింది.
        ఇలా ముద్దు పెట్టుకొనుటలో క్రీస్తు ప్రభువు రెండు రకాలుగా వస్తాడు.  ఒకటవది రొట్టెరూపములో రెండవది ద్రాక్షారస రూపములో. రొట్టె రూపములో వచ్చే క్రీస్తు ప్రభువును మనము పెదవులకు పంటిని తగలకుండ నాలుకపై ఉంచుకొని మ్రింగుట చేస్తాము.  కాని ద్రాక్షారస రూపములో వచ్చిన క్రీస్తు ప్రభువు లాలాజలముతో కలసి నోటిని మొత్తము తాకుట జరుగును.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు ప్రియునిగాను ప్రియురాలుగా సంఘములోని కన్యకలను ముద్దిడును. ఈ ముద్దులోని మాధుర్యమును ఆస్వాదిస్తే రొట్టె కన్న ద్రాక్షారసము మధురముగా మనకు అనిపిస్తుంది. కాని మనము ఆ విధముగా దానిని ఆలోచించకూడదని అందులో ప్రియుని ప్రేమ చాలా మధురమైనదని చెప్పబడింది.
        ఈ ప్రేమను గూర్చి మనము ఆలోచిస్తే క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడై ఉండి మనకోసము ఈ లోకములో కన్యక ద్వారా జన్మించి సిలువ బలియాగమునకు ముందు తన ప్రేమను వ్యక్తపరచుట బల్ల భోజనము ద్వారా చూపుట జరిగింది.  అంత ఉన్నత స్థానములోని రాజు మనకోసము సాధారణ వ్యక్తిగా ఈ లోకములో జన్మించి జీవించుట ప్రేమకు నిదర్శనము కాదా! ఈ ప్రేమ ప్రభు భోజనమును పుచ్చుకొనునప్పుడు ఆయన మనలను ముద్దిడుచున్నట్లుగా భావించుకొనుచు ఆ మధురమును మనము ఆస్వాదించాలి.  ఈ మధుర ద్రాక్షారసమును బల్ల ఆరాధనలో త్రాగుట కన్న మధురమైనది.  కొద్దిగా పులియని ద్రాక్షారసము నోటికి తగిలినప్పుడు అది చాలా మధురముగా అనిపిస్తుంది కాని ఆయన ప్రేమను మనము ఇందులో ఆస్వాదిస్తే అత్యంత మధురమైనదిగా తెలుస్తుంది.  ఈ విధముగా ప్రియుడు ప్రియురాలిని విడరాని బంధముగా ముద్దు పెట్టుకోవాలని, ప్రియురాలైన సంఘము అందులోని కన్యకలమైన మనము ఆశించాలి.

3.  పూసికొను పరిమళతైలము - పోయబడిన పరిమళతైలము కన్యకలు ప్రేమించుట

        పరమగీతము 1:3, ''నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది  నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము  కన్యకలు నిన్ను ప్రేమించుదురు.''
        ఇందులో ప్రియురాలు - ''నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది అని చెప్పుచున్నది.  ఈ పరిమళతైలమును దేవుడైన యెహోవా మోషేకు చెప్పి చేయించాడు.  నిర్గమకాండము 30:22-29, ''మరియు యెహోవా మోషేతో ఇట్లనెను-నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తులముల యెత్తును నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులములును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధ ద్రవ్యమేళకుని పనియైన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటిని దీపవృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణము లన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతిపరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును.''   మరియు నిర్గమకాండము 30:33, ''దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.''  ఈ సుగంధమైన ప్రతిష్ఠాభిషేక తైలమును మందసము దాని సంబంధిత వస్తువులపై మాత్రమే చల్లాలి.  మందసములోని ప్రతి ఒక్కటి క్రీస్తు ప్రభువుకు సాదృశ్యముగా చేయబడినవే.  సాక్ష్యపు గుడారము - నమ్మకమైన సత్యసాక్షి - అనగా క్రీస్తు ప్రభువుకు సాదృశ్యమైనది.  ఇలా ప్రతి ఒక్క దానిని గూర్చి మనము చెప్పగలము.  ఇలాంటి పరిమళమైన తైలము ప్రతిష్ఠాభిషేక తైలముగా మందసము దాని సంబంధిత వస్తువులపై చల్లబడును లేదా పూయబడును.  అంటే దానిలో ప్రతి వస్తువు క్రీస్తు ప్రభువుకు సాదృశ్యమైనప్పుడు దానికి తైలము పూసిన అది క్రీస్తు ప్రభువుకు పూసినట్లుగా లెక్కింపబడును. హెబ్రీ 1:9.  కనుక క్రీస్తు ప్రభువు మందసములోని వస్తువులు అక్కడ ఉండగా తైలమును క్రీస్తు ప్రభువుకు పూసేవారు.  అందువలననే మందసము చాల అద్భుతములు ఆ కాలములో చేసేది.  ఇలాంటి తైలము ఇక ఎవరు చేయకూడదని దేవుని ఆజ్ఞ.
        అలాగే ''నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము.''  ఎంత వివరముగా ఈ వచనములో అలంకార ప్రాయముగా వర్ణించబడింది.  నీ పేరు అనగా ప్రియుని పేరు.  ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువును ప్రియునిగా వర్ణించారు.  ఈ వచనములో నీ పేరు అంటే యేసుక్రీస్తు పేరే.  యేసుక్రీస్తు పేరు పోయబడిన పరిమళతైలముతో సమానమని చెప్పబడింది.  ఎలా?  ఈ పోయబడిన పరిమళతైలమును ప్రతిష్ఠాభిషేక తైలముగా పాతనిబంధనలో పిలువబడింది.  అలాగే ఈ లోకములో జన్మించిన దైవకుమారుని పేరు ఏమిటి?  క్రీస్తు లేక యేసు.  యేసు అనగా రక్షకుడు  క్రీస్తు అనగా అభిషిక్తుడు.  లూకా 2:11, ''దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.''  యోహాను 1:42, ''యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను.  మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము.''  ఇది అందరికి తెలిసినదే.  ఈ విధముగా ప్రియుని పేరు పోయబడిన పరిమళతైలముతో సమానమైనది.
        ఇలాంటి అభిషిక్తుడైన యేసును అనగా క్రీస్తు ప్రభువును కన్యకలు నిన్ను ప్రేమించుదురు అని చెప్పబడింది.  కన్యకలు ఎవరు?  అంటే పరిశుద్ధులమైన మనమే.  ఎవరైతే దేవునిలో పరిశుద్ధులుగా జీవిస్తారో వారు కన్యకలు.  వారు మగవారు కావచ్చు లేక ఆడవారు కావచ్చు.  వారిలో పెండ్లి అయినవారు కావచ్చు లేక పెండ్లి కానివారు కావచ్చు లేక పసిపిల్లలలో బాలికలు కావచ్చు లేక బాలురు కావచ్చు.  వీరిలో ఎవరైన రక్షకుని యందు విశ్వాసముంచిన వారు అనగా ఆడ మగ అను తేడా లేకుండ దేవుని పిల్లలుగా లెక్కింపబడుదురు.  యోహాను 1:12, ''తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.''  వీరంతా యుగాంతములో గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు అను ప్రియునికి వధువుగా మారుదురు.  చివరకు వివాహానంతరము భార్యగా మారుదురు కనుక ఈ లోకరీత్యా వీరు పవిత్ర స్థితిలో ఏ దశలో వారి జీవితము ఉన్నను వారందరు కన్యకలే.  కనుక ఈ కన్యకలమైన మనమందరము ఆయనను ప్రేమించుదుమని వ్రాయబడింది.  వీరు ప్రేమ ఎంతవరకు చూపుచున్నారో ఒక్కసారి తెలుసుకోవలసిన అవసరత ఉన్నది.  కన్యకలుగా పిలువబడిన అపొస్తలులు ప్రపంచ నలుమూలల క్రీస్తును గూర్చి ప్రచారము చేసారు.  క్రీస్తు ప్రేమకు దూరమై జీవిస్తున్న కన్యకలను మీరు చెడిన స్థితిలో ఉన్నారు.  నిజానికి మన ప్రియుడు రక్షకుడు క్రీస్తు ప్రభువేనని వీరు సువార్త ప్రచారము చేసారు.  దైవవ్యతిరేకులచే చంపబడినారు.  అలాగే హతసాక్షులు ఆయనను అనగా తమ ప్రియుని గూర్చి తాము ఇచ్చు సాక్ష్యమును గూర్చి తమను చంపుచున్నను ఎలాంటి సంకోచము చూపకుండ వారు తమరీ ప్రేమను వెల్లడి చేసారు.  అలాగే విశ్వాసులు హతసాక్షులయొక్క మరణమును చూస్తూ కూడ విశ్వాసములో చెదరక అలాగే ఉన్నారంటే వారి ప్రేమ అలాంటిది.  ఇంతకి ఒక్క విషయము గమనించారా!  మనకు ఏ పని పాట లేదనా మనము ఆదివారము ఆరాధనకు ఖచ్చితముగా వెళతాము?  క్రీస్తు ప్రభువుపై ఉన్న ప్రేమతోనే కదా!  ఎన్ని పనులున్నను అవన్ని ప్రక్కన పెట్టో లేక ముందుగా కష్టించి పని చేసేసి సమయానికి ప్రియుని సన్నిధికి వెళ్లుట లేదా!  ఈ విధముగా కన్యకలుగా మనము ఆయనను ప్రేమించుచున్నాము.
        మరి కన్యకలకు మనలను ఎందుకు పోల్చబడింది?  అని ఆలోచిస్తే కన్యక అని ఎవని గూర్చి అంటారు? పురుషునితో సంబంధము లేని స్త్రీని కన్యక అని అంటారు.  అంటే ఈ కన్యక అంటే ఏ దోషము లేని స్త్రీ అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది.  ఎవరిలో అయితే 10 ఆజ్ఞలకు వ్యతిరేక జీవితము ఉండదో వారందరు పాపము లేని కన్యలు.  ఇలాంటి కన్యకలు క్రీస్తు ప్రభువును ప్రేమిస్తారు.  పాపపు జీవితములో జీవించువారు అనగా ప్రకటన 21:8, ''పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికు లందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.''  ఇలా చెప్పబడినవారు మలినముతో నిండిన కన్యకలు వీరిని ఆత్మ రీత్యా వ్యభిచారులు అని యిర్మీయా ప్రవచించియున్నారు.  ఎవరైతే దేవునిలో జీవించుచు ఆయనయందు మనస్సు కలిగి ఉందురో వారు కన్యకలు గనుక ఆయనను తమ ప్రియునిగా ఆరాధించుట అనగా ప్రేమించుట జరుగును.  మత్తయి 25:10.

4.  ఆకర్షించుట - పరుగెత్తి వచ్చుట - చేర్చుకొనుట (సంతోషముతో ప్రేమను స్మరించుచు ప్రేమించుట)

        పరమగీతము 1:4, ''నన్ను ఆకర్షించుము  మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము  రాజు తన అంత:పురములోనికి నన్ను చేర్చుకొనెను  నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము  ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము  యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు.''
        ''నన్ను ఆకర్షించుము,'' అని అనుటలో ఎవరిని ఎవరు ఆకర్షించాలి?  ప్రియురాలు ప్రియునితో నన్ను ఆకర్షించుము అని చెప్పుట జరిగింది.  అంటే క్రీస్తు ప్రభువు పురుషునిగా సంఘము ప్రియురాలుగా మనము చెప్పుకొన్నాము.  క్రీస్తు ప్రభువు సంఘమును ఏ విధముగా ఆకర్షిస్తాడో తెలుసుకొందము.
        ప్రకటన 22:17, ''ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.''  ఇందులో ఆత్మ, పెండ్లి కుమార్తె అయిన ప్రియురాలు, విశ్వసించిన విశ్వాసి అనగా కన్యక అందరు రమ్ము అని పిలుస్తున్నారు.  ఎవరిని?  ఎవరిలో నైతే క్రీస్తు ప్రభువునందు విశ్వాసము లేక జీవిస్తున్నారో వారిని పిలుస్తున్నారు.  ఆత్మయైన దేవుడు జీవాత్మను పిలుస్తున్నాడు.  సంఘము తనలో అప్పటిదాక చేరిన కన్యల క్రియలన్నిటిని ఐక్య రీతిన చూపుచు పిలుస్తున్నది.  విడివిడిగా సంఘముగా కాకుండ కూడ జీవాత్మయైన నరుడు అనగా విశ్వాసి అనగా కన్య పిలుస్తుంది.  ఇంతమంది పిలుస్తున్నను ఇందులో ఒక లోపము మనకు కనిపిస్తుంది.  అదేమిటంటే ప్రియురాలుగా తాను వచ్చు కన్యకు ఇంకొకరు ఆకర్షించాలని కోరుకొంటున్నారు.  ఈ కన్య అనగా ప్రియురాలు ఎవరిని ఆకర్షించమని కోరుకొంటున్నది?  క్రీస్తు ప్రభువునే కదా!  అందుకే క్రీస్తు ప్రభువు - సిలువపై నుండి ఆకర్షిస్తేనే గాని ఎవరును ఆయన యొద్దకు రాలేరని చెప్పుచున్నారు.  యోహాను 12:32, ''నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.''  అంటే సిలువపై వ్రేలాడుచు రక్తసిక్తమై మరి కొద్ది క్షణములలో మరణించబోవు స్థితిలో ఉన్న క్రీస్తు ప్రభువును ప్రియురాలు అనగా సంఘము తనను ఆకర్షించమని కోరుకొంటుంది.  అంటే రక్షణ ఒక సిలువ బలిలోనే ఉన్నది.  ఈ బలిని అర్పించి క్రీస్తు ప్రభువు ఆకర్షించుట జరిగితే, రక్షణలోనికి రాగలుగుదురు.  అందుకే నేను ఇన్ని ఆత్మలను రక్షించాను అని విర్రవీగుట విశ్వాసికి తగదు.
        ఎప్పుడైతే సిలువపై యున్న క్రీస్తు ప్రభువు ఆకర్షించాడో ప్రియురాలైన కన్యకలు ఆకర్షించబడి మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము అని చెప్పుచున్నది.  నన్ను ఆకర్షించమని సంఘము అను కన్యక అడిగినందున, తరువాత ప్రియురాలుగా ఆకర్షించబడిన కన్యక లందరు కలిసి నీయొద్దకు పరుగెత్తి వచ్చెదమని చెప్పుట జరిగింది. ఎఫెసీ 2:19.  ఎక్కడికి వస్తారు?  రక్షణలోకి తరువాత ప్రియురాలుగా ఏక సంఘములోనికి తరువాత క్రీస్తుతో బాటుగ పరలోకమునకు వెళ్లుటకు పరుగెత్తి వస్తారు.  వచ్చేవారు నెమ్మదిగా రావటము లేదు.  ఆయన ఆకర్షణ అలాంటిది.  ఒక్కసారి ఆకర్షింపబడితే ఇక క్షణమైన ఆగలేరు.  వారి మనస్సు రక్షణ పొందాలన్న తపనతో పరుగులు తీస్తుంది.  కనుక ఆకర్షించబడిన కన్యకలు ప్రియురాలుగా మారుటకు పరుగెత్తుకొని వచ్చుట జరుగును.
        ఇలా పరుగెత్తుకొని వచ్చినవారిని రాజు తన అంత:పురములోనికి నన్ను చేర్చుకొనెను అని చెప్పుచున్నది.  ఇందులో చెప్పబడిన రాజు ఎవరు?  సంఘముయొక్క ప్రియుడైన క్రీస్తు ప్రభువే.  ఎలా?  లూకా 23:3, ''పిలాతు -నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన-నీవన్నట్టే అని అతనితో చెప్పెను.''  నీవు యూదుల రాజువా?  అంటే నీవన్నట్టే అని క్రీస్తు ప్రభువే స్వయముగా చెప్పుట జరిగింది.  ఈ రాజు దావీదు సింహాసనమును యుగయుగములు ఏలునని చెప్పబడింది.  లూకా 1:32, ''ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడన బడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.''  తూర్పు దిక్కునుండి వచ్చిన జ్ఞానులు కూడ హేరోదును క్రీస్తు ప్రభువును గూర్చి విచారిస్తూ యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ అని మత్తయి 2:1-5లో చెప్పబడింది.  కనుక పరమగీతములో చెప్పబడిన రాజు క్రీస్తు ప్రభువు.  
        ఇలాంటి రాజు ఎప్పుడైతే తనను ఆకర్షించాడో ఎప్పుడైతే ఆ ఆకర్షణకు ఆకర్షించబడి కన్యలందరు పరుగెత్తుకొని వచ్చారో వారందరు ఒకే క్రీస్తు సంఘమైనందుకే ''నన్ను'' అన్న ఏకవచనం ఇందులో చెప్పబడింది.  యెరూషలేమను క్రీస్తు సంఘమును తన అంత:పురములోనికి చేర్చుకొంటాడు.  ఈ అంత:పురము పరలోక రాజ్యమే.  ఈ రాజ్యములో అనేక గృహములు ఉన్నట్లుగా క్రీస్తు ప్రభువు తెలియజేశాడు.  యోహాను 14:2-6, ''నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.  నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.  నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.  నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.  అందుకు తోమా-ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా యేసు-నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.''  కనుక పరలోక రాజ్యములో జీవాత్మకు సంబంధించిన నివాసములు ఉన్నాయి.  అవి రాజైన క్రీస్తు ప్రభువునకు సంబంధించినవి గనుక ఆయన తన ప్రియురాలుగా వచ్చుచున్న జీవాత్మలమైన మనకు వీటిని సిద్ధపరచి మనలను తనతో తీసుకొని పోవును.  ఇక్కడ తన ప్రేమ ఎంత గొప్పదో చూడండి.  క్రీస్తు ప్రభువే మన కొరకు మనముండవలసిన నివాసములను సిద్ధపరచును.  ఈ విధముగా ప్రియుడు ఆకర్షించగా పరుగెత్తుకొచ్చిన ప్రియురాలిని పరలోకములో తన అంత:పురములలో చేర్చుకొని బహు ఆదరణతో చూచుకొనును.
        ఇంతటి సర్వోన్నత స్థానమును క్రీస్తు ప్రభువు ఇచ్చును కనుక ఆయన మనకు అండగా ఉండుటను బట్టి మేము అనగా కన్యకలైన విశ్వాసులందరు సంతోషించుటయేగాక ఉత్సహించెదరని వ్రాయుట జరిగింది.  అంటే క్రీస్తు ప్రభువు విషయములో దావీదు మందసమును ఊరేగించుచు యెరూషలేమునకు తీసుకొని వచ్చుచు కీర్తనలతో, వాయిద్యములతో, నాట్యములతో ఆయన విషయములో ఉత్సవములు చేయుట జరిగింది.  అలాగే క్రీస్తు ప్రభువు నూతన నిబంధన కాలములో యూదుల రాజుగా యెరూషలేమునకు వచ్చునప్పుడు ఒక ఉత్సవమే జరిగింది.  మత్తయి 21:6-11, ''శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.  జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగున పరచిరి.  జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చు చుండినవారును -దావీదు కుమారునికి జయము  ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక  సర్వోన్నతమైన స్ఠలములలో జయము  అని కేలు వేయుచుండిరి.  ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు-ఈయన ఎవరో అని కలవరపడెను.  జనసమూహము-ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.'' ఈ విధముగా క్రీస్తు ప్రభువును బట్టి విశ్వాసులందరు సంతోషించుటయేగాక ఉత్సవములు కూడ చేసుకొంటారు.  ఇది భూలోకములో మాత్రమేగాక మన మరణానంతరము పరలోకములో కూడ జరుగును.  ప్రకటన 7:9-10, ''అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను.  వారు తెల్లని వస్త్రములు ధరించు కొన్నవారై, ఖర్జూలపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను నిలువబడి -సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.''  అలాగే ప్రకటన 14:1-3, ''మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను.  ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువదినాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.  మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.  వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.''  అలాగే ప్రకటన 19వ అధ్యాయము, 21వ అధ్యాయములో నిశ్చితార్థము, వివాహ సంబంధమైన ఉత్సవాలు జరుగును.  కనుక క్రీస్తు ప్రభువును బట్టి ఇవన్ని జరుగుచున్నట్లుగా మనము గ్రహించాలి.  
        ఇంతటి ఉన్నత స్థానమును దేవుడు దయచేసినందుకు ఈ ప్రియురాలు ఆయన ప్రేమలోని మాధుర్యమును చవి చూస్తూ నిరంతరము స్మరించుకొనుచు యథార్థమైన మనస్సుతో కన్యలందరు క్రీస్తు ప్రభువును ప్రేమించుదురని చెప్పబడింది.  ఇందులో ఏ అనుమానము లేదు.  నిజ క్రైస్తవ విశ్వాసులందరు ఆయనను ఎక్కువగా ప్రేమించుదురు.  ఆయన ప్రేమను నిరంతరము గుర్తు చేసుకొనుచు సంతోషించుచు అప్పుడప్పుడు ఆయనగూర్చి పండుగలు ఉత్సవాలతో ఆ ప్రేమను వ్యక్తపరచుట జరుగును.

5.  నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను (కేదారువారి గుడారములు - సొలొమోను నగరు తెరలు)

        పరమగీతము 1:5, ''యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను  కేదారువారి గుడారములవలెను  సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను.''
        ఇందులో యెరూషలేము కుమార్తెలను గూర్చి సంబోధిస్తూ ప్రియురాలైన సంఘము తనను నల్లనిదానిగా చెప్పుకుంటూనే నేను సౌందర్యవంతురాలునని చెప్పబడింది.  పరమగీతము 1:1-4లో ప్రియురాలు ఒకటిగా ఉన్నట్లుగా వ్రాయబడింది.  కాని పరమగీతము 1:5లో ఆ ప్రియురాలు రెండుగా విడిపోయినట్లుగా వ్రాయబడి అందులో ఒక భాగము యెరూషలేము కుమార్తెలుగాను, రెండవ భాగము నల్లనిదియైన సౌందర్యవంతురాలుగా చెప్పుకొన్న కుమార్తెగాను రెండు భాగాలుగా కనబడుచున్నది.
        ఇందులో చెప్పబడిన యెరూషలేము కుమార్తెలు ఎవరు? వీరు పాపము చేయక దైవప్రజలుగా ఉన్నవారు.  ఈ సృష్టి ప్రారంభములో వీరు ఉన్నారు.  మొదట ఆదాము హవ్వలను దేవుడు యెరూషలేము కుమార్తెలుగా చేస్తే వారు పాపముచేసి దేవుడు తినవద్దన్న పండును తిని దేవునిలో స్థానమును కోల్పోయి ఏదెను వనము నుండి త్రోసివేయబడినారు.  అయినప్పటికి వారు దేవుని రక్షణను చర్మపు దుస్తులుగా అనుగ్రహింపబడి ఇక పాపము చేయక వారి సంతానము దేవుని కుమారులుగా పిలువబడినారు.  ఆదికాండము 4:26 మరియు ఆదికాండము 6:1-4.  ఈ దేవుని కుమారులు అనగా ఆదాము సంతానము యెరూషలేము కుమార్తెగా లెక్కించాలి.  మిగిలినవారు తప్పిన జీవితములో ఉన్నారు.  వీరు ఎంత తప్పిపోయినను ఒకే జీవాత్మలోని భాగమే కదా! అందుకే మన మూలవాక్యములో కూడ రెండు రకాలుగా వర్ణించాడు. పరమగీతములో ఆఖరిలో ఈ వర్ణన రాలేదు.  మొదటి వచనము వ్రాసిన రచయితను గూర్చి చెప్పి రెండవ వచనము ఆయన ప్రేమలోని మధురమును చెప్పి మూడవ వచనములో ఆయన ఎవరో కన్యలుగా ఉన్నవారెవరో చెప్పి ఆయన ఆకర్షణ ఆయన ఇయ్యబోవు ఉన్నత స్థానమును చెప్పి వెంటనే విడిపోయిన ప్రియురాలిని గూర్చి చెప్పుచున్నారు. అంటే ఈ సృష్టి ఆదిలోనే ఈ సంఘము ఏకసంఘముగా ఏర్పరచబడినను పాపము ద్వారా రెండుగా విడిపోవుట జరిగింది.        
        ఈ విడిపోయిన సంఘము యుగాంతము వరకు అలాగే ఉంటున్నది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు యెరూషలేము కుమార్తెలుగాను, అన్యజాతివారు నల్లనిదియైన  స్త్రీగాను ఉన్నారు.  ఇప్పుడు అనగా క్రీస్తు ప్రభువు తరువాత క్రైస్తవులందరు యెరూషలేము కుమార్తెలైతే ఇంకను రక్షణ పొందనివారు నల్లనిదియైన స్త్రీలుగా ఉన్నారు.  ఈ విధముగా క్రీస్తు ప్రభువుయొక్క ప్రియురాలైన సంఘము రెండు భాగాలుగా మారి యెరూషలేముగాను, మహాబబులోనుగాను ప్రకటన గ్రంథములో చెప్పబడింది.  ఇంతకి నల్లనిదనము ఎందుకు వచ్చింది?  పాపము మనిషిలో మురికిగా దేవునికి కనిపిస్తుంది.  అందుకే ప్రకటన 7:13-14, ''పెద్దలలో ఒడు-తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు?  ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.  అందుకు నేను-అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను-వీరు మహా శ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.''  పాపములు మురికిగా చెప్పబడి అది ఉదుకుట ద్వారా పోగొట్టుకొన్నట్లుగా చెప్పబడింది.  ఈ మురికిగా ఉన్న వ్యక్తి మనకు ఎలాగున కనిపిస్తాడు?  నల్లగా మురికిగానే కదా!  ప్రకటన 16:8, ''నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను.''  ఇలా ఎవరిని కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడింది?  భూమిపై ఉన్న మనుష్యులను.  కనుక భూమిపై యుగాంతములో పాపులే తప్ప పరిశుద్ధులు ఉండరు కదా! కనుక ఎండ వేడి తగిలి మనుష్యులు నల్లబడుతారు.  అలాగే పాపములో ఉన్న నరులను నల్లనిదానిగా చెప్పుట జరిగింది.  ఇలా ఏకసంఘముగా ఉండవలసిన యెరూషలేము పవిత్రులు అపవిత్రులుగా విడిపోయి, పవిత్రమైనవారిని యెరూషలేము కుమార్తెలుగాను, అపవిత్రమైనవారిని నల్లనిదియైన బబులోనుగాను వర్ణించుట జరిగింది.  యిర్మీయా గ్రంథములోను, యెహెజ్కేలు 16:48-49లో దేవుడు తన ప్రవచనాలలో బబులోను యెరూషలేమునకు అక్కగా వర్ణించుట యెరూషలేమును చెల్లెలుగా వర్ణించుట ఇద్దరు పాపములో మ్రగ్గుచున్నట్లుగా చెప్పుచు ఇద్దరిని శిక్షిస్తానని అనేక ప్రవచనాలలో చెప్పబడింది.  కనుక రెండుగా విడిపోయినను నరులమైన మనమే మన క్రియల వలన అలా కనబడుచున్నాము కనుక పరమగీతములతో అలా వర్ణించుట జరిగింది.  కాబట్టి ఆత్మరీత్యా ఆ నల్లనిదనము పాపముల వలన దేవుని నుండి దూరముగా జీవించుట వలన వచ్చిందేగాని శరీరరీత్యా ఆమె చూచుటకు సౌందర్యవంతురాలే.
        ఇక కేదారువారి గుడారములు వలె సొలొమోను నగరు తెరలువలె ఆమె అనగా బబులోను సౌందర్యవంతురాలనని చెప్పుచున్నది.  ఇది ఈ లోకము చూచుటకు కనబడు వాటితో పోల్చి అలంకార ప్రాయముగా చెప్పుట జరిగింది.  గుడారములు చేయుటలో కేదారువారు ఆ దినములలో ప్రసిద్ధిని పొంది యుండాలి, అలాగే సొలొమోను తన నగరమును నిర్మించినప్పుడు అందులో తెరలు కట్టి ఆ నగరమును సుందరముగా చేసి ఉంటారు. ఆ రోజులలో యెరూషలేము ఆలయము, సొలొమోను నిర్మించిన నగరము చాలా ప్రసిద్ధి చెందాయి.  కనుక అలాంటి అద్భుతముగా కనిపించే వాటితో పాపపు స్థితిలో ఉండి నల్లగా ఆత్మరీత్యా కనబడుచున్నను విడిపోయిన సంఘమైన బబులోను సౌందర్యమును పోల్చుట జరిగింది.

6.  చిన్న చూపు చూచుట - ద్రాక్షతోటకు కావలికత్తెగా ఉంచుట

        పరమగీతము 1:6, ''నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.  నేను ఎండ తగిలినదానను  నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచిరి  అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.''
        నల్లనిదాననని ఈమెను చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు?  ఉదాహరణకు త్రాగుడు అలవాటు ఉన్నవారు త్రాగుడు అలవాటు లేనివారు మన సమాజములో కనిపిస్తారు.  త్రాగుడు అలవాటు ఉన్నవారు కూడ తాను చేయునది పాపమని తెలిసినను జీవితమును ఎంజాయ్‌ చెయ్యాలని అలా పాపము చేస్తున్నామని చెప్పుదురు.  అలాగే త్రాగుడు అలవాటు లేనివారు త్రాగేవారిని చూచి చెడిపోయినవారుగా పనికిమాలినవారుగా వర్ణిస్తారు.  దీనికి కారణము మంచివారిలో త్రాగుడు అనునది వ్యసనమని భావించుట.  నిజమే!  మహా జ్ఞాని సొలొమోను సైతము త్రాగుడు తప్పని చెప్పారు.  లోతు వంటివారు  తన కూతురుతో తప్పు జరుగుటకు ఈ అలవాటు కారణమైంది మనకందరికిని తెలుసును.  అలాగే పాపములో జీవించువారు నిజదైవమును విడనాడి ఆయన ఆజ్ఞలను మీరి జీవించువారు నల్లనివారుగా మనము ముందు విభాగములో చెప్పుకొన్నాము.  ఇలాంటి వారిని సహజముగా మనము చిన్న చూపు చూస్తాము. సమాజములో వీరికి అంత విలువ ఉండదు.  అలాగే యెరూషలేము అను పరిశుద్ధ సంఘము కూడ ఈమెను చిన్న చూపు చూస్తున్నది.  దీనికి కారణము ఈ నల్లనైన బబులోను చెప్పుచు నేను ఎండ తగిలినదానను అని చెప్పుచున్నది.  ముందు విభాగములో ప్రకటన 16:8లో పాపము చేసినవారిని ఎండ వేడితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడింది.  కనుక పాపము చేసి ఎండ వేడికి గురియై యెరూషలేములో ఉండవలసిన సంఘము వేరై బబులోనుగా మారిపోయింది.
        ఎప్పుడైతే యెరూషలేము నుండి పాపము వలన విడిపోయి బబులోనుగా మారి పోయిందో ఈమెను ఈమె సహోదరులు ఆమె మీద కోపగించి ద్రాక్షతోటకు కావలికత్తెగా ఉంచారు.  ఇందులో చెప్పబడిన - ''నా సోదరులు'' ఎవరు?  ఆమె మీద ఎందుకు కోపగించారు?  నరులకు సహోదరులు ''దేవుని దూతలు.''  ప్రకటన 22:8-9, ''యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు-వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.''  సహదాసుడుగా ఇందులో దేవుని దూత చెప్పుట మనము చూడగలము.  కనుక దేవుని దూతలు జీవాత్మయైన నరులకు సహోదరులును సహదాసులుగా దేవునికి యున్నారు.  కనుక ఈ దేవుని దూతలు యెరూషలేముకే కాదు బబులోనుగా విడిపోయిన సంఘమునకు కూడ సహోదరులే.  కనుక ఈ దేవుని దూతలు ఆమెపై కోపించి ఆమెను ద్రాక్షతోటకు కావలికత్తెగా నుంచారు. ఆదికాండము 4:2, ''తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలునుకనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు.''  ఆదికాండము 9:20, ''నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను.''  ఏదెను వనము నుండి తరిమి వేయబడిన తరువాత ఆదాము హవ్వలకు జన్మించిన వారిలో కయీను సేద్యము చేస్తూ తోటను వేసి వాటికి కావలిగా ఉండేవాడు.  కయీను హేబెలును హత్య చేసి పాపము చేయుట జరిగింది.  కాని కయీనులో ఆ తలంపు ద్వేష స్వభావము సేద్యము చేయక ముందు నుండి ఉన్నట్లుగా మనము గ్రహించాలి.  యెరూషలేము కుమార్తెగా హేబెలు జీవితము ఉంటే నల్లనిదైన బబులోను కుమార్తెగా కయీను జీవితము ఉన్నది.  ఈ విధముగా దేవుని దూతలు కయీను పాపపు ఆలోచనతో జీవిస్తుండుట వలన అతనిని శోధించుటకు అతని ద్వారా పొలము పంటను, నోవహు ద్వారా ఆదికాండము 9:20 ద్రాక్షతోటను వేయించి దానికి కాపలాగా ఉండుటకే ప్రేరేపించి ఆ విధముగా కావలిగా ఉంచుట జరిగింది.  అదృశ్యములో దేవుని దూతలు అలా చేస్తే, దృశ్యములో కయీను కావలి కాస్తున్నాడు. నల్లనిదియైన బబులోనులో నివసిస్తున్న నోవహు ఏమి చేస్తున్నాడు?  మత్తుడై తోటకు కావలి కాస్తున్నాడు.
        అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అని తన బాధను ఇందులో నల్లనిదైన బబులోను చెప్పుట చదువగలము.  సొంత తోట ఏదెను వనము.  దేవుడు ఆ తోటను వేసి దానిని స్వాస్థ్యముగా అనుభవించుచు కావలి కాయుమని అందులో ఆదాము హవ్వలను ఉంచుట జరిగింది. కాని పాపము చేయుట వలన వారు దాని నుండి త్రోసివేయబడ్డారు.  అంటే వారి సొంత తోట నుండి త్రోసివేయబడి భూమిపై జీవించ సాగారు.  ఈ స్థితిలో కయీనును అతని సహోదరులైన దేవుని దూతలు ప్రేరేపించి తోటను వేయించుట వలన కయీను దానికి కాపలాగా ఉన్నాడు. నిజానికి తాను కావలి కాయవలసిన తోట ఏదెను కాని దానిని కయీను తండ్రియైన ఆదాము దానిని పోగొట్టు కొనుట జరిగింది.  పాపము వలన కయీను నోవహు అతనివలె పాపపు స్థితిలో ఉన్నవారు కావలికత్తెలుగా బబులోనుగా ఉన్నారు.
        అలాగే పాతనిబంధనలో అబ్రాహాము కుమారుడైన యాకోబును మరల ఎన్నుకొని ఇశ్రాయేలీయులను తన రాజ్యముగా యెరూషలేము కుమార్తెలుగా ఎన్నుకొన్నాడు.  మిగిలినవారు బబులోనుగా ఉన్నారు.  అప్పుడు కూడ యెరూషలేము కుమార్తెలు తమ స్వంత తోటను కావలి కాస్తుంటే దానిలో ఉండి తమ స్వంత తోటలను కాయవలసిన నల్లని కుమార్తెలు యెరూషలేమునకు బయట అన్యజాతులుగా అక్కడ తోటలను కాస్తున్నారు.  ఈనాడు క్రీస్తు ప్రభువు క్రైస్తవ సంఘమును యెరూషలేము సంఘముగా ఏర్పరిస్తే క్రైస్తవులు అను యెరూషలేము కుమార్తెలు చర్చీలను కావలి కాస్తూ దానిలోని ద్రాక్షావల్లియైన క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ తమ స్వంత తోటను అనుభవిస్తున్నారు.  యోహాను 15:1, ''నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.''  నిజమైన ద్రాక్షావల్లిగా క్రీస్తు ప్రభువు దానిని నాటిన వ్యవసాయకునిగా తండ్రియైన దేవుడు ఉన్న సంఘమే నేటి క్రైస్తవ సంఘము.  ఈ సంఘములో అంటుగట్టబడి జీవించమని యెరూషలేము  కుమార్తెలైన మనకు దేవుడు చెప్పుచున్నారు.  యోహాను 15:5, ''ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు.  ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.''  ఇందులో చెప్పబడిన విధముగా యెరూషలేము కుమార్తెలమైన మనము క్రైస్తవ సంఘమును కాపు కాస్తూ అందులో అంటుగట్టబడి జీవిస్తే మనము నిజ క్రైస్తవులుగాను యెరూషలేము కుమార్తెలుగా ఎన్నిక చేయబడుదుము.  కాని అనేకులు విగ్రహారాధనలో అన్య దేవతలు దేవుళ్లను పూజిస్తూ నిజదైవమునకు దూరముగా ఉంటూ పాపములో మ్రగ్గి నల్లనైన బబులోనుగా ఉంటూ కారు ద్రాక్షలైన విగ్రహ దేవుళ్ల గుడులకు కావలి కాస్తూ ఉన్నారుగాని తమ స్వంత ద్రాక్ష తోటను కావలి కాయలేకపోవుచున్నారు.  అందుకే పాపపు స్థితిని బట్టి బబులోను అను నల్లనిదైన స్త్రీని చిన్న చూపు యెరూషలేము కుమార్తెలు చూచు చున్నట్లుగా అనుకొని నల్లనిదైన బబులోను చూడవద్దని చెప్పుచున్నది.
        ఇక ''అనుకొని'' అని ఎందుకు వ్రాసానంటే దేవుని పరిశుద్ధులు నిరంతరము క్రీస్తు ప్రభువు సువార్త ద్వారా పాపమును వదిలి మారుమనస్సు పొంది మరల యెరూషలేము కుమార్తెగా ఏకసంఘములోనికి రమ్మని బోధించుచున్నారే గాని వారిని చిన్న చూపు చూడక వారినే లక్ష్యముగా సువార్తను జరిగిస్తున్నారు.  దీనిని నల్లనిదైన బబులోను తాను చేయు హేయ క్రియలను యెరూషలేము కుమార్తెలు గుర్తించారని గ్రహించి, వారి ముందు సిగ్గుపడుచు ఈ విధముగా అంటున్నట్లుగా మనము గ్రహించాలి.

7.  ప్రాణ ప్రియుడు మందను మేపు స్థలము ముసుగు వేసుకొని మందల వద్ద ఉండు నల్లనిది

        పరమగీతము 1:7, ''నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము  ముసుకువేసికొనిన దాననై నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలెను?''
        ''నా ప్రాణ ప్రియుడా,'' అని నల్లనిదియైన బబులోను ఇక్కడ చెప్పుచున్నది.  సహజముగా బబులోను సాతానును గూర్చి చెప్పినట్లుగా దీనిని భావించు అవకాశము ఉన్నదిగాని నిజానికి కాదు.  నల్లనిదియైన బబులోను సైతము క్రీస్తు ప్రభువును ఎల్లవేళల గుర్తిస్తుంది.  మార్కు 5:2, 6-7, ''ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను.  . . .  వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయ పరచుకొనుచు నుండెను.  వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారము చేసి -యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి?  నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.''  వీడు సాతాను దూతలచే బంధితుడై దేవునికి దూరముగా నల్లనిదైన బబులోను కుమార్తెగా ఉన్నాడు.  వీడు క్రీస్తు ప్రభువును గుర్తించుచు సర్వోన్నతుని కుమారునిగా రక్షకునిగా వర్ణించాడు.  అంటే పాపపు స్థితిలో ఉన్న బబులోను కుమార్తెలకు కూడ రక్షకుడు క్రీస్తు ప్రభువే.  కనుక నల్లనిదైన బబులోనుకు ప్రాణ ప్రియుడు క్రీస్తు ప్రభువే.  ఈ బబులోను తప్పిపోయి దేవునికి దూరముగా జీవిస్తూ దూరమైపోవుట వలన క్రీస్తు ప్రభువు మందను అనగా విశ్వాసులను ఎక్కడ పోషించునో దానిని అడుగుచున్నది.  ఇంతకి విశ్వాసులను క్రీస్తు ప్రభువు తన సువార్త ద్వారా పోషించేది ఎక్కడ?  సంఘములోనే కదా!  అనగా చర్చీలో అనగా యెరూషలేము సంఘములో.  
        దూరమైపోయిన నల్లనిదైన బబులోను ఎక్కడ  నీ మందను మేపుదువో చెప్పమని క్రీస్తు ప్రభువును అడుగుచున్నది.  అలాగే ఎండ పాపపు స్థితిలో జీవించువారిని కాల్చునని చదువుకొన్నాము.  ఆ ఎండ తగలకుండ ఏ నీడన నీవు విశ్వాసులు అను మందను నిలుపు స్థలమును తెలుపమని అడుగుచున్నది.  ఇది సంభవమేనా!  బబులోను అను సంఘములోని విగ్రహారాధకులుగా హేతువాదులుగా అన్ని రకాల వ్యసనాలతో ఉన్నవారు విశ్వాసులను గూర్చి వారి స్థలములను గూర్చి వారికి నీడ నిచ్చు చోటులను గూర్చి అడుగునా?  నా జీవితములో నేను సుమారు 40 సంవత్సరముల వరకు నల్లనిదైన బబులోనులో ఉంటూ రకరకాల వ్యసనాలతోను విగ్రహారాధకునిగా క్రీస్తు ప్రభువు విషయములో మాత్రమే హేతువాదిగా ఉన్నాను.  కాని మారుమనస్సు పొంది క్రీస్తు మార్గములోకి వచ్చి నేను క్రీస్తు సంఘములో చేరలేదా!  నేను ఎలా వచ్చాను?  నిజమైన దేవుని గూర్చి శోధించుచు పరిశోధించుచు చివరకు క్రీస్తు ప్రభువులోనికి వచ్చాను.  అలాగే చాలామంది ఈనాడు అన్యులుగా ఉన్నవారు సువార్తలో బోధింపబడినవి విని చదివి మారుమనస్సు పొందుచు అనేకులు క్రీస్తు ప్రభువు సంఘములో పాలు పంచుకొనుటకు ఎదురు చూచుచున్నారు.  ఈనాడు క్రీస్తు ప్రభుని సంఘములే లేని గ్రామములు అనేకములు కలవు.  అక్కడ నూతనముగా మారుమనస్సు పొందినవారు ప్రభువుతో - నీ విశ్వాసులు ఉండు స్థలమునకు ఎలా వెళ్లాలని అడుగుట చూడగలము.  నన్ను నా జీవితములో అనేకులు చర్చీకి నీతో కూడ నేను వస్తానని అడుగుట జరిగింది.  ఈ విధముగా వారు మారుమనస్సు కలిగినప్పుడు మొదట రక్షకుడైన ప్రభువును ప్రార్థనలో నీ సంఘమునకు వచ్చు మార్గమును చూపమని అడుగుట ప్రతి ఒక్కరు గమనించాలి.  ఇదే నల్లనిదైన బబులోను అడుగుచున్నట్లుగా చెప్పబడింది.  ఇది అడుగు నాటికి వారిలో మారుమనస్సు పొందారుగాని బాప్తిస్మము ద్వారా పాపములను అప్పటికి పోగొట్టుకొన్న వారు కాదు. నమ్మి బాప్తిస్మము పొందాలి.  ప్రభువునందు నమ్మకము కలిగింది అందువల్ల ప్రభువు మంద ఉన్న స్థలమును అడుగుచున్నారు అంతేగాని బాప్తిస్మము అప్పటికి పొందలేదు గనుక వారిని ఇంకా నల్లనిదైన బబులోను కుమార్తెలుగానే చెప్పుచున్నారు.
        ఇలా అడుగుచున్న నల్లనిదైన బబులోను ముసుగు వేసుకొని దేవుని ముందు వినయమును ప్రదర్శిస్తూ ఉన్నది.  అంతే కాకుండ నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలెను?  అని అడుగుచున్నది.  ఇందులో దేవునికి జతకాండ్లు ఎవరు?  ద్వితీయోపదేశకాండము 32:8, ''మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.''  ద్వితీయోపదేశకాండము 32:12, ''యెహోవా మాత్రము వాని నడిపించెను  అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు.''  కనుక దేవుడు ఇశ్రాయేలీయులను ఎన్నుకొనినప్పుడు దేవుని దూతలలో కొందరిని అన్యజాతులను నడుపుటకు ఏర్పాటు చేశాడు అని ద్వితీయోపదేశకాండము 32:8లో ఇంగ్లీష్‌ బైబిలులో ఉన్నది.  కనుక దేవునికి జతకాండ్లుగా మందలుగా మేపువారు దేవుని దూతలే.  వారు అన్యజాతులుగా మందలు మందలుగా ఉన్నారు.  కాని అలాంటి వారి వద్ద అన్యజాతులుగా విగ్రహారాధికుల మధ్య విగ్రహారాధికురాలిగా నేను ఎందుకు ఉండాలి అని క్రీస్తు ప్రభువును బబులోను అడుగుచున్నది.  అంటే అప్పుడే మారుమనస్సు పొంది క్రీస్తు ప్రభువును రక్షకునిగా గుర్తించి బాప్తిస్మము పొందని విశ్వాసి ఇలా అడుగుచున్నాడు.  ఈ విధముగా ప్రాణ ప్రియుడైన క్రీస్తు ప్రభువు తన మందను మేపు స్థలములను, మందను ఉంచు నీడను గూర్చి నల్లనిదైన బబులోను దేవుని ముందు ముసుగు ధరించి తనలోని మార్పును ఈ రకముగా వినయముతో చూపుచు, అన్యజాతులను మేపు జతకాండ్ల వద్ద అనగా దేవుని దూతల వద్ద నేను ఎందుకు ఉండాలి?  అని అడుగుచు నిజ దైవవిశ్వాసులుండు చోటు కోసము తన ప్రార్థనా జీవితములో అడుగుచున్నది.

8.  యడుగుజాడలనుబట్టి పోయి - గుడారములయొద్ద మేకపిల్లలను మేపుట

        పరమగీతము 1:8, ''నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా?  మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము  మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము.''
        ''నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా?''  అని ప్రియుడైన క్రీస్తు ప్రభువు నల్లనిదియైన బబులోనును అడుగుచున్నారు.  ఇందులో దైవకుమారులుగా యెరూషలేము కుమార్తెలుగా ఉండవలసిన నీవు సాధారణమైన నరుల కుమారులు, కుమార్తెలు - నారీమణిగా పాపము వలన మారారని ఒక్క పదముతో క్రీస్తు ప్రభువు గుర్తు చేస్తున్నాడు.  ఆదికాండము 6:3, ''అప్పుడు యెహోవా-నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.''  వారు ఏమై పోయారు?  నరమాత్రులై పోయారు.  కనుకనే క్రీస్తు ప్రభువు తన గీతములో వీరినందరిని కలిపి నారీమణీ అని పిలుస్తున్నాడు అంటే ఒక పాపములో జీవిస్తున్న సంఘమా ఓ మహాబబులోను అని దాని అర్థము.  ఇలా పిలుస్తూనే క్రీస్తు ప్రభువు సుందరీ అని పిలుస్తున్నాడు.  అంటే వారిలో కలిగిన మార్పును క్రీస్తు ప్రభువును వారు గుర్తించి ఆయన మందలో చేరాలన్న తలంపును గుర్తించి వారు పొందబోవు స్థితిని గూర్చి ఆ విధముగా చెప్పుట జరిగింది.  పాపము తొలగించబడినవారు తెల్లని వస్త్రములు ధరించి బహుసుందరముగా కనిపిస్తారు.  అలాగే ఈ బబులోనులో మారుమనస్సు ద్వారా తన చెంతకు రాబోవువారు పొందబోవు స్థితిని ఈ విధముగా ఒక్క వచనములో చెప్పుట జరిగింది.
        ముందు విభాగములో బబులోనులోని కొందరిలో మారుమనస్సు వచ్చినట్లుగా వారు క్రీస్తు మందను గూర్చి విచారిస్తున్నట్లుగా చెప్పబడింది.  దీనికి క్రీస్తు ప్రభువు ఈ వచనములో బబులోనులో మార్పు పొందినవారికి అది నీకు తెలియకపోయెనా?  అని అడుగుచున్నారు.  అంటే నిజానికి వారందరు క్రీస్తు సంఘములోనే ఉండాలి.  అదే వారి స్వంత సంఘము.  కాని దారి తప్పి దూరముగా వెళ్లారు.  తిరిగి రావాలని అడిగితే క్రీస్తు ప్రభువు అది నీకు తెలియకపోయెనా?  అని అడుగుచూనే ఆ మందకు వెళ్లు దారిని తెలియజేసి ఎలా వెళ్లాలో చెప్పుచున్నారు.
        ''మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము.''  చూచారా!  క్రొత్తగా క్రైస్తవునిగా మారాలనుకొన్నవారు అప్పటికే నిజ క్రైస్తవ జీవితములో జీవించువారిని బట్టి వెళ్లాలి.  వారు వెళ్లు ప్రదేశములో వారు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించాలి.  వారు మోకాళ్ల మీద నిలువబడితే నిలుచోవాలి. కూర్చుంటే కూర్చోవాలి. ముసుగు వేసుకొంటే వేసుకోవాలి.  వారు ప్రార్థన చేస్తే దానిని అనుసరిస్తూ ప్రార్థించాలి.  వారు కీర్తన పాడితే తన స్వరము అందులో కలపాలి.  సులభ శైలిలో దీనినిగూర్చి పౌలు ఈ విధముగా వ్రాశాడు.  1 కొరింథీ 11:1-2, ''నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.  మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను.''
        ఇలా అనుసరించమని చెప్పుచూనే - ''మందకాపరుల గుడారములయొద్ద నీ మేకపిల్లలను మేపుము,'' అని చెప్పుచున్నారు.  క్రీస్తు ప్రభువు సంఘమును కాచుటకు యాజకులను యేసుక్రీస్తు ప్రభువు ఏర్పరచి వారిని కాపరులుగా ఉంచాడు.  వారి గుడారముల యొద్ద అనగా చర్చిల వద్ద నీ మేకపిల్లలను మేపుము అని చెప్పుచున్నారు.  ''నీ మేకపిల్లలు,'' అని చెప్పుటనుబట్టి బబులోను సంఘమునకు చెందినవారైనను మారుమనస్సు పొంది వచ్చినవారైనను ఇంకా వారు బాప్తిస్మము పొంది పాత పాపములు అనగా అలవాటైన దుర్‌ వ్యసనాలు పోగొట్టుకొనలేదు గనుక వారిని గొఱ్ఱెలుగాను గొఱ్ఱె పిల్లలుగాను వర్ణించక మేక పిల్లలుగా వర్ణించాడు.  మేక పిల్లలు చెట్లు పుట్టలు గుట్టలు ఎక్కి నానా రకములైన ఆకులు భక్షిస్తాయి.  గొఱ్ఱెలవలె కలసిమెలసి గుంపుగా ఉండవు.  చెదరిపోవుచు విడివిడిగా వస్తుంటాయి.  కాపరి ఇష్టానుసారముగా అవి నడవవు.  అంటే ఇంకా వారి పాత జీవితపు మరకలను మారుమనస్సు పొంది బాప్తిస్మము ద్వారా పోగొట్టుకొనలేదు గనుక వారి జీవితమును మేక పిల్లల జీవితమునకు పోల్చి వారిని మంద కాపరుల గుడారముల వద్ద అనగా క్రైస్తవ సంఘముల వద్ద మేపమని చెప్పుచున్నారు.  ఈ విధముగా సువార్తలో దేవుని నియమములను తెలుసుకొని దానిని మేయుచు అనగా పాటించుచు తిరిగి యెరూషలేము కుమార్తెగా మారమని చెప్పుచున్నారు.

9.  ప్రభువుయొక్క ప్రియులు - ఫరోయొక్క రథాశ్వములు

        పరమగీతము 1:9-11, ''నా ప్రియురాలా, ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను.  ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి.  వెండి పువ్వులుగల బంగారు సరములు  మేము నీకు చేయింతుము.''
        పై విభాగములో వలె మారి వచ్చిన నల్లనిదైన బబులోను సంఘములోని వారు మేక పిల్లలుగా క్రైస్తవ సంఘముల వద్ద ఉన్నారని తెలుసుకొన్నాం.  అయితే ఈ విభాగములో క్రీస్తు ప్రభువు ప్రియుడుగా వారిని ప్రియురాలుగా పిలుస్తున్నారు.  ఎంతో ప్రేమతో నా ప్రియురాలా, అని వారిని సంబోధిస్తున్నారు అంటే మారుమనస్సు పొంది నిజదైవమును తెలుసుకొన్న వారిపై క్రీస్తు ప్రభుని ప్రేమ లూకా 15:7లో వలె అపారమని గ్రహించాలి.  అందుకే పిలుపులోనే ఆ ప్రేమను చూపుచు నా ప్రియురాలా అని సంబోధించాడు.
        అలా సంబోధిస్తూనే ఫరోయొక్క రథాశ్వములతో ఆమెను పోల్చెదను అని చెప్పుచున్నారు.  ఐగుప్తు దేశపు రాజును ఫరోగా పిలుస్తారు.  రాజు వద్ద అవి బలిష్ఠమైన దృఢమైనవిగా ఉంటాయి. సాధారణ అశ్వములకు రాజు వద్ద ఉండు అశ్వములకు చాలా తేడా ఉంటుంది.  ఇలాంటి బలమైన దృఢమైన అశ్వములతో వీరిని పోల్చుచున్నాడు.  అలాగే ఆభరణ హారములతో అలంకరించబడిన స్త్రీ బహుసుందరముగా కనిపిస్తుంది.  ఏమి కొదువ లేనివారుగా కనిపిస్తారు.  అలా కనిపించినను వారు ఇంకా యెరూషలేము కుమార్తెలుగా మారలేదు గనుక వారిని ఫరో రాజు అశ్వములతో పోల్చుట జరిగిందిగాని దావీదు లేక సొలొమోను వంటి దైవప్రజల రాజుల అశ్వములతో పోల్చలేదు.  అంతమాత్రాన వారు తక్కువవారేమి కాదు. పాపములో ఉన్నారు. మారుమనస్సు కలిగి తిరిగి క్రీస్తు ప్రభువు వద్దకు వస్తున్నారు. ఇలాంటివారి విషయములో క్రీస్తు ప్రభువు బహుగా ఆనందించునని గ్రహించాలి.

10.  రాజు విందు - పరిమళతైలపు సువాసన

        పరమగీతము 1:12, ''రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళతైలపు సువాసన వ్యాపించెను.''
        రాజు విందులో కూర్చున్నప్పుడు ప్రియురాలి పరిమళ సువాసన అక్కడ వ్యాపించె నని చెప్పబడింది.  రాజు విందుకు ఎప్పుడు కూర్చుండును?  ప్రకటన 3:20, ''ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను.  ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము.''  ఇందులో క్రీస్తు ప్రభువు హృదయమనే తలుపు వద్ద ఆయన నిలుచుండి నిరంతరము తట్టుచున్నారు.  నల్లనిదాననైన బబులోను కుమార్తెలు అపరిశుద్ధులుగా ఉన్నను వారిలో కొందరు ఆ స్వరమును విని తలుపు తెరిచి వారి హృదయములోనికి క్రీస్తు ప్రభువును ఆహ్వానించుట జరిగింది.  ఇలా ఆహ్వానించినవారు ప్రభువు మందతో కలసి జీవించి చివరకు పరలోక రాజ్యమునకు యోగ్యులైనప్పుడు వారు రాజాధిరాజైన క్రీస్తు ప్రభువు ఇచ్చెడి విందుకు యోగ్యులు. అక్కడ ఆయనతో కూడ భుజించు అవకాశము వీరికి కూడ ఇస్తానని అనగా యెరూషలేము కుమార్తెలు మొదటి నుండి పరిశుద్ధముగా ఉండి పరలోక రాజ్యములో స్థానము పొందినవారివలె, పాపము నుండి మరల్చుకొని మారుమనస్సు ద్వారా వచ్చినవారికి ఇద్దరికిని సమానమైన అవకాశము ఇచ్చునని ఈ వచనములో ప్రభువు చెప్పుచున్నారు.  ఎఫెసీ 2:19.
        అయితే ఈ విందుకు వచ్చిన వారి నుండి వచ్చు పరిమళ తైలపు సువాసన అక్కడ అంతా వ్యాపించినట్లుగా చెప్పబడింది. మూడవ విభాగములో పోయబడిన పరిమళ తైలము క్రీస్తు ప్రభువుగా తెలుసుకొన్నాము.  పోయబడిన పరిమళతైలము సువాసన వెద జల్లును కదా! ఇదే సువాసన మారుమనస్సు పొంది వచ్చినవారిలో నుండికూడ సువాసన వ్యాపించుట ఆశ్చర్యముగా లేదా!  పౌలు అనేక చోట్ల నేను కాదు నాలో నుండి క్రీస్తు ప్రభువే జీవించుచున్నారని చెప్పుట చదువగలము.  గలతీ 2:20  అంటే మారుమనస్సు ద్వారా పాపము నుండి బయటపడి నిజదైవవిశ్వాసములోకి వచ్చి బాప్తిస్మము ద్వారా తొలి పాపములను కడిగించుకొన్నవారు. ఆపై జీవితమును పరిశుద్ధముగా జీవించి దేవునికి యోగ్యరీతిలో సువార్తలో బహుచురుకుగా పొల్గొన్నవారిలో క్రీస్తు ప్రభువు జీవించును.  వారి జీవితము క్రీస్తు ప్రభువే!  అలాంటివారి ఆత్మ శరీరము నుండి కంపు వాసన రాదుగాని క్రీస్తు ప్రభువు యొక్క పరిమళతైలము యొక్క సువాసన వచ్చి అక్కడంతా వ్యాపించును.  కనుక వారు ధన్యులే.

11.  ప్రియునికి ప్రియురాలు - ప్రియురాలికి ప్రియుడు

        పరమగీతము 1:13-15, ''నా ప్రియుడు నా రొమ్ముననుండు గోపరసమంత  సువాసనగలవాడు  నాకు నా ప్రియుడు ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు.''
        ఇందులో చెప్పబడిన గోపరసమును జాజి లేక రోజాలతో తయారు చేసిన పన్నీరు వంటిది.  ఇది సువాసన కోసము ఉపయోగిస్తారు.  ప్రియుడు ప్రియురాలి హృదయమునకు ఆనుకొని ఉంటే అది వారికి రహస్య వేదికగా మారుతుంది.  ఈ స్థితి ప్రియురాలి విషయములో రోజాలు లేక జాజి పూలతో చేసి గోపరసమంత సవాసనగా వర్ణించుట జరిగింది.  అలాగే ఏన్గెదీలోని ద్రాక్ష తోట మధ్యలోని కర్పూరపు చెట్టు నుండి పూగుత్తులు వస్తే ఎలా ఉంటుంది?  చాలా ప్రత్యేకముగా ఆకర్షణీయముగా అది కనిపిస్తుంది కనుక ప్రియురాలికి తన ప్రియుడు అనగా భార్యకు తన భర్త అలా ప్రత్యేకముగా కనిపిస్తాడు.  అతని స్థానము ఆమె హృదయములో ఉండును గనుక ఆ ఆస్వాదన గోపరసముతో పరిమళముగా ఉండునని చెప్పబడింది.  ఇది ప్రియురాలి దృష్టిలో ప్రియుడు.  ఇది ఈ లోకరీత్యా వర్ణన.
        ఇక ఆత్మరీత్యా క్రీస్తు ప్రభువుయొక్క స్థానము విశ్వాసియొక్క హృదయములోనే.  ఎప్పుడైతే విశ్వాసి లేక విశ్వాసురాలు క్రీస్తు ప్రభువును తన ప్రియునిగా అనగా ఆత్మీయునిగా అనుకొంటారో వారు ఆయనకు ఇచ్చు స్థానము వారి హృదయములో.  వారు వారి హృదయపు తలుపులను తెరిచి అందులో ఆయనకు ఆలయమును నిర్మిస్తారు.  అలాంటి వారి హృదయములో ఆయన నివసిస్తే అభిషిక్తుని పరిమళతైలము యొక్క సువాసన వారికి ఎప్పుడు వస్తూ ఉండి వారు దానియొక్క ఆధ్యాత్మిక ఆనందములో నిలిచియుందురు.  అలాంటివారిని ఈ లోకమనే బబులోను ప్రాంతములో సాతానుకు అనేక విగ్రహ గుళ్లు కట్టినను దానిలో ఒక చర్చిగాని కనిపించినప్పుడు అది ప్రత్యేక రీతిగా వారి కంటికి కనిపిస్తుంది.  కనుక ఈ లోకరీత్యా ఎంతమంది దేవుళ్లు దేవతలనబడేవారు ఉన్నను క్రీస్తు ప్రభువు వారందరి మధ్య ప్రత్యేకింపబడినవాడుగా అగుపిస్తాడు.  దీనికి కారణము నిజము లేక రక్షణ అనునది ఒక క్రీస్తు ప్రభువులోనే ఉన్నది.  ఈ విధముగా ప్రియురాలైన విశ్వాసి లేక యెరూషలేము కుమార్తె క్రీస్తు ప్రభువును ఆస్వాదిస్తే, క్రీస్తు ప్రభువు తన ప్రియురాలిని అనగా యెరూషలేమను వధువును చూచినప్పుడు ఆమె చాలా అందముగా నీతి అను క్రియలతో అలంకరించబడి ఆయనకు కనిపిస్తుంది.  కనుక నీతి అను క్రియలే వస్త్రాలుగా అలంకరింపబడిన సంఘము ఆయన కంటికి సుందరమైనదిగా కనిపించుటయేగాక ఆమె కళ్లు గువ్వ కళ్లుగా చెప్పుచున్నాడు.  అంటే గువ్వ కళ్లను మనము చూచుచున్నప్పుడు అలాగే చూడాలి అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పక్షి కళ్లను మనము చూచుకొద్ది ఇంకా అమాయికత్వము పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.  కనుక నీతి-పరిశుద్ధతలో ఉన్న వధువు సంఘముయొక్క స్థితి అందులో ఆయనకోసము నిలిచినవారిలోని అమాయికత్వము వారి నిర్దోషత్వము, పాపరహిత జీవితము మనకు వారి కండ్లలో కనిపిస్తుందని ఈ గీతములో చెప్పుట జరిగింది.

12.  ప్రియుని - ప్రియురాలి శయన స్థానములు

        పరమగీతము 1:16, ''నా ప్రియుడా, నీవు సుందరుడవు అతిమనోహరుడవు   మన శయనస్థానము పచ్చనిచోటు  మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు  మన వాసములు సరళపు మ్రానులు.''
        సంఘమనే స్త్రీ పరిశుద్ధ యెరూషలేమను ప్రియురాలు.  క్రీస్తు ప్రభువు విషయములో ఆయన విశ్రాంతి తీసుకొను ప్రదేశాలనే ఆయనకు తనకు ఉండే ప్రదేశాలుగా వర్ణించుట జరిగింది.  క్రీస్తు ప్రభువును ప్రియునిగా సంబోధించుచు నీవు సుందరుడవని  మనోహరుడు అనగా మనస్సును ఉత్సాహముతో నింపువాడవని చెప్పుచున్నది.  ఆయన రూపము విశ్వాసికి ఆకర్షణీయముగాను తాను ఏ ప్రక్క నుండి చూచిన తన వైపే చూస్తున్నట్లుగా ఉంటుంది.  అలాగే ఆయనను గూర్చిన ఆలోచన విశ్వాసి హృదయములో నూతనోత్సాహమును నింపుతుంది నుక పై విధముగా ప్రియురాలైన సంఘము క్రీస్తు ప్రభువుని సంబోధిస్తూ మన శయన స్థానము పచ్చని చోటు అని చెప్పుచున్నది.  ఇంతకి  శయన స్థానము అనగా నేమి?  విశ్రాంతిని తీసుకొను స్థానము లేక నిద్రించు స్థానము అని అర్థము. క్రీస్తు ప్రభువు ఈలోకములో ఎక్కువగా కొండ ప్రాంతమైన ఒలీవ కొండను తనకు విశ్రాంతి స్థలముగా ఉపయోగించేవాడు.  లూకా 21:37, ''ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను.'' లూకా 22:39, ''తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయన వెంట వెళ్లిరి.''  ఈ ఒలీవలకొండ వనముగా ఉండేది.  అక్కడ పచ్చని గడ్డితో నిండి ఉండి విశ్రాంతిని మనస్సుకు ఆనందమును కలిగించు రీతిగా ఆ స్థలము ఉండేది.  దీనినే ఎక్కువగా క్రీస్తు ప్రభువు ఎన్నుకొనేవారు.  కనుక ఈ స్థలమును గూర్చి ఆయన విశ్రాంతి  స్థలమని అది పచ్చని చోటని వర్ణించాడు.  ఇక్కడ క్రీస్తు ప్రభువు విశ్రాంతి స్థలము లేక శయన స్థానమంటే ప్రియుని విశ్రాంతి లేక శయన స్థానమగును.  అయితే ప్రియురాలైన సంఘముయొక్క శయన స్థానము లేక విశ్రాంతి స్థానము ఏది?  క్రీస్తు ప్రభువు కాలములో సంఘము అంటే ఆయన శిష్యులు మరి కొంతమంది. వారిలో మగ్దలేని మరియ, మార్త మరియ, లాజరు వంటివారు.  ఆయన శిష్యులు ఆయనతో కూడ అక్కడే ఉండేవారు.  అంటే శిష్యులు కూడ సంఘములోని వారే కదా! అప్పటికి సంఘము శిష్యులతో నూతనముగా మొదలైయున్నది. క్రీస్తు ప్రభువు ఎక్కడ ఉంటే అక్కడకి నూతనముగా విశ్వాసములోకి వచ్చువారు ఆయన వద్దకు వెళ్లేవారు.  ఆయన బహిరంగ ప్రదేశాలను ఎక్కువగా ఎన్నుకొనేవారు. ఇవన్ని పచ్చని చోటు కూర్చొను టకు విశ్రాంతిని పొందుటకు అనువైన ప్రదేశాలు.
        అలాగే క్రీస్తు ప్రభువు ఈ లోకములో సాధారణ పరిస్థితులలో జీవించినను, ఆయన రాజులకు రాజు కనుక ఇంకొక కోణములో ఆయన విశ్రాంతి స్థానములు దేవదారు మ్రానులను దూలములుగా నిర్మించిన మందిరములు సరళ మ్రానులతో నిర్మించిన నివాసాలు.  క్రీస్తు ప్రభువుకు యెరూషలేము ఆలయము ఆయన విశ్రాంతి స్థానమే కదా!  ఈనాడు మనము నిర్మించుకొన్న సంఘములు ఆయనకు విశ్రాంతి స్థలములే కదా!  కెథోలిక సంఘములో ప్రభువు శరీరముగా పిలువబడు రొట్టెను వారు ఆలయములో మందసము అను పేరుతో భద్రపరుస్తారు.  దీనికి ప్రత్యేకముగా ఒక స్థానమును ఇస్తారు.  క్రీస్తు ప్రభువే అందులో ఉన్నట్లుగా భావించుచుందురు.  అంటే ఆయన తన శరీరము రొట్టె రూపముగ అక్కడ విశ్రాంతిలో ఉన్నట్లే కదా!  ఇలాంటి అద్భుతమైన కట్టడములు ఆయన నివాసములని సొలొమోను వ్రాయుట జరిగింది.
        అంటే పచ్చని చోట బహిరంగ ప్రదేశాలలో విశ్రాంతి స్థలములుగా మొదలైన క్రీస్తు ప్రభువు సంఘముయొక్క విశ్రాంతి స్థలములు క్రమేణా వృద్ధి చెంది అత్యంత ఖరీదైన స్థలాలుగా నివాస స్థానాలుగా మారునని ఇందులో చెప్పుట జరిగింది.

13.  స్త్రీలలో నా ప్రియురాలు ప్రత్యేకత

        పరమగీతము 2:1-2, ''నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిదానను  లోయలలో పుట్టు పద్మమువంటిదానను.  బలురక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది.''
        షారోను పొలము అంటే భూమిని దున్ని సాగు చేయుటకు ఏర్పరచబడిన స్థలమును పొలము అంటాము.  ఇలాంటి పొలము షారోనులో ఉన్నదని అక్కడ ఉన్న ఆ పొలములో పూసిన పుష్పముతో ప్రియురాలైన సంఘమును పోల్చుకొని చెప్పుచున్నది.  పొలములో మంచి వాటితో బాటుగా కలుపు మొక్కలు కూడ పెరుగును.  కనుక అన్ని రకముల పనికిమాలిన మొక్కలలో ఒక మొక్కగా ఈ ప్రియురాలు ఉన్నది.  అంటే ఈ భూమిని దేవుడు ఏర్పరచి అందులో తన ప్రియురాలైన యెరూషలేమును అందులో ఏర్పరచాడు.  కాని యెరూషలేముతో బాటుగా విగ్రహారాధికులు సాతాను ప్రేరణతో పెరిగి, ఎక్కడ చూచినను విగ్రహాలే అనేకము వాటి సంబంధమైనవిగా కనిపిస్తున్నాయి.  వీటి మధ్యన ప్రత్యేకముగా కనిపిస్తూ వికసించుచున్న పుష్పమువలె యెరూషలేము అను పరిశుద్ధుల సంఘము ఉన్నది.
        అలాగే లోయలో పుట్టు పద్మము వంటిదాననని సంఘము చెప్పుచున్నది.  లోయ అంటేనే నీటితో నిండి ఉండగా అందులో పద్మము ఒకటి ఉంటుంది.  దానిలో దిగినవారు బురదలో కూరుకొని మరణించువారు ఉన్నారు.  అలాంటి అత్యంత భయంకరమైన కూపమను బబులోను అను చెడిన సంఘము మధ్యలో యెరూషలేమను పవిత్రమైన సంఘము ఉన్నది.  అందుకే చుట్టు బలురక్కసి చెట్లు ఉండగా వాటి మధ్యలో వల్లిపద్మము కనబడినట్లుగ స్త్రీలలో ప్రభువుయొక్క సంఘము మనకు కనిపిస్తుంది.  అంటే సమాజమంతా బబులోను సంఘముగా మారి ఉంది.  అది కూడ ఏక సంఘముగా లేక స్త్రీలుగా అనేక లోపాలతో విగ్రహారాధికులుగా సృష్టిని సృష్టములను ఏ దానిని బడితే దానిని పూజిస్తూ జీవిస్తున్నవారుగా ఉండగా వారిలో కొందరు క్రీస్తు ప్రభువును తన నాథునిగా ఎన్నిక చేసుకొని మారుమనస్సు బాప్తిస్మము అను కార్యముల ద్వారా ఈ లోకములో ఉన్నారు.  కనుక వారు ప్రత్యేకించి ఖచ్చితముగా కనిపిస్తారు.  క్రైస్తవ రాజ్యాలలో బ్రిటన్‌ దేశము ఒకటి.  అందులో లండన్‌ నగరములో చర్చికి వెళ్లితే అవి చాలా అద్భుత రీతిన నిర్మించి ఉన్నాయిగాని  అందులోని విశ్వాసులు తక్కువ.  అంటే మరీ తక్కువగా వచ్చుచున్నారని తెలిసింది.  మిగిలినవారి పరిస్థితి ఏమిటి?  వారు క్రీస్తు ప్రభువుకు దూరముగా జీవించు బబులోను సంఘములోని నల్లనిదియైన కుమార్తెలే.  వీరిలో సంఘమునకు వచ్చి విశ్వాసముతో జీవించువారు పై వచనములో చెప్పినట్లుగా వారు ప్రత్యేకముగా కనిపిస్తారు.  వీరు అనగా పరమయెరూషలేము  క్రీస్తు ప్రభువు అనగా ప్రియుని కంటికి వికసించు పుష్పముగాను, పద్మముగా - వల్లిపద్మముగా కనిపిస్తే, అదే క్రీస్తు ప్రభువు కంటికి బబులోను అనగా నల్లనిదియైన సంఘము లోయగా, కలుపు మొక్కలుగా, బలురక్కసి చెట్లుగా సాధారణ పాపపు స్త్రీలుగా కనిపిస్తున్నట్లుగా మనము గ్రహించాలి.

14.  పురుషులలో నా ప్రియుని ప్రత్యేకత

        పరమగీతము 2:3, ''అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో  పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు  ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని  అతని ఫలము నా జిహ్వకు మధురము.''
        అడవి చెట్లు విచ్చలవిడిగా అనేక విధాలుగా పెరిగియుంటాయి.  వాటికి నిర్థిష్టత లేదు.  ఈ అడవి చెట్లు ఈ లోకములోని విగ్రహ దేవుళ్లు, దేవతలు, బాబాలు, దేవుడమ్మలు వంటివారు.  వీరి జీవితము అడవి చెట్ల వంటి జీవితము.  వీరు తమ వద్దకు వచ్చు అవిశ్వాసులను అణగద్రొక్కు జీవితము.  వీరు ఈ సమాజములో ప్రపంచ నలుమూలల వెలుగొందుతున్న వృక్షములే ఈ పురుషులు.  వీటిలో జల్దరు వృక్షము ప్రత్యేకింపబడి అడవి చెట్లలో కనిపిస్తుంది.  ఈ వృక్షము ప్రతి విషయములోను ప్రత్యేకింపబడి ఉంటుంది.  అలాగే జల్దరు వృక్షముగా పోల్చబడిన సంఘముయొక్క ప్రియుడు అనగా క్రీస్తు ప్రభువు ఈ లోకములో ప్రియులుగా పిలువబడుచున్న వారిలో ప్రత్యేకింపబడినవారు. ఈ ప్రత్యేకత ఏమిటంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న నేటి శాస్త్ర సాంకేతిక ఖగోళ భూగోళ మానవ జ్ఞానమంతయు క్రీస్తు ద్వారా క్రైస్తవుల వలనను - యేసుక్రీస్తు తండ్రియైన యెహోవాను ఆరాధిస్తున్న యూదులు ఇశ్రాయేలీయుల వల్లను కలిగిందేగాని, అన్యజాతి జనుల వల్ల మానవులకు కలిగిన అజ్ఞానము ఏమిటంటే సృష్టికర్తను వదలి సృష్టిని సృష్టములను విగ్రహాలుగ చేసుకొని, పంచభూతాలను ఆరాధించు జ్ఞానము మాత్రమే కలిగింది.  అందువల్లనే  క్రీస్తు ప్రభువు అకర్షణ వేరు.  ఆయన ఇచ్చిన రక్షణ వేరు.  ఈ లోకము క్రీస్తు ప్రభువువలె కనబడు పురుషులు అనేకులు మేము నిజమైనవారమని చెప్పుకొను చున్నారుగాని వారి నుండి పాపికి రక్షణ రాలేదు.  అందుకే పురుషులలో సంఘముయొక్క ప్రియుడు ప్రత్యేకింపబడియున్నారు.
        ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును విశ్వాసి గుర్తిస్తాడో ముందు విభాగములో చెప్పుకొన్నట్లుగా ఆయన మంద అడుగుజాడలలో పయనించి, ఆయన గుడారముల వద్ద మేయుచు వారిని అనుసరించి, చివరకు బాప్తిస్మము పొంది నీతిని అనుసరించుట ద్వారా సంఘములో స్థానము పొందుట జరుగును.  ఈ స్థానమును పొందుట వలన ఆ నల్లనిదానిలో ఉన్న విశ్వాసి తాను పొందిన రక్షణ ఆనందమునకు పరమానందభరితమై మరల యెరూషలేము సంఘములో వధువుగా మారి, ఆయన నీడన కూర్చుంటినని చెప్పుట జరిగింది.  ఇంతవరకు విగ్రహాల దగ్గర పాము పుట్టల ఎదుట బాబాల దగ్గర దేవుడమ్మల ముందు దేవుడు లేడనే వారి చెంత కూర్చున్న ఈ నరుడే - ఇప్పుడు దానిలోని పాప జీవితమును వదలి బాప్తిస్మము ద్వారా క్రీస్తు నీడన కూర్చునుట జరిగింది.  ప్రకటన 7:15, ''సింహాసనాసీనుడైన వాడు తానేతన గుడారము వారిమీద కప్పును;''  ఈ విధముగా తాను నిజదైవ సంఘములో చేరుటన్నది క్రీస్తు ప్రభువు నీడలోకి వచ్చుటయే.
        ఈ స్థితిలో - ''అతని ఫలము నా జిహ్వకు మధురము,'' అని విశ్వాసి చెప్పుటను గూర్చి చదువగలము.  క్రీస్తు ప్రభువు ఈ లోకములో ప్రభువు బల్ల ఆరాధనను స్థాపించుట జరిగింది. ఈ ఆరాధనలో అర్పించు రొట్టె, ద్రాక్షారసములు క్రీస్తు ప్రభువు శరీర రక్తములకు సమానము.  దీనిని ఆయన తన శిష్యులకు ఆజ్ఞగా ఇచ్చాడు.  ఇది క్రీస్తు ప్రభువు ద్వారా సంఘము పొందిన ఫలము.  దీని ద్వారా మరో ఫలము రక్షణ రూపములో మనకు వచ్చింది.  ఇలాంటి ఫలమును మనము భక్తి విశ్వాసములతో నోటి ద్వారా పుచ్చుకొనుట జరుగును.  అందువలన రెండవ ఫలమైన రక్షణను పొందుచున్నాము.  ఈ రొట్టెను ద్రాక్షారసమును ఆరాధనలో ఆయనకు గుర్తుగా తీసుకొనుట విశ్వాసి నోటిలోని జిహ్వకు అనగా నాలుకకు మధురమైనదని ప్రియురాలు చెప్పుట జరుగుచున్నది.  దివ్య ఆరాధన జరుగునప్పుడు రొట్టెను ద్రాక్షారసమును పుచ్చుకొని దానిని ఎంతో పవిత్రతతో ఏకాగ్రతతో అన్నింటికన్నా మధురముగా పుచ్చుకొంటారు.
        కనుక క్రీస్తు ప్రభువు ఈ లోకములో మానవ జాతి కొరకు ప్రత్యేకింపబడినవారుగా రక్షకునిగా సంఘము గుర్తించినదని ఇందలి భావము.

15.  విందుశాల - ప్రేమను ధ్వజముగా ఎత్తుట

        పరమగీతము 2:4-6, ''అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను  నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను.  ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను  ద్రాక్షపండ్ల యడలు పెట్టి నన్ను బలపరచుడి  జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి  అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది  కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు.''
        ఈ వచనములో - నన్ను, అని ఏక వచనముతో విశ్వాసిని గూర్చి చెప్పబడింది.  ఈ విశ్వాసులందరిని కలిపి వధువు అని మరల ఏక వచనముతోనే సంబోధించబడుచున్నది.  ఎందుకు?  జీవాత్మ ఒకటే. దాని అణువులు మనలో నివసించుచున్నవి. కనుక మనమంతా జీవాత్మలోని భాగమే.  క్రీస్తు ప్రభువు ఈ లోకములో క్రైస్తవ సంఘమును ఏర్పరచుటద్వారా మరల అనేకులు రక్షణలోకి వచ్చుట జరిగింది.  అలాగే ప్రభువు కడరాత్రి భోజనమును ఏర్పాటు చేయుట ద్వారా దేవుని వాక్యమనే క్రీస్తు ప్రభువు ఫలమును మనము పొందుచున్నాము. అయితే ఈ ప్రభువు బల్ల ఏర్పాటు చేయుటకు క్రీస్తు ప్రభువు ఆదేశించిన తరువాత వారు పట్టణములో ప్రవేశించి, ఒక ఇంటిలో పస్కా విందుకు సిద్ధమైయ్యారు.
        లూకా 22:10-13, ''ఆయన-ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును; అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి -నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి.  అతడు సామాగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను.  వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టుకనుగొని పస్కాను సిద్ధపరచిరి.''  ఈ విధముగా విందును సిద్ధపరచిన తరువాత క్రీస్తు ప్రభువు విందుశాలకు అప్పటికి వధువు సంఘములో ఉన్న తన శిష్యులను తోడ్కొని వెళ్లాడు.  అక్కడ ప్రభువుయొక్క దివ్య శరీర ఫలమును ప్రతిష్ఠించుట జరిగింది. లూకా 22:14-20, ''ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి.  అప్పుడాయన-నేను శ్రమపడకమునుపు మీతో కూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.  అది దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి-మీరు దీనిని తీసికొని మీలో పంచుకొనుడి; ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాననెను. పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి-ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.  ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని-ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన.''  ఈ విధముగా ప్రియురాలుగా ఉన్న శిష్యులను విందుశాలకు క్రీస్తు ప్రభువు ప్రియుడుగా కొనిపోయాడు. తనయొక్క మహిమ శరీర ఫలమును ప్రతిష్ఠించి దానిని ప్రియురాలి జిహ్వకు మధురముగా ఒసగుట జరిగింది.  
        అటుతరువాత సంఘముపై అనగా తన ప్రియురాలిపై తనకున్న ప్రేమను ఆయన ధ్వజముగా ఎత్తెను అని వ్రాయబడింది.  ధ్వజము అనగా కటవుట్‌ బ్యానర్‌ అని గాని అంటారు.  ఈ ధ్వజమన్నది స్తంభము రూపములోను లేదా సైన్యము ముందు వరుసలో పైకెత్తబడిన జెండా రూపముగాను ఉంటుంది.  ఈ ధ్వజ స్తంభము నాటిన దగ్గరకు సైన్యములుగాని విగ్రహారాధికులుగాని కూడుకొను ప్రదేశమైయున్నది.  ఈ చిహ్నములో వారి వారి మత సంబంధమైనవిగాని రాజ్య సంబంధమైన చిహ్నములుండును.  సూర్యుడు చంద్రుడు గరుత్మంతుడు వగైరాలు వారి వారి ఇష్టానుసారముగా ముద్రించబడి యుంటుంది.  క్రైస్తవుడు క్రీస్తు యొక్క సిలువ నెత్తికొని ప్రభువును వెంబడించాలని మత్తయి 16:24 వివరిస్తున్నది.  ఇందునుగూర్చి అందరికి తెలిసిన విషయమే కడరాత్రి ప్రభువు బల్ల ఆరాధనను ఏర్పరచిన తరువాత ఆయనను పట్టించుటకు యూదా ఇస్కరియోతు వెళ్లిపోతాడు.  లూకా 22:21-23, ''ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడ ఈ బల్లమీద ఉన్నది.  నిర్ణయింపబడిన ప్రకారము మనుష్యకుమారుడు పోవుచున్నాడుగాని ఆయన ఎవరిచేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను.  వారు-ఈ పనిని చేయబోవువాడెవరో అని తమలో తాము అడుగుకొన సాగిరి.'' ఇలా వెళ్లిన యూదా ఇస్కరియోతు యాజకులతో ఒప్పందం కుదుర్చుకొని ఆయనను పట్టించుట జరిగింది.  ఆ తరువాత వారు ఆయనను దోషిగా తీర్పు తీర్చి సిలువకు గొట్టి చంపారు.  ఇది ఒక కోణము.  రెండవ కోణములో దేవుడు క్రీస్తు ప్రభువును సకల మానవాళి పాప పరిహారము కోసము రక్షకునిగా సిలువ బలియాగము చేయుటకు పంపాడు. ఇలా వచ్చిన క్రీస్తు ప్రభువు సంఘమును ఎంతగానో ప్రేమించెను గనుక తన ప్రేమను సిలువ రూపములో తన మరణము వరకు చూపారు.  ధ్వజస్తంభము అంటే గృహానికి లేక మందిరానికి ఆధారమైన స్తంభము అని అర్థము లేక ప్రత్యేకింపబడిన స్తంభమని, అలాగే ధ్వజముగా తన ప్రేమను క్రీస్తు ప్రభువు ఎత్తెను.  ఎలా?  సంఘము కోసము పాపములోని వారి రక్షణ కొరకు ఆయన సిలువపై మరణించునప్పుడు కూడ పాపపు నరులపై ప్రేమను చూపుచు రక్షణకు మూలమైన ధ్వజస్తంభము అనగా సిలువ మ్రానుపై చూపుట జరిగింది.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు తన రక్షణను సంఘమునకు ఇచ్చి తన ప్రేమలో సంఘమునకు ఎంత స్థానమున్నదో చూపబడింది.
        ఇలా తన ప్రేమను సిలువ మ్రానుపై క్రీస్తు ప్రభువు చూపగా అప్పటి సంఘము యొక్క పరిస్థితి ఎలా ఉన్నది?  ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అని సంఘము అనగా ప్రియురాలు చెప్పుచున్నది.  ఎలా జరిగింది?  ఎప్పుడు జరిగింది?  క్రీస్తు ప్రభువుకు సిలువ శిక్ష విధించగా శిష్యులందరు ఆయనను వదలి పారిపోయారు.  ఈ విధముగా సంఘము చెల్లాచెదురైంది.  క్రీస్తు ప్రభువు పాపికి రక్షణ ఇచ్చుటకు సిలువ బలియాగము ద్వారా తన ప్రేమను ధ్వజముగా సిలువపై ఎత్తగా ఆ ప్రేమను చూచి దిక్కు తెలియని స్థితిలో సంఘము చెల్లాచెదురై ఎవరి త్రోవన వారు వెళ్లిపోయారు.  కొందరు ప్రాణ భయముతో దాగుకొన్నారు.  ఇందులో ''నేను మూర్ఛిల్లుచున్నాను,'' అని చెప్పబడినదేగాని మూర్ఛిల్లలేదు.  ఆ స్థితికి సంఘము అనగా ప్రియురాలు వచ్చింది.  సిలువ బలియాగ సందర్భములో క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ పొందినవారిలో అనేకులు దూరముగా నిలిచిపోయారు.  శిష్యులు చెల్లాచెదురై దాగుకొన్నారు.  కొందరు దూర ప్రాంతములకు వెళ్లుచున్నారు.  శిష్యులలో యోహాను మాత్రమే సిలువ బలి దగ్గర నిలుచుని రక్షణను కళ్లారా చూచాడు.  అంటే సంఘము అప్పటికి చేరిన విశ్వాసులలో అందరు కలత చెంది చెల్లాచెదురైపోతే ఒక్క యోహాను మాత్రమే గుండె నిబ్బరముతో రక్షణను చూచాడు.  కనుక సంఘము మూర్ఛిల్లు స్థితికి వచ్చిందిగాని సంఘములోని యోహాను మూలముగా ఆ స్థితిలోనే ఉన్నదిగాని పూర్తిగా మూర్ఛిల్లలేదు.
        ఇలాంటి స్థితికి చేరిన ప్రియురాలైన సంఘమును ద్రాక్షపండ్ల యడలు పెట్టి నన్ను బలపరచుడని, జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడు అని ప్రియురాలు చెప్పుచున్నది.  అంటే క్రీస్తు ప్రభువు బలియాగము జరిగిపోయింది. ఆయనను సమాధి చేశారు.  సంఘము మూర్ఛిల్లు స్థితిలో ఉన్నది.  ఈ స్థితిలో సంఘము తిరిగి శక్తిని పొందుటకు ద్రాక్షపండ్ల యడలును, జల్దరుపండ్లను పెట్టుమని కోరుకొనుచున్నది. జల్దరు పండ్లు అనగా యాపిల్స్‌ అని పండితుల అభిప్రాయము.  యోవేలు 1:12లో ఆహారమునకు ఆరోగ్యమునకు యోగ్యమైన పండ్లలో ఇది యొకటి - ఆహారమునకు యోగ్యమైనదని చూచుటకు అందమైనదని ఆదికాండము 3:6 వివరిస్తున్నది. ఈ కోరుకొనుచు రహస్యస్థితిలో ఆనాటి శిష్యులు ప్రార్థించారు.  క్రీస్తు ప్రభువును గూర్చి సంఘము రోదించింది.  ఆదివారము తెల్లవారుఝామున క్రీస్తు ప్రభువు పునరుత్థానుడై మగ్దలేనే మరియకు ఆ తరువాత శిష్యులందరికి ప్రజలకు కనిపించాడు.  వారితో కూడ 40 రోజులు ఉన్నారు.  ఈస్థితిలో ప్రభువు వారి ముందు రొట్టెను విరిచి ద్రాక్షారసమును పంచి వారికి మరల తన పునరుత్థానమును గూర్చి గుర్తుకు వచ్చేటట్లు చేశాడు.  లూకా 24:28-35, ''ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా వారు-సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.  ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.  అప్పుడు వారు-ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.  ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదునొకండు గురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి -ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి.  వారిది విని త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమకేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.''  ఈ విధముగా క్రీస్తు ప్రభువు సంఘము ద్రాక్షపండ్ల యడలుతో చేయబడిన రసమును తన రక్తముగా జల్దరు పండ్లు అనగా తన శరీరమును రొట్టెగా వారికి పంచి తిరిగి వారిని బలపరచుట జరిగింది.  అడవిచెట్లలో జల్దరు చెట్టుగా క్రీస్తు ప్రభువును పరమగీతములోనే వర్ణించాడు. కనుక క్రీస్తు ప్రభువు శరీరము ఆహారమునకు మంచివియైన జల్దరు పండ్లతో పోల్చబడి ద్రాక్షపండ్ల యడలును తెచ్చి ద్రాక్షారసముగా మార్చి, దానిని ఆయన రక్తమునకు పోల్చి  క్రీస్తు ప్రభువే స్వయముగా గుర్తు చేయుట ద్వారా మూర్ఛిల్లు స్థితిలో ఉన్న సంఘమును తిరిగి బలపరుచుట జరిగింది.  ఈ విధముగా దేవుని ప్రేమ వలన సంఘము తిరిగి నిర్మించబడి పాపికి రక్షణ లభించింది.
        ఇలాంటి స్థితిలో ప్రియుడు ప్రియురాలైన సంఘమును యెడమ చెయ్యి ఆమె తల క్రింద నుంచాడు.  కుడిచేత ఆమెను కౌగిలించుకొన్నాడని వ్రాయబడింది.  మత్తయి 25:31, 33-34, 41, ''తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.  . . .  తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.  అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి-నా తండ్రిచేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.  . . .  అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి-శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.''  ఇందులో ఎడమ చేతివైపు శపింపబడినవారును పాపులును ఉన్నారు.  మన మూలవచనములో ప్రియుడు ప్రియురాలిని రెండు చేతులతో పట్టుకొనుచు ఎడమ చేతిని తల క్రింద కుడిచేత ఆమెను కౌగిలించుకొన్నాడు అంటే తల వెనుక ఎడమ చేయి వచ్చినప్పుడు, సంఘమను ప్రియురాలు ఎడమ చేతికి క్రీస్తు ప్రభువుకు మధ్య ఉన్నది.  కుడిచేత ఆమెను కౌగిలించుకొనెను అనుటలో ఆ ఎడమ చేతికి క్రీస్తు ప్రభువుకు  మధ్య ఉన్న వారందరు పరిశుద్ధులును ఆశీర్వదింపబడినవారు కనుక ఆయన కుడిచేతితో వారిని ఆశీర్వదించుచున్నారు.  అలాగే ఎడమ చేతితో పట్టుకొవాలంటే చేయి కుడివైపుకు వస్తుంది. కనుక వారు ఎడమ చేతి వైపువారు కారు. కుడివైపు వారినే ఆయన పట్టు కొనుటయు కౌగిలించుకొనుటలో జరిగింది.  అలాగే ఎడమ చేయి ప్రియురాలి తల వెనుక భాగమున ఉంచుటనుబట్టి సంఘమునకు ఆశీర్వదింపబడినవారికి అది చిహ్నముగా ఉండి ఆ చేయి నుండి అవతల ప్రక్కన ఉన్నవారు శపింపబడినవారుగాను కుడిచేత కౌగిలించుకొన్నవారు ఆశీర్వదింపబడినవారుగా మనము గుర్తించాలి.
        ఈ విధముగా క్రీస్తు ప్రభువు తిరిగి సంఘమును బలపరచుట జరిగింది.  నశింపు స్థితిలో ఉన్నవారికి రక్షణను ఇచ్చుట జరిగింది.

16.  యెరూషలేము కుమార్తెలారా - ప్రేమకు ఇష్టమగువరకు

        పరమగీతము 2:7, ''యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులను బట్టియు లేళ్లనుబట్టియు  మీచేత ప్రమాణము చేయించుకొని  ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.''
        నల్లనిదియైన బబులోనుకు మారుమనస్సుకు క్రీస్తు ప్రభువు అవకాశము ఇచ్చారు.  అయితే అప్పటికే క్రీస్తు ప్రభువులో ఉన్న వారి స్థితి ఏమిటి?  తాను సిలువ బలియాగము చేసి పాపములో మ్రగ్గుచున్న సంఘమైన బబులోనుకు అనగా అన్యులకు రక్షణ అవకాశమును ఇచ్చాడు. అయితే మార్త, మరియ, లాజరు వంటివారు అప్పటికే సంఘములో పూర్తి విశ్వాసములో యెరూషలేము కుమార్తెలుగా ఉన్నారు. వీరికి ప్రత్యేకముగా మారు మనస్సు అవసరత లేదు, ఎందుకంటే వీరు అప్పటికే ఆయనను అంగీకరించి రక్షణలోకి వచ్చారు.  సిలువ బలియాగము ద్వారా ఇరువర్గాల ప్రియురాళ్లకు  రక్షణ అనుగ్రహించాలి.  యెరూషలేము కుమార్తెలకు రక్షణ ఇచ్చాడు.  అన్యురాలైన బబులోనుకు రక్షణ ఇచ్చాడు.  ఇచ్చిన రక్షణ అప్పటికప్పుడు యెరూషలేము కుమార్తెలు పొందినారు.  పునరుత్థానముద్వారా లేచి పరిశుద్ధ పట్టణములో కనిపించారు.  మత్తయి 27:50-53, ''యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.  అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్దలాయెను; సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.  వారు సమాధులలోనుండి బయటికివచ్చి ఆయన లేచినతరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.''  వీరందరు యెరూషలేము కుమార్తెలే కాని వీరికి ఉన్న బంధకము వలన ప్రభువునకు ముందుగా పునరుత్థానమును పొందలేక ఆకాశ మధ్యమములో పరదైసులలో ఉండిపోయారు.  ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు తిరిగి పునరుత్థానము ద్వారా లేచాడో వారికి ఆ బంధకాలు తొలగి పరిశుద్ధులు అనగా యెరూషలేము కుమార్తెలు తమ తమ సమాధుల వద్ద నుండి పునరుత్థానములో పాలివారై క్రీస్తు ప్రభువు తరువాత తిరిగి లేచి జీవములో ప్రవేశించుట జరిగింది.
        కాని అన్యురాలుగా ఉన్న బబులోనుకు క్రీస్తు ప్రభువు ఇచ్చిన రక్షణను వారు కూడ పొందారు.  కాని వారిలో ఎందరు విశ్వాసులుగా మారారు?  ఎందరు రక్షణలోకి వచ్చారు?  లూకా 15:3-7, ''అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను -మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?  అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి -మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును గదా.  అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.''  కనుక క్రీస్తు ప్రభువు రక్షణను రుచి చూచి అన్యురాలుగా ఉన్న నల్లనిదియైన బబులోనువారిలో మారుమనస్సు కలిగి ప్రభువు సన్నిధికి వచ్చు వారిని గూర్చిన ఆనందము వారి హృదయములో నిండిపోయి సంతోషముతో ఉన్నారు.
        ఇటువంటి స్థితిలో - అప్పటికే రక్షణలో ఉన్న యెరూషలేము కుమార్తెలను గూర్చి అనగా పరిశుద్ధులను గూర్చి మన మూలవచనములో చెప్పుట జరిగింది.  ఏమని చెప్పబడింది?  యెరూషలేము కుమార్తెలారా అని సంబోధిస్తూ, ప్రస్తుతము క్రీస్తు ప్రభువు మారుమనస్సు పొంది తిరిగి తన చెంతకు ప్రియురాలుగా వస్తున్న విశ్వాసుల విషయములో బహు ఆనందముతో ఉన్నారు.  కనుక యిఱ్ఱులు అనగా జింకలు లేళ్లను బట్టి అనగా వాటిలో మనకు కనబడు అమాయికత్వపు స్థితినిబట్టి యెరూషలేము కుమార్తెలచే ప్రమాణము చేయించుచున్నాడు. ఏమని?  తిరిగి తన ప్రేమను వారు పొందు వరకు మీరు విశ్రాంతిలో ఉండమని కలత చెందవలసిన పని లేదని చెప్పుచూనే క్రీస్తు ప్రభువు బతిమాలుకొను చున్నట్లుగా చెప్పబడింది.  అంటే యెరూషలేము కుమార్తెలపై ఆయన ప్రేమ తగ్గలేదని వారి పట్ల ప్రేమతో బుజ్జగించుచు బతిమిలాడుకొనుటయేగాని, ఆజ్ఞగా అధికారముగా ప్రవర్తించుట లేదని మనము గ్రహించాలి.  కనుక యెరూషలేము కుమార్తెలను కలత చెందక తానిచ్చిన రక్షణను విశ్రాంతిలో ఆస్వాదించమని చెప్పుచు, తాను పొందుచున్న ఆనందమును గూర్చి బహు ఇష్టముగా అన్యురాలైన బబులోను నుండి మారుమనస్సు వచ్చు వారి విషయములో ఆనందించుచున్నారు.

17.  ప్రియుని స్వరము

        పరమగీతము 2:8-10, ''ఆలకించుడి; నా ప్రియుని స్వరము వినబడుచున్నది  ఇదిగో అతడు వచ్చుచున్నాడు  గంతులువేయుచు కొండలమీదను ఎగసిదాటుచు  మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు.  నా ప్రియుడు ఇఱ్ఱివలె నున్నాడు  లేడిపిల్లవలె నున్నాడు  అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు. కిటికీగుండ చూచుచున్నాడు  కిటకీ కంత గుండ తొంగి చూచుచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాటలాడు చున్నాడు.''
        యెరూషలేము కుమార్తెలు విశ్రాంతిలో కలత చెందక యుండగా, నల్లనిదియైన బబులోను సంఘములో రక్షణ సువార్త కలకలము మొదలైంది.  ఏ విధముగా?  క్రీస్తు ప్రభువు పునరుత్థానము తరువాత తిరిగి తన శిష్యులను చేరదీసి వారిని పరిశుద్ధాత్మచే బలపరచి నల్లనిదియైన బబులోను సంఘములోని పాపపు స్థితిలో జీవించు వారి మధ్యకు వారిని పంపి ప్రియుని స్వరమును వినిపించుట జరిగింది. ఇలా పంపబడినవారు ప్రియుని స్వరమును అనగా క్రీస్తు ప్రభువు స్వరమును వినిపింపజేశారు. దీనినే మన మూల వచనములో ఆలకింపమని ఆమె ప్రియుని స్వరము వినబడుచున్నదని చెప్పుట జరిగింది.  ఆలకించకపోతే వినబడదు.  ఖచ్చితముగా సువార్తీకులు క్రీస్తు ప్రభువుకు స్వరముగా మారి సువార్తను బోధించుచున్నప్పుడు మనస్సును కేంద్రీకరించక ఆలకించక పోతే ఆ స్వరము వారిని చేరదు. అందుకే ఆలకించమని తన సంఘములోని పాపపు స్థితిలో ఉన్న వారికి బబులోను అను అన్యజాతి స్త్రీ తెలియజేయుచున్నది.  క్రీస్తు ప్రభుని స్వరమును శిష్యులు లేక సువార్తీకులు వినిపించగా ఆలకించమని బబులోను సంఘము తనలో మారుమనస్సు పొందగోరువారికి చెప్పుచు - ఇదిగో అతడు వచ్చుచున్నాడని కొండలను, గుట్టలను దాటుచు అన్యజాతుల మధ్యకు వచ్చుచున్నాడని తెలియజేయుచున్నది.  కనుక ప్రపంచ నలుమూలల క్రీస్తు ప్రభువు శిష్యులు బోధించి అన్యజాతుల మధ్య ప్రియుడైన క్రీస్తు ప్రభుని స్వరము వినిపించుట చేశారు. ఈ విధముగా స్వరముగా వచ్చిన క్రీస్తు ప్రభువు - ప్రకటన 3:20, ''ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను.  ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము.''  అంటే హృదయపు తలుపువద్ద తట్టుచు ఉన్నారు.  ఎవరైతే తలుపు తీసి ఆయనను ఆహ్వానిస్తారో వారు రక్షణ పొందుదురని చెప్పబడింది. అలాగే ప్రియుని స్వరము వినబడగా, నల్లనిదియైన బబులోను స్త్రీ ఆస్వరము వైపు చూడగా ఆమెకు ప్రియుడైన క్రీస్తు ప్రభువు కనబడుట జరిగింది.  ఆయన చూచుటకు ఇఱ్ఱివలె అనగా జింకవలె లేడిపిల్లవలె ప్రశాంతముగా చూచుచున్నంతసేపు తన వైపే చూచుచున్నట్లుగా ఆయన కనిపిస్తున్నారు. ఇలా కనిపించిన క్రీస్తు ప్రభువు తన స్వరముతో వారిని పిలుస్తూ నల్లనిదియైన బబులోను సంఘము గోడకు వెలుపల నిలుచుని తలుపు తట్టుచు ఎవరైనా  ఆ స్వరము విని తలుపు తీయుదురేమోనని ఎదురు చూస్తున్నాడు.  కాని ఎంతకి వారు రాక పోవుట వలన కిటికీగుండ గోడ కంతలగుండ కూడ తొంగిచూచుచు నిరీక్షణ కలిగి యున్నట్లుగా చెప్పబడింది.  సహజముగా ఈనాడు భారతదేశములో సువార్త విరివిగా జరిగినను మారుమనస్సు పొందువారు ఎందరు?  కనుక ఆయన బబులోను విషయములో ఆ స్థితిలో ఉన్నట్లుగా చెప్పుటను అలా వివరించుచు వర్ణించారు.
        ఇలా ఆయన నిరీక్షణ కలిగి ఉండగా కొందరు తన స్వరమును విని తలుపు తెరవగా క్రీస్తు ప్రభువు వారితో వారి గృహములో చేరి, వారి ప్రియునిగా వారితో మాట్లాడు చున్నట్లుగ చెప్పబడింది.  ఇలాంటివారు వారి ప్రార్థనా జీవితములో అనేక అద్భుతములు సాధించినట్లుగా సంఘములో సాక్ష్యమిచ్చుట మనము చూడగలము.  ఈ స్థితిని ఈ వచనములో క్రీస్తు ప్రభువు వారితో మాట్లాడుటతో సమానమని గ్రహించాలి.  ఈ విధముగా దేవుని రక్షణ అన్యుల మధ్య సువార్తగా ప్రచారము కొనసాగుచున్నది.

18.  ప్రియురాలా లెమ్ము రమ్ము

        పరమగీతము 2:11-13, ''నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము  చలికాలము గడిచిపోయెను  వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు.  దేశమంతట పువ్వులు పూసియున్నవి  పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను  పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది.  అంజూరపుకాయలు పక్వమగుచున్నవి  ద్రాక్షచెట్లు పూతపట్టి సువాసన నిచ్చుచున్నవి  నా ప్రియురాలా, సుందరవతీ, లెమ్ము రమ్ము.''
        ప్రపంచ నలుమూలల క్రీస్తు ప్రభువు శిష్యులు, వారి తరువాత సువార్తీకులు బహుగా సువార్త ప్రచారమును కావించారు.  ఈ స్థితిలో ప్రపంచములో సుమారు 60 నుండి 70 శాతం ప్రజలు విశ్వాసులుగా మారుచున్నారు.  కాలములు గడచుచున్నాయి.  ఈ స్థితిలో క్రీస్తు ప్రభువు ఒకప్పుడు నల్లనిదియునై యుండి మారుమనస్సు పొందుచున్న తన ప్రియురాలైన సంఘమును చూచి మారుమసస్సు ద్వారా సుందరవతిగా మారినదని తలంచి, సుందరవతీ, అని సంబోధిస్తూ లెమ్ము రమ్ము అని పిలుస్తున్నారు. పాపపు జీవితములో సాతాను కబంధ హస్తాలలో ఇరుక్కొని సంఘము ఉన్నది.  
        అలాంటి సంఘములో క్రీస్తునుగూర్చిన సువార్తను కొనసాగించారు.  విన్న విశ్వాసి మారుమనస్సు పొందినట్టి స్థితిలో ఉన్నాడు.  అలాంటి వారికి ప్రభువు చెప్పుచు చలికాలము గడచి పోయినదని వర్షకాలము తీరిపోయి వర్షమిక రాదని చెప్పుచు లెమ్ము రమ్మని చెప్పుచున్నారు.  ప్రకటన 3:15-16, ''-నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.  నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించు చున్నాను.''  చలి కాలము అవిశ్వాసికి సాదృశ్యము అనగా చల్లనిదనము.  వర్షకాలములో చలి అంతగా ఉండదు  వేడి అంతగా ఉండదు  అలాంటి కాలము నులివెచ్చని జీవితమునకు పోల్చి చెప్పబడింది.  ఇలాంటి రెండు రకముల స్థితులు నీ నుండి గడచిపోయాయని అవి ఇక రావని చెప్పబడింది. అంటే నల్లనిదియైన ఈ ప్రియురాలు పాపములో మొదట ఉన్నది.  తరువాత క్రీస్తును తెలుసుకొని నులివెచ్చని స్థితికి వచ్చింది అంటే కొంతవరకు పాపపు స్థితిని వదిలి మరికొంత పాపుపు స్థితిని మిగుల్చుకొని అంటి పెట్టుకొని జీవిస్తున్నది.  ఆ తరువాత చెరగని విశ్వాసిగా మారుచున్నది గనుక క్రీస్తు ప్రభువు నీవు అక్కడ ఉండ నవసరత లేదు గనుక అక్కడ నుండి లేచి రమ్మని పిలుస్తున్నాడు.  ఇలా ఎప్పుడైతే పిలుచుట జరిగిందో నల్లనిదియైన బబులోను ప్రాంతములో మారుమనస్సు పొంది, పాపక్షమాపణ పొందిన విశ్వాసి నూతనముగా జన్మించిన అనుభవము పొంది పువ్వులు వికసించునట్లుగా దేశమంతట అనగా ఈ ప్రపంచము మొత్తములో అనేక చోట్ల విశ్వాసులు కనిపించారు. వారు పిట్టల కోలాహలము చేయు కాలమువలె వారు పువ్వులవలె వికసించి, వారి స్తోత్రగీతములతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగుచున్నది.  
        ఈ సమయములో అక్కడ పావుర స్వరము ఆ దేశములో వినిపించినట్లుగా వ్రాయబడింది.  ఏ విధముగా ఈ స్వరము వినబడింది?  ఇందులో చెప్పబడిన పావురము పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. ఈ పరిశుద్ధాథ్మయొక్క స్వరము ఆ దేశములో వినబడింది.  ఎలా?  అపొస్తలుల కార్యములు 10:44-46, ''పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.  సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి, ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.''  ఈ విధముగా పరిశుద్ధాత్మ పావురముగా అన్యజాతుల  జనుల మీదకు వచ్చినప్పుడు వారు భాషలతో మాట్లాడుచున్నారు.  ఈ విధముగా మారుమనస్సు ద్వారా పరిశుద్ధాత్మను పొందినవారు పావురముగా చెప్పబడిన పరిశుద్ధాత్మకు నిలయమై పరిశుద్ధాత్మ స్వరమును వారి ద్వారా పలుకుట జరిగింది జరుగుచూ ఉన్నది.  ఈ విధముగా పరిశుద్ధాత్మ స్వరము ఆయా దేశాలలో మారుమనస్సు ద్వారా నిజదైవము లోనికి వచ్చిన వారి ద్వారా వినిపిస్తూ వచ్చింది.
        ఈ పరిస్థితులలో అంజూరపు కాయలు పక్వమునకు వచ్చాయి.  ద్రాక్ష చెట్టు క్రొత్త పూత పట్టి సువాసనను నిచ్చుచున్నవి అని చెప్పబడింది.  పావురపు స్వరము వారి దేశములో విశ్వాసుల ద్వారా వినిపించుటను బట్టి విశ్వాసి విశ్వాసములో ఉన్నత స్థానమును పొందితేనేగాని పరిశుద్ధాత్మకు నిలయము కాలేరు.  కేవలము మారుమనస్సు మాత్రమే సరిపోదు. బాప్తిస్మము పొందితే సరిపోదు. దేవునిలో ఎదగాలి. నీతి క్రియలు కొనసాగించాలి.  ఈ స్థితిలో పరిశుద్ధాత్మను విశ్వాసి ఆకర్షించుట ద్వారా, పరిశుద్ధాత్మను పొందుతాడు.  అంటే కాయ స్థితి నుండి పక్వపు స్థితికి చేరుతాడు.  దీనినే ఈ గీతములో అంజూరపు కాయలు పక్వమగుచున్నవని చెప్పబడింది. ఎప్పుడైతే వీరు విశ్వాసములో పక్వమై ఆత్మను పొందారో వారి జీవితము మార్గదర్శకముగా మారి నూతన ఆత్మలకు మారుమనస్సుకు కారణమగును.  కనుక వీరిని చూచి వీరిలోని దైవభక్తి వలన వీరి ద్వారా క్రీస్తు ప్రభువు వారికి వారి జీవితములో కనిపించుట వలన అనేకులు రక్షణలోకి వస్తారు. దానినే మూల వచనములో ద్రాక్షచెట్టు పూతపట్టుట దాని సువాసనతో పోల్చబడినది.  ఈ నూతనముగా వచ్చినవారు పూతగా మొదలై కాయగా మారి చివరకు వారి క్రియల ద్వారా మంచి ద్రాక్షలుగా గాని కారుద్రాక్షలుగా గాని మారవచ్చును.
        కనుక విశ్వాసి జీవితములో ఎదుగుదలను ఎంత అందముగా ఇక్కడ వర్ణించాడో మనము చదువగలము.  ఎదుగుచు పరిపక్వము చెందినవారు కొందరైతే, నూతనముగా ప్రభువును తెలుసుకొని ఆయనలో ఎదుగుచున్నవారు మరికొందరు. ఇలా అన్ని రకముల వారు ఈ సంఘములో ఉన్నారు.  అలాంటి వారిని లెమ్మని రమ్మని పిలుస్తున్నారు.

19.  బండసందులలో ఎగురు పేటుబీటల నాశ్రయించు నా పావురము

        పరమగీతము 2:14, ''బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము  నీ ముఖము నాకు కనబడనిమ్ము  నీ స్వరము నాకు వినబడనిమ్ము.''
        ఇందులో పావురము అనగా పరిశుద్ధాత్మ కొండ శిలల మధ్య బండసందులలో ఎగురుచున్నదని చెప్పబడింది.  బండ కఠినత్వమునకు సూచన.  బండవలె రాటు తేలిన హృదయము కలిగిన జనులు వివిధ రకములుగా మలచబడిన శిలా విగ్రహాలను దేవుళ్లగాను దేవతలుగాను ఆరాధిస్తూ ఈ లోకములో అన్యులుగా జీవిస్తున్నారు.  వీరు ఏ కోశాన దేవునికి మనస్సున స్థానమీయక విగ్రహారాధన లేదా దేవుడే లేడంటూ జీవిస్తున్నారు.  అంటే వీరి హృదయము దేవునికి దూరముగా కాఠిన్యముతో నిండి కనీసము సువార్త స్వరమును ఆలకించు స్థితిలో ఎవ్వరు లేరు.  ఇలాంటివారి మధ్య కొందరు ప్రభువే నిజ దైవమని గుర్తెరిగి మారుమనస్సు పొంది దేవునికి యోగ్యరీతిలో నీతికి నిలయమై విశ్వాసులుగా ఉన్నారు.  జనులలో జనులుగా జీవిస్తున్నారు.  కనుక పావుర రూపమైన పరిశుద్ధాత్మ వారి మధ్య ఎగురుచు విశ్వాసిని చేరు ప్రయత్నమును గూర్చి ఇందులో చెప్పబడింది.  కఠినమైన బండ వంటి మారని స్వభావము కలిగిన జనుల మధ్య పవిత్రాత్మ విశ్వాసి కోసము ఎగురుచున్నట్లుగా ఎంత అందముగా అలంకార ప్రాసతో వర్ణించాడు.
        ఇలా ఎగురుతూ ఉన్న పావుర రూపమైన పరిశుద్ధాత్మకు పేటుబీటల వంటి అనగా నెర్రెలు విడిచి పగుళ్లతో నిండిన కొండ బండలవంటి హృదయ విదారకమైన స్థితిలో ఉన్న విశ్వాసులు కనిపిస్తున్నారు. అంటే ఒకప్పుడు అవిశ్వాసులుగా ఉండి మారుమనస్సు ద్వారా విశ్వాసిగా ఎదుగుచు పరిపక్వపు స్థితికి చేరుచున్న విశ్వాసి నీరు లేక ఎండిన పంట భూమి పగిలినట్లుగా కనిపిస్తున్నారు.  కనుక ఈ పావుర రూపైన పరిశుద్ధాత్మ వారిని కనికరించి వారిని ఆశ్రయించుచున్నట్లుగా ఈ వచనములో చెప్పబడింది.
        దేవుని ప్రేమ ఎంత ఉన్నతముగా ఉన్నదో దీనినిబట్టి మనకు తెలియుచున్నది.  ఈ విధముగా విశ్వాసిని ఆశ్రయించిన పరిశుద్ధాత్మ తన స్వరమును విశ్వాసికి దయచేసి, వాని ద్వారా ఈ లోకములో తన స్వరమును వినిపించుట జరుగును.  అపొస్తలుల కార్యములు 2:4, ''అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.'' ఈ విధముగా వాక్‌శక్తిని అనుగ్రహించి వారి ద్వారా తాను మాట్లాడుట జరుగుచున్నది.  ఈ స్వరము చాలా మధురమైనదని పవిత్రాత్మ వర్చస్సు అనగా విశ్వాసికి అనుగ్రహించు బలము శక్తి ప్రభావములే గాక శాంతి సమాధానములు చాలా మనోహరమైనదని చెప్పబడింది, ఎందుకంటే పరిశుద్ధాత్మ నిష్కపటమైనట్టి పావురము రూపములో వచ్చును. ఈ రూపములోని పావురపు ముఖము  చూచుటకు చాలా మనోహరముగా ఉంటుంది.  వెలుగు నిండగా అగ్నిజ్వాలలతో పావుర రూపములో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ రూపమును వర్ణించుట అసాధ్యమే అంత మనోహరముగా ఉంటుంది.  ఇలా వచ్చినప్పుడు ఇంకొంత సేపు చూడాలని, ఇంకొంతసేపు ఆ మాటలు వినాలని సంఘము కోరుకొనును.  విశ్వాసి హృదయము ఆనందోత్సాహాలతో నిండి మరికొంతసేపు అలాగే ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది.  ఆ యొక్క దైవిక అనుభూతిని గూర్చి ఇందులో వ్రాయుట జరిగింది.
        ఈ విధముగా పరిశుద్ధాత్మ దిగి వచ్చు విధానమును గూర్చి ఆయన ఎవరిని ఆశ్రయించి తన కార్యములను కొనసాగించునని ఇందులో వివరించుట జరిగింది.

20.  చెరుపు నక్కలు - గుంటనక్కలు

        పరమగీతము 2:15, ''మన ద్రాక్షతోటలు పూతపట్టియున్నవి  ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి  సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి.''
        హేరోదు రాజును గూర్చి క్రీస్తు ప్రభువు నక్కతో పోల్చి సంబోధించుటనుగూర్చి మనము చదువగలము. లూకా 13:32. హేరోదు జ్ఞానులనుండి క్రీస్తు ప్రభువు యూదుల రాజుగా పుట్టాడని తెలుసుకొని ఆయనను చంపించుటకు ప్రయత్నించాడు.  అటుతరువాత తరములోని హేరోదు యోహానును తల నరికించి చంపించాడు.  ఈ విధముగా క్రీస్తు ప్రభువును కుతంత్రముతో చంపజూచుట యోహానును తల నరికి చంపించుట ఇలాంటివి సంఘమునకు ఇబ్బందికరమైన సంఘటనలు.  ఇలా చేస్తున్నందుకు క్రీస్తు ప్రభువు హేరోదును నక్కతో పోల్చి చెప్పుట జరిగింది.  
        అంటే సంఘాన్ని నాశనము చేయాలని తిరుగు అలౌకిక లౌకిక శక్తులన్ని కూడ నక్కలతోను గుంటనక్కలు అనగా నక్కల పిల్లల తోను పోల్చుట జరిగింది.  ఇందులో అబద్ధ క్రీస్తువులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వంటివారు.  తమ సమాజములోనే తిరుగుచు అదే సమాజ వినాశనము కొరకు తిరుగుతారు.  ఈ లక్షణములు గల వారిని నక్కలుగా వర్ణించుట జరిగింది.                
        అయితే పరిశుద్ధాత్మ రాకడతో ఆయన స్వరముతో చిగురించి పూతపట్టిన ద్రాక్షతోటలు అనగా నూతనముగా విశ్వాసములోకి వచ్చు విశ్వాసులను చెదరగొట్టుచు చెరుపు చేయు పై వంటి నక్కలను పట్టుకొనుడి అని చెప్పబడింది.  అలాగే పైకి సహాయము చేయు వారివలె కనిపిస్తూ లోపల గోతులు త్రవ్వి విశ్వాసి నాశనమునకు కారణమయ్యే గుంట నక్కలను కూడ పట్టుకొనుడి అని చెప్పుచున్నారు.  కనుక మొదటి దినాలలో క్రీస్తు ప్రభువు ప్రియునిగా అకర్షించగా ఆయన స్వరమును విని మారుమనస్సు పొంది సంఘముగా ప్రియురాలిగా మారినవారికి పరిశుద్ధాత్మ పావురము రూపములో సహకారము అందించును.  
        అలాగే నక్కలవంటి అపవిత్రుల వలన చెడు జరుగు అవకాశము ఆ తోటను మొత్తము నాశనము చేయగల సమర్థులు వారని, వారి విషయములో జాగ్రత్త వహించమని తెలియజేయుట జరిగింది.

21.  నా ప్రియుడు నా వాడు - నేను అతనిదానను

        పరమగీతము 2:16-17, ''నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను  పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు  చల్లనిగాలి వీచువరకు నీడలు లేకపోవువరకు ఇఱ్ఱివలెను లేడిపిల్లవలెను కొండబాటలమీద త్వరపడిరమ్ము.''
        సంఘము అనగా ప్రియురాలు - నా ప్రియుడు నా వాడు అని చెప్పుచున్నది.  ఈనాడు క్రైస్తవ సంఘములు విస్తరించియున్నవి.  సంఘము పరమగీతములో వలె నా క్రీస్తు ప్రభువు నా వాడు అని చెప్పు స్థితిలో ఉన్నదా?  ఇలా చెప్పాలి అంటే 1 కొరింథీ 11:1, ''నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.''  వాక్యరీతిగా సంఘము నడవాలి.  అలా సంఘ కార్యములు నీతికి సువార్తకు ప్రతిరూపమైతే ఆనాడు ఆ సంఘము నా ప్రియుడైన క్రీస్తు ప్రభువు నా వాడని ఈ సంఘము అతనిది అని చెప్పుకొనగలదు.  ఇలాంటి సంఘము అంత్య దినములలో ఆత్మీయ సంఘముగా మారి మొదట వధువుగా నీతి క్రియలతో అలంకరించబడి తరువాత గొఱ్ఱెపిల్ల భార్యగా పరమయెరూషలేముగా మారును.
        ఈ విధముగా సంఘము మారినప్పుడు క్రీస్తు ప్రభువు అందులోని గొఱ్ఱెలను - ''పద్మములున్నచోట అతడు మందను మేపుచున్నాడు,'' అని చెప్పబడింది.  మందను అనగా గొఱ్ఱెలను అని అర్థము అనగా విశ్వాసులు.  వీరికి క్రీస్తు ప్రభువు కాపరియై పద్మములున్నచోట మేపును.  పద్మములు నీటిలో కదా ఉంటాయి.  అంటే నీటి ఊటల వద్ద ఆయన వారిని మేపునని చెప్పబడింది.  ప్రకటన 7:17, ''ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.''  ఈ విధముగా జీవజలముల బుగ్గల వద్దకు మందను నడిపిస్తాడు.
        ఇంత గొప్ప స్థితిలో నడిపించగల కాపరి రక్షకుడు ఒక్క క్రీస్తు ప్రభువు మాత్రమే.  కనుక తన ప్రియుని వద్దకు రమ్మని ప్రియురాలైన నల్లనిదియైన బబులోను విశ్వాసులకు చెప్పుచున్నది.  ఎలా రమ్మంటున్నదంటే - ఇఱ్ఱి అనగా జింకవలె లేడిపిల్లవలె కొండ బాటలమీద త్వరపడి రమ్ము అని చెప్పుచున్నది.  కనుక ఓ విశ్వాసి!  జాగు చేయక సాతాను శక్తులను జయించి మారుమనస్సు పొంది, నిజమైన ప్రియుని వద్దకు త్వరపడి వెళ్లుట శ్రేయస్కరము.

22.  ప్రాణప్రియుని వెదకుట

        పరమగీతము 3:1-4, ''రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని  వెదకినను అతడు కనబడక యుండెను.  నేనిప్పుడే లేచెదను  పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణ ప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.  పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు  పడగా  మీరు నా ప్రాణప్రియుని చూచితిరా?  అని నేనడిగితిని  నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా  నా ప్రాణ ప్రియుడు నాకెదురుపడెను  వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని  నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని  నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.''
        ఇందులో నల్లనిదియైన బబులోను రాత్రివేళ పరుండియుండి యున్నప్పుడు, ఆమె తన ప్రాణప్రియుని వెదికెనని వ్రాయబడింది.  రాత్రి చీకటికి సూచన. చీకటిలో మనకు ఏమి కనబడదు.  అనగా వెలుగు లేని జీవితములో ఆమె పరుండినట్లుగా చెప్ప బడింది.  ఈ జీవితములో క్రీస్తు ప్రభువుకు అవసరమైన నీతిక్రియలు ఇవి తప్ప మిగిలినవన్ని వారి వద్ద ఉంటాయి.  అవినీతికి నిలయముగాను సాతానుకు మందిరముగాను ఈ జీవితము ఉన్నది.  ఈమె ఏ స్థితిలో ఉన్నదంటే చీకటిలో దైవత్వమునకు దూరముగా పరుండి అనగా పాపపు కార్యములు మధ్య విశ్రాంతిలో ఉంది.  ఈ స్థితిలో ఉన్న నల్లనిదియైన బబులోను తనను ఏలుచున్న సాతాను శక్తులను వదలి తిరిగి తన ప్రాణప్రియుని కోసము ఆ పాపపు స్థితిలో విశ్రాంతిని పొందుచు నిజమునుగూర్చి అబద్ధమును వదలి జీవించుటకు ప్రయత్నించింది.  కాని అంత నిర్లక్ష్య ధోరణిలో పాపపు క్రియల మధ్య వెలుగు లేని జీవితములో నిజదైవమును వెదకినను అక్కడ ఎందుకుంటాడు?  కనుక ఆమెకు ఆమె నిజమైన ప్రియుడు క్రీస్తు ప్రభువు కనబడలేదు.  ఇది మొదటి ఆలోచన.  దీనిలో నిజదైవమును కనుగొనాలన్న ఆలోచనతో వెదకుట కనబడుచున్నది.
        మూలవచనములో - పరుండి రాత్రివేళ వెదకినట్టి బబులోనులోని నిజదైవమును కనుకొనాలన్న కన్యలు అంతటితో ఆగలేదు.  వారి ప్రయత్నము మరింత ముందుకు సాగి పట్టణముల వద్దకు వెళ్లి సంతవీధులలో రాజవీధులలో క్రీస్తు ప్రభువు కోసము నిజదైవము కోసము వెదకుట మొదలైంది.  అక్కడ అందరు వ్యాపారులు మోసగాళ్లు రకరకాల విగ్రహ దేవుళ్లను పూజించువారు - తమవలె జీవించువారు అనేకులు కనిపించారుగాని అక్కడ ఎక్కడ నిజదైవమునకు స్థానము ఉండదు, ఎందుకంటే అవి వ్యాపార స్థలాలు మరియు ఈ లోకరీత్యా ఉన్నత స్థలాలు.  వీటిలో సాతాను అన్ని విధాలుగా విజృంభించి క్రియ జరిగిస్తాడు కనుక అక్కడ దైవిక వెలుగుకు స్థానము లేదు.  కనుక అక్కడ ఆయనను ఎంత వెదకినను కనబడలేదు.
        ఇక బబులోనులో ఉన్న కన్యలు వీరిలో ఆతృత మరింత ఎక్కువ అయ్యిందేగాని వదలలేదు. ఏది నిజము?  ఏది అబద్ధము?  సమస్తములో వారి పరిశోధన కొనసాగుచున్నది.  రాత్రివేళ పాపపు స్థితిలో మొదలైన పరిశోధన తమ చుట్టు ప్రక్కల తమవలె పాపపు స్థితిలోని వారి మధ్య కొనసాగింపబడినను, ఆ బబులోనులోని కన్యలు నిజదైవస్వరూపుడైన వారి ప్రాణప్రియుని కనుగొనలేకపోయారుగాని, వారికి బబులోనులో ఉన్న అంధకార స్థితి పాపపు స్థితి అని అక్కడ దేవుడు దేవుళ్లుగా చలామణి అగువారు అబద్ధికులు అని మనుష్యుల చేత చెక్కబడిన నోరువాయి లేని బొమ్మలని గ్రహింపు కలుగబట్టే నిజమైన దాని కొరకు ఈ అన్వేషణ మొదలైంది.  ఈ అన్వేషణలో ఇంకొక అడుగు ముందుకు వచ్చి అక్కడ పట్టణములయందు కావలి కాయువారు అనగా సమాజపు పెద్దలు లేక విగ్రహ దేవుళ్లు యాజకులు మొదలైనవారు ఆ బబులోను పట్టణమును అందులోని వారిని కావలి కాయువారు వారిని నిజదైవమును గూర్చి అడుగుట జరిగింది.  వారిని క్రీస్తు ప్రభువును గూర్చి ప్రశ్నించింది కాని ఫలితము లేదు, ఎందుకంటే వారు కూడ అన్యులుగా ఉంటూ సాతానుకు వారు ఏర్పరచిన శిలా విగ్రహాలు.  అవి ఏ మనుష్యుడు లెక్కపెట్టలేనన్ని ముక్కోటి అబద్ధపు దేవుళ్లు దేవతలకే కొలువు చేయువారు గనుక - వారు కూడ క్రీస్తు ప్రభువును గూర్చిన సమాచారము ఇయ్యలేక పోయారు.
        ఇంతటితో ఈ కన్యలలో ఉన్న అన్వేషణ ఆగలేదు.  ఇంకొక అడుగు ముందుకు వేశారు.  ఎలా?  వారు పాపపు సమాజమైన బబులోనును విడిచి, దానిని కావలి కాయు వారిలో శరీర రీత్యా ఉన్న పెద్దలను, యాజకులు మొదలైనవారిని విడిచి ఆత్మరీత్యా ఉన్న సాతాను ఏర్పరచిన విగ్రహ దేవుళ్లను దేవతలను విడిచి అనగా మూలవచనములో - ''నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా,'' అని చెప్పుట జరిగింది.  ఎప్పుడైతే పైవన్ని అబద్ధమని వాటిని, వాటి సంబంధమైన సమస్తమును విడిచి పెట్టిందో అప్పుడు - ''నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను,'' అని చెప్పుట జరిగింది.
        అంటే క్రీస్తు ప్రభువు రక్షణలోకి అనగా నిజదైవములోకి రావాలంటే మొదట అన్వేషణ జరిగించాలి.  తమ చుట్టుప్రక్కల ఉన్నవారిలో పరిశోధించాలి.  చివరకు అవన్ని అబద్ధములని గ్రహించి మరికొంత ముందుకు అన్వేషిస్తూ ప్రయాణిస్తే - అక్కడ క్రీస్తు ప్రభువును దర్శించగలుగుదురు.  ఈ విధముగా అనేకులు రక్షణలోకి వచ్చారు.  వారి సాక్ష్య జీవితము ఇంచుమించు ఈ పద్ధతిలోనే ఉంటుంది.
        ఇలా రక్షణలోకి వచ్చిన కన్యలు అనగా విశ్వాసులకు ఎప్పుడైతే రక్షణ అనుభవములోకి వచ్చారో వెంటనే రక్షణను వదలిపెట్టక పట్టుకొనుట జరుగును.  ఇక ఎవ్వరు ఎన్ని చెప్పినను ఎంతగా హేళన చేసినను వారు ఆయనను తమ ప్రాణప్రియునిగా చేసుకొంటారేగాని వదలరు విడిచిపెట్టరు.  ఇంకా ఎక్కువ గట్టిగా విశ్వాసములో బలపడుట జరుగును.  ఇలా గట్టిగా పట్టుకొని తన రక్షణ అనుభవమును ముందుగా త్వరితగతిని తన తల్లి ఇంటికి అనగా నల్లనిదియైన బబులోనులోనికి కొనిపోయింది.  ఇక్కడ విశ్వాసి తాను నిజమును కనుగొన్నానని ఎంతో ఆనందముతో దానిని విడిచిపెట్టక గట్టిగా పట్టుకొని తిరిగి తన తల్లి యింటికి కొనిపోయింది.  తాను అన్వేషిస్తున్నన్ని రోజులు తన యింటిలో వారికి అంతగా తెలియదుగాని ఒక్కసారి అన్వేషణ ఫలితమును మాత్రము తన తల్లియైన బబులోనులో తెలియజేస్తుంది. అంతేకాదు తన ప్రాణప్రియుడని ఆయన ఒసగిన రక్షణను తీసుకొని తనతో బాటుగా తోడుకొని వచ్చుట జరిగింది.  ఇక్కడ వచనాలు చాలా విచిత్రముగా వ్రాయబడియున్నవి.  తన తల్లి, తరువాత వచనములో నన్ను కనినదాని అని చెప్పబడింది.  తన తల్లి అను పదములో గౌరవ భావము ఉన్నది.  కనినదాని అను పదములో గౌరవము లేదు.  అలా చెప్పుచూనే నన్ను కనినదాని యర లోనికి తోడుకొని వచ్చితిని అని చెప్పబడింది.  అంటే తాను రక్షణ పొందినది క్రీస్తుప్రభువును కనుగొనినది.  అంతటితో ఊరుకొనక తాను పొందిన రక్షణను తన తల్లి యింటికి కొనిపోయింది.  కాని అక్కడ ఉన్నవారంతా అన్యజాతివారు విగ్రహారాధికులు.  అక్కడ పరిస్థితి ఎటు చూచిన విగ్రహారాధన మధ్యలో రక్షణ స్వరము వచ్చి చేరింది.  ఇక్కడ కనినదాని యర అనుటలో బబులోనులో ఈ విశ్వాసిగా మారిన వాని జన్మ జరిగింది.  దాని యరలో అన్యజాతులవారున్నారు.  బబులోను విగ్రహారాధన మూలమైన ప్రాంతము.  నరుల పతనానికి ఇదే పట్టుకొమ్మలాంటిది.  మనిషిని అన్ని రకములుగా దేవునికి దూరముగా చేయగల సత్తా దానికి ఉంది.  చివరకు అటువంటి ప్రాంతములోనికి ఈ రక్షణను తోడుకొని తనతో బాటుగా విశ్వాసిగా మారినవారు దైవ రక్షణకు మూలమైన ప్రభువును తమతో తీసుకొని పోవుట జరిగింది.  అందువల్లనే యేసుక్రీస్తు ప్రభువుయొక్క నామము దశదిశల వ్యాపింపజేయగలిగినారు.

23.  యెరూషలేము కుమార్తెలారా - ప్రేమకు ఇష్టమగువరకు

        పరమగీతము 3:5, ''యెరూషలేము కుమార్తెలారా,  పొలములోని యిఱ్ఱులను బట్టియు లేళ్లనుబట్టియు  మీచేత ప్రమాణము చేయించుకొని  లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు  మీరు లేపకయు కలతపరచకయు  నుండుడని నేను మిమ్మును బతిమాలుకొను చున్నాను.''
        16వ విభాగము పరమగీతము 2:7లో ఇదే సంగతిని క్రీస్తు ప్రభువు ప్రియునిగా చెప్పుట జరిగింది.  కనుక యెరూషలేము కుమార్తెలు అనగా పరిశుద్ధులు.  వీరిని మరికొంతకాలము వారిపై తన ప్రేమ ఇష్టము వచ్చువరకు వేరే విధమైన అన్య ఆలోచనలు చేయక ఉన్న స్థితి నుండి లేవక కలత చెందక ఉండమని చెప్పుట జరుగుచున్నది.  ప్రకటన 6:9-11, ''ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.  వారు-నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.  తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.''  వీరంతా క్రీస్తు ప్రభువు కోసము ప్రాణములు కోల్పోయినవారు.  వీరిని అదే స్థితిలో మరికొంతకాలము వేచియుండుమని చెప్పబడింది.  అలాగే యెరూషలేము కుమార్తెలను అనగా పరిశుద్ధు లందరిని వేచియుండుమని అనగా ప్రకటన 6:11 తాను ఏర్పరచుకొన్న సహదాసుల ఆత్మల నిమిత్తము అనగా తన ప్రేమ నల్లనిదియైన అన్యజాతులపై ఉండు నిమిత్తము కలత చెందక ఉండమని చెప్పుచున్నారు.

24.  ధూమ స్తంభము - అరణ్య మార్గముగా పరిమళ సువాసనతో వచ్చుట

        పరమగీతము 3:6, ''ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి?  గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను  పరిమళించుచు వచ్చు ఇది ఏమి?''
        ఈ వచనములో ఐగుప్తును విడనాడిన సందర్భమును గుర్తు చేసుకొనుచు వర్ణించబడింది. వారు ఎఱ్ఱ సముద్రము దాటు సందర్భము మొదలు ఎడారిలోను కానాను ప్రవేశించుటకు ముందు వరకు ఈ స్తంభము వారిని నడిపించింది.  నిర్గమ కాండము 14:19-20, ''అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు.''  ఈ విధముగా ఈ మేఘస్తంభము వారిని రక్షించింది.  అటుతరువాత - నిర్గమ కాండము 40:36-38, ''మేఘము మందిరముమీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి.  ఇదే వారి ప్రయాణ పద్ధతి.  ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి.  ఇశ్రాయేలీయు లందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద ఉండెను.  రాత్రి వేళ అగ్ని దానిమీద ఉండెను.  వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.''  ఈ విధముగా అగ్నిస్తంభముగా రాత్రి, మేఘస్తంభముగా పగలు వారిని నడిపింపజేశాడు.  ఈ అగ్ని మండుచు పొగవలె, మేఘము క్రమ్ముట వలన అది బూడిద రంగువలె కనిపించుట వలన దానిని ధూమస్తంభముగా గీతములో అలంకారముగా వర్ణించుట జరిగింది.  ఇది మొదట ఐగుప్తులో ప్రారంభమై, ఎఱ్ఱ సముద్రములోను, ఎడారి గుండా ప్రయాణించి చివరకు అరణ్యమార్గముగా కానాను చేరుకొన్నది. కనుక ఈ వచనములో ఈ ధూమ స్తంభమువలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి?  అని గీతములో వ్రాయట జరిగింది.  ఇలా వచ్చుచున్న దాని నుండి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చుచున్నట్లుగా వ్రాయబడింది.  నిర్గమ కాండము 30:22-29, ''మరియు యెహోవా మోషేతో ఇట్లనెను-నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తులముల యెత్తును నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులములును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము, అనగా సుగంధ ద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభారముగా చేయవలెను.  అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.  ఆ తైలములో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటిని దీపవృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణము లన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతిపరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను.''  ఇందులో వివిధ రకములైన సుగంధ ద్రవ్యములతో  తైలము చేసి దానిని మందసమునకు పవిత్రమైన వస్తువులపై చల్లగా ఆ పరిమళించు సువాసనతో ఆ మందసము అరణ్య మార్గముగా కానానుకు చేరుట జరిగింది.  ఈ యొక్క సందర్భాన్ని అద్భుతముగా అలంకార ప్రాయముగా ఈ గీతములో వర్ణించాడు.

25.  సొలొమోను పల్లకి - అరువదిమంది శూరులు

        పరమగీతము 3:7-8, ''ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది  అరువదిమంది శూరులు దానికి  పరివారము  వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు  వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు  రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు.''
        సొలొమోను పల్లకి వస్తున్నది అని చెప్పబడింది.  పల్లకిలో వధువు వచ్చునుగాని సొలొమోను కాదు.  మహారాజుల ప్రయాణము రథముల మీదను లేదా గుర్రముల మీదను ఉంటుంది.  అలాగే వధువు కోసము సొలొమోను పల్లకి పంపితే సొలొమోను పల్లకి వధువు కోసము వెళ్లుచున్నది అని వ్రాయాలి.  అట్లుగాక వధువును తీసుకొని వస్తుంటే అది వధువు పల్లకి అవుతుందిగాని సొలొమోను పంపినను వధువు పల్లకి వస్తుందనే చెప్పుదురు.  ఇంతకి ఈ పల్లకి ఏమిటి?  మందసమే.  అరణ్యమార్గములో పరిమళించుచు ఎవరు ఉపయోగించని తైలముల సుగంధమైన వాసనలతో ఆ మందసము ఊరేగింపుగా దానిని మోసుకొంటూ వస్తున్నారు.  నిర్గమ కాండము 37:1-5, ''మరియు బెసలేలు తుమ్మకఱ్ఱతో ఆ మందసమును చేసెను.  దాని పొడుగు రెండు మూరలనర  దాని వెడల్పు మూరెడునర దాని యెత్తు మూరెడునర.  లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేసెను.  దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒకప్రక్కను రెండు ఉంగరములును ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను.  మరియు అతడు తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను చొనిపెను.''  ఈ విధముగా మందసమును పల్లకిని మోసుకొని వచ్చునట్లుగా నాలుగు ప్రక్కల మోసుకొని వచ్చేవారు.  పల్లకీలలో సాధారణముగా వధువు ఉంటుంది.  కాని దీనిలో మందసము అందలి వస్తువులు ఉన్నాయి.  ఇవన్ని క్రీస్తు ప్రభువుకు సూచన.  చిగురించిన అహరోను కర్ర క్రీస్తు ప్రభువుకు సూచన.  దశాజ్ఞలు చెక్కబడిన రాళ్లు క్రీస్తు ప్రభువుకు సూచనే.  ఇవన్ని మందసములో ఉంచుట వలన క్రీస్తు ప్రభువును వారు పల్లకిలో ఉంచుకొని మోసుకొంటూ వస్తున్నారు.  అందువలన ఈ మందసమునకు  సొలొమోను పల్లకి అని నామకరణము చేశారు.  సొలొమోను రాజు అతనిలోని జ్ఞానము క్రీస్తు ప్రభువు.  క్రీస్తు ప్రభువే ఆ పల్లకి అనగా మందసములో పరిశుద్ధమైన వస్తువుల రూపములో ఉన్నారు.  కనుక ఇది సొలొమోను పల్లకిగా వర్ణించబడింది.
        ఈ విధముగా మందసమును నాలుగు ప్రక్కల మోసుకొంటూ వస్తున్నారు.  ఈ మందసమును కాపాడుటకు అరువదిమంది శూరులు దానికి పరివారముగా ఉన్నారు.  వీరు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు.  వీరందరు కూడ ఖడ్గము ధరించినవారు.  యుద్ధము చేయగలిగిన వీరులే.  ఇంతకి వీరు ఎవరు?  యాకోబు సంతతివారు.  వారిలో లేవీయులు దేవాలయములో దేవునికి సేవ చేసుకొనువారు గనుక వీరు యుద్ధమునకు రానవసరత లేదు.  మందసమునకు వెలుపటి కార్యక్రమాలలో వీరు పాల్గొన అవసరము లేదు.  వీరికి కేవలము మందసమున్న దేవుని ఆలయములో వారు దేవునికి సేవ చేసుకొందురు.  యాజకులుగాను పనివారుగాను ఆలయములో ఉండురు.  కనుక ఈ డెబ్బదిమందిలో నుండి వారి పేర్లు తొలగించాలి.  ఈ పేర్లు లేని లేక వ్రాయ బడని లేవీయులు మాత్రమే దానిని కాపలా కాయాలి.  సంఖ్యా కాండము 1:48-54, ''ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను-నీవు లేవీగోత్రమును లెక్కింపకూడదు.  ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు.  నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటిమీదను లేవీయులను నియమింపుము.  వారే మందిరమును దాని ఉపకరణము లన్నిటిని మోయవలెను.  వారు మందిరపు సేవచేయుచు దానిచుట్టు దిగవలసినవారై యుందురు.  మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను.  అన్యుడు సమీపించినయెడల వాడు మరణశిక్ష నొందును.  ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను. ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.  యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి.''  దీనినిబట్టి లేవీయులు మందసమునకు చుట్టు ఉంటూ దానిని కావలి కాయు చున్నారు.  రాత్రి చీకటి భయము వలన వారు రాత్రులందు కూడ ఖడ్గము ధరించి దానిని కావలి కాస్తున్నట్లుగా చెప్పబడింది.  కనుక వీరు లేవీయులు.

26.  మంచమును చేసి అలంకరించుట

        పరమగీతము 3:9-10, ''లెబానోను మ్రానుతో మంచమొకటి  సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.  దాని స్తంభములు వెండిమయములు  దాని పాదములు స్వర్ణమయములు  దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను  ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంకరించిరి.''
        లెబానోను మ్రానుతో సొలొమోను రాజు ఒక మంచము చేయించుకొని యున్నాడని ఇందులో చెప్పబడింది.  మంచము విశ్రాంతికి సూచనగా చెప్పబడింది.  దేవుని రెండవ ఆజ్ఞ కూడ ఇదియే.  విశ్రాంతి దినమును ఆచరించాలి.  ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సొలొమోను రాజు లెబానోను మ్రానులతో యెరూషలేము నగరములో దేవునికి ఒక మందిరము నిర్మించాడు.  1 రాజులు 5:5-6, ''కాబట్టి-నీ సింహాసనముమీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రియైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను.  లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెల విమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురు; మ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక,'' దేవుని ఆలయమునకు సొలొమోను రాజు లెబానోనున దేవదారు మ్రానులతో మందిరమును నిర్మించాడు.  దీనిని ఎందుకు నిర్మించాడు?  దేవుని కోసమా?  లేక తన కోసమా?  అని ఆలోచిస్తే దేవుడు మానవ నిర్మితములైన హస్తకృత్యములలో నివసింపబడడని వ్రాయబడియున్నది.  అపొస్తలుల కార్యములు 7:50, ''అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు.''  
        అయితే దీనిని ఎందుకోసము నిర్మించినట్లు? విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక చింతనతో జీవించుటకు నిర్మించాడు. అందుకే లెబానోను మ్రానుతో సొలొమోను రాజు ఒక మంచము తనకోసము చేసుకొనెనని వ్రాయబడింది. ఇలా మందిరమును నిర్మించుటలో ఇంకొన్ని వర్ణనలు ఉన్నాయి.  ''దాని స్తంభములు వెండి మయములు.''  1 రాజులు 7:15-18, ''ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోసెను; ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివిగలది, ఒక్కొక్కటి పండ్రెండు మూరల కైవారము గలది. మరియు స్తంభములమీద ఉంచుటకై యిత్తడితో రెండు పీటలు పోతపోసెను; ఒకపీటయొక్క యెత్తు అయిదు మూరలు, రెండవ పీటయొక్క యెత్తు అయిదు మూరలు.  మరియు స్తంభములమీదనున్న పీటలకు అల్లిక పనివంటి పనియు, గొలుసు పని దండలును చేయబడెను; అవి పీటకు ఏడేసి కలిగి యుండెను.  ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని రెండు వరుసలు దానిమ్మపండ్లతో చేసెను; ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను.''    
        ''దాని పాదములు స్వర్ణమయములు.''  1 రాజులు 6:17-20, ''అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము నలువది మూరల పొడుగై యుండెను.  మందిరములోపల నున్న దేవదారు పలకలమీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి యుండెను; అంతయు దేవదారుకఱ్ఱ పనియే, రాయి యొకటైన కనబడలేదు.  యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరములోపల గర్భాలయమును సిద్ధపరచెను.  గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల యెత్తును గలదై యుండెను, దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను, అర్జకఱ్ఱతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించెను.''  మందసము ఉంచు భాగము మొత్తము బంగారముతో పొదిగారు కనుక అది స్వర్ణమయముగా ఉన్నది.  ''దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను.''  ఆ యొక్క ఆలయములో సొలొమోను రాజు తెరలు కట్టించి అందముగా అలంకరించెనని వ్రాయబడింది.  2 దినవృత్తాంతములు 2:7, ''ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై-నేను నీకు ఏమి ఇయ్య గోరుదువో దాని అడుగుమని సెలవియ్యగా.''  ఈ విధముగా రకరకాల రంగులు గల వస్త్రములు సిద్ధము చేయుట జరిగింది.  ఈ వస్త్రములను యెరూషలేము కుమార్తెలు అనగా నీతి మార్గములో జీవించువారు దేవుని ప్రేమను సూచించు విధముగా వారికి దేవునిపై ఉన్న ప్రేమను కనబరచు విధముగా ఆ యెరూషలేము ఆలయము లోపలి భాగమును అలంకరించిరని చెప్పబడింది.  

27.  వివాహదినమున తల్లి తన కుమారునికి కిరీటము పెట్టుట

        పరమగీతము 3:11, ''సీయోను కుమార్తెలారా, వేంచేయుడి  కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి  వివాహదినమున అతని తల్లి  అతనికి పెట్టిన కిరీటము చూడుడి  ఆ దినము అతనికి బహు సంతోషకరము.''
        మొదట ఇశ్రాయేలీయులను ఎన్నుకొని వారి ద్వారా ప్రపంచ మానవాళికి నిజమైన దేవుడను నేనే అని నిరూపించుతూ దేవుడు క్రియ జరిగించాడు.  కాని వారు చివరకు పతనమై ప్రతిష్ఠాత్మకముగా నిర్మించిన యెరూషలేము ఆలయమును సైతము విగ్రహ దేవుళ్ల  ప్రతిమలతో నింపి దేవుని అవమానపరచారు.  కనుక దేవుడు సీయోనులో క్రీస్తు ప్రభువును తిరిగి సంఘమునకు పునాదిగా వేశాడు.  యెషయా 28:16, ''ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు  -సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే  అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి  బహు స్థిరమైన పునాదియైన మూలరాయియై యున్నది.''  ఈ పునాది క్రీస్తు ప్రభువే!  
        ఆయన ద్వారా మారినవారిని సీయోను కుమార్తెలుగా ఇందులో వర్ణించుచు వారిని రమ్మని ఆహ్వానించుచున్నారు.  కనుక ఎవరైతే ఈ ఆహ్వానము అందుకొనువారు ధన్యులు.  ప్రకటన 19:9, ''మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను-గొఱ్ఱెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను.''  వీరిని ఆహ్వానించుటయేగాక కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి అని చెప్పుచున్నారు. కాని పరలోకరాజ్య ప్రవేశ అర్హత రాజులు తమ ఘనతను వీడి కేవలము తాము పొందిన మహిమ అనగా క్రీస్తు ప్రభువును అంగీకరించిన దానిని బట్టి మాత్రమే వారికి ప్రవేశముంటుంది.  ప్రకటన 21:24, ''జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొని వచ్చెదరు.''  ప్రకటన 21:26, ''జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.''  జనులు ఘనతను మహిమను కొనిపోతుంటే భూరాజులు కేవలము మహిమను మాత్రమే కొనిపోతారు.  కనుక ఇక్కడ చెప్పబడిన రాజు క్రీస్తు ప్రభువే.  వైభవములో సొలొమోను భూరాజులందరిని మించినవాడు.  అంత వైభవము క్రీస్తు ప్రభువే ఆయనలో జ్ఞానముగా ఉండుట వలన ఈ వచనములో సొలొమోను రాజు అని వ్రాయబడింది.  కాని నిజానికి యూదుల రాజైన క్రీస్తు ప్రభువు అతని తల్లియైన కన్య మరియమ్మ ఆ వివాహ దినమున ఆయనకు కిరీటము పెట్టుట జరుగును, కనుక ఆ దినము అతనికి బహు సంతోషకరమైనదని చెప్పబడింది.  కనీసము సొలొమోనును రాజుగా అభిషేకించినవారు నాతాను సొదోకు ప్రవక్తలు.  అలాగే 1 రాజులు 3:1, ''తరువాత సొలొమోను ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను.  తన నగరును యెహోవా మందిరమును యెరూషలేముచుట్టు ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను.''  
        ఈ విధముగా సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను వివాహము చేసుకొన్నాడు.  అన్యురాలైన స్త్రీని వివాహము చేసుకొనుట బహు సంతోషకర దినము కాదు.  ఇది బాధాకరమైన దినము, ఎందుకంటే సొలొమోను తన చివరి కాలములో ఈ అన్యజాతి స్త్రీలు అతనిని విగ్రహారాధికునిగా మార్చి ఆత్మీయ జీవితమును నాశనము చేశారు. 1 రాజులు 11:9-10.  కనుక ఇందులో రాజును సొలొమోను రాజుగా వర్ణించినను ఆ రాజు గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు ప్రభువే!
        అయితే క్రీస్తు ప్రభువుకు వివాహము జరుగునా?  అన్న అనుమానము మనకు కలుగవచ్చును.  క్రీస్తు ప్రభువు గొఱ్ఱెపిల్లగా వధువు సంఘమును వివాహము చేసుకొనును.  ప్రకటన 19:7-9, ''అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము-సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలు చున్నాడు; ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని.  మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.  మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను-గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను.''  అలాగే ప్రకటన 21:9-11లో వధువుగా అలంకరింపబడుట అటుతరువాత భార్యగా మారును.  ఈ వివాహమునకు ఒక దినము ఉన్నది.  ఆ దినమున క్రీస్తు ప్రభువుకు కిరీటమును ఆయన తల్లియైన కన్య మరియమ్మ ధరింపజేయును.  
        ఈ విధముగా క్రీస్తు ప్రభువును పెండ్లి కుమారునిగా చేసి ఆయనకు కిరీటమును ఆయన తల్లియైన కన్య మరియమ్మ ధరింపజేయునని చెప్పబడింది.  
        ఇందునుబట్టి కన్య మరియ వధువు సంఘమునకు అత్తగారని, విశ్వాసి యొక్క విశ్వాస జీవితమునకు ప్రభువు దయచేసిన తల్లియని యోహాను 19:27 వివరిస్తున్నది.  ఇలాంటి దినము బహు సంతోషకరమైనదని దానిని చూచుటకు సీయోను కుమార్తెలమైన మనలను అనగా క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన మనలను చూచుటకు వేంచేయుమని పిలుచుటను గీతముగా రచించుట జరిగింది.

28. నల్లనిదియైన ప్రియురాలి సౌందర్యమును గూర్చి మొదటి వర్ణన

        పరమగీతము 4:1-7, ''నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి  నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడుచున్నవి  నీ తలవెండ్రుకలు  గిలాదు పర్వతముమీది మేకల మందను  పోలియున్నవి.  నీ పలువరుస కత్తెరవేయబడినవియు  కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై  జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టుకొనక  సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నది. నీ పెదవులు ఎరుపునూలును పోలియున్నవి.  నీ నోరు సుందరము  నీ ముసుకుగుండ నీ కణతలు విచ్చిన దాడిమ ఫలమువలె నగపడుచున్నవి. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురము తోను  వేయి డాలులును, శూరుల కవచములన్నియును  వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము.  నీ యిరు కుచములు ఒక జింకపిల్లలయి తామరలో  మేయు కవలను పోలియున్నవి.  ఎండ చల్లారి నీడలు జరిగిపోవువరకు  గోపరస పర్వతములకు  సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును.  నా ప్రియురాలా, నీవు అధికసుందరివి  నీయందు కళంకమేమియు లేదు.''
        ఎప్పుడైతే ప్రియుని వివాహ దినమున ఆయన తల్లి కిరీటమును ధరింపజేసిందో, ఆ తరువాత ప్రియురాలిని గూర్చి చెప్పబడింది, ఎందుకంటే వివాహమునకు స్త్రీ పురుషులిద్దరు తయారు కావాలి.  ప్రియుడు క్రీస్తు ప్రభువు సిద్ధమైనాడు.  సీయోను కుమార్తెలు అనగా విశ్వాసులు చూడడానికి వచ్చారు.  ఇప్పుడు ప్రియురాలు సిద్ధమైంది.  ఆమె ప్రియుని చూపుకు ఎలా కనబడుచున్నదో తెలుసుకొందము.
        అతని ప్రియురాలైన యెరూషలేము సంఘము అనగా వధువు సంఘము చాలా సుందరముగా కనిపించింది. అందుకే ''నీవు సుందరివి నీవు సుందరివి'' అని చెప్పు చున్నారు.  అలాగే ఆమె ముసుగు ధరించుకొని వినయమును ప్రియుడైన క్రీస్తు ప్రభువు ముందు ప్రదర్శించగా ఆయన ఆమె కళ్లను చూచి, గువ్వ కన్నులవలె అమాయికత్వముతోను నిష్కల్మషముగా ఉన్నట్లుగా చెప్పుచున్నారు.  అలాగే ఆమె తల వెండ్రుకలు నిండుదనముగా ఉన్నవని చెప్పుటకు గిలాదు పర్వతము మీద మేకల మందను పోల్చి చెప్పుట జరిగింది.  ఈ వెండ్రుకలు శరీరమును కప్పుకొనుటకు ఆమెకు ఇచ్చినట్లుగా పౌలు తన లేఖలో వ్రాశాడు.  1 కొరింథీ 11:15.
        అలాగే ఆమె పలువరుస హెచ్చుతగ్గులు లేక సరి చేయబడి వరుస క్రమములో ఉన్నవి.  అలాగే అవి బాగా కడగబడి అప్పుడే పైకి వచ్చినవియై పిల్లలను కలిగిన గొఱ్ఱెయొక్క పిల్లలను పోలియున్నవని చెప్పుచున్నారు.  అంటే తమ పాపములు ప్రక్షాళన చేసుకొని ప్రభువు రక్తములో కడగబడి, అప్పుడే నీతిలో ప్రవేశించినవారికి సూచనగా అవి అలా కనబడుచున్నవి.  ఆమె పెదవులు సన్నవిగా ఎరుపుగా ఉన్నవని చెప్పుటకు ఎరుపు నూలుతో పోల్చి చెప్పుచున్నారు.  అలా సన్నని పెదవులుగల నోరు సుందరమైనదని చెప్పబడింది.  అలాగే ఆమె కణతలు దాడిమ ఫలమువలె కనిపిస్తుంది.  ఈ విధముగా రకరకాలుగా క్రైస్తవ్యములోనికి వచ్చిన విశ్వాసులచే వధువు నింపబడి వివాహమునకు సిద్ధపరచుచున్నది.  అలా తయారైన వధువు క్రీస్తు ప్రభుని కళ్లకు పై విధముగా కనబడినట్లుగా వ్రాయబడింది.  
        కంధరము అనగా కంఠ భాగము జయసూచకముల నుంచుటకే దావీదు గోపురములను కట్టించి అక్కడ డాలులను, శూరుల కవచములను వ్రేలాడ కట్టినారు.  అలాగే ఈ కంఠ భాగము వధువు సంఘములో చేరిన విశ్వాసులు సాతాను మరియు ఈ లోకముపై సాధించిన విజయమునకు సూచనగా అది కనిపిస్తున్నది.  ఎఫెసీ 6:13-15, ''అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.  ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.'' అని చెప్పబడినట్లుగా పాతనిబంధన కాలములో వీరు ఉపయోగించు వస్తువులను సూచనగా చెప్పుట జరిగింది.  అలాగే ఆమె కుచములు అనగా చంటి బిడ్డకు పాలుఇచ్చు భాగములు - తామరలో మేయు జింక పిల్లలవలె యున్నాయని చెప్పబడింది కనుక లోయలలో తామర క్రీస్తు ప్రభువుకు సూచనగా వర్ణించబడింది.  కనుక క్రీస్తు ప్రభువును ఆధారముగా అనగా సువార్తను ఆధారము చేసుకొని విశ్వాసులను పోషించిన సంఘమునకు ఇది సూచనగా చెప్పబడింది.
        ఇన్ని విధాలుగా వధువు విశ్వాసులతో నింపబడి సౌందర్యమును సంతరించు కొనగా - ఎండ చల్లారి అనగా పాప ప్రక్షాళన జరిగి, నీడలు జరిగిపోవు వరకు అనగా క్రీస్తు ప్రభువు నీడలో ఉన్నంతవరకు ఆ నీడ తొలగనంత వరకు ఆమె గోపరస, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్లుదును అని చెప్పుచున్నది.  ఈ గోపరసము అన్నది అరబ్బుల దేశమందు ఒక విధమైన ముళ్ళ చెట్టు నుండి వచ్చు బంకయై యున్నది.  దీనినే బోళము అని అందురు.  యేసు జన్మించినప్పుడు ఆయనను చూడ వచ్చిన జ్ఞానులు దీనిని ఆయనకు కానుకగా సమర్పించినట్లు మత్తయి 2:11 వివరిస్తున్నది.  ఇందునుబట్టి ముండ్ల చెట్టు నుండి తయారయ్యే రసము కనుక ఈ దినుసులు పర్వత సానువులపై దొరకుచుండుట వలన గోపరస పర్వతమునకు సాంబ్రాణి దొరకు పర్వతములకు నేను వెళ్లుదునని వ్రాయబడియుండవచ్చును.  పన్నీరు వలె చేసిన రోజా పుష్పముల నీళ్లతో పర్వతములు ఉండక పోయినను అలాగే సాంబ్రాణితో పర్వతములు ఉండక పోయినను ఆ పర్వత సానువులలో వీటి తయారీకి కావలసిన మొక్కలు దొరకుచున్నవి.  కనుక ఇది అభిషేక తైలమునకు సూచనగా చెప్పబడింది.  ఈ తైలమును తయారీ చేయు విధానములో వీటిని ఉపయోగిస్తారు.  కనుక ఆయన వద్దకు పోతానని చెప్పబడింది.  ఇందులో పర్వతములని చెప్పుటనుబట్టి అవి ఉన్నత స్థానమునకు సూచన.  కనుక ఎంత కష్టమైనను నేను ప్రభువును చేరుకొంటానని ప్రియురాలు ఇందులో తెలియజేస్తున్నది.
        ఇలా చెప్పుచున్న తన ప్రియురాలైన వధువు సంఘమును గూర్చి క్రీస్తు ప్రభువు ఆమెయందు ఏ కళంకము లేదు అని చెప్పుచున్నారు.  కనుక సంఘము నందు ఏ కళంకము లేకుండ మన సంఘమును మనము యోగ్యరీతిలో నడిపించాలి.

29.  ప్రాణేశ్వరిని లెబానోను విడిచి రమ్మని పిలుపు

        పరమగీతము 4:8, ''ప్రాణేశ్వరీ, లెబానోను విడిచి నాతోకూడ రమ్ము  లెబానోను విడిచి నాతో కూడ రమ్ము అమానపర్వతపు శిఖరమునుండి  శెనీరు హెర్మోనుల శిఖరము నుండి సింహవ్యాఘ్రములుండు గుహలుగల  కొండలపైనుండి  నీవు క్రిందికి చూచెదవు.''
        ఇంత ఉన్నతముగా ఏ కళంకము లేకుండ ఉన్న వధువును తన ప్రాణముతో సమానముగా ప్రాణేశ్వరీ, అని సంబోధిస్తూ, ప్రియుడైన క్రీస్తు ప్రభువు లెబానోను విడిచి నాతో రమ్మని పిలుస్తున్నారు.  పాతనిబంధన కాలములో లెబానోను దేవదారు కొయ్యలతో యెరూషలేమునందు ఆలయము నిర్మించబడింది.  అందువలన అక్కడ అనేకమంది విశ్వాసులు పరలోక రాజ్యమునకు యోగ్యులుగా మారారు.  వధువు సంఘములో చేర్చబడ్డారు.  ఇలాంటి ఈ వధువు సంఘము బబులోనుకు బానిసత్వమునకు కొనిపోవు కాలమునకు ఆ ఆలయమును విగ్రహాలతో నింపి ఇశ్రాయేలీయులు పాడు చేశారు.  అక్కడ నుండి దేవుడు తన మందసమును అందులోని తన మహిమను పరలోకమునకు కొనిపోయాడు అని యెహెజ్కేలు దర్శనములలో ఆయన ఎలా కెరూబుల ద్వారా వెళ్లినది వ్రాయబడింది మరియు ప్రకటన 11:19 వివరిస్తున్నది.
        అటుతరువాత సీయోనులో క్రీస్తు ప్రభువును దేవుడు పునాదిగా వేసి దానిపై పేతురు అను బండను నాటి మరల సంఘమును నిర్మించాడు.  క్రీస్తు ప్రభువు రక్షణ మార్గము వలన లెబానోను విడిచి ఆయనతో కూడ వచ్చిన వధువు సంఘము అనగా యెరూషలేమును విడనాడిన సంఘము మరల అమానపర్వతమును, శెనీరు, హెర్మోను పర్వతములను, సింహవ్యాఘ్రములుండు గుహలుగల  కొండలను స్వాధీనపరచుకొనుట జరిగింది.  అంటే రక్షణ ఈ లోకములో అన్ని ప్రాంతములకు విస్తరించినదని చెప్పబడింది.  ఆ ప్రాంతములలో శిఖరములుగా చెప్పబడినవి అత్యున్నత స్థానమును పొందెనని, కొండలుగా చెప్పబడిన దగ్గర కొంత ఉన్నత స్థానమును పొందెనని అలంకారముగా చెప్పబడింది.  యెరూషలేమును విడిచిన ప్రియురాలు క్రీస్తు ప్రభువు ద్వారా తిరిగి అన్ని ప్రాంతములలో ప్రవేశించి అత్యున్నత స్థానమును, కొన్ని చోట్ల పరిస్థితులను బట్టి నిలిచిందని అర్థము.  ఈ విధముగా సంఘము యొక్క స్థానమును ఈ లోకములో ఆ సంఘము పొందిన స్థితిని వదిలిన ప్రాంతమును చెప్పుట జరిగింది.

30.  నా సహోదరీ, ప్రాణేశ్వరీ - వశపరచుకొనుట

        పరమగీతము 4:9, ''నా సహోదరీ, ప్రాణేశ్వరీ,  నీవు నా హృదయమును వశపరచుకొంటివి  ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి.  నీ హారములలో ఒకదానిచేత నన్ను వశపరచుకొంటివి.''  
        ప్రాణేశ్వరీగా చెప్పబడిన వధువు సంఘము తనతో బాటుగా జన్మించిన విశ్వాసులతో నింపబడినది కనుక నా సహోదరీ, అని చెప్పుట జరిగింది.  వీరందరుకూడ క్రీస్తు ప్రభువుకు తోబుట్టువులుగా ఇందులో వర్ణించబడింది.  యోహాను 20:17-18, ''యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి-నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను.  మగ్దలేనే మరియ వచ్చి-నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.''  ఇందులో క్రీస్తు ప్రభువు మగ్దలేనే మరియతో నా సహోదరులకు చెప్పమని చెప్పాడు.  మగ్దలేనే మరియ శిష్యులకు తెలియజేసింది.  కనుక ఆయన సహోదరులు ఆయన శిష్యులు అనగా విశ్వాసములో జీవించు ప్రతి ఒక్కరు ఆయనకు సహోదరులే.  అయితే ఆయనకు సహోదరులైనను ఆయనతో సమానము కారుగాని సంఘములో భాగస్థులు అనగా ఈ సహోదరులందరు వధువు సంఘములో చేరి వధువుగా మారుతారు.  కారణమేమిటంటే ఆదాము ఇచ్చిన దైవనిషేధఫలములు తిని దైవవ్యతిరేకియై స్త్రీకి దాసుడైనందున ఎంతటి మగవాడైనను పెండ్లి కుమార్తెయైన వధువు సంఘములో చేరవలసిందే.  కనుక క్రీస్తు ప్రభువు వధువు సంఘములో చేరిన తనయందు విశ్వాసము కలిగిన తన సహోదరులు స్త్రీ యొక్క రూపములోనికి మారగా సహోదరిగా సంబోధించుట జరిగింది.  కనుక ఆయన సహోదరులుగా పిలువబడుచున్న విశ్వాసులందరు ఆయనకు యుగాంతములో సహోదరిగా మారి ఆయనను ప్రాణముతో సమానముగా ప్రేమించుదుము.
        ఇలా మారిన ఈ వధువు క్రీస్తు ప్రభువు హృదయమును వశపరచుకొనినదని, ఒక చూపుతోనే వశపరచుకొనినదని ఒక హారముతోనే వశపరచుకొన్నదని చెప్పబడింది.  అంటే ఎంత అందముగా విశ్వాసి యొక్క ఉన్నత స్థితిని ఇందులో వర్ణించాడో గ్రహించాలి.  ఈ వధువుగా మారిన సంఘము మొత్తము క్రీస్తు ప్రభువు హృదయమును వశపరచుకొన్నది.  అలాగే అందులో ఒక చూపుతోనే అనగా ఆయన వద్దకు రావాలని ప్రయత్నించి ఎదురు చూచిన ఒక చూపు ఆమెను ఆయన వద్దకు చేర్చింది.  ఆ చిన్న ప్రయత్నము ఎలా క్రీస్తు ప్రభువు వద్దకు నడిపించునో పరిశోధించు విధానమును ఇంతకు ముందు చదువుకొని యున్నాము.  అలాగే ఒక హారము ఆయనను వశపరచుకొనెనని చెప్పబడింది.  1 కొరింథీ 3:10-15, ''దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాది వేసితిని, మరియొకడు దానిమీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.  వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.  ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును.  మరియు వానివాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.  పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును.  ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.''  ఇలా విశ్వాసి నిర్మించుకొన్న క్రియలు రకరకాలుగా అందులో కనిపిస్తున్నాయి.  వాటిలో ఒక్క హారము అనగా ఒక్కొక్క విశ్వాసి క్రియలు ఆయనను అంతగా ఆకర్షించి వశపరచుకొన్నవని చెప్పబడింది.  అంటే ఈ లోకములో విశ్వాసి చేయు క్రియలు అంత గొప్పవని అవి క్రీస్తు ప్రభువును మన వశము చేయునని గ్రహించాలి.

31.  సహోదరీ, ప్రాణేశ్వరీ - ప్రేమ

        పరమగీతము 4:10, ''సహోదరీ, ప్రాణేశ్వరీ,  నీ ప్రేమ ఎంత మధురము!  ద్రాక్షారసముకన్న నీ ప్రేమ ఎంత సంతోషకరము  నీవు పూసికొను పరిమళ తైలముల వాసన  సకల గంధవర్గములకన్న సంతోషకరము.''
        సహోదరీ, ప్రాణేశ్వరీగా చెప్పబడిన వధువు సంఘము యొక్క ప్రేమ ఎంత మధురము అని ప్రియుడు క్రీస్తు ప్రభువు చెప్పుటనుబట్టి వధువు సంఘమును మెచ్చుకోవాలి.  అంత ప్రేమ వధువు సంఘము చూపెనని అర్థము.  ప్రకటన 2:4, ''అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.''  కనుక ప్రేమ లేకపోతే అది తప్పు.  అలాగే ప్రకటన 2:13, ''-సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును.  మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.''  ఒక ప్రక్క విశ్వాసులను చంపుచున్నను మిగిలిన విశ్వాసులలోని విశ్వాసము కోల్పోనంత ప్రేమ క్రీస్తు ప్రభువు మీద ఉంది. కనుకనే ఈ వచనములో ప్రభువు నీ ప్రేమ ఎంత మధురము అని చెప్పుచున్నారు.  ఈ ప్రేమ ద్రాక్షారసముకన్న ఎంత సంతోషకరము అని చెప్పుచున్నారు.  ద్రాక్షారసము క్రీస్తు ప్రభువు రక్తము.  ఇది పాప ప్రక్షాళన కోసము చిందించబడి పాపి యొక్క పాపములను కడుగుటకు కల్వరిలో చిందించబడింది.  దీనికన్నా నీ ప్రేమ సంతోషకరము అని చెప్పుచున్నారు అంటే విశ్వాసి క్రీస్తు ప్రభువు పట్ల చూపు ప్రేమ విలువ ఎంత గొప్పగా చెప్పబడినదో ఒక్కసారి గమనించాలి.  అంతే కాకుండ మందసము, దానిలోని అతి పవిత్రమైన వస్తువులను అభిషేకించు తైలము కన్నా సంతోషించదగినదని చెప్పుచున్నారు.  అంటే క్రీస్తు అభిషక్తుడు అలా అభిషేకించుట కన్నా కూడ విశ్వాసిలోని ప్రేమే గొప్పదని చెప్పుచున్నారు.  కనుక క్రీస్తు ప్రభువు మనకొరకు ఇచ్చిన రక్తము కన్నా, క్రీస్తు ప్రభువు మనలను క్రైస్తవులుగా అభిషేకించిన దానికన్నా విశ్వాసములో బలపడి విశ్వాసి చూపు ప్రేమే గొప్పదని చెప్పబడింది.

32.  ప్రాణేశ్వరీ - మాటలు - వస్త్రములు

        పరమగీతము 4:11, ''ప్రాణేశ్వరీ, నీ పెదవులు తేనియలొలుకుచున్నట్టున్నవి  నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు  నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది.''
        మనము మాట్లాడునప్పుడు మాటలు మన నోటి గుండా వచ్చును.  అలాగే విశ్వాసి మాట్లాడు ప్రతి మాట వధువు సంఘము మాటయే.  వధువు సంఘము ఏ మాట మాట్లాడుచున్నది?  ప్రకటన 22:17, ''ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.''  రమ్ము అని పిలుస్తున్నది.  ఆ పిలుపు నందుకొని దప్పిగొని వచ్చిన మరో విశ్వాసిని ఉచితముగా చేర్చుకొని వానిని సువార్త సంబంధమైన మాటలతో వారి దప్పికను తీర్చాలి.  అంటే సువార్తను బోధించువారి పెదవులు తేనియలొలుకుచున్నట్టున్నవని క్రీస్తు ప్రభువు చెప్పుచున్నారు.  రోమా 10:15.  అలాగే ఆ పెదవుల మధ్య ఉన్న నాలుక క్రింద అనగా జిహ్వ క్రింద మధుక్షీరములు కలవని చెప్పుచున్నారు కనుక వారి నోటి నుండి ప్రతి మాట జీవజలమే.  ఈ జీవజలము సువార్తగా వధువు సంఘము నోటిగుండా వచ్చుచున్నదని ఆ సువార్తలోని మాటల వలన వధువుయొక్క పెదవులు, జిహ్వ క్రింద ఉన్న జలములును పాలు తేనెలవలె మధురమైనవని చెప్పుచున్నారు.  
        అలాగే వధువు యొక్క వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె ఉన్నదని చెప్పబడింది.  ఈ వస్త్రములు పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పబడింది.  ప్రకటన 19:8, ''మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.''  పరిశుద్ధుల నీతిక్రియలు వస్త్రములుగా వధువుకు ఇయ్యగా ఆ వస్త్రముల నుండి వచ్చు సువాసన లెబానోనులోని దేవదారు వృక్షాలనుండి వచ్చు సువాసనవలె ఉన్నది.

33.  నా సహోదరి నా ప్రాణేశ్వరి - విలువలు

        పరమగీతము 4:12-14, ''నా సహోదరి నా ప్రాణేశ్వరి  మూయబడిన ఉద్యానము  మూతవేయబడిన జలకూపము.  నీ చిగురులు దాడిమవనము  వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కర్పూరవృక్షములు  జటామాంసి వృక్షములు  జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు  లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు  గోపరసమును అగరు వృక్షములు  నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.''
        ప్రియుని సహోదరి ప్రాణేశ్వరియైన వధువు సంఘము యొక్క ఉన్నత విలువలు ఇందులో వర్ణించుట జరిగింది.  ఈ వధువు సంఘము మూయబడిన ఉద్యానము అనగా ఉద్యానవనములో మనిషికి ఆహ్లాదము నిచ్చు సమస్తము అందులో ఉంటాయి.  కాని అది మూయబడింది అంటే లోపలివారు వెలుపలికి రాలేరు.  వెలుపలివారు లోపలికి రాలేరు.  అనగా అన్యులు ప్రవేశించుటకు వీలుపడదని భావము.  ప్రకటన 22:14-15, ''జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకు కొనువారు ధన్యులు.  కుక్కలును మాంత్రికులును వ్యభి చారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.''  కనుక ఉద్యానవనముగా చెప్పబడిన పరమ యెరూషలేము గొఱ్ఱెపిల్ల భార్యగా మారిన తరువాత అది మూయబడును.  అప్పుడు కొందరు హక్కుగలవారై గుమ్మముల గుండా ప్రవేశించి అందులో ఉంటారు.  మిగిలిన రకరకాల పాపపు సంబంధమైన నరులు యెరూషలేమునకు వెలుపటనుందురు.  ఆ విధముగా అది మూయబడును అనగా ప్రవేశ అర్హత వారికి ఉండదు.  అలాగే అది మూతవేయబడిన జలకూపము అని చెప్పబడింది.  ప్రకటన 22:1-2, ''మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను.  ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవ్షృముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును.  ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.''  జీవజలముల నది అందులో ప్రవహిస్తున్నది గాని దానికి బయట కాదు.  కనుక ఈ నది ఆ ఉద్యానవనమైన పరమయెరూషలేములో ఉన్నది.  కాబట్టి అది మూత వేయబడిన జలకూపముగా తన ప్రాణేశ్వరిని గూర్చి వర్ణించాడు.  అందులో ప్రతి ఒక్కరు జీవజలమైన క్రీస్తు ప్రభువును అంగీకరించినవారే!  పరమయెరూషలేమునకు వెలుపట ఉన్నవారు జీవజలమైన క్రీస్తు ప్రభువును తృణీకరించినవారు.  కనుక వారు ప్రవేశించుటకు అందులో అవకాశము లేదన్న అర్థముతో అది మూయబడి మూతవేయబడిన అని చెప్పబడింది.
        ఈ విధముగా మూత వేయబడియున్న ఈ వనములో అన్ని రకముల ఫలవృక్షములు పరిమళతైల వృక్షములు అన్ని రకముల పూలవృక్షములతో బాటు నిమ్మగడ్డియు అందులో ఉన్నది.  అంటే ఈ మూతవేయబడు నాటికి అందులో ఉన్నవారందరు ఒక్క యెరూషలేము కుమార్తెలే కాదు.  అన్ని ప్రాంతముల నుండి వచ్చిన నానా జాతులవారు అందులో ఉన్నారని వారందరు కూడ శ్రేష్ఠమైనవారేనని చెప్పబడింది.  కనుక పరమయెరూషలేము అను ప్రియునిలో ప్రియురాలులో ఉన్నవారు ఒకే రకమైనవారు కారు.  అన్ని రకాల జాతులవారైనప్పటికి అందరికి యోగ్యత ఒక్కటే - క్రీస్తు ప్రభువును రక్షకునిగాను తమ ప్రాణ ప్రియునిగాను నమ్మి, ఆయన ఆజ్ఞలను శిరసావహించి జీవించుటయే అందులో ఉండుటకు అర్హత.  ఇలా అర్హత సాధించినవారు సాధారణమైనవారు కారని శ్రేష్ఠమైనవారుగా వర్ణనతో చెప్పబడింది.

34.  నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ - జలప్రవాహము

        పరమగీతము 4:15, ''నా సహోదరీ నా ప్రాణేశ్వరీ,  నీవు ఉద్యానజలాశయము  ప్రవాహజలకూపము  లెబానోను పర్వతప్రవాహము.''
        దీనికి ముందు ప్రియుని సహోదరి ప్రాణేశ్వరియైన వధువు సంఘము మూయబడిన జలపాతమని తెలుసుకొన్నాము.  ఇలాంటి వధువు సంఘమునుగూర్చి మరికొంత విశ్లేషణగా వివరించుట ఈ వచనములో జరిగింది. ఇందులో మూడు రకముల జలములు ప్రవహిస్తున్నవి.  అందులో  1.  ఉద్యానజలాశయము  2.  ప్రవాహజలకూపము  3.  లెబానోను పర్వతప్రవాహము.  అంటే యెరూషలేముగా మొదలైన వధువు లెబానోను దేవదారులతో చేయబడిన యెరూషలేము ఆలయముగా ప్రసిద్ధి చెంది ప్రపంచమంతా ఆ  పరిస్థితిని గూర్చి ఆ దినములలో తెలియనివారు లేరు.  ఇశ్రాయేలీయుల దేవుడు గొప్ప వాడని అందరు ఒప్పుకొన్నట్లుగా రాజుల గ్రంథములో చదువగలము.  ఇలాంటి వధువు సంఘము క్రీస్తు ప్రభువు కాలములో మరల సీయోనులో పునాది వేయబడి క్రీస్తు ప్రభువు ఏర్పరచుకొన్న శిష్యుల ద్వారా లెబానోను పర్వత ప్రవాహముగా ఉన్న నిజదైవత్వము మార్పు చెంది సీయోను నుండి ప్రవాహ జలములు ప్రపంచ నలుమూలల ప్రవహించింది.  ఇలా ప్రవహించిన జలప్రవాహము చివరకు యుగాంతము తరువాత వధువుగా మారి, గొఱ్ఱెపిల్లకు భార్యగా మారిన తరువాత ఉద్యానజలాశయముగా మాత్రమే ఒకటిగా నిలుచునని అదే పరమయెరూషలేమని చెప్పబడింది.

35. ప్రియుడు తన వద్దకు వచ్చుటకు ఉద్యానవనముయొక్క సిద్ధపాటు

        పరమగీతము4:16, ''ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము  నా ఉద్యానవనముమీద విసరుడి  దాని పరిమళములు వ్యాపింపజేయుడి  నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక.''
        ప్రియుడైన క్రీస్తు ప్రభువు తన వద్దకు వచ్చుటకు ఈ వచనములోని ప్రియురాలు ఉద్యానవనముగా చెప్పబడిన వధువు సంఘము సిద్ధపడుచున్నది. ఏ విధముగా?  ప్రకటన 7:1, ''అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి యుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచ కుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని.''  ఇలాచేయుట వలన బాధ కలిగించినట్లు అగును దానివలన హాని జరుగునని చెప్పబడింది.  అయితే ఉద్యానవనముగా ఉన్న వధువు ఉత్తర, దక్షిణ వాయువులను తనపై వీచమని కోరుచున్నది.  ఇలా వీచుట ద్వారా ఆ వధువు సంఘములో హాని జరుగదు.  పైపెచ్చు ఆహ్లాదకరమైన స్థితి అక్కడ ఏర్పడును.  అంటే ఆ ఉద్యానవనమైన వధువు సంఘములో ఉన్న విశ్వాసులకు వాయువులు బిగబట్టుట వలన ఏ హాని జరుగదని వాయువులు ఆ ఉద్యానవనములో ఎల్లప్పుడు వీచునని మనకు అర్థమగుచున్నది.  ఇలా విసురుట వలన అందులో ఉన్న విశ్వాసులు అను పరిమళము అందరికి సువాసనగా వ్యాపిస్తుంది.  వీరిలోని విశ్వాసము ప్రేమ అను సుక్రుత గుణములు పరిమళ ద్రవ్యములుగా ఆ గాలుల వలన వ్యాపింపగా అవి ప్రియుని యొద్దకు చేరి, ఆ ప్రియుడు ఉద్యానవనమునకు వచ్చునట్లుగా చేయునని చెప్పబడింది.  ప్రకటన 8:3-4, '' మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుటఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.  అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.'' పరిశుద్ధుల ప్రార్థనలు ధూపద్రవ్యములు అనగా పరిమళ సువాసన పొగ లేచి వాయువుల సహాయముతో వ్యాపించి చివరకు దేవుని సన్నిధికి చేరగా, క్రీస్తు ప్రభువు వారి ప్రార్థనలకు బదులు ఇచ్చుటకు ఆ ఉద్యానవనమైన వధువు సంఘమునకు వచ్చుట జరుగును. అలా వచ్చిన ప్రియుడైన క్రీస్తు ప్రభువు ఆ ఉద్యానవనములో విశ్వాసులతో బాటుగా తనకిష్టమైన ఫలములను భుజించునని వ్రాయబడియున్నది.  ఆ ఫలములే జీవవృక్ష ఫలములు.  ప్రకటన 22:2, ''ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను.  ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును.  ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.''  ఈ ఫలములు తనకు చాలా ఇష్టమైనవని వాటిని ఆ ఉద్యానవనమునకు వచ్చి భుజించునని చెప్పబడింది.  క్రీస్తు ప్రభువుకు ఇష్టమైన ఆ ఫలములను మనము భుజించవలెనంటే వధువు సంఘములో ప్రవేశింపగల యోగ్యతను సంపాదించుకోవాలి.

36.  ప్రియుడు ఉద్యానవనమునకు వచ్చుట - ప్రియుని విందు

        పరమగీతము 5:1, ''నా సహోదరీ, ప్రాణేశ్వరీ,  నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని  నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను  తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను  క్షీరసహితద్రాక్షారసము పానము చేయుచున్నాను.  నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి  స్నేహితులారా, పానము చేయుడి.''
        నా సహోదరీ, ప్రాణేశ్వరీ అనుచు ఒకానొక దినమున ప్రియుడైన క్రీస్తు ప్రభువు ఉద్యానవనమునకు అనగా వధువు సంఘమునకు వస్తారు.  అలా వచ్చిన క్రీస్తు ప్రభువు అక్కడ ఆయనకు సంబంధించిన జటామాంసిని గంధవర్గములను కూర్చుట చేయును.  అనగా జయించినవారిని వారి వారి వర్గములుగా విభజించుట చేయును.  ఇలా ఏడు వర్గములుగ విభజిస్తాడు.  ప్రకటన రెండవ, మూడవ అధ్యాయాలలో జయించిన వారిని ఏడు వర్గములుగా విభజించి వారికి జయించిన వర్గమును బట్టి వారితో కూడ వారికి సంబంధమైన బహుమానముతో సత్కరిస్తాడు.  అటుతరువాత అందరు కలిసి ప్రియుడైన క్రీస్తు ప్రభువు ఇచ్చు విందులో పాల్గొనుట జరుగును.  ప్రకటన 3:20, ''ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను.  ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము.''  ఇక్కడ మారుమనస్సు పొందిన అందరు అనగా ఆయనకు తమ హృదయములో చోటు ఇచ్చిన వారందరు కలిసి భుజించుట జరుగును.  అందుకే ప్రకటన 19:9, ''మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను-గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను.''  ఈ విందులో పాల్గొనువారు ధన్యులని వ్రాయబడింది.
        కనుక వధువు సంఘములో ఉన్నవారికి ప్రియుని రాక ఒక పండుగే.  అందరిని వారి వారి క్రియలను బట్టి వర్గములుగా విభజించి వారిని సత్కరించి చివరకు వారితోకూడ విందు చేయును.  అక్కడ ఆయన ఇచ్చు తేనెను తియ్యటి తేనెపట్టును, పాలతో కలిపిన పులియని ద్రాక్షారసమును పానము చేస్తారు.  అప్పుడు క్రీస్తు ప్రభువు వారినుద్దేశించి - నా వధువు సంఘములో ఉండి నాకు భార్యగా అనగా సాటి సహాయులుగా మారుచున్న విశ్వాసులారా - ''తృప్తిగా భుజించమని పానము చేయమని చెప్పును.''  అని చెప్పుచూనే వారందరు ఆయనకు స్నేహితులు అనగా సహోదరులు కనుక అది గుర్తు చేస్తూ ఇంకను పానము చేయమని ప్రేరేపించును. ఈ విధముగా క్రీస్తు ప్రభువు వధువుసంఘములో ప్రవేశించి విందును ఏర్పాటు చేయుట వారు ప్రభువుతో కూడ అత్యానందము పొందుదురు.

37.  పాపములో ఉన్నవారికోసము ప్రియుని పాట్లుప్రియురాలి గుర్తింపు

        పరమగీతము 5:2, ''నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని యున్నది  నా సహోదరీ, నా ప్రియురాలా,  నా పావురమా, నిష్కళంకురాలా, ఆలకింపుము  నా తల మంచుకు తడిసినది  నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి.  నాకు తలుపుతీయుమనుచు నా ప్రియుడు వాకిలి తట్టు చున్నాడు.''
        ప్రకటన 3:20, ''ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను.  ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడ అతడును భోజనము చేయుదుము.''  ఇలా ప్రియుడైన క్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరి హృదయమనే తలుపును తీయుమని తట్టుచున్నాడు.  ఇలా తట్టుచున్నట్లుగా ఇప్పుడు చెప్పుచున్నది ప్రియురాలైన వధువు సంఘము అనగా విశ్వాసులమైన మనమే అంటే ప్రియుని పిలుపును విశ్వాసులు గుర్తించారు. ఆయన తట్టుచున్న సంగతిని గుర్తించారు.  అంతేకాదు తట్టుచూ క్రీస్తు ప్రభువు ఏమి చెప్పుచున్నాడో తెలుసుకొందము.
        ''నేను నిద్రించితినేగాని నా మనస్సు మేలుకొని యున్నది,'' అంటే క్రీస్తు ప్రభువు నశించినవారి కొరకు వారిలో సువార్త బీజమును విత్తుట కొరకు నిరంతరము ఆయన మనస్సు ఆలోచిస్తూ మేలుకొని యున్నది.  కనీసము నిద్రించినప్పుడు కూడ ఆయన మనస్సు ఎవరిని ఎలా నిజదైవములోనికి రక్షణలోకి వచ్చుటకు ప్రేరేపించాలి?  ఎవరు తననుగూర్చి నిజాన్ని పరిశోధించుటకు మొదలుపెట్టారు అను సంగతులను ప్రతి క్షణము ఆయన మనస్సు మేలుకొని ఆలోచిస్తూ పరిశోధిస్తున్నట్లుగా మనము గ్రహించాలి.  ఆ కారణము చేతనే విశ్వాసిగా మారాలని నిజదైవమును పరిశోధించాలన్న తలంపుతో పరిశోధించువారికి ప్రతినిత్యము వారికి సహకరిస్తూ చివరకు తన వద్దకు చేర్చుకొంటారు కనుకనే ఆయన నిద్రించినను ఆయన మనస్సు నల్లనిదియైన బబులోనులోని నరులలో మార్పు కోసము వారిని విశ్వాసులుగా మార్చి సీయోనులో తరువాత పరమ యెరూషలేములో చేర్చుట కొరకు పరితపిస్తున్నట్లుగా గ్రహించాలి. ఇలా ప్రియురాలికి ప్రియుడైన క్రీస్తు ప్రభువు చెప్పుచూ - నా సహోదరీ, నా ప్రియురాలా అని సంబోధిస్తున్నాడు.  అంటే మనమందరము ఈ భూమిమీద పుట్టిన ప్రతి ఒక్కరు తనకు సహోదరులే.  వీరంతా మారుమనస్సు పొంది వధువు సంఘములో పాలిపంపులు కలిగినట్లయితే వారు ఆయనకు సహోదరిగాను ప్రియురాలుగాను మారుతారు.  అంటే ఈ వచనము విశ్వాసులు వధువు గాను లేక భార్యగాను మారినప్పటిది కాదు.  ఆయనకు ప్రియురాలుగా ఉన్నప్పుడు జరుగు సంఘటనలతో వ్రాసిన వాక్యము.  ఇంతకు ముందు నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ అన్న సంబోధన వేరు.  ఇందులో భార్యను పిలిచిన పిలుపు కనబడుతుంది.  కనుక విందుతో ఆ పిలుపును ముగించి మరల ప్రియురాలుగా సంఘము ఉన్నప్పుడు తాను ప్రియునిగా పడ్డ కష్టమును ఈ సందర్భములో క్రీస్తు ప్రభువు గుర్తు చేస్తున్నారు.
        ఇలా గుర్తు చేస్తూనే - సంఘములో క్రియ జరిగించు పరిశుద్ధాత్మను సంఘముతో కలిపి ఉచ్ఛరిస్తూ - ''నా పావురమా, నిష్కళంకురాలా, ఆలకింపుము,'' అని చెప్పుచున్నారు.  పరిశుద్ధాత్మ పావుర రూపములో వారిలో క్రియ జరిగించితేనే సంఘమునకు నిండుదనము ఆశీర్వాదము.  సంఘములో చేరువారిని పరిశుద్ధాత్మ పావుర రూపములో వారిని చేరి వారిని నిష్కల్మషముగా మార్చుట ద్వారా సంఘమును పరిశుద్ధముగా ఉంచుట కళంకము లేకుండ ఉంచుట జరిగింది.  కనుకనే క్రీస్తు ప్రభువు దేవుని శక్తియైన పరిశుద్ధాత్మతో నిండిన సంఘమును నా పావురమా, నిష్కళంకురాలా అని సంబోధించుచు నేను చెప్పునది ఆలకించుమని చెప్పుచున్నారు.  విశ్వాసిగా మారువారు మారుమనస్సు పొంది బాప్తిస్మము ద్వారా సంఘములో చేరుచున్నారు.  సంఘములో చేరి నీతి మార్గములో ఎదిగినవారు పరిశుద్ధాత్మకు నిలయమై అనేక క్రియలు మహత్కార్యాలు సూచక క్రియలు జరిగిస్తున్నారు.  ఇలాంటి వారితో నిండుట వలన సంఘము కళంకము లేనిదిగా ఉంటుంది.  కాని ఒక పాపి విశ్వాసిగా మారుటకు మన ప్రియుడైన క్రీస్తు ప్రభువు అనేక బాధలకు ఓర్చినట్లుగా ఈ వచనములో మనకు అర్థమగుచున్నది.  అందుకోసము క్రీస్తు ప్రభువు నిద్రించు సమయములోను ఆయన మనస్సు మేలుకొనే ఉన్నదని చెప్పుచున్నారు.  అలాగే మన హృదయమనే తలుపు బయట ఆయన ఉండి తట్టుట వలన ఆయన వెలుపల ఉండుట వలన రాత్రి మంచుకు చినుకులకు ఆయన తడిసినట్లుగా చెప్పుచున్నారు అంటే ఆయన నిత్యము అనగా చలికాలము వర్షాకాలము అన్న తేడా లేకుండ ప్రతినిత్యము ఆయన మనకోసము మన హృదయమనే తలుపును తట్టుచూనే ఉన్నారు.  ప్రకటన 3:15-16, ''-నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.  నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.''  చలికాలము చల్లనిదానికి వర్షాకాలము నులివెచ్చని జీవితములో ఉన్నదానికి సూచనగా ఉన్నది.  ఈ రెండు స్థితులలో జీవించువారి హృదయమనే తలుపును తెరుచుటకు తట్టుచున్నట్లుగా చెప్పబడింది  అలాంటి వారి కోసము తాను నిద్రించుచున్నను ఆయన మనస్సు మేలుకొని యున్నది.  అంతేకాదు, ఎవరికొరకు ఆయన మేల్కొని వారి హృదయమనే తలుపు తట్టాడో వారు తలుపు తీయనప్పటికి, వారిలోని పాపపు జీవితము నులివెచ్చని జీవితము రెండును మంచుగాను, చినుకులుగాను వచ్చి ఆయన తలను, వెండ్రుకలకు అంటుకొనుచున్నట్లుగా చెప్పుచున్నారు.  అంటే మనము నిజదైవమును గుర్తించి ఆయన యందు బాప్తిస్మము పొంది రక్షణలోకి వచ్చామని ఆనందించుచున్నాము.  కాని మనము రక్షణలోకి వచ్చునప్పటికి మనలోని పాపపు జీవితాన్ని క్రీస్తు ప్రభువు ప్రక్షాళన చేస్తున్నట్లుగా మనము గుర్తించాలి.  అలా ప్రక్షాళన చేయునప్పుడు మన జీవితమను వస్త్రమును క్రీస్తు ప్రభువు రక్తములో ఉదుకుకొని తెలుపు చేసుకొంటున్నారు.  ఈ పాపపు జీవితము ఆయన తలకు వెండ్రుకలకు ధూళి మరకలుగాను మంచుగాను చినుకులుగాను అంటుకొను చున్నవి.  అందుకే యెషయా ప్రవక్త ప్రవచిస్తూ క్రీస్తు ప్రభువు మన పాపములను ఆయన భరించెనని వ్రాయబడింది.  దీనిని భరించుటకు క్రీస్తు ప్రభువు సిలువపై నలుగగొట్టబడినట్లుగా వ్రాయబడింది.  ఇలాంటి సంగతులను పరిశుద్ధాత్మ పావురము రూపములో ఉండగా కళంకము లేని స్థితిలో ఉన్న తన ప్రియురాలైన సంఘమునకు క్రీస్తు ప్రభువు తాను పొందిన కష్టమును, తాను ఆమె కోసము నిద్రించినను మనస్సు మేలుకొని ఉన్న సందర్భాలను గుర్తు చేస్తున్నారు.  కనుక విశ్వాసిగా మారిన ఓ నరుడా!  మరల పాపము చేసి నీ రక్షకుని కష్టపెట్టవద్దు.

38.  వస్త్రము తీసివేయుట - పాదములు కడుగుకొనుట

        పరమగీతము 5:3, ''నేను వస్త్రము తీసివేసితిని  నేను మరల దాని ధరింపనేల?  నా పాదములు కడుగుకొంటిని  నేను మరల వాటిని మురికిచేయనేల?''
        ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ నిలయమైన నిష్కళంకురాలును ప్రియురాలైన సంఘమునకు తాను పడిన కష్టములు చెప్పెనో, అప్పుడే ప్రియురాలైన సంఘము పై మూలవచనములోని రీతిగా అనుకొనుట జరుగును.  ఏమని?  ''నేను వస్త్రము తీసివేసితిని  నేను మరల దాని ధరింపనేల,'' అనగా మలిన వస్త్రమును మారుమనస్సు ద్వారా తీసి వేయుట జరిగింది.  ఇప్పుడు దేవుని మహిమయను వస్త్రమును ధరించుకొని నిష్కల్మషముగా కళంకము లేక సంఘమైన ప్రియురాలు ఉన్నది.  అందులోను పరిశుద్ధాత్మతో నిండియున్నది.  ఇంత ఉన్నత స్థానములోకి వచ్చిన నేను పాపపు మలిన వస్త్రాలను మరల ఎందుకు ధరించాలి? అని ప్రశ్నించుకొనుచున్నది. కనుక ఇక పాపము చేయక జీవిస్తానన్న అర్థము ఇందులో కనబడుచున్నది. అలాగే ''నా పాదములు కడుగుకొంటిని నేను మరల వాటిని మురికిచేయనేల?'' అని తనను తానే ప్రశ్నించుకొనుచున్నది.  శరీరమంతా స్నానము చేసినవాడు బయట అడుగుపెట్టితే మలినమయ్యేది పాదములే.  తాను చేసిన పాపములన్ని ప్రక్షాళన క్రీస్తు ప్రభువు చేస్తే మరల పాపము చేయుటకు నా పాదములను పాపకూపమునకు నడిపించుట ద్వారా తిరిగి వాటిని ఎందుకు మురికి చేయాలి? అని తనను తానే ప్రశ్నించు కుంటూ ఇక పవిత్రముగా ఉండాలని కోరుకొనుచున్నట్లుగా వ్రాయబడింది.

39.  ప్రియునిపై జాలి

        పరమగీతము 5:4, ''తలుపుసందులో నా ప్రియుడు చెయ్యియుంచగా  నా అంతరంగము అతనియెడల జాలిగొనెను.''
        తలుపు వద్ద తట్టుచున్నట్లుగా చెప్పుచున్నారు.  ఆ తట్టు స్వరము వినునప్పటికి విశ్వాసి అనగా ప్రియురాలు సిద్ధముగా లేదు.  లేచి రావలసిన స్థితిలో ఉన్నను సిద్ధపాటులో లేక సమస్త పాప కార్యముతో నిండియున్నది.  కనుకనే ఆయన మన హృదయమనే తలుపును తట్టుచున్నాడు.  ఎందుకు?  యిర్మీయా 17:9 హృదయమును శుద్ధి చేయుటకు తన రక్తముతో పాపములను కడుగుటకు తెరవమని తట్టుచున్నాడు.  అక్కడ ప్రియురాలైన విశ్వాసి నిజదైవత్వమును గూర్చి అప్పుడే పరిశోధించాలన్న తలంపుతో ఉన్నాడు గనుక తట్టుచున్నది ఎవరు?  నిజదైవమెవరు?  అన్న తలంపుతో ఎదురు చూస్తున్నది.  ఇంతలో తలుపులో కొన్ని సందులు ఉండగా దానిలో వ్రేళ్లు వెళ్లుట జరిగింది.  ఇలా వెళ్లినప్పుడు చేతి వ్రేళ్లు నలుగును లేక సన్న సందులలో ఇరుక్కొనుట వలన బాధ కలుగును.  ప్రియుడైన క్రీస్తు ప్రభువు ఎన్నో శ్రమలకోర్చి విశ్వాసిగా మారుటకు నిజదైవమును వెదకు నల్లనిదియైన బబులోను కుమార్తె హృదయమును తట్టుచున్నాడు.  అందులో ఆయన అనేక శ్రమలకోర్చి జరిగిస్తున్నట్లుగా చెప్పబడింది.  కనుక ఇలా తనకోసము ఆయన బాధలు పొందెనని సిలువ బలియాగము చేసెనని, సాతాను అను అంధకార శక్తుల వలన అవమానము పొందెనని తెలుసుకొని, ప్రియురాలైన నల్లనిదియైన బబులోను కుమార్తె విశ్వాసిగా ప్రియురాలైన యెరూషలేము కుమార్తెగా మారక ముందు ఆయనయందు జాలిగొనెను అని వ్రాయబడియున్నది.  ఈనాడు నూతనముగా పాపపు స్థితి నుండి విగ్రహారాధనను వీడి నిజదైవమును తెలుసుకోవాలన్న ఆలోచనతో పరిశోధించువారికి క్రీస్తు ప్రభుని చరిత్ర - ఆయన పాపి కోసము చేసిన త్యాగము విన్న వెంటనే అయ్యో!  అన్న జాలి లుగును.  అదే తెలుసుకోవాలన్న ఆలోచన లేని స్థితిలో ఈయనను గూర్చి చెప్పితే ఏమిటి?  ఆయనకేమన్నా పిచ్చా అలా హృదయ విదారకముగా చావాలని కోరుకొన్నాడు.  ఏమిటి దేవుడైతే మనుష్యుల చేతిలో చిక్కి చావటమేమిటి?  మనకు దేవుళ్లే లేనట్లుగా ఆయనను దేవునిగా ఆరాధించవలసిన పని ఏమున్నదని మాట్లాడెదము.  కాని తెలుసుకోవాలన్న ఆలోచన కలవారు ఆయన పాపి కోసము పడిన కష్టము వారి హృదయమనే తలుపుసందులను గుచ్చును కనుక ఆయనపై జాలి వారికి కలుగును అని అర్థము.

40.  ప్రియురాలు తలుపు తీయునంతలో ప్రియుని ఎడబాటు

        పరమగీతము 5:5-6, ''నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతులనుండియు నా వ్రేళ్లనుండియు  జటామాంసి గడియలమీద స్రవించెను  నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో  అతడు వెళ్లిపోయెను  అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను  నేనతని వెదకినను అతడు కనబడకపోయెను  నేను పిలిచినను అతడు పలుకలేదు.''
        తలుపు తట్టుచున్న క్రీస్తు ప్రభువును తన హృదయములోనికి ఆహ్వానించుటకు జాలితో తలుపు తీయుటకు నల్లనిదియైన స్త్రీ లేచు వరకు తట్టుచున్న క్రీస్తు ప్రభువు తట్టుచూనే ఉన్నారు. ఆమె లేచి తన చేతి వ్రేళ్లతో గడియలమీద చేయి ఉంచగా ఆ గడియల మీద జటామాంసి అనగా పరిమళ ద్రవ్యము స్రవించింది.  తానున్న స్థితి పాపపు స్థితి.  ఈ స్థితిలో నల్లనిదియైన బబులోను కుమార్తె సాతాను చెరలో ఉంటుంది.  ఆ చెర గడియ పెట్టిన హృదయము.  ఈ స్థితిలో ఈ నల్లనిదియైన బబులోను కుమార్తెకు కలిగిన ఆలోచన నిజదైవము ఎవరు?  నేను తెలుసుకోవాలన్న తలంపు.  ఇది కలుగగానే వెంటనే హృదయమనే తలుపును క్రీస్తు ప్రభువు తట్టుట.  ఆయననుగూర్చి మరికొంత తెలుసుకొని తనకోసము ఆయన బలియాగము చేసాడని జాలిని పొందుట జరిగింది.  ఇలా జాలి పొందుట క్రీస్తు ప్రభువు వ్రేళ్లు ఆమె హృదయ తలుపుల సందులలో చేయి ఉంచినట్లుంది.  వెంటనే ఆమె లేచి తన హృదయ గడియను తీసి ఆయనను ఆహ్వానించాలి అని అనుకొన్నది.  వెంటనే లేచి గడియపై చేయి ఉంచినప్పుడు తనలోని ఆలోచన విగ్రహ దేవుళ్లు ఒట్టి రాతివని పాపమని గ్రహింపు ఇవన్ని జటామాంసి పరిమళ ద్రవ్యముగా మారి ఆమె చేతి నుండి హృదయమనే గదికి తలుపునకు ఉన్న గడిపై పడ్డాయి.
        ఎప్పుడైతే నల్లనిదియైన బబులోను కుమార్తెలో మార్పు వచ్చిందో, ఆయనను తన హృదయములోనికి ఆహ్వానించాలని గడియను సాతాను చెర నుండి విడుదల పొందాలని చేయి చాచి దానిని తాకి తెరుచుటకు ప్రయత్నించింది.  ఇలా తెరిచే లోపల ప్రియునిగా ఆమె హృదయ తలుపును తట్టి, ఆమెలో జాలిని కలిగించిన ప్రియుడైన క్రీస్తు ప్రభువు వెళ్లిపోవుట జరిగింది.  తట్టుట ఎందుకు?  వెళ్లిపోవుట ఎందుకు?  నల్లనిదియైన బబులోను కుమార్తె పాపపు స్థితిలో జీవించుచున్నది.  కాని ఆ స్థితిలో ఆమె నిజదైవమును గూర్చి తెలుసుకోవాలన్న తలంపుతో అన్వేషణ మొదలుపెట్టింది.  అప్పుడే క్రీస్తు ప్రభువు తలుపు తట్టాడు.  ఇలా తట్టుట ద్వారా తనకు తెలిసి తనతో బాటుగా తన హృదయములో చేరిన దేవుళ్లు దైవవ్యతిరేక వర్గము వారందరిలో తాను వెదకుచున్నది.  ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు తట్టాడో ఆయన ఎవరో తనకు తెలియదుగాని క్రొత్తగా ఇంకా ఉన్నారన్న తలంపు ఆమెకు కలుగును.  కనుక ఆమె మరింతగా శోధించి క్రీస్తు ప్రభువును గూర్చి అడిగి తెలుసుకోవాలి.  ఇలా తెలుసుకొన్నప్పుడు ఆమె హృదయములో కొంత కాఠిన్యత తొలగి క్రీస్తు ప్రభువు చేయి స్పర్శతో జాలిని పొందును.  అప్పుడు ఆమె ఆయనను చూచుటకు తలుపును తెరువగా క్రీస్తు ప్రభువు అంతలోనే వెళ్లిపోవుట జరుగును.  ఎందుకు?  ఆమె అనగా విశ్వాసములోకి వచ్చుచున్న ఈ నల్లని స్త్రీ తెలుసుకోవాలన్న తలంపు కలిగియున్నదిగాని ఇంకా పాపమును విడిచి రాలేదు గనుక ఆయన వెళ్లిపోతున్నాడు.

41.  ప్రియుని మాట వినిన తోడనే సొమ్మసిల్లిన ప్రియురాలు

        పరమగీతము 5:6, ''అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను  నేనతని వెదకినను అతడు కనబడకపోయెను  నేను పిలిచినను అతడు పలుకలేదు.''
        తలుపు తట్టి, ఆమెలో జాలిని కలిగించినది ఎవరు అన్నది తెలుసుకొనే లోపలే ఆయన వెళ్లిపోవుట ఆమెలో బహు బాధను కలిగించింది.  ఒక వైపు తెలుసుకోవాలన్న తాపత్రయము రెండవ వైపు ఆ తాపత్రయములో కలిగిన ఒత్తిడి.  ఒకసారి ఈ స్థితిని ఆలోచించండి చుట్టూ ఎటు చూచిన విగ్రహ దేవుళ్లే.  వారందరి ప్రభావము ఆమెమీద ఉన్నది.  వాటిని, వాటిని అనుసరించుచున్నవారు చేయు హేళనతో ఎటు తెలియని స్థితిలో ఉన్నది.  ఈ స్థితిలో మానసిక ఘర్షణ ఎక్కువై సొమ్మసిల్లినట్లుగా ఆమె యొక్క ప్రాణమునుగూర్చి చెప్పబడింది.  ఎప్పుడైతే తలుపు తట్టి పిలుచుట జరిగిందో, ఎప్పుడైతే ఆయన మాట ఆమెకు వినిపించిందో వెంటనే తెలుసుకోవాలన్న తపనతో తన వద్ద తన చుట్టూ ఉన్న వారినందరిని ఎదిరించుచు, మానసిక ఘర్షణతో తలుపు తీసి చూచేసరికి ఆయన కనబడలేదు.  ఈ స్థితి ఆమెను సొమ్మసిల్లునట్లుగా చేసింది.  మానసిక ఘర్షణ అత్యున్నత స్థాయిలో జరుగుచున్నట్లుగా మనము గ్రహించాలి.  అటుతరువాత ఆమె తన ప్రయత్నము మానక నిజమైన ప్రియునిగూర్చి మరల వెదకుచున్నట్లుగా చెప్పబడినది.  అలా వెదికినను అక్కడ కనిపించలేదు. పాపపు స్థితిలో పడుకున్న స్థితిలో వెదికింది కనిపించలేదుగాని స్వరము తట్టుచున్నట్లుగా వినిపించింది.  తలుపు తీసి వెదికితే ఆ నిజమైన ప్రియుడు కనిపించలేదు. అప్పుడు ఆమె నీవు ఎవరు?  అని పిలిచింది.  అతడు పలుకలేదు.  ఈ విధముగా హృదయమనే తలుపు తీసి అనగా తన చుట్టు సాతాను ఏర్పరచిన చెర అను గడిని తీసి అనగా అవి అన్ని తప్పు అని తలంచి వాటిని దాటి నిజమైన ప్రియునికోసము వెదికి పిలిచినను ఆయన ఆమెకు కనబడలేదు.  ఆమెతో ఆయన పలుకలేదు.
        ప్రకటన 3:20లో తలుపు తట్టుచున్నను తలుపు తీసిన నేను మీతోను మీరు నాతోను కూర్చుని భుజించవచ్చని వ్రాయబడింది.  కాని ఇక్కడ తలుపు తీయుసరికి క్రీస్తు ప్రభువు వెళ్లిపోతున్నాడు.  ఇక్కడ ఎప్పుడు తలుపు తీశారు అన్నది కాదు లేచారా లేదా అన్నదే ముఖ్యము.  తలుపు తట్టు స్వరమును బట్టి తలుపు తీయుట జరిగింది.  కాని ప్రియుడైన క్రీస్తు ప్రభువు కనిపించలేదు.  తలుపు తీసి బయటకు వచ్చేసింది కనుక రక్షణలోకి నాలుగు అడుగులు ముందుకు వచ్చినట్లే.  ఈ స్థితిలో ఈమె ఇంకా క్రీస్తు ప్రభువును గూర్చి వెదకుచున్నది.  ఆయనతో మాట్లాడాలని పిలుస్తున్నది.

42.  ప్రియురాలిని కొట్టి గాయపరచువారు

        పరమగీతము 5:7, ''పట్టణములో తిరుగు కావలివారు  నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి  ప్రాకారముమీది కావలివారు  నా పైవస్త్రమును దొంగిలించిరి.''
        హృదయ తలుపు తెరుచుకొని బయటికి వచ్చిన స్త్రీ అంతటితో వదలక రెండు విధములైన పరిస్థితులకు అనగా శోధనకు గురి అగుచున్నది.  ఇందులో ఒకటి - తాను వెదుకుచు పట్టణములోనికి రాగా దానిని కాపలా కాచువారు ఆమెను కొట్టి గాయపరచారు.  వీరు ఎవరు?  వీరు సాతాను సంఘమునకు చెందిన నాయకులు యాజకులు.  వీరు ఈమె చేయు ప్రయత్నమును గూర్చి కోపించి ఆమెను తన మనస్సును మార్చుకొని ఎప్పటివలె ఉండమని హెచ్చరించుట చివరకు కొట్టి గాయపరచుట అనగా బలవంతముగా అదుపులో ఉంచాలని ప్రయత్నిస్తారు.  రెండవది - పట్టణ ప్రాకారము పైన ఉన్నవారు ఆమె పైవస్త్రమును దొంగిలించిరి అని వ్రాయబడింది.  పట్టణ ప్రాకారము పైన ఉన్నవారు ఎవరు?  వారు ఎందుకు దొంగిలించుచున్నారు.  ప్రాకారము పైన ఉన్న కావలివారు సాతాను అతని దూతలని ''ప్రవక్తల ప్రవచనములు - పరమార్థములు'' అను గ్రంథములో తెలుసుకొన్నాము.  వారు పైవస్త్రమును దొంగిలించుచున్నారు.  అంటే పై వస్త్రము నీతి పరిశుద్ధతకు సూచన.  ఇది పైవస్త్రముగా ఉన్నదేగాని లోపలి వస్త్రముగా లేదు.  అంటే ఇది జరుగునప్పటికి ఆమె కొంతవరకు నీతి పరిశుద్ధతలో ప్రవేశించు ప్రయత్నము చేయుచున్నది కనుక ఆ ప్రయత్నము ఆమె చేయుచున్న అన్వేషణ ఆమెకు పైవస్త్రముగా కనిపిస్తున్నది.  దానిని సాతాను సమాజమువారి వలన కలిగిన హేళనలు, బలవంతపు చర్యలు, హింసలు, గాయపరచుట వంటివి జరుగుట వలన తన మనస్సులో కలిగిన అనుమానము సంశయము వలన తన పైవస్త్రము తిరిగి కోల్పోవుట జరుగుచున్నది.  ఈ హింస కలిగినప్పుడు తన కంటికి నగరముపై కావలిగా ఉన్న సాతాను అతని దూతలు విగ్రహ దేవుళ్లుగా ఆ పట్టణమును చెరలో ఉంచుకొని కావలి కాస్తున్నారు. వారి సంబంధ మైనవి ఆమె మనస్సుకు అందముగా కనిపిస్తాయి.  వాటిలో తప్పు ఏమున్నది?  ఇంతమంది అనుసరిస్తున్నది తప్పా?  అని అనిపిస్తుంది.  ఈ మానసిక సంఘర్షణకు విగ్రహ దేవుళ్లు కనిపించు తీరు వలన ఆమె మనస్సున తిరిగి పాతదే సరియైనదై యుండవచ్చు అనే అనుమానము ఆమెకు లభించిన పైవస్త్రమును పోగొట్టుకొనునట్లు చేయును. ఇదే శోధన.  ఈ రెండు విధములైన శోధనలు కలిగినప్పుడు పడిపోతే తిరిగి నల్లనిదియైన బబులోను కుమార్తెగానే ఉంటారు.  తిరిగి పడిపోక మారుమనస్సు అన్వేషణ కొనసాగిస్తే విశ్వాసిగా మారు అవకాశము లభిస్తుంది.

43.  ప్రియురాలు - ప్రియునికి చెప్పమని యెరూషలేము కుమార్తెలచే ప్రమాణము చేయించుట

        పరమగీతము 5:8, ''యెరూషలేము కుమార్తెలారా,  నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియ జేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.''
        ఇటువంటి స్థితిని మనము ప్రతినిత్యము చూచుచున్నదే.  దానినే పరమగీతము కీర్తనలకే కీర్తనగా వ్రాయుట జరిగింది.  ఎప్పుడైతే సాతాను శోధన, అన్యుల నుండి నిందలు శిక్ష వచ్చాయో, విశ్వాసమును కోల్పోవువారు ఉన్నారు.  ఇంకా తెలుసుకోవాలన్న తలంపు కలిగి విశ్వాసములో ముందుకు వెళ్లువారు ఉన్నారు.  విశ్వాసము కోల్పోయినవారు తిరిగి పాపపు స్థితిలోనికి వెళ్లి నల్లనిదియైన బబులోనుకు కుమార్తెలుగా ఉంటారు.  బబులోను అను సంఘములో జీవిస్తారు.  వీరు తిరిగి అదే పాపపు స్థితిని కలిగియుందురు.  ఇక విశ్వాసము కోల్పోక వచ్చుచున్న శోధనను ఓర్చుకొని దానిలో సహనమును చూపుచు తిరిగి తన ప్రయత్నమును కొనసాగించి తనకు కనబడని నిజమైన ప్రియుని కొరకు తిరిగి ప్రయత్నమును పై మూలవచనములో వలె కొనసాగించును.
        ఈ స్థితిలో నల్లనిదియైన బబులోను కుమార్తె తన ప్రయత్నమును కొనసాగించుచు ఆ ప్రయత్నములో కొందరు యెరూషలేము కుమార్తెలను చూచింది.  వీరు ఎవరు?  అప్పటికే నిజదైవములో జీవిస్తూ క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము  ద్వారా ప్రమాణము చేసి నీతిలో పరిశుద్ధాత్మకు నిలయమైనవారు యెరూషలేము కుమార్తెలు.  ఇలాంటివారిని నల్లనిదియైన బబులోను కుమార్తె గుర్తించి వారికి తన స్థితిని తెలియజేసి, ఒకవేళ తన ప్రియుడైన క్రీస్తు ప్రభువు మీకు కనిపించితే నేను ఆయన ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లెనని తెలియజేయుమని చెప్పుట జరిగింది.  ఎప్పుడైతే క్రీస్తు సంఘములోని విశ్వాసులు తన అన్వేషణలో కనబడ్డారో వారిని పలకరించుకొని తాను ఏ విధముగా రక్షణను గూర్చి నిజదైవమును గూర్చి అన్వేషించుచున్నానో తెలియజేస్తూ  తన గూర్చి నా ప్రియుడైన క్రీస్తు ప్రభువుకు విన్నవించండి అని చెప్పుచు ఖచ్చితముగా ప్రార్థించమని మీ ప్రార్థనలో గుర్తు చేసుకోమని చాలాసేపు అడుగుచు వారు చెప్పు మాటలలో నమ్మకము కుదురు వరకు అడిగి చివరకు నమ్మకము కిలిగిన తరువాత వారిని వదిలిపెట్టుట జరుగును.  ఇలా ప్రార్థించమని అడుగువారిని సంఘముల వద్ద విశ్వాసులు చూడవచ్చును.  ఈ విధముగా నల్లనిదియైన బబులోను కుమారి తన అన్వేషణను కొనసాగిస్తున్నది.

44.  ప్రియుని విశేషమునుగూర్చి యెరూషలేము కుమార్తెలు నల్లనిదియైన బబులోను కుమార్తెను అడుగుట

        పరమగీతము 5:9, ''స్త్రీలలో అధిక సుందరివగుదానా,  వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?  నీవు మాచేత ప్రమాణము చేయుంచుకొనుటకు  వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?''
        నల్లనిదియైన బబులోను కుమారి తన అన్వేషణ కొనసాగిస్తూ అప్పటికే ప్రియురాలుగా ఉన్న యెరూషలేము కుమార్తెల వద్ద విచారించుచున్నప్పుడు, ఆ యెరూషలేము కుమార్తెలు నల్లనిదియైన బబులోను కుమార్తెను సంబోధిస్తూ స్త్రీలలో అధిక సుందరివగు దానా, అని అంటున్నారు.  ఇక ఇంకా అవలేదు అవబోతున్నావని చెప్పుట జరిగింది.  అంటే ఇలాగే అన్వేషణ కొనసాగి నీవు రక్షణలోనికి వచ్చి బాప్తిస్మము పొంది నీలోని నల్లనిదనము పోగొట్టుకొంటే అప్పుడు నీవు బబులోనుకు కుమార్తెవు కాదుగాని నీవు అత్యంత సుందరివిగా మారుదువు, ఎందుకంటే నీలో పాపమనే డాగుగాని మచ్చగాని లేదు.  కనుక నీవు అత్యంత సుందరివగుదువని చెప్పుచున్నారు.  అలా చెప్పుచూనే-  ''వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి?''  అని అడుగుచున్నారు. ఆ వేరే ప్రియులు ఎవరు? నీ ప్రియుడు ఎవరు?  ఈ నీ ప్రియునిలో విశేషమేమి?  బబులోనులో అనేకమంది ప్రియులు మనకు కనిపిస్తారు. వారందరు విగ్రహ దేవుళ్లు దేవతలుగా బాబాలుగా దేవుడమ్మలుగా కనిపిస్తారు. వీరు బబులోను కుమార్తెలను ఏలుచూ వారిని తమ ప్రియురాలుగా ఉంచుకొనుచున్నారు.  కనుకనే వీరిని వేశ్యలుగా యిర్మీయా వర్ణించుట జరిగింది.  వీరంతా వేరే ప్రియులు.  అయితే ఇప్పుడు నీ అన్వేషణలో నీవు గుర్తించిన నీ ప్రియుడు ఎవరు?  ఈయన బబులోనులోని ప్రియుల వంటివాడు కాదు.  ఈయన తన ప్రియురాలి కోసము ప్రాణమును అర్పించినవాడు.  ఈయనే క్రీస్తు ప్రభువు.  ఇలాంటి నీ ప్రియునిలో నీకు కనిపించిన విశేషమేమిటి?  అని యెరూషలేము కుమార్తెలు వీరిని అడుగుచున్నారు. మన సంఘములో నూతనముగా వచ్చువారిని ఏ విధముగా నీవు మారావు? రక్షణలోకి ఎలా వచ్చావు అని అడుగుట గమనించవచ్చు. ఈ విధముగా అడిగినవారికి కాదనకుండ తాను ఏ విధముగా రక్షకుని గుర్తించినది సాక్ష్యముగా చెప్పుదురు.  ఈ సాక్ష్యమే విశేషముగా వర్ణించబడింది.  సాక్ష్య జీవితమునకు క్రైస్తవ సంఘములో విశేష ఆదరణ ఎప్పటికి ఉంటుంది.  ఈ సాక్ష్యమును తన ప్రియునిలోని విశేషతను చెప్పునప్పుడు అందరు ఆనందించి ఒకరిని ఒకరు విశ్వాసములో బలపరచుకొందురు.

45.  పదివేలమంది పురుషులలో నా ప్రియుని గుర్తించవచ్చు

        పరమగీతము 5:10-16, ''నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు  పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును  అతని శిరస్సు అపరంజివంటిది  అతని తలవెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణ వర్ణములు  అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి.  అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడి నట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి. అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు  సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగములు  అతని పెదవులు పద్మములవంటివి  ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన  స్వర్ణగోళమువలె ఉన్నవి  అతని కాయము నీలరత్నఖచితమైన విచిత్రమగు దంతపుపనిగా కనబడుచున్నది. అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి.  అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కుమార్తె లారా,  ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.''
        ఇందులో నల్లనిదియైన బబులోను కుమారి తన అన్వేషణలో క్రీస్తు ప్రభువును నిజమైన రక్షకునిగా గుర్తించి ఆయనను గూర్చిన సాక్ష్యము తన ప్రియునిలోని గొప్పతనమును ప్రియురాలుగా ఉన్న యెరూషలేము కుమార్తెలకు తెలియజేస్తున్నది.  ఆ వర్ణనను ఆమె కంటికి క్రీస్తు ప్రభువు కనబడు తీరును తెలుసుకొందము.
        ''నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు,'' అనగా తెల్లనివాడని, రత్నములవలె ప్రకాశించుచున్న వర్ణము కలవాడని చెప్పబడింది.  పదివేలమంది పురుషులలో అతని సులభముగా గుర్తింపవచ్చును అని చెప్పుచున్నది.  ఆమె ప్రియుడు అంత తెల్లగా ప్రకాశించు రత్నము వంటి ఛాయ కలిగియుంటాడు.  అతని తల అపరంజి అనగా బంగారమువలె కనిపిస్తుంది.  అంటే అతను పొందిన రాజరికమునకు గుర్తుగా ఉన్నది.  అతని తల వెండ్రుకలు కాకపక్షములవలె కృష్ణ వర్ణములుగా ఉన్నాయి అనగా కాకివలె నల్లని రంగు కలిగి చంద్రుడు కృష్ణ పక్షమునకు వచ్చినప్పుడు ఉండు వంపుతో ప్రకాశించుచున్నవని చెప్పుచున్నది.  ఆ వెండ్రుకలు వంపులు వంపులుగా ఒక క్రమబద్ధముగా అమర్చినట్లుగా ఉన్నవని చెప్పుచున్నది. ఇక ఆయన కళ్లు నదీతీరమువలె చల్లగా గువ్వల కళ్లువలె అమాయికత్వము ఉట్టిపడునట్లుగా కనిపిస్తున్నవి.  అంతేకాదు అవి చక్కగా అమర్చిన రత్నము ఎలా చీకటిలో మెరయునో ఆ విధముగా మెరుస్తూ పాలవలె సున్నితముగా ఉన్నాయి.  ఇక ఆయన చెక్కిళ్లు అనగా బుగ్గలు సుగంధ వృక్షములలో పరిమళ పుష్పములు ఉన్న విధముగా తాకాలంటే అంత సున్నితముగా కనిపిస్తున్నది. ఆయన పెదవులు పద్మములవలె విప్పి విప్పనట్లుగా కనిపిస్తూ అందలి నుండి వచ్చు లాలాజలము ద్రవముగా తగిలి తగలనట్లుగా కనిపిస్తుంది. ఆ విధముగా ఆయన మనుష్యులకు సువార్తను బోధించు నప్పుడు వారిని హెచ్చరించిన విధము ఆయన మాటలు అంత సున్నితముగా పరిమళించు సువాసనవలె వారికి చేరేవి.  తార్షీషు వారు తమ చేతులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన రత్నములతో గోళముగా చేసుకొని ధరించేవారు.  ఆ విధముగా ఆయన చేతులు స్వర్ణ గోళములవలె రత్నములతో అలంకరింపబడి కనిపిస్తున్నారు.  అతని శరీరము రకరకాల నీలరత్న దంతములతో చేసిన పనిగా కనిపిస్తుంది.  వీటితో కప్పబడియున్నది.  ఆయన కాళ్లు మేలిమి బంగారు వర్ణముతో మెరుస్తున్నట్లుగా వివరిస్తున్నది.  అతని మట్ల యందు అనగా పాదముల క్రింద చలువరాతి వంటి జోడులు అనగా చెప్పులు ఉన్నట్లుగా చెప్పుచున్నది.  ఇంత అద్భుతముగా కనిపిస్తున్న ఇతని వైఖరి లెబానోను పర్వతములవలె దేవదారు వృక్షములవలె ఉన్నతమైనది మరియు అంత ప్రసిద్ధిని పొందియున్నదని చెప్పబడింది.  ఎవరికి లేని విధముగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చరిత్ర క్రీస్తు ప్రభువుది.
        ఇంత చరిత్ర ఉన్న అతని నోరు అతి మధురమైనదని ఆ నోటి నుండి వచ్చు ప్రతి మాట మనలను రక్షించునంత గొప్పదని చెప్పబడింది.  అంతేకాదు చూచుటకు అతికాంక్షణీయుడుగా కనబడును.  ఒక్కసారి ఆయనను చూచిన మరల మరల చూడాలన్న తపన ఉంటుంది. ఆ రూపమును ప్రతినిత్యము గుర్తు చేసుకొంటూనే ఉంటారు అని చెప్పుచూ నల్లనిదియైన బబులోను కుమార్తె తన అన్వేషణలో చూచిన నిజమును అంత అద్భుతముగా వర్ణిస్తూ సంఘములోని విశ్వాసులను ఉద్దేశించి యెరూషలేము కుమార్తెలారా, అంతటి గొప్పవాడే నా ప్రియుడని అతనే నా స్నేహితుడని సాక్ష్యమిచ్చుట జరుగును.  అయనే క్రీస్తు ప్రభువు.  ఎంత గొప్పగా ఉన్నదో ఒక్కసారి ఊహించుకోండి. . . . .

46. యెరూషలేము కుమార్తెలు నల్లనిదియైన బబులోను కుమార్తెతో ప్రియుని వెదకుట

        పరమగీతము 6:1, ''స్త్రీలలో అధిక సుందరివగుదానా,  నీ ప్రియుడు ఎక్కడికి పోయెను?  అతడేదిక్కునకు తిరిగెను?  మనము పోయి యతని వెదకుదము రమ్ము.''
        ఎప్పుడైతే సాక్ష్య జీవితమును విన్నారో నల్లనిదియైన బబులోను కుమార్తెలోని నల్లదనము బదులు అందముగా మారుచున్న సంగతి యెరూషలేము కుమార్తెలు గుర్తించారు.  అప్పుడు నీవు ప్రేమించిన నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అని యెరూషలేము కుమార్తెలు నల్లనిదియైన బబులోను కుమార్తెను- అతడు ఏ దిక్కున తిరుగుచున్నాడని అడుగుచున్నారు.  అంతేకాదు మనము పోయి యతనిని వెదకుదము రమ్ము అని యెరూషలేము కుమార్తెలు పిలుస్తున్నారు.  అంటే నల్లనిదియైన బబులోను కుమార్తెలో కలిగిన మారుమనస్సును గుర్తించిన యెరూషలేము కుమార్తెలు ఆమెను తమలో కలుపుకొని ఆమె కోసముగా వారు కూడ ఆమెకు సహకరిస్తూ క్రీస్తునుగూర్చి విషయాలు, ఆయన గూర్చిన సంగతులు అందరు కలిసి ప్రార్థనలో, వాక్య బోధలో, కీర్తనలలో వెదకుట మొదలుపెట్టారు.  అపొస్తలుల కార్యములు 2:46-47లో వివరించిన విధముగా క్రీస్తు ప్రభువు ఎక్కడ ఉంటాడు?  ఎక్కడ తిరుగుతాడు?  ఎటువైపు వెళ్లుతాడో వారి వాక్య బోధలో అర్థము చేసుకొంటున్నారు.  ఈ విధముగా నల్లనిదియైన బబులోను కుమార్తె మారుమనస్సు ద్వారా యెరూషలేము కుమార్తెగా మారిపోయింది.  ఇతడును అబ్రాహాము కుమారుడేయని అన్యుడైన జక్కయ్యను గూర్చి లూకా 19:9లో ప్రభువు పలికినట్లుగా ఈమె ఇకపై యెరూషలేము కుమార్తెలలో ఒకటిగా పిలువబడునుగాని నల్లనిదియైన బబులోను కుమార్తెగా పిలువబడదు.  కనుకనే వారందరు కలిసి క్రీస్తు ప్రభువును గూర్చి వెదకుచున్నారు.

47.   ప్రియుని గుర్తించుట

        పరమగీతము 6:2, ''ఉద్యానవనమునందు మేపుటకును  పద్మములను ఏరు కొనుటకును  నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను  పరిమళ పుష్పస్థానమునకు పోయెను.''
        నల్లనిదియైన బబులోను కుమార్తె మారుమనస్సు ద్వారా యెరూషలేము కుమార్తెగా మారిందో, అప్పుడు అందరు కలిసి క్రీస్తు ప్రభువును వెదకి కనుగొనుట జరిగింది.  బైబిలు గ్రంథము ప్రకారము ఆయనను వెదికారు కనుగొన్నారు. ఆయనను తన మందను మేపుటకు ఉద్యానవనమునకు వెళ్లెనని చెప్పబడింది. ఉద్యానవనము అంటే వధువు సంఘము అనగా ప్రియురాలు ఆమె సన్నిధికి వెళ్లాడు. అలాగే13వ విభాగములో పద్మము వంటిదైన నల్లనిదియైన బబులోను కుమార్తె అనగా సత్యాన్వేషణలో ముందుకు వస్తున్న బబులోను కుమార్తెలను వారి మధ్య నుండి ప్రత్యేకించుటకు బయలుదేరి వెళ్లాడు.  అందుకే పద్మములను ఏరుటకు వెళ్లాడు అని చెప్పబడింది.  ఈ వచనములో ప్రియురాలైన పరమయెరూషలేము కుమార్తెలు క్రీస్తు ప్రభువు రెండు విధాలుగా తిరుగుచున్నట్లుగా గుర్తించారు. 1.  యెరూషలేము కుమార్తెలను తన ఉద్యానవమైన సంఘములో మందగా వారిని మేపుట.  అనగా వాక్యమందును, పరిచర్యయందును రొట్టె విరుచుట యందును వారు నిరంతరము పోషింపబడుచున్నారు. 2. నల్లనిదియైన బబులోను కుమార్తెలను వెదకుటకు వెళ్లుచున్నాడు. అందుకే పద్మములను ఏరుకొను చున్నట్లుగా చెప్పబడింది. పద్మములు ఏరుట అంటే అక్కడక్కడ ఉన్నట్లే కదా!  కొంతమంది అని అర్థము.  అలాగే అగాధముగా ఉన్న అన్ని పాపములతో నిండిన లోయలలో నీటిమధ్య పద్మములు ఉంటాయి. అలాంటిది అని నల్లనిదియైన బబులోను కుమార్తెనని చెప్పుకొనగా పరమగీతము 2:1లో చదివినాము.  ఈ విధముగా రెండు విధాలుగా ఆయన వెళ్లుచున్నట్లుగా వారు గుర్తించారు.

48.   నేను నా ప్రియునిదానను - అతడు నావాడు

        పరమగీతము 6:3, ''నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను  అతడును నావాడు.''
        ప్రియురాలైన నల్లనిదియు యెరూషలేము కుమార్తెగా మారుటకు సిద్ధపడుచున్న విశ్వాసి పద్మమువంటిది.  ఈ పద్మము లోయలోనే ఉంటుంది.  అనగా బబులోనులోనే ఉంటుంది కాని బబులోనులోని విగ్రహ దేవుళ్లను రక్షకునిగా నమ్మదుగాని క్రీస్తు ప్రభువును మాత్రము రక్షకునిగా నమ్మును.  కనుక ఈమెను లోయలో ఉన్న పద్మముగా చెప్పబడింది.  ఇలాంటి విశ్వాసిని క్రీస్తు ప్రభువు పద్మము ఎక్కడ ఉన్నదో అక్కడ ఆమెను పోషించును.  అయినప్పటికి ఆ విశ్వాసి అనగా ప్రియురాలు ప్రియుడైన క్రీస్తు సంబంధి. అంటే మనము అన్యుల మధ్య ఉన్నను మనము ఆయన సంబంధులమే.  కాబట్టి మనలను అన్యుల మధ్యనే ఉంచి పోషించునని ఈ వచనములో చెప్పుచున్నది.  అలాంటి స్థితిలో నన్ను పోషించుచున్న అతను అనగా క్రీస్తు ప్రభువు నావాడు అని చెప్పుచున్నది.  అనగా తన రక్షకునిగా గుర్తించుచున్నది.

49.  నల్లనిదియైన ప్రియురాలి సౌందర్యమును గూర్చి రెండవసారి వర్ణన

        పరమగీతము 6:4-7, ''నా సఖీ, నీవు తిర్సాపట్టణమువలె సుందరమైనదానవు.  యెరూషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యమువలె భయము పుట్టించుదానవు  నీ కనుదృష్టి నామీద ఉంచకుము  అది నన్ను వశపరచుకొనును  నీ తలవెండ్రుకలు  గిలాదు పర్వతముమీది మేకలమందను పోలియున్నవి.  నీ పలువరుస కత్తెర వేయబడినవియు  కడుగబడి యప్పుడే పైకి వచ్చినవియునై  జోడుజోడు పిల్లలు కలిగి ఒకదానినైన పోగొట్టుకొనక  సుఖముగానున్న గొఱ్ఱెల కదుపులను పోలియున్నవి.  నీ ముసుకుగుండ నీ కణతలు  విచ్చిన దాడిమ ఫలమువలె అగపడుచున్నవి.''
        మొదటగా పరమగీతము 4:1-7లో వ్రాయబడింది.  దానినిగూర్చి 28వ విభాగములో చదువగలము.  28వ విభాగములో వలె ఇందులో కూడ సుందరమైనదని, సౌందర్యవంతురాలని ఆమె యొక్క రూపురేఖలను వర్ణించుట జరిగింది.

50.  కన్య మరియమ్మను గూర్చి పరమగీతము

        పరమగీతము6:8-9, ''అరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్నులును  లెక్కకు మించిన కన్యకలును కలరు.  నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే  ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె  కన్నతల్లికి ముద్దు బిడ్డ  స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు.  రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు.''  
        ఈ ప్రవచనములు మరియమ్మను గూర్చినవి. పరమగీతము 6:8, ''ఆరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్నులును  లెక్కకు మించిన కన్యకలును కలరు.'' అని వ్రాయబడిన విధముగా రాణులు అనగా భార్యలు. వీరు అధికారము కలిగినవారు అనగా యజమానురాలు.  ఉపపత్నులు అనగా వీరు భార్యలు కారు కాని భార్యలాగా ప్రవర్తించువారు, అలాగే లెక్కకు మించిన కన్యకలు కూడ కలరు. ఇక్కడ రాణువులు ఉపపత్నులుగా చెప్పబడినవారు సంసార జీవితమును అనుభవించువారు వీరు కొందరు ఉన్నట్లుగా సంఖ్య ఉదాహరణగా చెప్పబడినది.  ఈ సంఖ్యనుబట్టి కొందరు ఉన్నట్లుగా గుర్తించాలి.  వీరు వేరేవారికి భార్యలుగా చెప్పబడినది.
        ఇక  కన్యకలు అనేకులు కలరు.  వీరు నూతన నిబంధన కాలములో అనేకులు ఉన్నట్లుగా చెప్పబడినది.  పరమయెరూషలేము కూడ కన్యకయే!  ఇప్పుడున్న సంఘము కూడ కన్యకయే!  ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ప్రకారము మానవులు అందరు అనగా పవిత్రమైనవారు వధువు అనే కన్యకగా మారి క్రీస్తులో ఐక్యమగుదురు.  కనుక మనమందరము కన్యకలమే.  మనలనుగూర్చి రోమా 3:11, ''నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు  గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు.''  కనుక ఈ అనేకమైన కన్యకలు నీతిని తప్పి ఒక్కరును పవిత్రముగా లేరు.
        లోకపాపపరిహారార్థము ఈ లోకములో దేవుడు అవతరించుటకు నిష్కళంకమైన కన్యనుగూర్చి అన్వేషించుచు, దేవుడు తన తలంపులోని ఆలోచనను పరమగీతములో సొలోమోను చేత వ్రాయించెను. మరియమ్మ ఎక్కడ పుట్టింది? ఎవరికి పుట్టింది?  ఎక్కడ పెరిగింది?  వీటికి బైబిలు గ్రంథమందు సమాధానాలు లేవు.  కాని పరమగీతము 6:9, ''నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే  ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె  కన్నతల్లికి ముద్దు బిడ్డ  స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు.''  అని వ్రాయబడిన  ప్రకారము, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె అని, ఆమె ముద్దుబిడ్డగా పుట్టిందని, ఈమెను స్త్రీలు ధన్యురాలు అంటారని చెప్పబడినది.  ఈమె ఒకతే కుమార్తె అనగా ఆమెకు తరువాతగాని ముందుగాని ఆమె తల్లికి సంతానము లేదు అని తెలియుచున్నది.  ఈ విధముగా తండ్రియైన దేవుడు సొలోమోను చేత ఈ ప్రవచనములు వ్రాయించెను. ఆమె మరియమ్మ అని వేరే చెప్పనవసరము లేదు.  అయితే ముస్లీం మతగ్రంథమైన ఖురాన్‌-ఈ-షరీష్‌ నందు ఈమె పుట్టుక, ఎక్కడ పెరిగింది?  ఎవరికి పుట్టింది?  అను వాటినిగూర్చి సంపూర్ణముగా తెలియజేస్తున్నది.  ఆమె తండ్రి ఇమ్రాన్‌.  ఈయన భార్యకు బహుకాలము అనగా ముసలితనము వరకు సంతానము లేక దేవుని ప్రార్థించినట్లుగా వ్రాయబడియున్నది.  ఆమె ప్రార్థించింది మగ సంతానము కొరకు.  కాని ఆమెకు పుట్టింది ఆడ సంతానము.  ఈమెయే కన్య మరియ.  ఈమెను పోషించినవారు జెకర్యా అనగా ఈమె పుట్టినప్పటికే ఆమె తల్లిదండ్రులు ముసలివారుగా మనము గుర్తించాలి. వీరు మరియమ్మ పుట్టిన తర్వాత మరణించియుండాలి. లేని పక్షములో ఆమెను తల్లిదండ్రులే పోషించేవారుగాని జెకర్యా పోషణకర్తగా ఉండవలసిన అవసరము లేదు.
        అదే ఖురాన్‌-ఈ-షరీష్‌ గ్రంథములో ఈమెను జెకర్యా చూడడానికి వెళ్లినప్పుడల్లా ఆమెదగ్గర ఆహారము ఉన్నట్లుగా చెప్పబడి యున్నది.  అంతే కాదు ఈ ఆహారము జెకర్యా ఇచ్చినది కాదు.  ఈమెను దేవుడు స్వయముగా పోషించాడు.  ఇందునుబట్టి జెకర్యా పోషణకర్తగా ఎన్నిక కాబడినను జెకర్యా ఈమెను పోషించలేదు.  దేవుడైన యెహోవా  యెరూషలేము ఆలయములో ఆమెను పోషించి పెద్ద జేశాడు.
        ఈ విధముగా మన మూల ప్రవచనములో చెప్పబడినట్లుగా ఈమె తన తల్లికి ఒకతే కుమార్తె ఈమె ఆమెకు ముద్దు బిడ్డగా పుట్టింది.  యెరూషలేము దేవాలయములో ఒక అనాధగా ఈమె తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అప్పగింపబడి ఈమె పోషణకర్తగా జెకర్యా పేరు దేవుడే తెలియజేయగా ఆయన  పోషణకర్తగా ఉన్నాడు.  కాని ఎప్పుడు కూడ ఆయన పోషించినట్లుగా బైబిలు గ్రంథమందుగాని, ఖురాన్‌-ఈ-షరీష్‌ గ్రంథమందు గాని చెప్పలేదు.  పైపెచ్చు ఆమె ఆహారము కొరత లేకుండ ఉన్నట్లుగా చెప్పబడింది.  ఈ ఆహారము దేవుడు పంపినట్లుగా గ్రహించాలి.  తండ్రియైన దేవుడు ఆమెను పోషించాడు అనగా ఈ లోకసంబంధమైన ఆహారముతో ఆమె పోషింపబడలేదు.  ఈ విషయములను గూర్చి చివరి అధ్యాయములో అనగా ఖురాన్‌-ఈ-షరీష్‌ మరియమ్మనుగూర్చి ఏమి చెప్పుచున్నది?  అన్న విభాగములో ఇంకా ఎక్కువగా చదువుకొనగలరు.  ఇటువంటి స్త్రీయైన కన్య మరియను ప్రతి స్త్రీ ధన్యురాలుగా పిలుచుదురు అని వ్రచనములో చెప్పబడియున్నది.  దీనినే మనము లూకా సువార్తలో చదువగలము.  లూకా 1:49, ''సర్వశక్తి మంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు.''
        చివరగా ''నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే,'' అనుటలో నా పావురము  అనగా దేవునియొక్క పావురము ఎవరు?  పరిశుద్ధాత్మ దేవుడే కదా!  మత్తయి 3:17, ''మరియు-ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నా నని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.'' నా నిష్కళంకురాలు ఎవరు? ఈమె కన్యయైన మరియ.  ఈమె కళంకము లేనిది అని పరమగీతములో దేవుడు సాక్ష్యమిచ్చు చున్నారు.  ఈ సాక్ష్యము సాధారణమైనది కాదు.  దేవుడే స్వయముగా ఇస్తున్న సాక్ష్యము.  ఈ సాక్ష్యములో తన ఆత్మయైన పరిశుద్ధాత్మను పావురముగా చెప్పుచూనే కన్య మరియను నిష్కళంకురాలుగా చెప్పుచున్నారు.  ఇంత గొప్ప సాక్ష్యము తండ్రియైన దేవుడు ఇస్తుంటే ఆమెకు కళంకమును ఆపాదించువారు అబద్ధ బోధకులు కారా?
        ఇంకొంత లోతుగా ఈ వచనములను మనము పరికిస్తే ఇందులో ఇంకొక ముఖ్య రహస్యము మనకు తెలియును.  ''నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే,'' అనగా దేవుని పావురమైన పరిశుద్ధాత్మ కన్య మరియమ్మలో చేరి మరియను తనతో సమానముగా చేసుకొనినందున ఇద్దరు ఒక్కరే.
        ఇందుకు సాక్ష్యమిచ్చు వేదవచనములు  . . .
        1.  ఎవరు క్రీస్తునందున్నారో - వారు క్రీస్తే - క్రీస్తును ధరించుకొనియున్నారు.
        2.  నాలో జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు.
        3.  మీరు దేవుని ఆలయమైయున్నారు - దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నది.
        కనుక ఇద్దరు ఒక్కరే.  వీరిలో ఎటువంటి తేడా లేదు అని ఈ వచనములు   తెలియజేయుచున్నాయి.
        ఏ విధముగా ఈ ఇద్దరు ఒకటే  . . .
        1.  నీతి విషయములో
        2.  కళంకము లేని విషయములో
        3.  క్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చు విషయములో
        4.  అద్భుతములు జరిగించు విషయములో
        5.  పరిశుద్ధత విషయములో
        6.  క్రీస్తు పెండ్లాడబోవు యెరుషలేము అను వధవు సంఘమును కనిపెట్టుకొని
            వారి అవసరతలలో సహాయపడుచు తీర్చిదిద్దు విషయములో
        ఈ విధముగా చెప్పుకుంటూపోతే  ప్రతి విషయములో వీరిద్దరు ఒక్కటే.  వీరిద్దరు ఏకీభవించి క్రీస్తుకు జన్మనిచ్చారు.  పురుష స్వరూపియైన పరిశుద్ధాత్మ దేవుడు నిష్కళంకురాలుగా కన్యకయైన మరియను ఆవరించి క్రియ జరిగించి క్రీస్తుకు జన్మనిచ్చారు. ఈ విధముగా పరిశుద్ధాత్మ, కన్య మరియమ్మ ఒకటే అని మనము గుర్తించాలి.  ఇటువంటి స్త్రీని దూషించవచ్చునా?  
        పాఠకులే ఆలోచించండి.

51.  వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు?

        పరమగీతము 6:10, ''సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై  వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు  ఈమె ఎవరు?''
        ఇందులో మూడవ రకము స్త్రీని గూర్చి వర్ణిస్తున్నాడు.  మొదటి రకము స్త్రీ యెరూషలేము సంఘము.  రెండవ రకము స్త్రీ నల్లనిదియైన మారుమనస్సు ద్వారా రక్షకునికి దగ్గరవుతున్న బబులోను కుమార్తె అనగా షూలమ్మీతి.  మూడవ స్త్రీ వ్యూహితసైన్య సమభీకర రూపిణియగు స్త్రీ.  ఈమె ఎవరు?  దీనికిముందు ఈ వచనము ఈమె అందమును గూర్చి వర్ణించుట జరిగింది.  అందులో ఈమె సంధ్యారాగము చూపట్టుచు అని చెప్పుచున్నాడు.  సంధ్యా కాలములో సూర్యుని వెలుగు ఎర్రగా అనేక సందర్భాలలో మారుటను గుర్తించాలి.  అలాగే ఈమె సంధ్య వెలుగులాగే నెమ్మది కలిగినట్లుగా ఉన్నను మధ్యమధ్యలో ఈమె స్వభావము ఎర్రని స్వభావము అనగా రక్తపాతానికి గుర్తు.  అలాగే చంద్రబింబమంత అందముగలదై అంటున్నాడు.  అంటే ఈ స్త్రీయొక్క ఆకర్షణ ఎక్కువ.  చంద్రుని ఏదో ఒక సందర్భములో దాని అందము మనలను ఆకర్షించును.  అంత ఆకర్షించగల సామర్థ్యము ఈ స్త్రీలో కూడ ఉన్నది.  అలాగే సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై అంటున్నాడు.అంటే నీతిసూర్యుడు క్రీస్తు ప్రభువు ఆయనకు సంబంధించిన ప్రతి కళలు అనగా ప్రభువు దగ్గర ఉన్నవారి నైపుణ్యములన్ని అంత నైపుణ్యము స్వచ్ఛతగ కళలు తెలిసినవారు అందులో ఉన్నారు.  ఇంత స్థానము కలిగినను ఆమె వద్ద వ్యూహితసైన్యము ఉన్నది.  అనగా ఈమె ఆ స్థానములో వ్యూహములు చేస్తూ కుళ్లు కుతంత్రాలతో వల పన్నే సైన్యము ఉంది.  అంతేకాదు ఈమె సమభీకర రూపిణి అనగా భయానకముగా కనిపించు ఒక స్త్రీ.  ఈమె ఎవరు?
        ప్రకటన 17:1-5, ''ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడువచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను.  -నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను; భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.  అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని.  ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేత పట్టుకొనియుండెను.  దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి యుండెను -మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహాబబులోను.''  ఈమె బబులోను అను వేశ్య.  ఈమె పరిశుద్ధుల రక్తముతో సంధ్యా రాగము చూపట్టుచు ఉంది.  తనలో ఎఱ్ఱని స్వభావమును చూపుచున్నది.  ప్రకటన 17:6, ''మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండుట చూచితిని.  నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా,''  అలాగే ఈమె ఆకర్షణ వలన ప్రకటన 17: లో భూరాజులు, భూనివాసులు వ్యభిచారులై మద్యము మత్తులో ఉన్నారు.  అంటే అందరిని ఆకర్షించగల శక్తి ఈమెలో ఉన్నది.  ప్రతి ఒక్కరిని పాపములో దించగల ఆకర్షణ ఈమెదని చెప్పుచున్నాడు.  అలాగే ఈమె వద్ద కుట్రలు కుతంత్రములు చేయు సైన్యము ఉంది.  ప్రకటన 17:7, 9, ''ఆ దూత నాతో ఇట్లనెను-నీవేల ఆశ్చర్యపడితివి?  యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూరమృగమునుగూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను.  . . .  ఇందులో జ్ఞానముగల మనస్సు కనబడును.  ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడు కొండలు;''  ఈ విధముగా ఈ సమభీకర రూపమైన ఈ స్త్రీ వద్ద రాజులే ఆమెకు ఊడిగము చేస్తున్నారు అంటే ఎంత భయంకర హీనమైన స్థితిలో ఈమె ఉన్నదో గమనించాలి.

52.  షూలమ్మీతీ, రమ్ము రమ్ము తిరిగిరమ్ము

        పరమగీతము 6:11-13, ''లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు  ద్రాక్షా వల్లులు చిగిర్చెనో లేదో  దాడిమవృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు  నేను ఆక్షోట వృక్షోద్యానమునకు వెళ్లితిని.  తెలియకయే నా జనులలో ఘనులగువారి రథములను నేను కలిసికొంటిని.  షూలమ్మీతీ, రమ్ము రమ్ము  మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగి రమ్ము, తిరిగిరమ్ము. షూలమ్మీతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది? ఆమె మహనయీము నాటకమంత వింతయైనదా?''
        వ్యూహితసైన్య సమభీకర రూపిణియగు బబులోనుకు కుమార్తెగా ఉన్నప్పుడు ఆ స్త్రీ బబులోను వాసిగా లేక బబులోను సంఘము క్రింద లెక్క. అందుకే ఈ స్త్రీ నల్లనిది యైన ప్రియురాలుగా అనగా పాపములో కళంకము కలిగిన స్త్రీగా వర్ణించాడు.  ఎప్పుడైతే ఈ స్త్రీలో రక్షకుని తెలుసుకోవాలని అనుకొన్నదో అప్పుడు ప్రభువు స్వరము ఆమె హృదయమనే తలుపు వద్ద తట్టుచున్నట్లుగా వినిపించింది.  ఆ పిలుపును అందుకొనిన బబులోను స్త్రీ యెరూషలేములో కుమార్తెగా మారువరకు ఆమె నల్లనిదియైన బబులోను స్త్రీగా చెప్పుకొన్నాము. ఈ వచనాలలో ఈ స్త్రీకి అనగా ఈ స్థితిలో అటు బబులోను కుమార్తెలవలె చల్లగా లేక ఇటు యెరూషలేము కుమార్తెలవలె వెచ్చగా లేక నులివెచ్చగా అటు ఇటు ఉన్న స్థితి నిజమును గూర్చి అన్వేషిస్తూ వస్తున్న ఈ స్త్రీని షూలమ్మీతీ అని చెప్పుచున్నారు.  ఈ షూలమ్మీతీ ఇంకా పూర్తిగా క్రీస్తు ప్రభువును గూర్చి తెలుసుకోలేదు.  అలాగని విగ్రహారాధనను అన్యదేవతలు దేవుళ్లను దేవునిగా అంగీకరించని స్థితి.  ఇలాంటి స్త్రీ నిజదైవము నిజమైన రక్షకుని తెలుసుకొనుటకు అన్వేషిస్తూ వెళ్లితే సరిపోతుందా?  రక్షణలోకి వస్తుంది కాబట్టి యెరూషలేము సంఘము అందులోని కుమార్తెలైన నిజదైవ విశ్వాసులు ఆమె యెడల ఆనందమును వ్యక్తపరుస్తారు.  క్రీస్తు ప్రభువు తన ప్రియురాలుగా ఆమెను గుర్తించి తన వద్దకు ఆకర్షించుకొంటాడు.  అయితే బబులోను అను వ్యూహితసైన్య సమభీకర రూపిణియగు స్త్రీ ఊరుకుంటుందా? పరమగీతము 5:7, ''పట్టణములో తిరుగు కావలివారు నా కెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు  నా పైవస్త్రమును దొంగిలించిరి.''  షూలమ్మీతీ నివసిస్తున్న పట్టణము బబులోనుది కనుక ఆ పట్టణము బబులోను సంబంధమైన కుట్రలు, కుతంత్రాలు పన్ను సైన్యము బబులోనుకు సహకరిస్తూ దృశ్యములో షూలమ్మీతీని గాయపరుస్తున్నారు.  అదృశ్య సాతాను శక్తులు పరిశుద్ధాత్మ వంటి పై వస్త్రముగా ఆమెను చేరగా దానిని దొంగిలించ ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నము ఇలాగే కొనసాగుచున్నను తిరిగి రమ్మని మన మూలవచనాలలో పిలుస్తున్నారు.
        లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు అనగా షూలమ్మీతీ పద్మముగా మారబట్టి క్రీస్తు ప్రభువు ఆకర్షణకు లోనైంది.  మిగిలినవారు అక్కడ అనేక రకాలుగా పాపపు స్థితి పదివేలమంది విగ్రహ దేవుళ్లలో ఒక దేవుడిని పూజిస్తూ ఉన్నారు కదా వారిని చూచుటకు, ఇంకా ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో అనగా బబులోనులో తనతో బాటుగా ఉన్నవారిలో ఎవరిలోనైన మార్పు వచ్చెనో లేదో చూచుటకు, ఇంకా దాడిమవృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు అనగా వారిలో నూతన ఆలోచనలు కలిగి రక్షకుని వైపు అన్వేషణవచ్చెనో లేదో చూచుటకు తాను నివశిస్తూ ఉన్న అక్షోట వృక్షోద్యానమునకు వెళ్లింది షూలమ్మీతీ.
        అక్కడ తన జనులలో ఘనులగువారిని ఆమె కలుసుకొనుట జరిగింది.  వారికి విగ్రహ దేవుళ్లు, యాజకులు, పెద్దలు వంటివారు.  వారు ఆమెను షూలమ్మీతీ రమ్ము రమ్ము అని పిలుస్తున్నారు.  మేమందరము తిరిగి నిన్ను మొదటి స్థితిలో మావలె ఉన్న స్థితిలోకి రమ్మని పిలుస్తూ అలా చూడాలని అది వారి ఆశ అని చెప్పుచున్నారు.
53. షూలమ్మీతీయందు ముచ్చట పుట్టించునది ఏది? వింతైనది ఏది?
        పరమగీతము 6:13, ''షూలమ్మీతీ, రమ్ము రమ్ము  మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరమ్ము,  తిరిగిరమ్ము.  షూలమ్మీతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది?  ఆమె మహనయీము నాటకమంత వింతయైనదా?''
        షూలమ్మీతీయందు ముచ్చట పుట్టించునది సత్యాన్వేషణ. ఆమె చరిత్ర ఒక వింతయైన నాటకమని గ్రంథకర్త వ్రాసినారు.  ఇంతగా ఈ పరమగీతము అను ఈ గ్రంథము ఎంత నాటకీయ మలుపులు తిరుగుచూ ఆసక్తిగా ఉన్నది.  చదవాలి అని మొదలిడితే ఇంకా ఇంకా చదవాలి అన్న ఆసక్తి ఇందులో కనిపిస్తుంది.  ఇదే దీనిలోని వింత.  కనుక సత్యాన్వేషణ నాటకీయ మలుపులు తిరుగుచు ఆసక్తిని రేకెత్తించినను అది నిజమైన సత్యాన్వేషణే కదా!

54.  రాజకుమార పుత్రిక వర్ణన

        పరమగీతము 7:1-9, ''రాజకుమార పుత్రికా,  నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు!  నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి.  నీ నాభీదేశము మండలాకార కలశము  సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితిపడకుండును గాక  నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి  నీ యిరు కుచములు  జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి.  నీ కంధరము దంతగోపుర రూపము  నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున  నున్న  రెండు తటాకములతో సమానములు  నీ నాసిక దమస్సు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము.  నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము  నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి.  రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు.  నా ప్రియురాలా, ఆనందకరమైనవాటిలో  నీవు అతిసుందరమైనదానవు  అతి మనోహరమైనదానవు.  నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు  నీ కుచములు గెలలవలె నున్నవి.  తాళవృక్షము నెక్కుదుననుకొంటిని  దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని  నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది.  నీ నోరు శ్రేష్ఠద్రాక్షారసమువలె నున్నది  ఆ శ్రేష్ఠద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము  అది నిద్రితుల యధరములు ఆడజేయును.''  
        రాజకుమారా పుత్రికా అనగా రాజుగా ఒకరు ఉన్నారని అతనికి ఒక కూతురు ఉన్నదని అర్థము వచ్చుచున్నది.  ఈ రాజు దేవాదిదేవుడు దేవుడైన యెహోవా.  ఆయన పుత్రిక సంఘమైన యెరూషలేము.  ఆయనకు ప్రియమైన కుమారుడు క్రీస్తు ప్రభువు.  ఈ వచనాలలో ప్రియునిగా దేవునికి ప్రియమైన కుమారుడు క్రీస్తు ప్రభువు వధువు సంఘమును గూర్చి వర్ణించుచు ముందుగా ఆమె ఎవరి కూతురో చెప్పుచున్నారు.  ఆమె దేవాదిదేవుడు సైన్యములకధిపతి పరలోక భూలోక పాతాళ లోకాలకు మొదలైన అన్ని లోకాలకు రాజు యొక్క కూతురు.  ఈ కూతురు జీవాత్మగా భూమి పైకి వచ్చి జీవాత్మ యొక్క అణువులుగా ఈ భూమిపై విస్తరించి జీవించి, ప్రతి విషయములో దేవునికి యోగ్యమైన రీతిలో జీవించుచు యెరూషలేము కుమార్తెలుగా మారింది.  దేవునికి అయోగ్య రీతిగా అసహ్యకరమైన రీతిలో జీవించినవారు వ్యూహితసైన్య సమభీకర రూపిణియైన మహాబబులోనుగా మారి పాతాళ లోకములో అగ్నిగంధకములతో కూడిన శిక్షను రెండవ మరణముగా పొందుదురు. అయితే నిజదైవములో ఉండి క్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించినవారు యెరూషలేము కుమార్తెలుగా పిలువబడి, చివరకు వధువుగా, భార్యగా క్రీస్తు ప్రభువుకు ప్రేమపాత్రులుగా మారుదురు. వీరిని క్రీస్తుప్రభువు ప్రియునిగా పెండ్లి కుమారునిగా అందరిని కలిపి ఇలా రాజకుమార పుత్రికా అని సంబోధించుట జరిగింది.  
        ఇలా సంబోధించిన క్రీస్తు ప్రభువు మొదటగా ఆమెలోని సౌందర్యమునుగూర్చి వర్ణించుచు - ''నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు!'' అని చెప్పుచున్నారు.  ఒకప్పుడు క్రీస్తు ప్రభువు రక్షణలోకి వచ్చి సువార్త కోసము ప్రతి సందు, ప్రతి ఊరు, ప్రతి పట్టణము కాళ్లు, కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగిన విశ్వాసి ఆమెలో ఉన్నాడు.  కనుక సువార్తని బోధించువారి పాదములు ఎలా ఉంటాయి?  బైబిలు గ్రంథము బహుసుందరముగా ఉండునని బోధించుచున్నది.  యెషయా 52:7.  దానినే క్రీస్తు ప్రభువు నీ పాదరక్షలతో ఓ రాజకుమార పుత్రికా నీవు పడిన కష్టము నాకు బహుసుందరము అందముగా కనిపిస్తుందని చెప్పుచున్నారు.  కనుక పాదరక్షలు విశ్వాసి సువార్త కొరకు పడిన కష్టమునకు గుర్తు.  ''నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి,'' అనుటలో విలువగల వస్తువులను పరలోక సంఘములో మన పనితనము ద్వారా కూర్చుకోమని పౌలు చెప్పుచున్నారు.  1 కొరింథీ 3:10-15.  ఎవరి పనితనము పరిశుద్ధాత్మ పరీక్షలో కాలిపోకుండ నిలుచునో వారు ధన్యులు అని చెప్పుచున్నారు.  ఈ నిలిచిన విలువగల బంగారు, రత్న, వజ్రాలు అందులో రాజకుమార పుత్రికకు ఆభరణములుగా నడుము నుండి క్రిందకు వ్రేలాడుచు ఆడుచున్నట్లుగా కనిపిస్తున్నవి.  ఆభరణములు విశ్వాసి ఈ లోకములో కూర్చుకున్న ధనమునకు గుర్తు.
        ''నీ నాభీదేశము మండలాకార కలశము,'' అనగా బొడ్డు భాగము గుండ్రని గిన్నెవలె ఉన్నదని చెప్పుచున్నారు.  ''సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితిపడకుండును గాక,'' అనగా ద్రాక్షారసము క్రీస్తు ప్రభువు రక్తమునకు సాదృశ్యముగా చెప్పబడింది.  ఈ ద్రాక్షారసమునకు సంఘములో లోటు ఎప్పటికి రాదు.  ఎందుంటే ఆ రక్తములోనే రక్షణ పొందినవారు తమ పాపములను ఉదుకుకొని ప్రక్షాళన గావించి నాభి అనగా గుండ్రని గిన్నె ద్వారా అనగా ద్వారము ద్వారా సంఘములో ప్రవేశించుదురు అనుటకు మాదిరిగా చెప్పబడింది.  ద్రాక్షారస కలశము విశ్వాసి పొందిన రక్షణకు గుర్తు.
        ''నీ శరీరము పద్మాలంకృత గోధుమరాశి,'' అనగా ఆమె యొక్క శరీరము గోధుమ వర్ణముతో పేర్చబడిన పద్మములతో అలంకరింపబడినట్లుగా ఉంది  అంటే బబులోను కుమార్తెలుగా ఉండి షూలమ్మీతీగా మారి చివరకు నీతిలో రక్షణలో నిలువబడిన వధువు సంఘమైన పరమయెరూషలేములో భాగమును పొందిన స్థితి అని చెప్పుట జరిగింది.  కనుక ''పద్మాలంకృత గోధుమరాశి'' మారుమనస్సుతో రక్షణలోకి వచ్చిన షూలమ్మీతీకి గుర్తు.
        ''నీ యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి,'' అనగా జింక పిల్లలు చూచుటకు చాలా అందముగా ఉంటాయి.  అవి చూచినకొద్ది ఇంకా చూడాలి అన్న తలంపు మనస్సులో లుగును.  అంతటి పరిశుద్ధతను సంఘము కలిగి అంత ఆకర్షణ కలిగియున్నట్లుగా పై వచనములోని అర్థము.  కనుక యిరు కుచముల వర్ణన సంఘము యొక్క ఆకర్షణకు గుర్తు.
        ''నీ కంధరము దంతగోపుర రూపము,'' అనగా కంఠము తెల్లని దంతముతో పోల్చబడింది కనుక సంఘములోని పరిశుద్ధతకు గుర్తు.
        ''నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున  నున్న  రెండు తటాకములతో సమానములు,'' అనగా తటాకములతో నీళ్లు నింపి ఉంచుతారు.  ఈ నీళ్లు జీవజలములకు సూచన.  అలాగే నేత్రములకు దీనిని పోల్చుట కరుణా పూర్ణమైన జీవితమునకు గుర్తు.
        ''నీ నాసిక దమస్సు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము,'' అనగా లెబానోను శిఖరము యెరూషలేము ఆలయ ఉన్నతికి సూచన, ఎందుకంటే లెబానోనులోని దేవదారు కొయ్యలతో ఇది నిర్మించబడింది.  దాని నాసిక దమస్సు దిక్కునకు చూచుట గూర్చి చెప్పబడింది.  అంటే యెరూషలేము అను వధువు సంఘము లెబానోనులోని దేవదారు కొయ్యలవలె శ్రేష్ఠమైన యెరూషలేము కుమార్తెలచే నిండియున్నను దాని నాసిక అనగా శ్వాస ఎప్పుడు దమస్సు దిక్కునకు అనగా రక్షణలోకి వచ్చువారి వైపు ఉన్నదనుటకు సూచనగా చెప్పబడింది.
        ''నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము,'' అనగా శిరస్సును కర్మెలు పర్వతముతో పోల్చుట అత్యున్నత స్థానముగా చెప్పుట. సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభువు.  కనుక అత్యున్నత పర్వతమువలె సంఘములో క్రీస్తుప్రభువు తలగా కనిపిస్తారు అనుటకు గుర్తు.
        ''నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి,'' అనగా ధూమ్రవర్ణముగల వెండ్రుకలు సంఘము ఈ లోకములో పడిన వేదనకు గుర్తు.
        ''రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు,'' అనగా రాజులకు రాజుగా క్రీస్తు ప్రభువు వివాహమునకు ముందు జరుగు నిశ్చితార్థముగా ప్రామాణికముగా సంఘము యొక్క యుంగరము మార్చుకొని ఆమెను తనదిగా ఒప్పుకొనును అని అర్థము.
        ''నా ప్రియురాలా, ఆనందకరమైనవాటిలో  నీవు అతిసుందరమైనదానవు  అతి మనోహరమైనదానవు.''  కనుక సంఘములో ఆనందము ఉంటుంది.  మనస్సుకు ఆహ్లాదకరము ఉంటుందనుటకు ఇది గుర్తు.
        ''నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు,'' అనగా తాటిచెట్టు ఎలా పొడవుగా ఉండునో ఆకాశాన్నంటుతున్నట్లుగా పెద్దదిగాని చిన్నది కాదు అనుటకు గుర్తు.
        ''నీ కుచములు గెలలవలె నున్నవి,'' అందులో ఆ సంఘము యొక్క కుచములు ఫలింపును కలిగి ప్రియునికి ఆకర్షణతో కలిగించుచున్నదనుటకు గుర్తు.
        ''తాళవృక్షము నెక్కుదుననుకొంటిని,'' అనుటలో సంఘమును తన భార్యగా చేసుకొందునని అలంకార ప్రాసతో చెప్పుట జరిగింది.
        ''దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని,'' అనుటలో సంఘమును తన భార్యగా చేసుకొన్న తరువాత ఆమెను తన కౌగిలిలోనికి తెచ్చుకొందునని అర్థము.
        ''నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి,'' అనుటలో యెరూషలేము సంఘము పరిపక్వత క్రీస్తు ప్రభువుకు భార్యగా మారి, ఆయనలో లీనమైనప్పుడు పొందునని అర్థము.
        ''నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది,'' అనుటలో జల్దరు ఫలము ప్రియునికి సూచనగా చెప్పబడింది.  కనుక వధువు వేరు క్రీస్తు వేరు కారని వధువు శ్వాస కూడ క్రీస్తు ప్రభువు శ్వాసవలె ఏకమై ఒకటిగా అయ్యారని అనగా క్రీస్తు ప్రభువులో సంఘము ఏకమై పోవునని అర్థము.
        ఇలాంటి ఏకమైన స్థితిలో వధువు సంఘము నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసమువలె క్రీస్తు రక్తముతో నిండియున్నది.  కనుక ఈ శ్రేష్ఠమైన ద్రాక్షారసము ప్రియుడైన క్రీస్తు ప్రభువు శరీరములో ప్రవహించు మధురమైన రక్తము.  అది విశ్వాసికి మధురమైన పానీయము.  ''అది నిద్రితుల యధరములు ఆడజేయును,'' అనగా సంఘము క్రీస్తు ప్రభువు ఏకమై విశ్రాంతిని పొందుదురని అర్థము.

55.  ప్రియురాలు ప్రియునితో జీవితము

        పరమగీతము 7:10-13, ''నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు.  నా ప్రియుడా, లెమ్ము రమ్ము  మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము.  పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము  ద్రాక్షా వల్లులు చిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో  దాడిమచెట్లు పూతపట్టెనో లేదో  చూతము రమ్ము  అచ్చటనే నా ప్రేమసూచనలు నీకు చూపెదను  పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది  నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన  నానావిధ శ్రేష్ఠఫలములు పచ్చివియు పండువియు  మా ద్వారబంధములమీద వ్రేలాడుచున్నవి.''
        నేను నా ప్రియునిదానను అని యెరూషలేము సంఘము ఏక నిర్ణయమును కలిగియున్నది.  బబులోనువలె దేవునికి దూరమై సాతానును తనకు ప్రియునిగా చేసుకొని వ్యభిచారిణిగా ఉండదు కనుక యెరూషలేము సంఘము ఎప్పటికి ప్రభువునకు సంబంధించి నదే!  కనుక క్రీస్తు ప్రభువు ఎప్పటికి యెరూషలేము సంఘమునందు ఆయన ఆశను కలిగియున్నారు. ఏ ఆశను కలిగియున్నారు? నీతి పరిశుద్ధత కలిగి తనయందు విశ్వాసము తో ఉండాలి అన్న ఆశను కలిగియున్నారు.  ఈ ఆశ న్యాయమైనదని ప్రియురాలు ఈ వచనములో తెలియజేయుచున్నది.  ఇలా ఒకరి యందు ఒకరు ఏకమై జీవించుట పరలోకములో జరుగును.  ఆ స్థితిని పరమగీతములో బహుఅలంకారముగా వర్ణించుట జరిగింది.  ''నా ప్రియుడా, లెమ్ము రమ్ము  మనము పల్లెలకు పోదము  గ్రామసీమలో నివసింతము.''  ఈ విధముగా వారు ఇరువురు ఈ అనంత విశ్వములో సంచరించుదురు.  సంఘము అను ప్రియురాలు ఒంటరిగా వెళ్లలేదుగాని ప్రియుడైన క్రీస్తు ప్రభువుతో కలిసి మాత్రమే సంచరించగలదు.  కనుకనే ప్రియురాలైన సంఘము తన ప్రియుని లేచి రమ్మని పిలుస్తూనే తన కోరికను వెళ్లవలసిన ప్రాంతములను గుర్తు చేస్తున్నది.  ప్రకటన 7:17, ''ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.''  కనుక క్రీస్తు ప్రభువు నడిపించితేనే వారు ఆయనతోకూడ వెళ్లుటకు సాధ్యమగును. అందుకే తరువాత వచనములో పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము అని అడుగుచున్నది.  ఆ వనము క్రీస్తు ప్రభునిది.  అక్కడ జీవవృక్షము, జీవజలములనది ఉన్నది కనుక అక్కడకి వెళ్లుదమని తన ప్రియుని అడుగుచున్నది.  అక్కడ ద్రాక్షా వల్లులు చిగిరించెనో లేదో  వాటి పువ్వులు వికసించెనో లేదో  దాడిమచెట్లు పూతపట్టెనో లేదో చూతము రమ్ము అని ప్రియుడైన క్రీస్తు ప్రభువును పిలుస్తున్నది.  
        ప్రకటన 22:1-2, ''మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆదూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును.  ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.''  పరలోకములో ప్రవేశించిన విశ్వాసులలో ఈ లోకములో జీవించినప్పుడు పాపము చేసినవారు మారుమనస్సుద్వారా క్రీస్తు ప్రభువులో ప్రవేశించి రక్షణ వలన వారు పరలోక రాజ్యమును వారసత్వముగా పొందియున్నారు.  రోమా 3:11-12, ''నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు  గ్రహించువాడెవడును లేడు  దేవుని వెదకువాడెవడును లేడు  అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.  మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.''  కనుక ఎంత పాపియైన క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ పొంది పరమయెరూషలేమును చేరుకొన్నారు. కాని వారు పాపపు జీవితములో ఉన్నప్పుడు చేసిన పాపము వారి ఆత్మను దెబ్బతీయును. ఉదా :- దేవుని దూతలు దృఢమైన సైనికులు వంటి శరీరమును కలిగినవారు. వారు మనవలె ఉంటారు.  అలాంటి దూతలు వికార రూపమునకు కప్పలవంటి రూపమునకు ఎందుకు మారిపోయారు?  ప్రకటన 16:13, ''మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోటనుండియు ఆబద్ధ ప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని.''  అపవిత్రాత్మలు కూడ దేవుని దూతలు.  కాని వారు ఈ స్థితిని ఎందుకు పొందారు?  దైవవ్యతిరేత వలననే కదా!  అలాగే వారు దేవుని ఆజ్ఞను మీరి పాపము చేసినారు. కనుక వారి ఆత్మ దెబ్బ తిని ఈ స్థితికి క్రమేణా వచ్చుచున్నది. అయితే పరమ యెరూషలేములో భాగము పొందినవారిలో పాపము అతి తక్కువ పాళ్లలో ఉండును.  యాకోబు 4:17. కనుక వారి ఆత్మ కొద్దిమేర దెబ్బ తినును కనుక వారు జీవజలముల యొద్దకు క్రీస్తు ప్రభువుచే నడిపింపబడి అక్కడ జీవవృక్షపు ఆకులచే ఆత్మలోని అస్వస్థతకు చికిత్స చేసుకొందురు. దీనిని పరమగీతములో పైవిధముగా వర్ణించుట జరిగింది.  పాపము వలన దెబ్బ తినిన వారి ఆత్మలలో ఎవరి ఆత్మలు మరల చిగురించాయి  పువ్వులవలె వికసించాయి  దానిమ్మ పూతలవలె పూలు పట్టాయి చూతము రమ్మని సంఘము క్రీస్తు ప్రభువును పిలుస్తున్నది. ఆ ప్రదేశములో స్వస్థత పొందుచున్న విశ్వాసులకు క్రీస్తుప్రభువు ఎంతగా వారిని ప్రేమించెనో చూపునదిగా గ్రహించాలి.  పాప ప్రక్షాళన అక్కడ పూర్తిగా జరిగి విశ్వాసి ఆత్మ సంపూర్ణత్వమును పొందును.
        ఈ స్థితిలో విశ్వాసి సంపూర్ణత్వము పొందుట వలన అన్ని రకములవారు సంఘములోఉన్నారని వారికి సంఘములోని ద్వారముల వద్ద నిరీక్షణ కలిగి ఎప్పటికి ఆయన వారుగా ఉంటారు.

56.  ముద్దులిడుదును

        పరమగీతము 8:1, ''నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె  నీవు నాయెడలనుండిన నెంత మేలు!  అప్పుడు నేను బయట నీకు ఎదురై  ముద్దులిడుదును  ఎవరును నన్ను నిందింపరు.''
        ఈ లోకములో సంఘము యొక్క బాధను ఇందులో వర్ణించబడింది.  ఈ లోకములో మూడు రకములైన సంఘములనుగూర్చి తెలుసుకొన్నాము.  అందులో  1.  యెరూషలేము సంఘము  2.  బబులోను సంఘము  3.  షూలమ్మీతీ సంఘము.  దేవుడు ఏకసంఘముగా ఈ లోకములో ఏర్పరచినను పాపపు స్థితిలోకి జీవాత్మ నడచి దేవునికి దూరమై విగ్రహ దేవుళ్లు అను సాతాను మాయలో పడి వారిలో ఎక్కువ శాతము బబులోను సంఘములో కుమార్తెలుగా మారిపోయారు.  కనుక బబులోను దేవుని నుండి దూరమై పాపపు స్థితిలో జీవించుచున్నది.  నిజానికి బబులోనులోని కుమార్తెలందరు యెరూషలేము సంఘములో కుమార్తెలుగా ఉండవలసినవారు.  అలా ఉండి ఉంటే వారు క్రీస్తు ప్రభువుకు ప్రియురాలుగా, వధువుగా, భార్యగా ఉండేది.  కాని నిజదైవమును వీడుట ద్వారా బబులోనులోని కుమార్తెలు సాతానుకు ప్రియురాలుగా, వధువుగా, భార్యగా ఉంటుంది.  కనుక ఈమెను మహావేశ్యగా చెప్పబడింది.  ప్రకటన 17:1, 5, ''ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడువచ్చి  నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను.  -నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను;  . . . దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి యుండెను-మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహాబబులోను.''  అయితే ఈ పాపపు స్థితిలోని కొందరు నిజమైన దైవమును పరిశోధించి ఆయననుగూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నిస్తారు.  వారిని షూలమ్మీతీగా ఆమె చరిత్రను పరమగీతములో వర్ణించుట జరిగింది.  ఈమెనుగూర్చి ఈమె భూలోకములో ప్రవర్తించు తీరునుగూర్చి వర్ణించుట జరిగింది. మరల ఈ అధ్యాయములో తిరిగి ప్రస్తావించుట జరిగింది.  దీనినిగూర్చి మనము మరికొన్ని నూతన విషయాలు తెలుసుకొందము.
        బబులోను సంఘములో వేలకొలది పురుషులుగా విగ్రహ దేవుళ్లుగా చెలామణి అగుచున్న పతనము చెందిన దేవుని దూతలు సాతానుకు ప్రతిగా సాతానుకు సాటివారుగా క్రియ జరిగిస్తున్నారు.  వీరు జీవాత్మయైన నరులకు సహోదరులే, ఎందుకంటే దేవుని దూతలు నరులతో బాటుగా దేవుని సహదాసులని బైబిలు గ్రంథములో ప్రకటన 22:9 చెప్పుచున్నది.  కెనుక వీరు దేవుని దూతలైన వారిలో పతనము చెందినవారైనను నరులకు సహోదరులే.  దీనినిబట్టి బబులోను కుమార్తెలుగా ఉన్నవారికి సహోదరులు అనగా విగ్రహ దేవుళ్లు చాలామంది ఉన్నారు.  అంటే విగ్రహ దేవుళ్లయిన పతనము చెందిన దేవుని దూతలు.  వీరితో వారు నిరంతరము ఒక తల్లి బిడ్డలవలె జీవిస్తున్నారు.  వారు ప్రియుడు ప్రియురాలుగా తిరిగినను ముద్దులిడినను ఎవరు అడుగుట లేదు నిందించుట లేదు.  అనగా కుమార్తెలు దూతలను దేవుళ్లుగాను దేవతలుగాను భావించి నైవేద్యములు అర్పిస్తూ వాటిని పూజిస్తూ జీవించుటలో ఎవరు వారికి అభ్యంతరములు చెప్పుట లేదు.  అయితే క్రీస్తు ప్రభువు విషయానికి వచ్చుసరికి ఆయన అందులోనివాడు కాదు.  ఈయన ప్రత్యేకింప బడిన వాడు. విగ్రహ దేవుళ్ల వంటి వాడు కాదు. కనుక వారిలో వారికి సహోదరుడుగా ఉండడు.  బబులోనుకు ఆయనకు సంబంధము లేదు.  అందులో క్రీస్తు ప్రభువు ఉండడుగాని యెరూషలేములో మాత్రము ఆయన ఒక్కడే ఉంటాడు.  అందులో విగ్రహ దేవుళ్లు అను పతనము చెందిన దేవుని దూతలు ఉండరు.  కనుక యెరూషలేము కుమార్తెలు ప్రియులుగా తమ నాథుడైన క్రీస్తు ప్రభుని ప్రియునిగా ప్రార్థనలు, వాక్య పరిచర్య కీర్తనలు వంటివి జరిపిస్తూ సహోదరులు ఐక్యత కలిగి ప్రభువుకు ముద్దులర్పిస్తూ ఒకరితో ఒకరు ఆప్యాయముగా జీవిస్తున్నను అక్కడ అడిగేవారు ఉండరు.  కాని ఎప్పుడైతే నిజదైవమును తెలుసుకోవాలన్న తలంపు కలిగి మారుమనస్సు ద్వారా బబులోనులో తనతో బాటుగా సహోదరులుగా ఉంటూ తన నుండి ముద్దులు పొందుచు అనగా నైవేద్యములు, పూజలు వంటివి పొందుతున్నవారు నిజదైవము కాదని అబద్ధికులని గుర్తించి విడనాడుట జరిగింది.  కాని క్రీస్తు ప్రభువు మాత్రమే నిజదైవమును రక్షకుడును నిజమైన ప్రియుడు.  ఆ ముద్దులు నిజముగా క్రీస్తు ప్రభువునికి చెందాలని గుర్తించింది.  వారిని విడనాడి తన ముద్దులతో ఆయన ఎదురై బహిరంగముగా ఆనందించాలనుకొంటే ఆ బబులోను సంఘములో ఆయన ఉండడు.  ఒకవేళ తాను ఆయనను తీసుకొని వెళ్లి బబులోను సంఘములో ఆరాధన, వాక్య పరిచర్య, రొట్టె విరుచుట వంటివి చేస్తే అనగా ఆయనకు బహిరంగముగా ముద్దులిస్తే అక్కడ ఉన్న బబులోను కుమార్తెలందరు ఆమెను నిందించుదురని చెప్పుచున్నది.  అదే క్రీస్తు ప్రభువు విగ్రహ దేవుళ్లతో ఒకరుగా అందులో ఇంతకుముందే ఉండి ఉంటే తనను ఎవరు నిందించరు కదా అని షూలమ్మీతీ తన బాధను వ్యక్తపరుస్తుంది. క్రీస్తు ప్రభువు విషయములో నేను క్రైస్తవునిగా మారిన క్రొత్తల్లో నా బంధువులు నాతో మనకు ఎంతోమంది దేవుళ్లు లేరా? ఆయననే ఎందుకు ఆరాధించాలి?  మన వాళ్లలో ఎవరిని పూజించిన మాకు అభ్యంతరము లేదని అనేక రకములుగా నన్ను నిందించారు.  ఇదే బాధ ఈ వచనాలలో షూలమ్మీతీ చెప్పుచున్నది.

57.  షూలమ్మీతీ తన ప్రియుడైన క్రీస్తు ప్రభువుకు మార్గము చూపుట

        పరమగీతము 8:2, ''నేను నీకు మార్గదర్శినౌదును  నా తల్లియింట చేర్చుదును  నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫలరసమును నేను నీకిత్తును.''
        క్రీస్తు ప్రభువుకు బబులోను సంఘములోని విగ్రహ దేవుళ్లకు సంబంధము లేదు కనుక నీవు నిజమైన నా సహోదరుడవని నేను గుర్తించానని షూలమ్మీతీ చెప్పుచు ఈ వచనములో నేను నీకు మార్గదర్శిగా ఉంటూ నేను నిన్ను నడిపిస్తానన్నది.  నా తల్లియింట నిజముగా ఉండవలసినది విగ్రహ దేవుళ్లు కాదుగాని నీవు మాత్రమే అని చెప్పుచు షూలమ్మీతీ క్రీస్తు ప్రభువుకు తన యింటికి మార్గము చూపుతూ ఆహ్వానించు చున్నది.  అందువలన వచ్చు నిందలను తాను సహించుటకు ముందుగానే సిద్ధమైంది కనుక తన ప్రియుడైన క్రీస్తు ప్రభువును తన తల్లి యింటిలో అనగా బబులోను సంఘములో చేర్చుకొంది.  అప్పుడు ప్రభువుతో నీవు నాకు ఉపదేశము చెప్పుదువు అని చెప్పుచున్నది.  అనగా అక్కడ నేను నీతో ఎలా ఉండాలి  నిన్ను నేను ఎలా ప్రేమించాలి అన్నదానిని ఉపదేశించమని అదియు తన తల్లియింట చెప్పమని చెప్పుచున్నది.  ఇలా నన్ను నీవు కరుణించి నాతో కూడ వచ్చి నాకు నీవు ఉపదేశిస్తే నీకు నేను ద్రాక్షారసమును, దానిమ్మ ఫల రసమును ఇస్తానని చెప్పుచున్నది.  అంటే ఇంకా అనేకులకు నేను మార్గదర్శిగా ఉండి ద్రాక్షావళ్లియైన నీలో జతపడుచు నేను ఫలించి అనేక ఆత్మలను నేను నీకిత్తును అని వాగ్దానము చేయుచున్నది. ఈ వాగ్దానము చాలా గొప్పది.

58.  ప్రియుని ఎడమ చేయి ప్రియురాలు తలక్రింద కుడిచేత కౌగిలించుకొనుట

        పరమగీతము 8:3, ''అతని యెడమచెయ్యి నా తలక్రింద నున్నది  అతని కుడిచెయ్యి నన్ను కౌగిలించుచున్నది.''
        దీనినిగూర్చి 15వ విభాగములో మరల ఒకసారి చదవండి.

59.  యెరూషలేము కుమార్తెలారా - ప్రేమకు ఇష్టమగువరకు

        పరమగీతము 8:4, ''యెరూషలేము కుమార్తెలారా,  లేచుటకు ప్రేమకు ఇచ్ఛపుట్టు వరకు  లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీచేత ప్రమాణము చేయించు కొందును.''
        దీనినిగూర్చి 16వ విభాగములో మరల ఒకసారి చదవండి.

60.  ప్రియునిమీద ఆనుకొని అరణ్యమార్గమున వచ్చునది ఎవతె?

        పరమగీతము 8:5, ''తన ప్రియునిమీద ఆనుకొని  అరణ్యమార్గమున వచ్చునది ఎవతె?  జల్దరువృక్షము క్రింద నేను నిన్ను లేపితిని  అచ్చట నీ తల్లికి నీవలన ప్రసవవేదన కలిగెను  నిన్ను కనిన తల్లి యిచ్చటనే ప్రసవవేదన పడెను.''
        తన ప్రియునిమీద ఆనుకొని అరణ్యమార్గమున వచ్చునది ఎవతె?  అని మన మూలవచనములో ప్రశ్నించుట జరిగింది.  అరణ్యము అనగా జనవాసము తక్కువగా ఉండే ప్రాంతము లేక జనులు నివశించుటకు యోగ్యమైనను నివాసము ఉండని ప్రాంతము.  ఇలాంటి అయోగ్యమైన స్థలమైనను ఎడారిలా కాక గడ్డి ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతములో తన ప్రియునిమీద నడవలేని స్థితిలో ఆనుకొని ఒక స్త్రీ వస్తున్నది.  ఈ స్త్రీ కూడ సంఘమే.  ఈ సంఘము యొక్క భారము సిలువగా క్రీస్తు ప్రభువు భుజముపై పడగా ఆయన దానిని మోస్తూ గొల్గతా అను ప్రాంతమునకు యెరూషలేము నుండి తీసుకొని వచ్చారు.  మార్గమంతా జనసందోహముతో నిండిపోయింది.  కాని దానిలో క్రీస్తు ప్రభువుపై నిజ ప్రేమ కలిగి సంఘములో యోగ్యరీతిలో ఉండుటకు యోగ్యమైనవారు ఎందరు?  చాలా తక్కువమంది అని చెప్పవచ్చును.  కనుక దానిని మనము జనులు గుంపులు గుంపులుగా ఉన్నను దేవునికి యోగ్యమైనవారు అక్కడ లేరు గనుక అది అరణ్యముగా చెప్పబడింది.  ఈ అరణ్యములో ప్రియుడు నడుస్తూ సిలువను మోస్తూ వస్తున్నారు.  అంటే సంఘము సీయోనులో క్రీస్తు ప్రభువే పునాదిగా వేయబడింది.  దానిని వృద్ధిలోనికి తెచ్చు బాధ్యత క్రీస్తు ప్రభువుదే.  క్రీస్తు ప్రభువుకు సంఘముపై అంత ప్రేమ ఉంది.  అందుకే తనే పునాదిగా వేయబడిన సంఘము నడవలేని స్థితిలో ఉన్నదని గ్రహించి దానిని తనమీద ఆనుకొనునట్లు చేసుకొని గొల్గతాకు నడిపించాడు.  నడచుటకు బలహీనపడిన స్త్రీ ప్రియుని ఆనుకొని ఎలా నడుస్తుంది?  ఒక చేయి ప్రియుని భుజముపై వేయగా ప్రియుడు తన ఎడమ చేయిని తల వెనుక మెడ భాగములో ఉంచి, కుడి చేయిని నడుము భాగములో పట్టుకొని సగము భారము మోయుచు, మిగిలిన భారమును ప్రియురాలు తన కాళ్లపై మోపి నడచును.  అలాగే సిలువ తన కుడి భుజముపై వేయగా ఎడమచేతిని అడ్డ కర్రను పట్టుకొని కుడిచేతి సిలువ కర్రకు క్రింద నుండి కొద్దిగా పై భాగములో పట్టుకొని, సిలువ కర్ర క్రింద భాగము నేలను తాకుచుండగా లాగుకొనుచు దానిని తీసుకొని పోవుట జరిగింది.  ఈ విధముగా క్రీస్తు ప్రభువు సిలువ బలియాగ కాలములో సంఘము ఉన్న పరిస్థితిని వర్ణించుట జరిగింది.
        ఈ విధముగా నీరసించిన స్థితిలో సంఘము ఉండగా క్రీస్తు ప్రభువు సిలువలో బలియాగము చేశాడు.  ఆ బలియాగములో సిలువ మ్రానును జల్దరువృక్షముగా చెప్పబడింది.  ఇంతవరకు సిలువ సంఘముగా ఆనుకొని రాగా, బలియాగ సమయమునకు క్రీస్తు ప్రభువును సిలువపై బలి ఇచ్చారో, అప్పుడే అది క్రీస్తు ప్రభువుకు మారుగా జల్దరువృక్షముగా మారింది.  ఆ సిలువ క్రింద నిజదైవమును గూర్చి చింతించువారు కొందరు ఉన్నారు.  వారిలో యోహాను, తన తల్లియైన కన్య మరియమ్మ.  ఆ స్థితిని శిష్యులందరు పారిపోయిన యోహాను మాత్రము ఎవరికి జంకక అక్కడ ఉన్నాడు.  కనుక సంఘము ఏ రూపములో ఉన్నది?  అని ఎవరైన అడిగితే యోహాను అను శిష్యుని రూపములో అక్కడ ఉన్నది.  మిగిలినవారందరు పారిపోయారు.  ఈ స్థితిలో పాపక్షమాపణ క్రీస్తు ప్రభువు జల్దరువృక్షమైన సిలువపై నుండి ఇచ్చి, సంఘమును బలపరచి వారిని లేపుట జరిగింది.  ఎలా?  తన తల్లిని తన శిష్యునికి ఇచ్చి తద్వారా ఆమెకు తన శిష్యుని కుమారునిగా చేశాడు.  ఈ విధముగా తన శిష్యుడు తనకు సహోదరుడునిగా మారాడు.  తన సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి?  ఏడు లేక డెబ్బదిసార్లు అన్న సంగతిని క్రీస్తు ప్రభువు తన బోధలో చెప్పుట జరిగింది.  ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు తన శిష్యునికి తన తల్లిని ఇచ్చాడో పాపక్షమాపణ వచ్చింది.  తన శిష్యునికి తాను సహోదరునిగా మారిపోయాడు.  క్షమించుట పాపక్షమాపణ మారుమనస్సు పొందువారికి ఇచ్చాడు.  ఇలా సంఘాన్ని లేపుట జరిగింది.  పాపక్షమాపణ ఇచ్చి బలపరచాడు.  అందులో మొదటివాడు సంఘమునకు పునాది క్రీస్తే.  ఆ పునాదిపై మొదటి రాయి లేక బండ పేతురు కాని ప్రస్తుత నీరసించిన పరిస్థితులలో పారిపోయి ఉన్నాడు.  అందువలన తన సంఘములోని శిష్యులలో యోహానుకు తన తల్లిని ఇచ్చుట ద్వారా వారికి సువార్తను బోధించి శిష్యులుగా జేయమని సంఘమును వృద్ధి చేయమని మారుమనస్సు పొందినవారికి రక్షణ వచ్చునట్లుగను వారికి బాప్తిస్మమిచ్చి సంఘమును వృద్ధి చేయమని పేతురు అను బండ ద్వారా తలపెట్టిన సంఘములో యోహానును ఇంకొక రాయిగాను స్త్రీలలో కన్య మరియమ్మను ఇంకొక రాయిగా వేసి బలపరచుట చేశాడు.  1 పేతురు 2:4-5.  
        ఈ విధముగా సిలువ అను బల్దరువృక్షము క్రిందే సంఘమును ఆయన లేపుట జరిగింది.  అక్కడ మన తల్లికి ఆత్మల సంపాదన అను ప్రసవవేదన కలిగించబడింది.  అదే పునాదిగా మారి ఇప్పటికి అనేక ఆత్మలను పరలోకమునకు చేర్చుచున్నది.  అలాంటి సంఘమునకు ఆ సిలువ క్రిందే ఈనాడు నిన్ను కనిన తల్లియైన సంఘమునకు ప్రసవవేదనకు గురియైందని చెప్పబడింది.

61.  ప్రేమలోని బలము - ఈర్ష్యలోని కఠోరము

        పరమగీతము 8:6-7, ''ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది  దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు  అది యెహోవా పుట్టించు జ్వాల  నీ హృదయముమీద నన్ను నామాక్షరముగా ఉంచుము  నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము.  అగాధసముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు  నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు  ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను  తిరస్కారముతో అతడు త్రోసివేయబడును.''
        ప్రేమ - ఈర్ష్య రెండు చాలా అవినాభావ సంబంధమును కలిగియున్నవి.  ప్రేమలో స్వార్థము, త్యాగము రెండు ఉన్నాయి. ప్రేమలోని స్వార్థము ఈర్ష్యకు కారణమగును.  అలాగే పరమగీతములో ప్రేమ మరణమంత బలవంతమైనది అని చెప్పుచున్నాడు. క్రీస్తు ప్రభువులోని ప్రేమ ఆయన పాపి కొరకు తన ప్రాణమును అర్పించలేదా!  ఇంత గొప్ప త్యాగమునకు కారణము ప్రేమే కదా!  మదర్‌ థెరిస్సా ఇండియాలో సేవకు కారణమేమి?  ప్రేమే కదా!  ఇది త్యాగమును సూచించును.  దానికి రెండవ కోణము ఆ ప్రేమలో అంతా నాకే కావాలి అన్న స్వార్థము వచ్చినప్పుడు దానికి ఈర్ష్య జతపడును.  ఇది ఎప్పుడైతే చేరునో అది సంఘమును నాశనము చేయునేగాని వృద్ధిలోనికి తీసుకొని రాదు.  ప్రవక్తల వలన యెరూషలేము సంఘము పొందుచున్న వృద్ధిని చూచి ఈర్ష్య పొందిన సాతాను తన అనుచరులలో కూడ ఈ ఈర్ష్యను లేపి ప్రవక్తలను చంపించాడు.  క్రీస్తు ప్రభువును చంపించాడు.  ఆయన శిష్యులలో అనేకులను హత:సాక్షులుగా మార్చాడు.  దీనికి కారణము సంఘము వృద్ధిలోకి వచ్చుట.  దీనిని ఈర్ష్యగా చెప్పబడింది.  ఈ ఈర్ష్యను కలిగినవారు పాతాళ లోకమంత కఠోరమైనది అని చెప్పబడింది.  వారికి తరువాత స్థితి పాతాళ లోకమని ఆ లోకములో అగ్నిజ్వాలలతో బాధింపబడుదురని అది దేవుడైన యెహోవా వలన పుట్టించు జ్వాలలని చెప్పుచున్నాడు.  మత్తయి 25:41, ''అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి-శపింప బడినవార లారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.''  ఇవి ముందుగానే సిద్ధపరచబడి ఉన్నాయి.  కనుక క్రీస్తు ప్రభువుపై ప్రేమ మరణమంత బలవంతమైనదియైనను మనకు పరలోకాన్ని ఇస్తుంది.  క్రీస్తు ప్రభువుపై ఈర్ష్య పాతాళమంత కఠోరమైనదిగా మారి మనలను శిక్షించును.
        ఈ రెండు స్థితులు ఈ లోకములో క్రియ జరిగిస్తున్నాయి.  కనుక ఓ విశ్వాసి, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము అని ప్రియుడు చెప్పుచున్నారు.  మత్తయి 11:28-30, ''ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.  నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.''  ఈ విధముగా క్రీస్తు సువార్త అను కాడిని మన భుజముపై ఉంచుకోవాలి.  దానిని మోయాలి. అప్పుడే క్రీస్తు ప్రేమ మన భుజముపై సువార్త అక్షరములుగా నిలుచును.  అలాంటి ప్రేమను అగాధ సముద్రజలములు ఆర్పజాలవు.  
        ఈ జలములు ఎవరు?  ప్రకటన 17:1, 15, ''ఆ యేడు పాత్రలను పట్టుకొని యున్న యేడుగురు దేవదూతలలో ఒకడువచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను.  -నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను;  . . .  మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను-ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.''  ఇలా పాపపు స్థితిలో జీవించుచు బబులోను సంఘముగా సాతానును ప్రియునిగా చేసుకొని వేశ్యలుగా ఉన్నవారు ఎందరు వచ్చినను క్రీస్తు ప్రభువు ప్రేమను, ఆయనపై మనకున్న ప్రేమను ఆర్పలేరని చెప్పబడింది.  
        అలాగే ప్రకటన 12:15, ''కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని''  ఇలా ప్రవాహముగా వచ్చు కష్టములు, బాధలు ఏమి కూడ ముంచివేయలేవని చెప్పబడింది.  ఎంత ధనము ఇచ్చినను వీరు తిరస్కరిస్తారేగాని క్రీస్తు ప్రభువుపై వారికి యున్న ప్రేమను వదలరని చెప్పబడింది.

62.  చిన్న చెల్లెలు - వివాహ కాలము

        పరమగీతము 8:8-10, ''మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దానివిషయమై యేమి చేయుదుము?  అది ప్రాకారమువంటిదాయెనా?  మేము దానిపైన వెండి గోపురమొకటి కట్టుదుము.  అది కవాటమువంటిదాయెనా?  దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము  నేను ప్రాకారమువంటిదాననైతిని  నా కుచములు దుర్గములాయెను  అందువలన అతనిదృష్టికి  నేను క్షేమము నొందదగినదాననైతిని.''
        ఇందులో చిన్న చెల్లెలు ఒకటి ఉంది. ఈమె కూడ సంఘమే. కాకపోతే చిన్నది.  నిజానికి ఏకసంఘముగా ఉండాలి.  కాని పాపములవ బబులోను సంఘము ఏర్పడగా, మారుమనస్సు వలన షూలమ్మీతీ బబులోను సంఘములోనే చిన్న చిన్న సంఘములు ఏర్పరచుకొని క్రీస్తు ప్రభువుపై తన ప్రేమను చూపుచున్నది.  పౌలు తన జీవిత కాలములో అన్యుల మధ్య సువార్తను జరిగించి అనేక చిన్న చెల్లెళ్లను ఏర్పరచుట జరిగింది.  అవి క్రమేణా వృద్ధి చెంది మహా సంఘాలుగా మారాయి.  అలాగే మన మూలవాక్యములో కూడ ఒక చిన్న చెల్లెలు ఉంది.  ఆమె ఎవరికి చెల్లెలు?  సంఘానికే.  అనగా యెరూషలేము సంఘమునకు ఈమె చెల్లెలు.  కాని ఆమెకు దూరముగా వేరొక చోట షూలమ్మీతీ ద్వారా మారుమనస్సు పొందినవారి ద్వారా ఈ సంఘము వారి వద్ద ఏర్పరచబడింది.  ఇది ఏర్పరచబడినప్పుడు ఈ సంఘములో అన్ని కొదువే.  చెల్లెలు అనగా అపరిపక్వ స్థితిలో ఉన్నది. ఈ చెల్లెలుకు ఇంకా వయస్సు రాని స్థితిలో కొంత కాలము జరుగుతూ వచ్చింది.  కొంత కాలానికి సంఘము అను చెల్లెలు పెద్దదై వివాహ వయస్సుకు వచ్చింది.  అంటే సంఘము వృద్ధి చెంది నింపబడుచూ వస్తుంది.  ఈ స్థితికి వచ్చినప్పుడు ఈ సంఘము విషయములో ఏమి చేయాలి?  అన్న ఆలోచన వస్తుంది.  అప్పుడు దానికి ఒక స్థలము సిద్ధపరచి దానికి ప్రాకారములు కట్టి దానిలో వెండి వంటి విలువైన వస్తువులతో గోపురము అనగా ఆలయము నిర్మించాలన్న తలంపు కలిగి అందరు కలిసి నిర్మిస్తారు.  అలాగే అది ప్రాకారము కలిగి రక్షణలో సంపూర్తిగా ఉంటేనే ఆలయ నిర్మాణము జరుగును  లేకపోతే జలప్రవాహమువలె సాతాను సంఘము వలన బాధలలో ఉంటే దానికి దేవదారు మ్రానులతో అడ్డులు కట్టి సంరక్షించుకొందమని అందులోని విశ్వాసులు సంఘమును వృద్ధి చేయుచూ పెద్ద సంఘముగా మార్చుట జరుగును.
        ఈ స్థితిలో చిన్న చెల్లెలుగా ఉన్న సంఘము కూడ నా ప్రాకారము మంచి రక్షణలో ఉన్నది.  తనలోని మధ్య భాగము బాగా పెంపొంది దుర్గమువలె ఆకర్షించుచు బలమైనదిగా తయారైతినని అనుకొనుచున్నది.  ఈ స్థితి ఎలా ఉన్నది?  ఈ స్థితి క్రీస్తు ప్రభువుకు యోగ్యమైనది అని చెప్పబడింది.  కనుక చిన్న చెల్లెలైనను దానిని వృద్ధి చేసి క్రీస్తు ప్రభువుకు యోగ్యరీతిలో మలచి గొఱ్ఱెపిల్ల వివాహ మహోత్సవములో ఆయన దృష్టికి ఆకర్షించునట్లుగా నీతిలో నడిపించగలిగితే పరమయెరూషలేములో చేర్చబడి క్షేమమును పొందును.

63.  సొలొమోను ద్రాక్షావనము - కాపులకిచ్చుట

        పరమగీతము 8:11-12, ''బయలు హామోనునందు సొలొమోను కొక ద్రాక్షా వనము కలదు  అతడు దానిని కాపులకిచ్చెను  దాని ఫలములకు వచ్చుబడిగా  ఒక్కొక్కడు వేయి రూపాయిలు తేవలెను.  నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది  సొలొమోనూ, ఆ వేయి రూపాయిలు నీకే చెల్లును.  దానిని కాపుచేయువారికి రెండువందలు వచ్చును.''
        సొలొమోను ఇశ్రాయేలీయులకు రాజు.  ఆయనకు ఒక ద్రాక్షావనము ఒకటి ఉన్నదని చెప్పబడింది.  దానిని ఆయన కాపులకు గుప్తకు ఇచ్చాడు.  వారు దానిని కాచి దాని ఫలములను అమ్మినప్పుడు వచ్చు ఆదాయమును ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలెనని చెప్పి కాపలాగా ఇచ్చుట జరిగింది.  ఇలా ఇచ్చినను ఆ ద్రాక్షావనము మాత్రము తన వశమునే ఉన్నదని చెప్పుచున్నాడు.  కనుక కాపులు వెయ్యి రూపాయలు తెచ్చి సొలొమోనుకు ఇచ్చినప్పుడు, అందులో వారికి రెండు వందలు రూపాయలున్నవని చెప్పబడింది.
        ఇందులో దేవుడు సంఘమును నిర్మించి దానిని కాచుటకు మనలో చాలామందికి కౌలుకు అనగా లీజుకు ఇచ్చాడు.  దానిని సరియైన రీతిలో కాచి వృద్ధిలోకి తీసుకొని వచ్చిన ఆత్మలు వృద్ధి చెంది ఫలింపు కనిపిస్తుంది.  వీటిని మనము దేవునికి అర్పించవలసియున్నది.  కాపుకి ఇచ్చినది వెయ్యి రూపాయలు.  వీరు చెల్లించవలసినది వెయ్యి రూపాయలు.  ఎన్ని ఆత్మలను రక్షణలోనికి తెస్తారో అందరిని దేవునికి ఇచ్చివేయాలి.  దీనికి ఫలితము  రెండువందలు రూపాయలు వచ్చునని చెప్పబడింది.  ఇది క్రీస్తు ప్రభువు జయించినవారికి ఇచ్చు బహుమానముగా ఇచ్చును.  మొదట కాపు ఇచ్చునప్పుడు వారివద్ద ఏమి లేదు.  చివరిగా వారివద్ద రెండువందలు రూపాయలు ఉన్నాయి.  కనుక వీరు పరలోకములో మంచి స్థానమును కలిగి జీవించుదురని చెప్పబడింది.

64.  చెలికత్తెలు వినగోరిన స్వరము - ప్రియుని తీరు

        పరమగీతము 8:13-14, ''ఉద్యానవనములలో పెంచబడినదానా,  నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు  నన్నును దాని విననిమ్ము.  నా ప్రియుడా, త్వరపడుము  లఘువైన యిఱ్ఱివలె ఉండుము  గంధవర్గవృక్ష పర్వతములమీద  గంతులువేయు లేడిపిల్లవలె ఉండుము.''
        ''ఉద్యానవనములలో పెంచబడినదానా,'' అనుటలో ఇది యెరూషలేము సంఘము.  దీనిలో ఏ లోటు ఉండదు.  అందుకే కలత చెందక విశ్రాంతిలో ఆనందముగా ఉండుమని క్రీస్తు ప్రభువే స్వయంగా మూడుసార్లు చెప్పుట జరిగింది.  ఇలాంటివారి స్వరమును వారి చెలికెత్తెలు వినాలని కోరుకొందురని చెప్పబడింది.  ప్రకటన 14:1-3, ''మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడి యుండెను.  ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడి యున్న నూట నలువదినాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.  మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని.  నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.  వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.''  ఇందులో వీరు పాడు కీర్తన ఎవరును నేర్చుకొనలేకపోతున్నారు. అలాగే పరమ యెరూషలేము కు చెందిన కుమార్తెలు అనగా విశ్వాసులు ఈ భూమిపై అక్కడక్కడ మాత్రమే ఉంటారు, ఎందుకంటే భూమి పుట్టినది మొదలు యుగాంతము వరకు 1,44,000 మంది మాత్రమే ఇశ్రాయేలీయుల నుండి ఎన్నికయినవారు. అంటే ఎంత జల్లెడ పట్టుచున్నారో అర్థమగు చున్నది.  అలాగే ఈ పుస్తక రచనలు చదివినవారిలో కొందరు నాతో మాట్లాడాలని శేఖర్‌ రెడ్డి ఎలా ఉంటాడో చూడాలని మా ఇంటికి వచ్చినవారు ఉన్నారు.  దేవుని ఆశీర్వాదములో పెరిగినవారు ఆయన ఆశీర్వాదమును వారి క్రియల ద్వారా ప్రదర్శిస్తారు.  కనుక వారు పొందిన ఆశీర్వాదమును చూచుటకు వారితో మాట్లాడుటకు కోరుకొందురని చెప్పబడింది.
        అలాగే క్రీస్తు ప్రభువు కూడ వారి స్వరమును వినాలని కోరుకుంటాడని చెప్ప బడింది.  కనుక పరిశుద్ధులు పరమయెరూషలేము నివాసులు వారికి ఏ కొరత ఉండదు.  వారి స్వరాన్ని సాధారణ స్థితిలో ఉన్న విశ్వాసులు, వారి సంఘములు వినాలని కోరు కొన్నట్లే, క్రీస్తు ప్రభువు కూడ దానిని వినాలని అనుకొంటారు.  కనుక నా ప్రియుడవైన క్రీస్తు ప్రభువా, నా స్వరమును వినుటకు త్వరపడుము, జింకవలె చురుకును కలిగి లేడిపిల్లవలె హుషారుగా ఉండమని చెప్పబడింది.  ఇలా ఎప్పుడైతే పరిశుద్ధుని స్వరము సువార్త రూపములో వినబడునో ఆ క్షణమే క్రీస్తు ప్రభువు స్వరమును విని నల్లనిదియైన బబులోను కుమార్తెను ఆకర్షించుటకు చురుకుగా ఉండమని చెప్పుచున్నాడు.

చివరిగా ఒక మాట

ప్రభువునందు సహోదరీ సహోదరులారా!  
  1. ఈ పుస్తకమును చదువుచున్న మీకు ఏమైన అనుమానాలు ఉన్నట్లయితే,
  2. ఈ పుస్తకములోని సారాంశములో లోపమును మీరు గ్రహించినట్లయితే,
  3. దీనిలో విభాగములు పూర్తిగా వివరించనట్లు మీరు గ్రహించినట్లయితే,
  4. పవిత్ర గ్రంథమునకు వ్యతిరేకమైన అంశములు మీరు ఇందులో చూచినట్లయితే,
  5. మీ హృదయము నుండి ఈ అంశమును కలిపిన మరింత బాగుండునని ఆలోచన వచ్చినట్లయితే, ''దయవుంచి నాకు వ్రాయండి.'' (email: FaithScope@thamu.com)
        దీని వలన, మేము మీ యొక్క సహాయ సహకారాల వల్ల తరువాత ముద్రణలో ఈ పుస్తకము అన్ని కోణాలలో అందముగా తీర్చిదిద్ది అందించగలము. ఆమేన్‌.
శేఖర్ రెడ్డి గారు వ్రాసిన పుస్తకములు: 
  1. ఏడు అను సంఖ్యలోని సర్వసంపూర్ణత  
  2. లోకానికి బైబిల్‌ సవాల్‌ - పార్ట్‌ 1-5
  3. మరణము తరువాత  
  4. నా ప్రభువు తల్లి
  5. ఏదెనులోని దైవప్రణాళిక  
  6. సున్నతి - బాప్తిస్మము  
  7. దేవుని దూతలు - వారి పరిచర్యలు
  8. జేసునాథుని దివ్య వాక్కులు  
  9. ప్రవక్తల ప్రవచనములు - పరమార్థములు  
  10. ప్రకటన గ్రంథ రహస్యములు ఇప్పుడు మీ చేతిలో
  11. పరమగీతము
  12. సాటి సహాయిని
వీటిని మీరు www.FaithScope.com ద్వారా ఉచితముగా పొంద వచ్చును.

        

No comments :

Post a Comment