సాంఖ్యయోగము

సాంఖ్యయోగము

బైబిలులో భగవద్గీత ఉన్నదా ?భగవద్గీతలో బైబిలు ఉన్నదా?
ఇది మత సామరస్యము సాధించిన అద్వితీయ గ్రంథరాజము

రచన :
వి. శేఖరరెడ్డి
క్రైస్తవ యోగ విద్యాకోవిదులు

గమనిక :            పబ్లిషర్స్‌ బాలసరస్వతీ బుక్‌ డిపో, కర్నూలు వారిచే
ముద్రించబడి, బ్రహ్మశ్రీ అనుముల సుబ్రహ్మణ్యశాస్త్రి
గారిచే రచించబడిన భగవద్గీత శ్లోక తాత్పర్యములు
ఈ గ్రంథమునందు చేర్చుకోబడినవి.


సాంఖ్యయోగము
                ప్రభువులో ప్రియమైన పాఠక మహాశయులైన సోదర సోదరీమణులకు భగవద్గీతలోని సాంఖ్యయోగమునకు గ్రంథకర్తనగునా తొలిపలుకు :-
                ప్రియులారా ! ప్రపంచములో ఆయా దేశాలలో మతసాహిత్యమన్నది అనగా మతములు వాటిని గూర్చినట్టి సాహిత్యాలు కొద్దే ! పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ మతము బౌద్దమతము మహమ్మదీయ మతము - ఈ మూడు మతాలు జనాదరణను పొందియున్నవి. అయితే ప్రత్యేకించి మన భారతదేశములో మతాలు జాతులకు కులాలకు మితములేక ఎవరి మతం వారికి గొప్ప అంటూ ఒక్కడైయున్న దేవుడు ఆ నరజీవుని కంటి చూపునకు అదృశ్యుడైయున్న దేవునియొక్క రూపమును నరుడు పలాని అని తేల్చుకోలేక నానావిధ రూపాలను సృష్టించి కొన్నిటిని రాతితోను కొన్నిటిని లోహములతోను కొన్నిటిని కొయ్యతోను - ఇవేవియు సరికాదని సర్పము గోవు గరుత్మంతుడు, దర్గాలు అను పేరుతో సమాధులు ఒకటేమిటి ? సర్వమైన వాటిని దేవతలని ఆరాధిస్తున్నారు.
                ప్రియపాఠకులారా ! నిజమైన ఆరాధన - ఒక్కడే మనకు దేవుడు'', అనిన సంగతిని నరుడు తెలిసికోలేకపోవుట చేతనే మతకలహాలు తద్వారా దేశప్రజల ఐక్యతకు విఘాతమేర్పడి, దేశములోను లోకములోను శాంతి సమాధానములు కరువై కలహాలు జరుగుచున్నవి. నేటి ఆధునిక యుగములో నరుడు ఎన్నో నూతన విషయాలనుగూర్చి సాంకేతిక జ్ఞానంతో ఎన్నో పరిశోధనలు చేస్తూ యాంత్రికంగా ఎంతో గణనీయమైన విజయాన్ని సాధిస్తున్నాడు. అయితే ఆత్మయైయున్న దేవుని యొక్క గుణాతిశయములను గూర్చియు ఆయనలో దాగియున్న అదృశ్య లక్షణములనుగూర్చి పరిశోధనలు చేయుటకు బదులుగా బలహీనుడై లోకాకర్షణకు గురియై ఎంతకును లోకసంబంధంగా ఆలోచిస్తున్నాడు. కాని ఆత్మ సంబంధమైన పరిశోధన ఈ యుగములో చేసే స్థితిలో లేడు. ఎందుకంటే నరదేహము లోకసంబంధమైనదియు మట్టితో నిర్మించబడినందువల్ల వాని జ్ఞానము కూడా మట్టిని గూర్చి ఆలోచిస్తున్నది. కాని మట్టిని రూపించిన పరమాత్ముని శక్తిని గూర్చి ఆలోచించే స్థితిలో ఈనాడు ఏ నరుడును లేడు. అందుకే కీర్తన 14 : 2-3లోను 53 : 2-3లోను దేవుడు పొందిన సంతాపమును గూర్చి వివరించబడి యున్నది. అదేమనగా వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరును దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడును తప్పకుండ అందరును చెడియున్నారు. మేలు చేయువారు ఎవరును లేరు ఒక్కడైనను లేడు, అని వ్రాయబడియున్న ప్రకారము ఈనాటి నరుని స్థితి స్వార్ధము స్వలాభము, లోకసంబంధమైన ఆలోచనలు ప్రయత్నాలు ప్రయాసలు వీటితో పరిమితమై, దృశ్యమైన వాటిమీదనే మనస్సుంచి తన ఆస్థిని ఐశ్వర్యమునుబట్టి కులగోత్రములను బట్టి విర్రవీగి అతిశయిస్తున్నాడేగాని దైవత్వమునుగూర్చి పూర్తిగా ఆకళింపు చేసుకోలేక పోతున్నాడు.
                ప్రియపాఠకులారా ! ఈ గ్రంథకర్తనైన నా జీవితములో పైవిధంగా నేను జీవించి ఏది గొప్ప ఎవరు గొప్ప ఏ కులము గొప్ప ఏ భాష గొప్ప ఏ దేవుడు గొప్ప అని గొప్పలతో నేను లోకములో పరిశోధించి ప్రయోగాలు చేయగా ఏదియును గొప్పగాదని, నరుడు చేయు ప్రతి పని వ్యర్థమేనని, నరుడు లోకరీత్యా ఏనాటికిని కృతార్ధుడు కాలేడని, నరుడు కృతార్ధుడు కావాలన్నను సంపూర్ణుడు కావాలన్నను పరమాత్ముని యొక్క కరుణాకటాక్షము వుంటేనేగాని సంపూర్ణుడు కాలేడన్న సత్యాన్ని చివరగా నేను తెలిసికోగల్గి, ఆ విధంగా సత్యసంపూర్ణుడైన పరమాత్మను ఎరిగిన వాడనై నా ఇహలోక జీవితములో సమస్తమును వ్యర్థమని, దృశ్యమైయున్న నిర్జీవమైన విగ్రహపూజలు పరమాత్మ సృష్టియైన జీవరాసులను జంతుజాలమును పూజించుటయు, గోరీలను ఆరాధించుటయు, పంచభూతాల ఆరాధనలు ఇవన్నియు కూడా పరమాత్మునికిని ఆయన చట్టమునకును ఆయన నిబంధనలకును విరోధములని గ్రహించిన వాడనై, పరమాత్ముని సన్నిధిలో కులగోత్రాలకు మతాలకును, నరుని యొక్క ఆస్థులు అంతస్థులకును ఈ షణ్మాత్రము ఎన్నిక లేదని, పరమాత్మునికి కావలసింది ''ఆత్మశుద్ధి, సత్యదైవాన్వేషణ, సత్యదేవుని యొక్క సావాసమును వెల్లడిచేయుటకు ప్రతినిత్యము నరుడు చేయు భక్తి సాధనాలు వేద పారాయణము'' దేవతలు అనబడెడివారు అనేకులున్నను దేవుడు ఒక్కడే ! అట్టి సృష్టికర్తయైన దేవుని గూర్చిన పరిశోధన, ప్రార్థనాది కార్యములే ప్రధానములని, ప్రార్థనాకార్యసాధనము ద్వారా పరమాత్ముని ఆత్మీయంగా దర్శించుటకును ఆయన అనుగ్రహము పొందుటకును, ఆయనలో ఆనందించుటకు లోకాకర్షణకు లోనుగాకుండ, దీని మాయలో తగుల్కొనక, భూమిమీదనున్న సకల జనులను తమ ఆత్మీయ సోదరులుగా భావించి అందరితోను సఖ్యతగలిగి జాతి విద్వేషములు మాని, అహంకార స్వభావమును సమాధిజేసి శాంతి కాముకుడై జీవించిన వ్యక్తులకు పరమాత్ముడు ప్రసన్నుడు, ఇట్టి ప్రసన్నతను పొందాలంటే మతవైరుధ్యమును కులభేదములు మాని అన్ని మత గ్రంథాలు చెప్పే సారము ఒక్కటే, అందరు ప్రవక్తలు చెప్పేది ఒక్కటేయని క్రీస్తు చెప్పిన మాట ప్రకారము సకల జనులు మరియు ఈ యొక్క శ్లోక  భావపూరితమైన గ్రంథమును పఠించే పాఠకులు మతసామరస్యమును పాటించి అది భగవద్గీతగాని భాగవతంగాని ఖురానె షరీఫ్‌గాని లేక మరి ఏదైనను గాని వానిలోని సరియైన నిర్వచనాన్ని వానికి దీటైనటువంటి సరియైన సమాధానాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తనప్రవచనములలో జవాబు ఇవ్వగల శక్తి ఈ వేదగ్రంథ రాజమునకు వున్నదని నెలల తరబడి పరిశోధించి అనుభవపూర్వకంగా వేదవ్యాసమహర్షి విరచితమైన భగవద్గీత అను ఈ వేదశ్లోకములకు సరియైన జవాబులను దృష్టాంతములను సద్భావములను ఈ గ్రంథమందు వివరించడమైనది.
                కనుక ప్రియపాఠకులారా ! జాతి కులమత భేదములు శాఖాభేదములు మాని మానవదృక్పధంతో - మంచి మనస్సాక్షితో అన్ని మతములు ఒక్కటే ! ఎందుకంటే అందరిని సృష్టించిన ఆత్మయైన దేవుడు ఒక్కడే, అందరి దేహాలకు రూపమిచ్చునది భూమిలోని మట్టియే! అందరిని ఒకేమట్టితో రూపించిన ఏకాత్మయైన పరమాత్ముని ఆత్మతోను వివేకముతోను సత్యముతోను ఆరాధించాలని, ఆత్మదేవుడే పూజార్హుడని జీవాధిపతియని నరజీవునికి సంపూర్ణ ఆనందాన్ని, మనశ్శాంతిని ప్రసాదింప సమర్ధుడని సాక్ష్యమిస్తూ ఈ గ్రంథమును పఠించు సోదరులు నా వలెనే సంపూర్ణమైన ఆత్మీయ సిద్ధి పొందాలని నిజమైయున్న దేవుని యొక్క మహిమాన్విత క్రియలలోను ఆయన సావాసములోను, ఆయన ఎన్నికలోను నిలిచి ఆత్మీయ విజయాన్ని సాధించాలన్న కాంక్షతో ఈ గ్రంథాన్ని రచించడమైనది. శుభమస్తు.
                ఉపోద్ఘాతము :- ప్రియపాఠకులారా ! మతము కులము జాతి గోత్రము భాష ఇవన్నియు కూడా నరులు ఏర్పరచుకొన్నవి. అయితే నరుని రూపించిన పరమాత్మునికి కులము లేదు, ఆయనకు గోత్రము లేదు, ఆయన ఏ జాతివాడు కాదు. ఆయన ఏ దేశస్థుడు కాడు. ఆయన ఏ భాషవాడు కాదు, కాని ఆయనకు అన్ని భాషలు తెలుసును. ఎలాగంటే ఆయన ప్రవచింపజేసిన పరిశుద్ధ గ్రంథములోని మాటలు అన్ని భాషలలో వున్నది. ఈ విధంగా అన్ని భాషలలో విరచితమైన గ్రంథము ప్రపంచములో ఏదియు లేదు. ఈ విధంగా అన్ని భాషలు తెలిసిన దేవుడు అందరిలో వున్నాడు, అందరిని రూపించాడు. అందరిని తనను ఆరాధించమంటున్నాడు. కాని ఇంత ఆప్యాయంగా తనను ఆరాధించమంటున్న దేవుని యొక్క సత్యరూపమును కనుగొనలేక నరజీవుడు సతమతమగుచున్నాడు. మరియు దేవుని యొక్క నిజరూపము కనుగొనలేక తికమకపడుచు - నానామతాలు నానాగోత్రాలు నానా జాతులతో పోట్లాడుకొంటూ ఒకరినొకరు హత్య చేసుకొంటూ - కటిక చీకటిలో తడవులాడుకొనే అంధులవలె ప్రేమ వాత్సల్యములను మాని ఒకరినొకరు పొడుచుకొంటూ ఇటు లోకానికి అటు పరమాత్మునికి కూడా పనికిమాలిన వారై అప్రాచ్యులుగాను అప్రయోజకులుగాను తమ జీవితాన్ని వ్యర్ధము చేసుకొంటున్నారు.
                ప్రియపాఠకులారా ! సత్యాన్ని మనము పరిశోధిస్తూ సత్యదేవుని యొక్క మహిమాన్విత క్రియలను, మన మనస్సాక్షి ప్రకారంగా మనము ఆలోచిస్తే విద్యుత్‌రైళ్ళు, ఆకాశంలో ఆశ్చర్యరీతిలో పయనించే విమానాలు హెలికాప్టర్లు వగైరా సాధనాలను - భూమిమీద బస్సులు లారీలు కార్లు, ఆటోలు, చిత్రవిచిత్రములైన ప్రయాణసాధనాలు, ద్విచక్రవాహనాలు, మహావైభోగములతో కూడిన భవనాలు, ఏర్‌కండిషన్‌ గదులు, టి.విలు, సినిమాలు, ఇవన్నియు సృష్టించిన నరునికి జ్ఞానమిచ్చినవాడు పరమాత్మనా ? లేక పరమాత్ముని ఆరాధనతో - నరుడు ఆరాధించే పాము గ్రద్ధ ఎద్దు గోవు ఏనుగు చనిపోయిన వాని సమాధి, నరులచేత రూపించబడిన రాతితోను లోహముతోను పోతపోసినదియు కొయ్యతో చెక్కబడిన విగ్రహాలు - ఇవి మానవునికి జ్ఞానాన్ని ఇవ్వగలవా ? నా సాటి దైవాన్వేషితులైన సహోదర - సోదరీలు ఒక్కసారి ఆలోచించండి. నరునికి అపూర్వమైనట్టి జ్ఞానాన్ని ఇచ్చిన పరమాత్ముడు జ్ఞానియా ? అజ్ఞానియా ? నరునికి జ్ఞానమిచ్చిన పరమాత్ముడు మంచి జ్ఞానియైనందుననే - తానే విధంగా మహాజ్ఞానియై లోకాన్ని పరిపాలిస్తున్నాడో, లోకసృష్టికి మనుగడనిస్తున్నాడో - ఆవిధంగానే నరుని కూడా తన జ్ఞానముచేత లోకాన్ని పరిపాలింప జేస్తున్నాడు. ఇట్టి శక్తిమంతుడైన దేవుని బొమ్మలకు జంతువులకు గోరీలకు, బుద్ధి జ్ఞానము లేని జంతువులకు పోల్చి ఆరాధించుట న్యాయమా ? ఇందుకు జవాబు పాఠకులే అన్వేషించాలి. ఈ ప్రశ్నకు జవాబు మీరే చెప్పుకోవాలి.
                కనుక భూమి మీద నివసిస్తున్న సకల నరకోటికి దేవుడు ఒక్కడే, ఆయన భూమిపై జరిగించిన క్రియాకర్మలనుబట్టి ''పిత-పుత్ర-పరిశుద్దాత్మ'' అను త్రియైక నామధారియై నిత్యజీవుడై, మహామహిమా ప్రభావితుడై భూమి మీదనున్న నరులు చేయు క్రియలకు అనగా వారి యొక్క మనస్సి ్థకిని వారియొక్క ఆత్మీయ బలహీనతలకు సంతాపపడుచు ప్రతి నరుడును దైవపుత్రుడే - కాని వైషమ్యములు మాని సమస్తజనులు సహోదర భావముతో ఒకరినొకరు ప్రేమ వాత్సల్య గుణాతిశయములతో ఐక్యతగల్గి జీవిస్తూ - ఏకపరమాత్ముని సన్నిధికి ఏకమార్గంలో ఏకచిత్తశుద్ధితో తనలో లీనము కమ్మని నరులను కీర్తన 90 : 3 లో వలె ''నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు - నరులారా ! తిరిగి రండని నీవు సెలవిచ్చుతున్నావు, అనిన వేదవాక్యమునుబట్టి, తనలో లీనము కమ్మని పరమాత్ముడు అభిలషిస్తున్నాడు. ఈ యొక్క వ్యాఖ్యానమును చదువుచున్న సోదరీ ! సోదరుడా ! నీ యొక్క స్థితి ఎలాగున్నది ? నీవు పరమాత్ముని సన్నిధిలో మోకరించి పరమాత్ముని వైపు నీ ఆత్మీయదృష్టిని మరల్చి, నీలోని దోషాపరాధ క్రియాకర్మలనుగూర్చి సంతాపపడి, పరమాత్మునియొక్క అనుగ్రహం పొందాలని - అట్లు పొందిననాడే సంపూర్ణ మత సామరస్యమన్నది భూమిమీద క్రియ జరిగించగలదు.
గ్రంథ సారాంశము - సమీక్ష తుదిపలుకులు :-
                ప్రియపాఠకులారా ! ఇంతవరకును రచింపబడినట్టి ఈ యొక్క సాహిత్యము శారీరాత్మలకు సంబంధించినదేగాని లోకసంబంధమైనవియు మానవమర్యాదలతో వ్రాసినవి కావు. ఎందుకంటే పరమాత్మునికి భూలోకమునకును, నరజీవితమునకును-నరజీవితమునకును, పంచభూతాలకును - పంచభూతాలకును, ఆకాశమందున్న శక్తులకును, సమస్తమైన సృష్టికిని - సృష్టికర్తయైన దేవునికిని పరస్పర బంధకములున్నవి. ఇట్టి బంధకములనుబట్టి సృష్టి పంచభూతములు జంతుజాలము నర సందోహము వగైరాలు జీవిత సంచారము జరుపుకొంటున్నాయి. అయితే అన్నిటికిని మూలకారకుడు పరమాత్మయే'', ఆయన చిత్తములేనిదే ఈ అనంత విశ్వములో వేటికిని జీవముగాని చలనముగాని సంచారముగాని లేదు.
                కనుక ప్రియపాఠకులారా ! ఇపుడు ఈ సాంఖ్యయోగమునుబట్టి జీవాత్మ శరీరము పరమాత్మ - వీటి అన్యోన్య సంబంధ బాంధవ్యలను గూర్చి ఈ శ్లోకములలో వివరిస్తూ రచింపబడింది. ఏది ఏమైనప్పటికిని దైవత్వము యొక్క పర్వసంపూర్ణత క్రీస్తులో నివసిస్తున్నదన్న సత్యాన్ని మనము గ్రహించుదుముగాక!

భగవద్గీత - సాంఖ్యయోగము
                11వ శ్లోకం :- ఎవ్వరికొఱకు శోకింపవలసిన పని యుండదో, వారలగూర్చి నీవు శోకించితివి. ప్రజ్ఞావంతుని వలె మాట్లాడుచున్నావు. పండితులగువారు చచ్చినవారి కొఱకుగాని, చావనున్నవారి కొఱకుగాని శోకింపరు.
                ఇందుకు సరియగు బైబిలులోని వాక్యవిన్యాసము :- ప్రభువునందు ప్రియపాఠకులారా! శరీరమును చంప చూచువారి కొరకు భయపడకుడి, ఆత్మను చంపచూచువాని కొరకు భయపడుడీ. లూకా 12:29-31 ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. ఈ లోక ప్రజలు వీటన్నిటిని వెదకుదురు ఇవి మీకు కావలసినయున్నవని మీ పరలోకపు తండ్రికి తెలియును. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి. దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. కనుక లోకసంబంధమైన శోకము దైవత్వమునకు దైవరాజ్యమునకును దైవమార్గమునకును ఆటంకము కల్గించు అడ్డుబండగా వుంటుందని మనము గ్రహించవలసి యున్నది.
                ఇంక పండితులైనవారు చచ్చినవారి కొరకుగాని చావమన్నవారి కొరకుగాని శోకింపరంటాడు. బాగానే వుంది. అయితే శారీర రక్త సంబంధ బాంధవ్యాలనుబట్టి ప్రతి నరునికిని తమ స్వకీయుల యొక్క మరణము బాధాకరంగానే వుంటుంది. ఇట్టి బాధను యేసు ప్రభువు క్రియారూపంగా యోహాను 11 : 33లో మరియతో కూడా లాజరు సమాధి దగ్గరకు వచ్చి మరియ ఏడ్చుటయు యేసు ఆత్మలో మూలుగుచు కలవరపడుటన్నది మనము గ్రహించవలసియున్నది. మరియు ఆత్మకు ఇహలోక బాంధవ్యాలు లేవు. ఉన్నబాంధవ్యాలన్ని లోకమునకే. ఆత్మన్నది అదృశ్యంలో వుండి శారీర దృష్టికి కానరానిది, నీడలేనిది, ఆకలి దప్పికలేనిది, కునకనిది, నిద్రలేనిది. కనుక భూలోకవాంఛలు దానికి లేవు. భూలోక సంబంధ ఆశయాలు అసలు దానికి పట్టవు. శరీరమన్నది లోక సంబంధం కనుక దేహము లోకసంబంధమైన వస్తు సముదాయములను గూర్చి విచారించుట వాటికొరకు ప్రయాసపడుట వాటి నిమిత్తమై దుఃఖము వాటినిగూర్చి ఆవేదన ఎంత సంపాయించినను ఎంతవున్నను అసంతృప్తి అశాంతి మనశ్శాంతి శూన్యము. ఇదియే దీని ఫలితము. అయితే యేసుప్రభువు తన శిష్యులను రాజ్య సువార్త ప్రకటనార్థము పంపుచు మీరు సంచినైనను, జాలెనైనను రెండు అంగీలైనను తీసుకొని వెళ్ళవద్దంటాడు. ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకోవలసియున్నది. లూకా 6:7-9.
                12వ శ్లోకము :- మున్నొకప్పుడెప్పుడును నేను లేని వాడనుగాను. నీవును నీ యెదుటనున్న ఈ రాజులును లేని వారుకారు. ఇకమీదట మనమందరమును నొకప్పుడు లేకపోవువారమును గాము.
                బైబిలు వివరించు భగవద్గీత పరమార్ధము :- ప్రభువు నందు ప్రియమైన వారలారా ! యేసు ప్రభువు తన బోధలో అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానంటున్నాడు. కాని నేను లేనివాడను కానంటాడు. నేను మృతుడనైతినిగాని యుగయుగములందు సజీవుడనే. మరణాన్ని జయించి సజీవుడనైన నేను లేనివాడను కానుగాని లోకములో వున్న పాపదారిద్య్రంతో బాధపడువారి కొరకు వారి దారిద్య్రంలో పాలు పంపులు పంచుకొనుటకు అనగా వారిని ఐశ్వర్యవంతులుగా జేయుటకు ఆయన దరిద్రుడాయెను. రెండవ కొరింథీ 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా ? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్య్రము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను''. ఎపెసీ 1 : 6 యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన యెదుట పరిశుద్ధులము, నిర్దోషులమై యుండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను''. దీనినిబట్టి దేవుడు పరమాత్ముడై యున్నాడు, నరుడు జీవాత్మయే.
                ఈ నరులందరు ఒక్క జీవాత్మచేత రూపించబడినవారేనని శరీరములు అనేకములై యున్నను ఆత్మ ఒక్కటేనని ఎపెసీ 4: లో వలె వున్నవారము. నన్ను పొడిచినవారును క్రీస్తు రాకడ చూస్తారని అంటాడు. కనుక ఆత్మ ఎల్లప్పుడు వుండునది స్థిరమైనదని భావము. మొదటి థెస్సలో 4:17 క్రీస్తునందుండి మృతులైనవారు మొదటలేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువు నెదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా వుందుము.
                13వ శ్లోకం :- జీవునికీ శరీరమందు కౌమారము యౌవ్వనము వార్ధక్యము అను అవస్థలెట్టివో వేరొక శరీరమును పొందుటయు నట్టిదే ! కావున ఈ విషయమున పండితుడు శోకింపడు.
బైబిలు పరమార్ధము :- ప్రియపాఠకులారా ! బాల్యదశలో నరుడు క్రియాశూన్యుడుగాను బుద్ధిజ్ఞానము, మంచిచెడ్డ, విద్య వివేకము అన్నది లేనిస్థితిలో వుండి సాటి శరీరులచేత మోయబడుచు అనగా తల్లిదండ్రులచేత, తమ పితరులచేత మోయబడుచు లేక ఉయ్యాలలో ఊపబడుచు కన్నతల్లి యొక్క  చనుబాలతో పెంచబడుచు అజ్ఞానస్థితిలో వుండి లోకజ్ఞానమునకు  దూరమై వుండుదశ.
                యౌవ్వనము అనగా నూనూగు మీసాలతో మిసమిసలాడుచు చక్కటి అంగసౌష్ఠవముతో శారీరబలముతో స్వజ్ఞానంతో చిన్నపెద్దయను విచక్షణ లేక తనకు తానే సాటి యన్నట్లుగా జీవించే దశ. ఈ దశలో చాలావరకు నరజీవితము లోకసంబంధంగానే అనగా లోకసంబంధమగు గుణాతిశయములెక్కువగా అంటి వుంటాయని ఈ దశలో మనము తెలుసుకోగలము.
                వార్ధక్యము :- ఈ దశలో పంచేంద్రియముల యొక్క పటుత్వములుడిగి వాటియొక్క క్రియాకర్మలు శూన్యములై అనగా కనుచూపు లోపించుట, మసకలగుట చర్మము ముడతలు పడుట వెన్నెముక వంగుట కాళ్ళుసేతులు తమ పటుత్వాన్ని కోల్పోవుట, చెవులు వినికిడి శక్తిని కోల్పోవుట, కంఠస్వరములోను బలహీనత, అంగములు తమ రూపమును కోల్పోయి బలహీనములగుట. ఇది ఈ యొక్క దశలో కలిగేటటువంటి మార్పులు. ఈ దశలో నరుడు మరణానికి సమీపంగా వున్నట్లు గ్రహించవలసియున్నది. ఏది ఏమైనను పై ఉదహరించినటువంటి మూడు అవస్థలు. శరీరానికేగాని ఆత్మకివి లేవు.
                ఈ మూడు అవస్థలలోను ఆత్మ ఏకత్వంగానే ఉంటుంది. గలతీ 5:17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధకముగా అపేక్షించును. ఇవి యొకదాని కొకటి విరోధముగా అపేక్షించును.  ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా వున్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అన్నట్లే - నరజీవితంలో శారీరసంబంధమైన ఎదుగుదలలో కూడా ఆత్మ శరీరాలకు పొందిక కుదరదు. పొందిక కుదరాలంటే  జ్ఞానియైనవాడు అనగా నిజ దైవ విశ్వాసియైనవాడు శారీర సంబంధితములైన పంచేంద్రియములను భగవదోపాసనకు అతి ముఖ్యమైన నాలుకను తన స్వాధీనమందుంచుకొని బహు ఏకాగ్రతతో జీవించాల్సిన బాధ్యత నరజీవుని కెంతైనా వున్నదని యోహాను 15:5 ద్రాక్షావళ్ళిని నేను తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా వుండి మీరేమియు చేయలేరు. అని ఏసు చెప్పిన మాట వివరిస్తున్నది.
                ఇందునుబట్టి దైవవిశ్వాసులైనవారు అనగా నీతిమంతులుగా తీర్చబడినవారు ఆత్మమూలంగా జీవిస్తారు. లోక దారిద్య్రము అతనికి సుదూరము, లోకమాలిన్యమతనిని అంటదు. కనుక గలతీ 5:16 నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడచుకున్న వ్యక్తి జ్ఞానవంతునిగాను ఆత్మసంబంధిగాను పరమాత్మకు సన్నిహితుడుగాను పరమాత్మ దర్శనమునకు యోగ్యుడుగాను పరమాత్ముని క్రియలకు అర్హుడుగాను ఎంచబడుచు విశ్వాస మూలంగా జీవించును. ఆహారం మూలంగా గాని ఐశ్వర్యమూలంగా గాని సుఖదుఃఖాలతోగాక విశ్వాసమూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును.
                ఆత్మపై నాలుగు దశలలో వేరొక శరీరము కూడా పొందవలసియున్నది. ఇది ఆంతర్య పురుషుడైన ఆత్మ పొందు దశలను గూర్చిన వివరము. ప్రియపాఠకులారా ! శరీరంలో నివసిస్తున్న ఆత్మ భూమిమీద కనపడుచున్నది. కాని శరీరంలో ఆత్మ తానున్నానన్న విషయం ఎదుటి శరీరానికి కూడా అది గోచరము కానీయక అదృశ్యంలో వుంటుంది. ఇది తొలిదశ. ఈ సందర్భంలో మొదటి కొరింథి 3:1-2 ఇది ఆత్మకు బాల్యదశ. సహోదరులారా ! ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీరసంబంధులైన మనుష్యులేననియు, క్రీస్తునందు పసిబిడ్డలేయనియు మీతో మాటలాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులైయున్నారు కారా ?
                అటుతర్వాత శారీరంలో వున్న ఆత్మనుగూర్చి ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపములచేతను మీరు చచ్చిన వారైయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను''. అనగా పాపజీవితము నుండి నిజక్రైస్తవ జీవితములోనికి అడుగుపెట్టుటన్నది ఇది యౌవ్వనదశ అనగా నూతనత్వములోనికి అడుగుపెట్టుట. ఇక వార్థక్యము :- ప్రకటన 14:13 అంతట ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు. నిజమే వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. వారిక్రియలు వారి వెంట పోవును.
                14వ శ్లోకం :- కన్నులు మొదలైన ఇంద్రియములకును రూపము మొదలైన విషయములకును గలుగుచుండు సంబంధములే చలిని, వేడిమిని, సుఖమును, దుఃఖమును నిచ్చునవి. అవి వచ్చుచుంబోవుచు నుండునవి. కాని నిలుకడగా నెప్పుడు నుండెడివి కావు. కావున వానిని సహింపుము.
                15వ శ్లోకం :- పై చెప్పబడిన విషయేంద్రియ సంబంధములు సుఖదుఃఖముల రెంటియందును సమచిత్తుడై యుండు నేధీరుని బాధింపవో వాడే మోక్షమునకర్హుడగును.
                దీనిని గూర్చి బైబిలులోని భగవద్గీత పరమార్ధము :- యాకోబు పత్రిక 1:12లో వలె ఇది శోధనకు సాదృశ్యమైయున్నది. ''శోధనను సహించువాడు  ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును''. మొదటి యోహాను 1:1 జీవ వాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏదై చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము''. కన్నులకు దేహానికి, కన్నులకు ఇంద్రియాలకు వున్న అవి నా భావసంబంధములను గూర్చినటువంటి సత్య వివరణ, ఈ వేదభాగములో వివరించబడియున్నది. మరియు మత్తయి 5:3-12 ఇవన్నియు కూడా సహించినవాడు ధన్యుడు''.
                ధన్యతలు :- (1) ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది. (2) దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. (3) సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. (4) నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. (5) కనికరముగలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. (6) హృదయ శుద్ధికలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. (7) సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. (8) నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. (9) నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
                16వ శ్లోకం :- లేదనదగిన వస్తువున కునికియేయుండదు. ఉన్నదనదగిన వస్తువునకు లేకుండుటయు కలుగదు. తత్త్వవేత్తలైన పెద్దలీ రెంటి యొక్క సిద్ధాంతమిట్టిదిగా కనుగొనిరి.
                బైబిలు వివరించు భగవద్గీత :- నిజమే ! నేటి విగ్రహదేవతల చరిత్రలు మానవకల్పితాలును సృష్టియొక్క ప్రతిరూపములును అనగా వృక్షములు సర్పములు వృషభములు, పులులు సింహాలు ఏనుగులు కుక్కలు, గుఱ్ఱములు, వగైరా జంతు రూపము గరుత్మంతుడు భరద్వాజ పక్షి, నెమలి వగైరా పక్షి రూపములను దేవతలుగా పూజింపబడుచున్నవి. ఇవి దేవతలు కావు. వస్తువులకు ఉనికి వున్నదిగాని వాటికి ఆత్మీయతగాని మహిమా క్రియాకర్మలు వగైరాలు లేక నరులచేత బాధింపబడి లేక చంపబడి లేక వేటాడబడి వాటి ఉనికినే కోల్పోవుచున్నవి. ఇందునుబట్టి వీటికి రూపమే లేకుండ పోవుచున్నవి. ఇట్టి వాటిని ఆరాధించువారికి కల్గు గతి రోమా పత్రిక 1:21-25 చదివితే లేదనదగిన వస్తువును గూర్చిన మర్మము తెలియగలదు. ''మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతా స్తుతులు చెల్లింపనులేదుగాని తమ వాదములయందు వ్యర్థులైరి.  వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగులయొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమెన్‌.
                ఇక ఉన్నదనదగిన వస్తువునకు లేమి కలుగదంటాడు. ఇందునుగూర్చి నిర్గమ 3:14లో తండ్రియైన యెహోవా దేవుడు - నేను ఉన్నవాడను కనుక ఉన్నవాడైన మనదేవుడు ఏనాటికిని లేనివాడుకాదు. ఆయన సర్వములో వున్నవాడు. సర్వముకల్గియున్నవాడు. సర్వమును సృష్టించినవాడు, సర్వమును సృష్టించగలవాడే - ఉన్నవాడై యున్నవాడు. ఆయనే దేవుడైన యెహోవా.
                ఇక మూడవ వచనంలో తత్వవేత్తలైన పెద్దలీ రెంటియొక్క సిద్ధాంతమిట్టిదిగా కనుగొనిరి''. మరి ఇట్టి తత్వవేత్తలు ఎవరో మనము తెలిసికోవలసియున్నది. తత్వవేత్తలు ఆత్మయొక్క ఉనికిని ఆత్మ యొక్క తత్వాన్ని ఆత్మయొక్క మహాత్మ్యమును ఆత్మయొక్క ప్రభావము నెరింగినవారు వీరెవరో ముందు తెలిసికొందము. ఆత్మయొక్క తత్త్వాన్ని తెలిసికొని ఆత్మతో జీవించిన వ్యక్తి హనోకు. పరమాత్మయొక్క తత్త్వములో ఆయన అడుగుజాడలలో ఆయన చిత్తానుసారంగా ఆయన చూపిన మార్గాలలో ఆయన చూపిన స్థలాలలో ఆయన పరిచర్య జరిగించి ఆత్మ కార్యసిద్ధులైనవారు వీరే. తత్త్వవేత్తలు హానోకు అబ్రహాము మోషే ఏలియా దానియేలు వగైరాలు పాత నిబంధనలోని వారు. అట్టివారిలో దావీదు సొలొమోను వీరు అనేక రచనలు వ్రాశారు.
                నూతన నిబంధనలో ఏసుప్రభువు యేర్పరచుకున్న 12 మంది అపోస్తలులు ఇట్టి తత్త్వవేత్తలు సువార్తలు వ్రాసి ఏసుకు సాక్షులుగా నిలబడి హతసాక్షులయ్యారు. ఇక పౌలుగా మారిన సౌలు స్తెఫను ఇట్టివారు ఈ ఆత్మతత్త్వవేత్తలు. ఇట్టివారిచే రచించబడిన గ్రంథమే. నూతన నిబంధనయను తత్త్వవేదము అనగా ఆత్మీయ సత్యవేదము నూతన నిబంధన.
                17వ శ్లోకము :- దేనిచే నివ్విశ్వమంతయు నభివ్యాప్తమై యున్నదో అది యెన్నటికిని నశించునదిగాదు. తఱుగని స్థితిగల యావస్తువునకెవ్వడు వినాశమును గలుగజేయగలడు ?
                బైబిలు వివరించు భగవద్గీత పరమార్ధము :- దేనిచే అభివ్యాపకమైయున్నదో'', అనుటలో ఆది 1:లో ఈ విశ్వమను భూగోళము జలనిధిలో గుప్తమైయుండి జీవాధిపతియైన దేవునియొక్క ఆత్మ మేరకు శుద్దీకరింపబడి రూపముదాల్చి పలువిధములైన సృష్టములతో అలంకరింప బడియున్నట్లు బైబిలు వేదంలో పై వేదభాగంలో మనం చదువగలము. సృష్టికర్తచేత రూపించబడిన ఈ విశ్వము తొలుత నిరాకారము శూన్యముగాను వున్నను పరమాత్మ వాక్ప్రభావముచేత పరమాత్మ వాక్కులననుసరించి ఆయా ఉద్దేశముల ప్రకారం పలురకములైన మృగపక్షి జంతువృక్ష సముదాయములు సృష్టించబడి పరమాత్మ దృష్టికి సౌందర్యవంతమును ఫలభరితమును ఆశీర్వాదకరమైన విశ్వముగా రూపించబడింది.
                ప్రియపాఠకులారా ! ఈ సందర్భంలో మనము గమనించాల్సింది - దేవుడు తన వాక్శక్తితో సృష్టించిన ప్రతి వస్తువును అది మంచిదైనట్లు వేదములో వ్రాయబడియున్నది. కనుక దేవుని చేత సృష్టించబడిన ఈ ప్రపంచం దినదినాభివృద్ధి జెంది బహువిధంబుల ఫలభరితమై నశింపు ఎరుంగక ఉపద్రవాన్ని ఎరుంగక దైవదృష్టికి ఆహ్లాదకరంగా అలరారి విరాజిల్లింది. భూసృష్టికి దేవుడే తన క్రియాకర్మలనుబట్టి ఎంతో ఆనందించినట్లుగా వేదములో చదువగలము. మరియు భూమికి వెలుగిచ్చుటకును వేడినిచ్చుటకును ప్రాణులను వాటి నెదిగించుటకును వాటిని విస్తరింపజేయుటకు కూడా సృష్టికర్తయైన పరమాత్ముడు సూర్యచంద్రగ్రహాలు నక్షత్ర మండలాలను వాయుమండలమును మేఘ మండలములను సృష్టించి తద్వారా భూమికి సారము జీవము వగైరా సహకారములకు వాటి నేర్పరచినట్లు చదువగలము. అట్టి మర్మమును నేటి తరమువారమైన మనము కూడా అనుభవిస్తున్నాము. నాడున్నటువంటి భూమియే నేడు కూడా వున్నది. నాడు దేవుడేర్పరచిన సృష్టియే నేడు అనంత విశ్వంగా పిలువబడుచున్నది.
                కనుక భూమి నశించాలంటే భూమిని సృష్టించినవాడే నాశనము చేయాలి. వేరొక శక్తికది అసాధ్యము. భూసృష్టిని కల్గించాలన్నదాన్ని ఫలభరితం చేయాలన్న అది విస్తరించబడాలన్నా పరమాత్మ శక్తియే మూలమై యున్నట్లు మనము గ్రహించాలి. ఈ విధంగా తరగని స్థితిగల ఈ విశ్వానికి నాశనము కలుగజేయాలంటే నరునికి అసాధ్యము. సృష్టికర్తయైన దేవునికి సాధ్యము. అదియే ఈ శ్లోకంలోని నిజమైన పరమార్ధము. ఈ అనంత విశ్వానికి అభివ్యాపకమైయున్న ఆ శక్తి ఏదో యోహాను 1:3-5 కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రవేశించుచున్నదిగాని చీకటి దాని గ్రహింపకుండెను. కనుక నరుడు నాశనము చేయాల్సిందేగాని జీవాన్ని సృష్టించలేడు.
                పాఠకులారా ! ఈ శ్లోకంలో - ''దేనిచే ఈ విశ్వమంతా అభివ్యాప్తమై యున్నదో అది ఎన్నటికిని నశించునదిగాదంటాడు''. ఇందును గూర్చి బైబిలులోవున్న ఆది 1:1-2 ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగను, శూన్యముగాను వుండెను. చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను. దేవుని ఆత్మజలములపైన అల్లాడుచుండెను''. ఆ తర్వాత దేవుడు తాను చేసిన సమస్త క్రియలను చూడగా అవి అన్నియు మంచివైయుండెను. దేవుడు జలమత్స్యములను ఆశీర్వదించెను, నరులను ఆశీర్వదించెను - ఆది 1:22 మరియు 28 మీరు బహుగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరచుకొనుడి''. ఈ విధంగా ఆశీర్వదించిన పరమాత్మయొక్క ధ్యేయము నేటివరకును విస్తరించి బహుముఖములుగా వ్యాప్తిజెంది ప్రపంచంలో పట్టరానంత జనాభా విస్తరించుటకు దోహదమైంది. ఇట్టి జగత్తంతయు యోహాను 1:2 నేటి వరకును తరగని స్థితిలో వున్నది. ''శరీరమును చంపువానికి భయపడకుడిగాని ఆత్మను చంపువానికి భయపడుడన్న'' యేసు చెప్పిన మాట ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసికోవలసియున్నది. మత్తయి 10:28.
                18వ శ్లోకం :- ఇట్టిది అనిగాని యింతటిది అని గాని నిర్ణయింపరానిదియు, నాశనము లేనిదియు, నిత్యమైనదియునైన ఈ శరీరాంతర్యామి యగు జీవాత్మకు సంబంధించిన నీ యంత్యదశగల శరీరములు కావున నిక యుద్ధము చేయుము.
పరిశుద్ధ గ్రంథ వివరణ : ఈ సందర్భంలో రెండవ కొరింథీ 5:1 ఇట్టిది అని గాని యింతటిది అనిగాని నిర్ణయింపరానిది అనగా ఆత్మీయ జీవితము''. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిధిలమైపోయినను, చేతి పనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము''. కనుక ఆత్మకు కొలతలేదు, వైశాల్యములేదు, పొడవు వెడల్పులు లేవు, లోతులేదు, రూపము లేదు, నీడలేదు. ఆత్మకున్న రూపమంతయు శరీరము. శరీరమునకున్న నీడ తుచ్ఛము, స్థిరమైనదికాదు. అదేవిధంగా ఆత్మ నివసించుచున్న శరీరము కూడా తుచ్ఛమైనది అనగా స్థిరముగానిది. ఆత్మ నిత్యమైనదని అర్థము.
                కనుక జీవాత్మ శరీరంలో వున్నంతకాలము శరీరమునకు సన్మానముగాని లోకసంబంధితములైనవి గాని శరీరసంబంధములైనవిగాని ఆధిక్యతలు ఘనతలు గల్గుచున్నవి. ఉదా|| జీవాత్మయుతమైన స్థూల శరీర ధారియైన వ్యక్తి వస్తాదుగాను గొప్ప యోధునిగాను బలాఢ్యునిగాను ఎంచబడుచున్నాడు. అదేవిధంగా శారీర సంబంధమైయుండి గొప్ప జ్ఞానియైనవాడు కవిగాను, వేదాంతిగాను, గొప్ప సాంకేతిక పరిజ్ఞానము గలవానిగాను కవి చాతుర్యము గలవానిగాను పాటగాడైతే సంగీత విద్వాంసునిగాను సాంకేతిక విజ్ఞానముగల శాస్త్రజ్ఞుడుగాను లోకములో ఎంచబడుచున్నాడు.
                ప్రియపాఠకులారా ! ఇవన్నియు కూడా శరీరంలో జీవాత్మ నివసించుచున్నందువల్లనే ఈ ఆధిక్యతలు కల్గుచున్నవను పరమసత్యాన్ని మనము మరువకూడదు. శరీరమన్నది ఆత్మకు నివాసమైయున్నదన్న సత్యాన్ని కూడా మనము గ్రహించాలి. ఇందునుబట్టి శారీరంలో నివసిస్తూ శారీరయుతంగా భూమి మీద సంచరిస్తున్న జీవాత్మయుతుడైన నరునియొక్క జన్మ కేవలము భూమి మీద యాత్రిక జీవితము చేయుచున్నదను సత్యాన్ని హెబ్రీ 11:13 వీరందరు ఆ వాగ్దానముల ఫలము ననుభవింపక పోయినను, దూరము నుండి చూచి వందనము జేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై యున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతిపొందిరి. ఇందునుబట్టి మనము పరదేశులమును అనగా పరలోకములో నివసించు వారమును, యాత్రికులము అనగా యాత్రసంబంధంగా ఈ లోకములోనికి వచ్చినారముగా గ్రహించవలసియున్నది. కనుక ఆత్మ నిత్యము శరీరము అనిత్యమని దీని భావము. ఆత్మలేనిదే సృష్టిగాని సృష్టములుగాని విస్తరింపు మనుగడ అభివృద్ధి జననము చలనము మరణము లేదు.
                19వ శ్లోకం :- అట్టి ఈ జీవాత్మనెవ్వడు చంపగలవానినిగా దెలిసికొనునో, ఎవ్వడు చంపబడువానినిగా దలంచునో ఆ యిద్దరును నిజమెరుంగని వారే. ఆ జీవాత్మ ఒకనిని జంపదు, ఒకనిచే జంపబడదు.
                పరమగీత పరమార్థము :- ప్రియపాఠకులారా ! జీవాత్మనెవ్వడు చంపగలవానినిగా, చంపబడువానినిగా తెలిసికొనునో అట్టివాడు చచ్చినవాని క్రింద లెక్కయే అనగా గృడ్డివాడే. ఉదా|| ఒక వ్యక్తి మరియొక వ్యక్తిని కక్షతో హత్యజేసినాడనుకొందము - హత్యచేయబడినది అనగా నరుకబడేది శరీరమేగాని శరీరంలో వున్న జీవాత్మగాదు. శరీరం ఖండించబడినప్పుడు అనగా శరీరమునకున్నటువంటి ఆత్మయొక్క ఆయువుపట్టు శరీరము కోల్పోయినప్పుడు యాంత్రికంగా జీవాత్మ వానిని వదిలివేస్తుంది గాని అది చావదు. అయితే ఎదుటి వ్యక్తి తాను చంపిన నరునిగూర్చి అతిశయపడును కాని తాను ఖండించింది దేహమేననియు జీవాత్మ అన్నదానికి మరణం లేదని ఆ వ్యక్తి గ్రహించడు. అదే విధంగా చంపబడినటువంటి ఆ యొక్క శరీర సంబంధులు కూడా ఖండించబడిన శరీరమును గూర్చి ఆ వ్యక్తి చనిపోయాడని అతనికి చరిత్రలేదని అనుకొనుట కూడా పొరబాటే అనగా ఈ ద్వంద జ్ఞానము అజ్ఞానమైనదని మనము గ్రహించాలి.
                మరియు ఆ జీవాత్మ ఒకనిని చంపదు. ఒకనిచేత చంపబడదు'', అంటాడు, నిజమే ! ఆత్మ ఆత్మను చంపదు గదా ! శరీరాలు అయితే ఒకదానినొకటి చంపుకొంటాయి. ఆత్మచేత శరీరమును శరీరేచ్ఛలను చంపుకోవలసిన వారమైయున్నాముగాని శారీరక్రియలచేత ఆత్మను చంపచూచుకొనే వానికి ఎఫెసీ 2 : 1లో సవివరంగా వ్రాయబడియున్నది. ''మీ అపరాధముల చేతను పాపములచేతను మీరు చచ్చినవారైయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను''. అనుటలో ఆత్మయొక్క బలహీనత ఆత్మీయ మూలమైన అస్వస్థత చేత ఆత్మీయ రోగములచేత మృతమైనటువంటి నరజీవితమునకు ఆత్మ ద్వారానే స్వస్థత అవసరమైయున్నట్లు ఈ సందర్భంలో మనము గ్రహించవలసియున్నది. ఎట్లనగా ఆత్మీయ అనారోగ్యంవల్ల చచ్చిన ఆత్మగా గుర్తింపబడినపుడు అందుకు కావలసినటువంటి అనగా పునరుజ్జీవము అనగా పునర్జన్మ ఆత్మ ద్వారానే జరుగవలసియున్నదని పై వేదభాగము ద్వారా వివరించబడియున్నది. ''మీ అపరాధములచేత పాపములచేత చచ్చిన వారైయుండగా'', అనుటలో ఇది ఆత్మీయ మరణమును సూచించుచున్నది. ఇట్టి ఆత్మీయ మరణమునకు పునరుజ్జీవము కలగాలంటే పరమాత్మ యొక్క ఆత్మీయ వైద్యము అవసరమైయున్నది. ఇట్టి ఆత్మీయ వైద్యము ద్వారానే జీవాత్మకు ఆత్మీయ స్వస్థతగాని ఆత్మీయ మరణము నుండి పునరుత్థానముగాని కలుగగలదని ఇందునుబట్టి మనము గ్రహించవలసియున్నది.
                20వ శ్లోకము :- అతడొకప్పుడు జన్మించువాడును గాడు. మరియొకప్పుడు మరణించువాడును గాడు. ఒకప్పుడేదేని యొక రూపమున నుండి మరియొకప్పుడింకొక రూపమునకు మారెడువాడును కాడు. కావున నాతడజుడు, నిత్యుడు శాశ్వతుడు పురాతనుడు. శరీరము చంపబడిన మాత్రమున అతడు చంపబడడు.
                బైబిలులోని గీతారహస్యము :- ప్రియపాఠకులారా ! దీనికి బైబిలులో వున్నటువంటి సరియైన నిర్వచనమేమిటో వేదరీత్యా మనము తెలిసికోగలము. ఇందులో మొట్టమొదటగా అతడొకప్పుడును జన్మించువాడునుకాడు'' అంటాడు. ఇది సృష్టికర్తయైన యెహోవా దేవునికి అన్వయించుచున్నది. ఎట్లంటే - ఆది 1:1-2లో చీకటి అగాధజలములపైన దేవుని ఆత్మ అల్లలాడినట్లుగ మనము చదువగలము. ఇందునుబట్టి పరమాత్మ సృష్టికి ముందు వున్నాడని అటుతర్వాత వెలుగు కమ్మనగా వెలుగాయెను''. అన్నట్లుగా ఈయన ద్వారా చీకటి అంధకారము పటాపంచలై కటిక చీకటియైన లోకమునకు వెలుగేర్పడినట్లు చదువగలము. ఆది 1:లో సమస్తమును సృష్టించాడు, పుట్టించాడు కాని ఈయన పుట్టలేదు. సృష్టిలోని ప్రతి జీవరాశియు ఈయనచే జనించి చలించుచున్నవి, ఉనికి గల్గియున్నవి. ఆయనను మహిమ పరచుచున్నవి.
                ఇక రెండవదిగ మరియొకప్పుడును మరణించువాడును కాదు'' అంటున్నాడు. ఈ సందర్భంలో తానేవిధంగా సజీవుడో తానేవిధంగా నిత్యుడో తానేవిధంగా సత్యుడో అలాగే తన హస్తముతో సృష్టించబడిన నరుని కూడా తన ఆత్మలో భాగస్వామిగా జేసి మరణమన్నది వుండకూడదని తనవలెనే తన ప్రతి సృష్టియైన నరుడు కూడా నిత్యజీవము గలవానిగా వుండాలని ఆశించి - ఏదేనను వనరూపంలో తన సన్నిధి నేర్పరచి అందులో జీవాత్ముడైన నరుని వుంచాడు. మరొక విశేషమేమిటంటే నరుడు ఒంటరివాడుగా వుండకుండ వానికొక జంటను కూడా నియమించాడు. తనవలె నరుడు కూడా మరణాన్ని చవిచూడ కూడదని తోట మధ్యలో జీవవృక్షము నాటించి ఆ జీవవృక్ష ఫలమును నరుడు తన ఆత్మ జ్ఞానంతోను కనుగొనగలడేమోయని నిరీక్షించాడు. అయితే ''పంది బురద మెచ్చు - పన్నీరు మెచ్చునా ?'' అని దైవసంబంధియైన నరుడు మట్టి సంబంధి కాబట్టి మట్టిలో మొలిచిన భూసంబంధమైన జనన మరణ వివేకయుతమైన వృక్ష ఫలాదులను భుజించి దైవత్వంతో వున్న సమానత్వమును, ఏదేను అనువనములో వున్న స్వాతంత్య్రమును నిత్యజీవమునకు బదులు మరణాన్ని, దైవత్వంతో వున్న సఖ్యతకు బదులుగా విరోధాన్ని సంపాయించుకున్నాడు. ఇక్కడ నుండి నరజీవితంలో జననము మరణము అను రెండు క్రియలు చోటుజేసుకున్నవి.
                అయితే పరమాత్ముడు నరునిపై వున్న ప్రేమ, మమకారాలనుబట్టి నరునికి తానిచ్చిన శాపమును బట్టి ఈ సందర్భంలో యోహాను 3:16 దేవుడు లోకము నెంతగానో ప్రేమించెను''. ఆయన ప్రేమను చంపుకోలేక సృష్టికి తండ్రిగా వున్నవాడు కుమారత్వమును దాల్చవలసి వచ్చింది. కుమారత్వమును దాల్చుటకు నరునికోసం నరుని సమక్షంలో ప్రత్యక్షంగా తన్నుతాను కనపరచుకున్నాడు, నరులతో తిరిగాడు, నరులతో నిద్రించాడు. నరుల ఎదుట అనేక మహత్కార్యములు చేశాడు. తనదైవత్వాన్ని గూర్చి నరులకు ప్రత్యక్షంగా చూపించాడు. అయినను లోకముయొక్క బంధకాలలో వున్న నరులు దాని గ్రహించలేకపోయారు. ఆనాటి లోకమును ఆవరించియున్న కటిక చీకటి నిత్యనాశనానికి దారిగా వున్న పాప సామ్రాజ్యము నుండి నిత్యజీవమైన మోక్ష సామ్రాజ్యమునకు నరజీవుని చేర్చుటకు నరునియొక్క దోషాపరాధములను తనపై వేసికొని, మరణించినవాడై యుండియు లోక నరకోటి కొరకు మారణహోమము జరిగించిన వానిగా కనబడి పునరుత్థానుడై సజీవుడై నరకోటి నావరించియున్న అజ్ఞానమును తొలగించుటకు నేడు సజీవ వాక్యంగా ప్రతియొక్క హృదయమును వెల్గించువాడైయున్నాడు.
                ప్రియపాఠకులారా ! ఇంకొక విషయమేమిటంటే ఒకప్పుడు ఏదోయొక రూపము నుండి మరియొకప్పుడు ఏదోయొక రూపమునకు మారెడివాడు కాదంటాడు. ఇందుకు సరియైన నిర్వచనము యోహాను 1:1 ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై యుండెను. అదే 1:14 లో ఆ వాక్యము శరీరధారియై కృపా సత్యసంపూర్ణుడుగా మనమధ్య వసియించెను'' అని వ్రాయబడియున్నది. కనుక ఈ శ్లోకంలో పైన వివరించబడిన రూపాంతరమును పొందు దైవత్వమును గూర్చిన వాదన సరియైనది కాదు. దేవుని యొక్క రూపము-''వాక్కు-శబ్దము, అట్లు వాక్కు - శబ్దమైయున్న దేవుడు నరజీవుల కోసం శారీరధారి అయ్యాడు. ఇది బైబిలు పరమార్థము.
                ఇక అజుడు అంటాడు : నిజమే ! ఏసు ప్రభువు ఈ లోకంలో జన్మించినను ఆయన నరునికి జన్మించిన వాడుకాదు. పరమాత్మ పుత్రుడైయుండియు నారీ గర్భంబున నవమాసములు ఎదిగి శిశువుగా ఈ లోకంలో జన్మించాడు. కాని ఇది నరునియొక్క ప్రమేయంతో జరిగిన క్రియకాదు. కనుక అతడు అజుడే. ఇంకను ''నిత్యుడు'' అనగా నిత్యము వుండువాడు. ఈ సందర్భంలో ప్రకటన 1:18లో వలె ఏసుప్రభువు నిత్యుడు. ''నేను మొదటివాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతినిగాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను''. ఇంకనూ రెండవ కొరింథీ 5:1 ఈయన నిత్యుడు కాబట్టి ఈయన నిత్యనివాసము పరలోకంలో వున్నది. కనుక ఈయన శాశ్వతుడు, ఆదియైయున్నవాడు. అనగా సృష్టికి నరునికి పూర్వమే వున్నవాడు. సనాతనుడు :- ఆది యందు వాక్యముండెను. ఆయన దేవుడై యుండెను. సృష్టి  యావత్తునూ ఆయన మూలంగా కలిగెను. కల్గియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగెను కనుక ఈయన పురాతనుడు.
                ''శరీరం చంపబడినంతమాత్రాన అతడు చంపబడడు''. ఇది దేవుని స్వరూపమైయున్న క్రీస్తుపట్ల నెరవేరింది. ఏసుక్రీస్తు రూపమున ఈ లోకంలో క్రియ జరిగించిన దేవుని నరులు ఏసుప్రభువును నరమాత్రునిగ ఎంచి ఆయనను సిలువలో చంపి పాతిపెట్టినారు. కాని ఆయన సజీవుడై మహిమాన్విత శరీరంతో తన్నుతాను ప్రత్యక్షపరచుకొని లోకరక్షకునిగాను పరలోక సామ్రాజ్యానికి ప్రభువుగానూ, నరుడు పరమాత్మ సన్నిధికి చేరాలంటే యోహాను 14:6లో వలె మార్గముగాను సత్యదేవుని కుమారునిగాను సకల నరకోటికి ప్రాణప్రియునిగాను, ఆత్మల రక్షకునిగాను ఏర్పరచబడియున్నట్లు మరియు నిర్ధారించబడియున్నట్లు ప్రతి జీవాత్ముడైన నరుడు ఈ నగ్న సత్యాన్ని ఎరిగి, దైవత్వమైన దేవుని ప్రతిరూపమైన క్రీస్తు నందు విశ్వాసముంచి నరుడు శారీరకంగా జీవించినంతకాలము ఏసునామము ఏసుప్రేమ ఏసు ఆత్మ ఏసు సిద్ధాంతము ఏసు మార్గము ఏసుయొక్క వెలుగులో జీవించి, ఇహలోక జన్మను సార్ధకం చేసికోవాలని ఈ శ్లోకంలోని క్రైస్తవ వేద పరమార్ధము యొక్క నిగూఢ సత్యమైయున్నది.
                21వ శ్లోకం :- ఏ పురుషుడు ఈ జీవాత్ముని వినాశరహితునిగను, నిత్యునిగను, అజునిగను అవ్యయునిగను నెరిగియుండునో ఆ పురుషుడెట్టులొకనిం జంపించును ? ఎట్టు లొకనిం జంపును ?
                ప్రియపాఠకులారా ! ఈ సందర్భంలో బైబిలు ఇచ్చు సమాధానమును మనము గ్రహించగలము. రెండవ కొరింథీ 5:1లో శరీరమన్నది గుడారముగాను మనలో వున్న ఆత్మ యాత్రికునిగాను, గుడారంలో వున్న అతిథిగాను పోల్చబడియున్నది. నిర్ణీత కాలమున అనగా ఆత్మకును శరీరమునకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు చెల్లినపుడు పరమాత్ముడనుగ్రహించిన ఆయుర్దాయము చెల్లినపుడు - శరీరము నుండి ఆత్మ వేరగుచున్నది. దీనినే మరణమంటారు. ఇట్టి నరజీవిని కీర్తిశేషుడు లేక కీర్తిశేషురాలు అని లోకములో ఎంచబడుచున్నారు. ఇందునుబట్టి చూడగా శరీరంలో ఆత్మ నివసించినంత కాలమే శరీరమునకు మనుగడ వికాసము సన్మానము ఆధిక్యత ఘనత లోకముతో పొత్తు వున్నట్లు మనము గ్రహించవలసియున్నది.
                ఆత్మను విడిచిన శరీరము జీవమును కోల్పోవునదియు చలనములేనిదియు నిరుపయోగమునై జీవికి ప్రతిగా నిర్జీవిగాను శవముగా పిలుపబడుచున్నది. ప్రియపాఠకులారా! ఇందులో ఒక గొప్ప నిగూఢ సత్యమును మనము గ్రహించవలసియున్నది. అది ఏమిటంటే దేహంలో ఆత్మ ఉన్నన్నినాళ్ళే దేహానికి ఘనత ప్రావీణ్యత లేక లోకములో ఒక చరిత్ర కూడా ఏర్పడుచున్నది. ఇందుకు ఉదా|| వాక్యమైయున్న దేవుడు యోహాను 1:14లో కృపా సత్య సంపూర్ణుడుగా శారీరధారిగా జీవించినపుడు నూతన నిబంధన చరిత్రకు రూపమేర్పడినది. అదేవిధంగా ఏసుప్రభువు ఏర్పరచుకున్న 12మంది అపోస్తలులు శారీర రీత్యావారు జేసిన దైవికసేవ తత్సంబంధమైన దైవికరచనలు నూతన నిబంధన గ్రంథమునకు రూపమేర్పడుచున్నది. అనగా నూతన నిబంధన అనుగ్రంథము రూపించబడింది.
                ఈ విధంగా ఆత్మపూరితమైన దేహము జరిగించు క్రియలనుబట్టి రెండవ కొరింథీ 5:10లో జరుగు తీర్పును గూర్చి వివరించబడియున్నది. ''తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును''. కనుక శరీరము క్షయము, ఆత్మ అక్షయము, శరీరము మృతము, ఆత్మ నిత్యజీవి. శరీరమునకు జన్మ వున్నది, ఆత్మకు వున్న జన్మ క్రీస్తులో జన్మించుట.
                అవ్యయుడు అనగా యోహాను 6:51 ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే''. 54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవముగలవాడు. అంత్యదినమున నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునైయున్నది. 55. అనగా అక్షయమైనదని అర్థము. ఇట్లు జీవించినవాడు ఎఫెసీ 2:1లో వలె అపరాధముల చేతను పాపములచేతను ఆత్మీయంగా చచ్చినటువంటి నరజీవితాలను వారి అపరాధ పాపముల నుండి వారిని చంపి మరల బ్రతికించుటకు సమర్ధుడు. మరియు ఇట్టివాడు తన వాక్శక్తితో అనగా శాపార్థనాలతో ఒకనిని చంపించుటకు కూడా శక్తిమంతుడైయున్నాడు. ఇందుకు ఉదా|| ఏలియా ఆహాబును శపించుట, ఏసుప్రభువు యెరూషలేమును గూర్చి అంగలార్చుట, వగైరాలను మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసికోగలము.
                22వ శ్లోకం :- మనుష్యుడు చినిగిపోయిన ప్రాత వస్త్రములను విడిచి తదితరమైన క్రొత్త వస్త్రములనెట్లు ధరించుచున్నాడో అట్లే ప్రాత పడిన శరీరమును విడిచిపెట్టి జీవాత్ముడును క్రొత్తదైన శరీరమును గ్రహించుచున్నాడు.
                బైబిలిచ్చు భగవద్గీతలోని సమాధానము :- ప్రభువునందు ప్రియమైన వారలారా ! ఇచట మహిమ వస్త్రాలనగా నూతన దేహము పొందుట. ఈ సందర్భంలో మొదటి కొరింథీ 15:50-53 రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. మనమందరము నిద్రించముగాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూరమ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. అదే విధంగా మొదటి కొరింథీ 15:42-44 శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి, ఆత్మ సంబంధ శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా వున్నది.
                ప్రియపాఠకులారా ! పై ఉదహరించిన వేదభాగము రీత్యా ప్రకృతి సంబంధమైన దేహము తనపై పాతగిలి చినిగిపోయిన వస్త్రములను విడిచిపెట్టి క్రొత్త వస్త్రములనెట్లు ధరించుకొనునో అట్లాగే శరీరంలో వున్న ఆంతర్య పురుషుడైన ఆత్మ రెండవ కొరింథీ 4:16లోవలె - ''మా బాహ్యపురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు''. బాహ్యపురుషుడైన శరీరం కృశించుచున్నను అనగా చిక్కిపోయినను లేక చితికిపోయినను ఆంతర్య పురుషుడైన ఆత్మ నూతన పరచబడినవాడై మహిమ వస్త్రాలతో మహిమాన్వితమైన ప్రభువు సన్నిధిలో ఏసు నామములో నిలబడుదినమొకటున్నదని మనము గ్రహించవలసియున్నది. ఎందుకంటే ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము. ఇందునుగూర్చి రెండవ కొరింథీ 5:2 మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము'' అని అంటాడు. మరియు 3వ వచనంలో మన ఆత్మకు మన శరీరము గుడారంగా వున్నదని వివరించబడియున్నది.
                కనుక ప్రియపాఠకులారా ! రెండవ కొరింథి 5:8లో వలె ధైర్యముగల్గి ఈ దేహమును  విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు మనము ఇష్టపడుచున్నాము. ఇందునుబట్టి తొమ్మిదవ వచనంలోవలె దేహమందున్నను దేహము విడిచినను ప్రభువు కిష్టులమై వుండవలెనని వివరించబడియున్నది. ఎందుకనగా రెండవ కొరింథీ 5:10లో వలె మనము దేహంతో జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము వద్ద ప్రత్యక్షము కావలసియున్నది. కనుక ఇట్లు ప్రత్యక్షమైనపుడు ఏసుక్రీస్తు నందుండి మృతులైన వారు మహిమవస్త్రాలు ధరించుకొని ఆయన ఎదుట నిలబడుదురు. అనగా క్రీస్తు న్యాయపీఠము ఎదుట గూర్చుండి తీర్పుజేయు దినమొకటున్నదని ఆ తీర్పులో ఏసుక్రీస్తును తమ ప్రభువుగా అంగీకరించిన విశ్వాసులు రెండవ కొరింథీ 5:17లో వలె నూతనసృష్టిగాను నూతన జీవితులుగాను తీర్చబడునట్లు వివరించబడియున్నది. ఇదియే నరజీవితమునకు నూతనత్వము. క్రొత్తదైన నూతన శరీరజీవితము, నూతన వస్త్ర ధారణతో కూడిన ఆత్మీయ జీవితము.
                23వ శ్లోకం :- శస్త్రములాతని నరుకజాలవు. అగ్ని ఆతని కాల్పజాలదు.నీళ్ళు ఆతనిని తడుపజాలదు. వాయువు ఆతనిని ఆర్పజాలదు''.
                దీని పరమార్థము :- ప్రియపాఠకులారా ! పై శ్లోకభావము నిజమే ! దైవత్వాన్ని హృదయంలో నింపుకొన్న విశ్వాసికి ఆయుధ భయములేదని బైబిలులోని చక్కని సందర్భాలు మనము చదువగలము. దావీదు పదివేలు సౌలు వెయ్యి మందిని అని ప్రజలు దావీదును పొగిడినపుడు సౌలు పగబట్టి తన యొక్క రాచరికానికి ఔన్నత్యానికి మూలకారకుడైన భగవంతునియొక్క చిత్తాన్ని విస్మరించి దావీదుపైకి ధ్వజమెత్తి ఈటెతో పొడవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. ఈటెను విసిరాడు కూడా, కాని సౌలు విసిరిన ఈటె దైవవిశ్వాసియైన దావీదును చంపలేకపోయింది. అదేవిధంగా యెజిబేలు తన భర్తయైన ఆహాబును ప్రోత్సహించి ఏలియాను నరకాలని ప్రయత్నించింది. ఏ ఆయుధంచేత ఏలియాను చంపాలని సతీసమేతంగా ఆహాబు ప్రయత్నించాడో ఆ ఆయుధంతోనే అతను చంపబడి అతని రక్తము కుక్కలు చవిచూచే హీనదశకు దైవశాపానికి గురియైనట్లు వేదంలో చదువగలము. ఎస్తేరు గ్రంథంలో దైవవిశ్వాసియు దైవజనాంగమైన ఇశ్రాయేలీయులలో ఒకడైన మొర్దెకైయను భక్తుని ఉరితీయుటకు దురాత్ముడైన హామాను మొర్దెకైని చంపాలని నాటించిన ఉరికొయ్య మొర్దెకైకు బదులుగా హామానునే చంపుటకు ఆయుధమైంది.
                అట్లే అగ్ని అతని కాల్పజాలదంటాడు. ప్రభువునందు ప్రియపాఠకులారా ! దానియేలు గ్రంథంలో మెషగు - షద్రగు - అబిద్నగోలను వారలను నెబుకద్నెజరు అగ్నిగుండపు శిక్షకు గురిజేయగా భీకరమైన అగ్నిజ్వాలలుగా ఉన్న ఆ గుండంలో పై ముగ్గిరిని పడవేయగా వారు ఆ అగ్నిలో వెన్నెలలో విహరించినట్లును మరియు ఆశ్చర్యకరరీతిలో వారితో కూడా నాలుగవ వ్యక్తి కూడా ఆ అగ్నిహోత్రంలో సంచరించినట్లుగా చదువగలము. ఇట్టి క్రియద్వారా రాజుయొక్క శారీర స్వభావము మాని హృదయ పరివర్తనజెంది తాను జేసినటువంటి నీచాతి నీచమైన తన సంబంధితమైన విగ్రాహారాధనకు నొచ్చుకున్నవాడై పరాభవము పొంది మంటలో వేయబడిన ముగ్గురుని బయటకు రప్పించి వారియెడల తాను జరిగించిన అమానుష క్రియకు క్షమాభిక్ష వేడుకొని మెషగు-షడ్రగు-అబిద్నగోలను వారు ఆరాధించే దేవుడైన యెహోవాయే జీవముగల దేవుడనియు ఆయనే నిత్యుడనియు ఆయనే సత్యుడనియు, శస్త్రములు అగ్నికి అతీతుడనియు తాను ప్రకటించిన విధానాన్ని బైబిలులో చదువగలము. దానియేలు 3:19-30.
                ఇంక మూడవదిగ నీళ్ళు ఆతనిని తడుపజాలవంటాడు. ప్రియపాఠకులారా ! ఆదికాండ 7:లో దేవుడు జలప్రళయంద్వారా లోకమును లోకసృష్టిని సర్వనాశనం చేయునపుడు తన విశ్వాసంలో నిలకడగా నిలిచిన నోవహు కుటుంబాన్ని ఆ ప్రచండ జలముల మీద వానకు తడువకుండ చలికి వణకకుండ క్షుద్బాధ కలమటించకుండ ఐహిక విచారములంటకుండ ఓడ గృహములో భద్రముజేసి నీటిమీద నడిపించి నోవహు కుటుంబాన్ని నీటిలో తడువకుండ కాపాడినాడు. ఏ వేదములోగాని ఇంతకంటె చక్కటి నిదర్శనం ఏదైన వున్నదా ?
                ఇక వాయువు ఆతనిని ఆర్పజాలదంటాడు''. ప్రియపాఠకులారా ! సొదమ గొమర్రాలమీద దేవుడు కురిపించిన అగ్నిగంధముల వర్షములను వాయువుగాని నీరుగాని ఆర్పజాలకపోయినవి. అదేవిధంగా మార్కు 4:37-39 గాలిని గద్ధించి సముద్రమును నిమ్మళముజేసెను''. అనగా ఇందునుబట్టి ప్రభువునామమున దైవవిశ్వాసియైన నరజీవియొక్క ఆత్మీయశక్తి దైవత్వంలో సిద్ధిని పొంది జీవిస్తే, పంచభూతాలు అతనికి లోబడునని ప్రకృతివైపరీత్యము అతనిని అంటజాలదని అతడు ప్రకృతికి అతీతుడని దైవత్వానికి సన్నిహితుడని ఇందునుబట్టి మనము గ్రహించాలి.
                ఏలియా సుడిగాలిలో ఆరోహణుడై దేహంతోకూడా అదృశ్యమైనట్లుగ వేదంలో చదువగలము. కనుక జీవాత్ముడైన నరజీవుడు కేవలము ఇహలోకమునకును దీనియొక్క తుచ్ఛమైన మాయలకు దాసుడుగాక తనలోవున్న జీవాత్మసంబంధమైన అనగా తనకు జీవాత్మననుగ్రహించిన పరమాత్మునియొక్క సిద్ధాంతములకు విధేయించి దైవిక సావాసము అనగా దైవదాసులతో సావాసము వేదపారాయణము భగవద్‌ ప్రార్థనాయుత క్రియలద్వారా దైవానుగ్రహమునకు యోగ్యునిగా ఇహపరలోకములలో స్థానమును పొందగలడు. ఇదియే ఇందులోని పరమార్ధము.
                24వ శ్లోకం :- ఆతడు ఛేదింప సాధ్యపడువాడుగాడు. దహింప సాధ్యపడువాడునుగాడు. తడుపదగువాడునుగాడు. ఆర్పదగువాడునుగాడు. మరియేమన్న, ఆతడు నిత్యుడు, ఎల్లయెడలను నుండువాడు, సుస్థిరుడు, నిశ్చలుడు, సనాతనుడు.
                ఆత్మ అను వాడు విగ్రహము కాదు. పై గుణలక్షణములన్నియు విగ్రహానికున్నాయిగాని సజీవమైన ఆత్మకులేవు.
                25వ శ్లోకం :- అతడింద్రియములకు కానరాడు. ఊహింపను సైతము అలవియైనవాడు కాడు. మార్పుజెందుటకు సాధ్యపడడు. కావున నతని ఇట్టివానినిగా దెలిసికొన్న నీవు వానింగూర్చి ఇక శోకింపవలదు.
                బైబిలు వివరించు భగవద్గీత పరమార్థము :- ప్రభువునందు ప్రియపాఠకులారా ! ఇందులో మొదటి వచనాన్ని గూర్చి ధ్యానిస్తాము. విరిగి నలిగిన హృదయులకు పరమాత్మ ఆసన్నుడని బైబిలు ఘోషిస్తున్నది. ఎవడైతే నిండు హృదయ ధ్యానం చేస్తాడో పూర్తిగ దైవత్వమును గూర్చి తెలిసికొనుటకు ప్రయత్నిస్తాడో తప్పక అట్టివానికి భగవద్దర్శన మున్నదనుటకు కొర్నేలి జీవితము ఉదాహరణగా అపో 10:లో వున్నది.
                ఇక రెండవదిగ ఊహించుటకు సైతము అలవియైనవాడు కాదు అంటాడు. నిజమే ! నరుని యొక్క ఊహకు పరమాత్ముడు అందకపోబట్టియే పరమాత్ముని రూపము ఫలాని అని ఎరుంగక నరుడు అజ్ఞానియై సృష్టికర్తను సృష్టమునకు పోల్చి అనగా ఆత్మయై యున్నటువంటి పరమాత్ముని దృశ్యములైన రాళ్ళకును వృక్షములకును లోహములకును జంతు రూపాలకును పోల్చి మానవుడు తన చిత్తము చొప్పున తన స్వజ్ఞానంతో విగ్రహాలను జేసి వాటిని దైవత్వమునకు మార్చి వాటికి మందిరాలు గుళ్ళు గోపురాలు కట్టుటలో నరుని అజ్ఞానము బైల్పడుచున్నది. నరుని ఊహకు పరమాత్ముడు సన్నిహితుడుకాడు. నరుని చిత్త ప్రకారం పరమాత్ముడు క్రియ జరిగించువాడు కాడు. పరమాత్ముని చిత్తానుసారం నరుడు జీవించాల్సిందేగాని సృష్టికర్తను తన క్రమమందుంచుకొనుటకు నరుడు అధికుడుకాడు. ఇందునుగూర్చి ఎఫెసీ 1:4-12 మరియు ఆయన జంతురూపుడు కాడు, పక్షిరూపుడు కాడు. విగ్రహరూపుడు కాడు. ఆయన ఏ రూపంలో వున్నాడో అదే రూపంగా నరులను చేసినట్లుగా నరసృష్టి నిర్మాణంలో ఆది 1:26లో మన స్వరూపం మన పోలిక చొప్పున నరులను జేయుదమని దేవుడు అనుకొనుటలో నరుడు దైవ రూపమును దేవుని పోలికలో సృష్టించబడియున్నట్లు మనము గ్రహించాలి. అంతియేగాని నరుని చిత్తానుసారంగా దేవుడు సృష్టించబడడని మనమెరుంగవలెను. మరియు ఆయన తన చిత్తానుసారం మార్పుజెందువాడేగాని నరుని చిత్తానుసారం మార్పుజెందువాడుకాదు. తన చిత్తానుసారం అనుటలో దేవుడు గాలి రూపంలోను అగ్నిరూపములోను నీటి రూపములోను క్రియ జరిగించినట్లుగా యోబు గ్రంథంలోను సొదమగొమర్రా పట్టణాల వినాశములోను మనము చదువగలము.
                ఇందునుగూర్చి ఏసుప్రభువు ఒకడు ఆత్మమూలంగాను, నీటిమూలంగాను జన్మించాలంటాడు. ఇందును గూర్చి యోహాను - ''నా వెనుక వచ్చువాడు నాకంటె శక్తిమంతుడు. అతడు ఆత్మతోను అగ్నితోను బాప్తిస్మమిచ్చు''నంటాడు. ఇందునుబట్టి పంచభూతముల ప్రభావము పరమాత్మకున్నదని తెలియుచున్నది. కనుక ఇట్టి శక్తి సంపన్నుడైన ఆత్మను గూర్చి తెలిసికొనుటకు ప్రయత్నించువాడును మరియు విశేషంగా తెలిసినవాడు దైవవిశ్వాసి చింతించుటగాని శోకించుటగాని భీతిచెందుట అధైర్యపడుటగాని తగదని ఈ శ్లోకభావము.
                ఇట్లు ఆత్మపూర్ణులై ఆత్మ దేవుని యొక్క శక్తి సంపన్నులై లోకమునకు వెరువని వారు బైబిలులో మోషే ఏలియా ఎలీషా దావీదు సొలొమోను దానియేలు మెషగు షద్రగు అబిద్నగోలు :- నూతన నిబంధనలో యేసు ఏర్పరచుకున్న అపోస్తలులు క్రీస్తు సాక్షిగా మరణించిన హతసాక్షులు స్తెఫను. పౌలు వగైరాలు ఋజువులై యున్నారు.
                26వ శ్లోకం :- ఒకవేళ వాని నెల్లప్పుడు పుట్టుచుండిన వానిగను, మరి ఎల్లప్పుడు చచ్చుచుండువానినిగను తలంతువేనియు వానిం గూర్చి నీవిట్లు శోకింపవలదు, ఏలయనగా -
                27వ శ్లోకం :- పుట్టినవానికి చావు తప్పదు. చచ్చినవానికి పుట్టుకయు తప్పదు. కావున తప్పింప శక్యముగాని ఈ విషయమునందు నీవెంత మాత్రము శోకింపతగదు.
                ప్రియపాఠకులారా ! ఇందులోని యదార్థతను బైబిలురీత్యా తెలిసికొనగలము. ఈ సందర్భంలో సృష్టి ముందా ? సృష్టికర్త ముందా ? శరీరం ముందా ? ఆత్మ ముందా ? అన్నదానిని గూర్చి తెలిసికొనవలసియున్నది. ఈ సందర్భంలో ఆది 1:1లో ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను వుండెను. చీకటి అగాధజలముపైన కమ్మియుండెను. వెలుగు అన్నది ఎరుగని స్థితిలో వుండి గాఢాంధకారమైన చీకటిలో అగాధజలములతో సృష్టినామ రూపాలు లేకుండ వుండినట్లు ఈ వేదభాగములలో చదువగలము. ఈ విధంగా నిరాకారంగా వున్న సృష్టికి ఆకారము కల్పించినవాడు పరమాత్మయని మరి రెండవ వచనంలో దేవుని ఆత్మ చీకటి అగాధజలముల మీద సంచరించుచున్నట్లు చదువగలము.
                ఇందునుబట్టి చూడగా సృష్టికంటె ముందు ఆత్మ వున్నట్లును ఆయన జీవిగా వుండి చీకటి అగాధ జలములమీద చలించినట్లును చదువగలము. కనుక సృష్టి మృతము సృష్టికర్తయైన పరమాత్ముడు సజీవుడు నిత్యుడు స్వయంభవుడు సర్వాంతర్యామి సర్వమునకు ఆది సంభూతుడని ఇందుమూలంగా మనము గ్రహించవలసియున్నది. సృష్టియైయున్న ఈ భూగోళమునకు జీవమిచ్చినవాడు కూడా పరమాత్ముడే. ఆయన వాక్శక్తి సృష్టియావత్తుకును జీవమిచ్చియున్నది. ఆయన వాక్శక్తితోనే సకలమును నిర్మాణమైయున్నది. ఆయన అంతట వ్యాపించి ఎఫెసీ 4:6 అందరిలో వున్నాడు.
                ఇట్లు సృష్టి యావత్తుకును జీవమిచ్చిన పరమాత్ముడు సృష్టిలోని నరజీవునిలో తన ఆత్మను ప్రతిష్ఠించాలని సంకల్పించి  తన స్వరూపము తన పోలికలో నరుని నిర్మించి వానిలో తన జీవవాయువు ఊదినట్లు వేదములో చదువగలము. ఇట్లు ఊదబడిన జీవాత్మ నర శరీరంలో క్రియ జరిగిస్తూ పరమాత్మ ఆజ్ఞానుసారం కాలనిర్ణయానుసారం అనేక శరీరములను పుట్టించుటకు ఈ జీవాత్ముడు కారకుడుగాను మరియు అలనాడు ఆదామునకు యెహోవా దేవుడిచ్చిన శాపముననుసరించి నరునిలో నుండి నరునిగా జన్మించిన ప్రతినరుని జీవాత్మయు ఆత్మీయంగాను శరీరయుతంగాను చచ్చుచుండుట - ఆత్మీయ జ్ఞానంతో దైవవిశ్వాసులైన మనము పరిశోధిస్తే ఈ సత్యము బైల్పడుచున్నది. అనగా దేవుడు నరునిలో ఊదిన జీవాత్మ ఒక్కడే. ఆయన ఒక్కసారే నరునిలో జీవాత్మను ప్రవేశపెట్టినాడు.
                ఇట్లు ఒక్కసారే ఒక్క ఆదాములో ప్రవేశించిన జీవాత్మ ద్వారా దేవుడు ఆదామునకు సహాయకారిగా నిర్మించిన స్త్రీని గూడ ఈ జీవాత్మకు పాలి భాగస్తురాలిగా చేశాడు. కాని ప్రత్యేకించి స్త్రీ నిర్మాణ కార్యములో మరియొక జీవాత్మను ఊదలేదు. ఈ నగ్నసత్యాన్ని ఆదాము గాఢనిద్ర నుండి మేల్కొని - నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము - నరునిలో నుండి తీయబడితివి గాన నారివి'' అని అన్నాడేగాని నా ఆత్మలో భాగస్వామిరాలివని అనలేదు. అయితే నాటి నుండి నేటివరకు విస్తరించియున్న జనసందోహం యావత్తుకును ఆదాములోని జీవాత్మ మూలమైయున్నదని ఇందుమూలంగా మనము గ్రహించవలసియున్నది. ఆదాము ద్వారా విస్తరించిన జీవాత్మ యొక్క శారీరక ఆత్మీయ బలప్రభావములు దినదిన ప్రవర్ధమానమై విస్తరించి జన సంఖ్యను ప్రబలించుటకు కారణభూతమైనట్లు మనము గ్రహించాలి.
                మరియొక విశేషమేమిటంటే ఆదాము ద్వారా నరకోటి ఎంత విస్తరించెనో అదేవిధంగా దేవుడు ఆదాముకిచ్చిన శాపము ద్వారా శారీరయుతమైన జీవితానికి మరణం కూడా సంప్రాప్తమైనట్లుగ, నరులలో సంభవించుచున్న జాడ్యములు ప్రమాదములు వాతావరణ దోషములు యుద్ధములు పోరాటములు దోపిడీలు హత్యలు మానసిక వ్యధలు జరుగుచున్న మారణహోమాలు ఇవన్నియు జీవాత్ముడైన ఆదామును శపించిన శాపము యొక్క ప్రభావమని ఆ శాపములో ఒక భాగమే మరణమని, రెండవ అంశము శ్రమపడి బ్రతకాలనీ భూమిని దున్ని జీవించాలి అనగా సృష్టిలో కృషిజేసి శారీరకంగాను మానసికంగాను శ్రమించి శోదనశోకము శ్రమలు అనుభవించుటన్నది తప్పదని ఈ శ్లోకమును గూర్చి బైబిలు వివరిస్తున్న నిగూఢ సత్యమని మనము తెలిసికోవలసియున్నది.
                కనుక లోకసంబంధమైన వాటిని గూర్చి శారీర సంబంధమైన ఇచ్ఛలను గూర్చి లోకాన్ని గూర్చి లోకేచ్ఛలను గూర్చి లోకములో వున్నవాటిని గూర్చి శోకింపగూడదని మొదటి యోహాను 2:15-16 ఈ లోకమునైనను లోకములో వున్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో వున్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవికావు. అవి లోకసంబంధమైనవే. కొలస్సె 3:3. పైనున్న వాటి మీదనేగాని, భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతిపొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడియున్నది. కాబట్టి మన చింత శోకము యావత్తు కూడా దృశ్యమైన వాటిని గూర్చియే యున్నది. అదృశ్యంలో వున్న అమూల్యమైన శక్తివంతమైన సుస్థిరమైన నిత్యమైన సత్యమైన వాటిని గూర్చి తలపోస్తూ వాటితో కూడిన చింత ఆలోచన ధ్యాసగల్గి వుండాలని ప్రతియొక్కరికి ఇది హెచ్చరికయై యున్నది. అంతేగాని దృశ్యమైన వాటిని గూర్చియేగాని అస్థిరమైనవాటిని గూర్చి గాదు.
                28వ శ్లోకం :- సకల భూతములను మొదట నేదేని యొక యగోచర పదార్థము నుండి పుట్టి నడుమ నిట్లు కనిపించుచున్నవి. తుదకా యగోచర పదార్థమునందే యవియన్నియు లయించును. కావున నందులకు శోకమెందులకు ?
                ఇందుకు బైబిలిచ్చు సరియైన నిర్వచనము :- ప్రియపాఠకులారా ! ఈ సందర్భంలో ఆది 1:లో ఈ సకల భూతములన్నవి అనగా భూమి నీరు నిప్పు గాలి ఆకాశం వగైరా సకల భూతములన్నీ ఏకమై ఒకదానిలో ఒకటి గుప్తమైయున్నట్లు ఈ వేద భాగములో ఆది 1:1లో ఆది దేవుడు భూమిని సృష్టించక పూర్వము దానిపై అగాధ జలముపైన కమ్మియుండెను. ఇందులో భూమి నీరు వాయువు అన్నియు ఒకదానితో నొకటి గుప్తమైయున్నవి. ''దేవుని ఆత్మ జలములపై అల్లలాడుచుండెను''. ఈ అగోచర పదార్థమన్నదే దేవుని ఆత్మ. పంచభూతాలతో కలిసి విహరిస్తూ వాటిపై క్రియ జరిగించుటకు వేగిరపడుచుండెను. అనగా పంచభూతాలను విడగొట్టి ఒకదానితో నొకదానికి సంబంధాలు ముడిపెట్టి దేనికది వేరుగా క్రియ జరిగించునట్లు చేయాలని, దేనికది విడిగా క్రియ జరిగించాలన్న సంకల్పముతో దేవుని ఆత్మ జలములపై అల్లలాడినట్లు తెలియుచున్నది. ఈ క్రియ జరిగించుటకు మొట్టమొదటగా వెలుగు అవసరము కాబట్టి - దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను.
                ప్రియపాఠకులారా ! ఇక్కడ దైవత్వము జరిగించిన ఒక గొప్ప క్రియా మర్మము మనము గ్రహించాలి. అదేమిటంటే - వెలుగు కావాలి అనిన శబ్దము పల్కినది దేవుడే. ఆ శబ్దాను గుణ్యంగా ఆ చీకటి వాతారణములోను వెలుగు కల్గింది. ఆ వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచినాడు. వెలుగును చీకటిని వేరుపరిచాడు. మొట్టమొదట పంచభూతాలలో శంకుస్థాపన కార్యంగా అదృశ్యశక్తియై యున్న పరమాత్ముడు చేసిన క్రియ ''వెలుగు - చీకటి'' ఈ విభజన అను క్రియతో దైవత్వమన్నది సంతుష్ఠి చెందక వెలుగునకు పగలు చీకటికి రాత్రియని పేర్లు పెట్టినట్లుగా ఈ వేదభాగంలో మనము చదువగలము. ఇక ఇచ్చట నుండి పంచభూతాల యొక్క నిర్మాణము వాటి ఏర్పాటు - అవి జరిగించవలసిన క్రియలు, సృష్టిలోని జీవరాసులకును నరజీవులపట్ల ఈ పంచభూతాలు అనుసరించవలసిన మరియు జరిగించవలసిన క్రియా విధానములను గూర్చి దేవుడు వీటికొక విధిని నిర్ణయించినట్లు ఈ మొదటి అధ్యాయంలో మనము చదువగలము.
                ప్రియపాఠకులారా ! ఆది 1:6-20లో వున్న వేదవాక్యములలో సృష్టికర్త అదృశ్యశక్తియైయున్న పరమాత్ముడు - పంచభూతాలను సృష్టిని సృష్టికి జీవాన్ని తత్సంబంధమైన జీవరాసులు పశుపక్ష్యాదులు కీటకాదులు చెట్లుచేమలు మహావృక్షాలు ఇక పచ్చిక బీళ్ళు, సెలయేళ్ళు, నదులు - జీవనదులు, కొండలు, శిలలు, మైదానాలు, పర్వతశ్రేణులు, వగైరాలను తన వాక్శక్తితోనే అదృశ్యశక్తియైన పరమాత్ముడు సృష్టించినాడంటే - దృశ్యమైయున్న నరుడు అదృశ్యశక్తియై యున్న పరమాత్మునిలో ఏపాటివాడో ఒక్కసారి మనము ఆలోచించవలసియున్నది.
                సృష్టి చరిత్రకును నరచరిత్రకును ఇంత ఆంతర్యము వుండగా చూపరులకు మాత్రము సకలము భూమి నుండియే పుట్టుచున్నవని - సమస్తమునకు భూమియే జీవమిస్తున్నదని - భూఫలములు లేకుండ భూసృష్టికి మనుగడలేదని - సమస్తమునకును భూమియే ఆధార సంభూతమని భూమియే దేవతయని నరుడు భ్రమిస్తున్నాడు. భూమికున్న ఈ శక్తి ఎవరి మూలంగా కల్గిందో భూమియొక్క వాతావరణానికి దీని మనుగడకు దీనిలో వున్న జీవానికి మూలకారకుడెవరు? అనిన నిగూఢ సత్యాన్ని నరుడు పూర్తిగా కోల్పోవుచున్నాడు. నరుని యొక్క దృష్టి యావత్తు ఇహలోక సంబంధమై చిత్ర విచిత్రములైన జంతుజాలము ఫలపుష్పాదులు ఆహ్లాదకరమైన వాతావరణమును గూర్చి పరవశుడై భూమినే శ్లాఘిస్తున్నాడుగాని అట్టి క్రియకు మూలకారకుడైన పరమాత్ముని స్తుతించుటకుగాని ఘనపరచుటకుగాని మహిమపరచుటకుగాని ముందుకు రాలేక అశక్తుడగుచున్నాడు.
                భగవద్గీతలోని 28వ శ్లోకంలో వివరించబడిన ఈ అంశము అనగా సకల భూతములును మొదటనేదేని యొక అగోచర పదార్థము నుండి పుట్టి నడుమనిట్లు కన్పించుచున్నవి,'' అని అంటున్నాడు. కనుక సృష్టి యావత్తును సృష్టిలోని సమస్తమును క్రీస్తులో గుప్తమైయున్నదన్న సత్యాన్ని నరుడు గ్రహించలేకయే యున్నారు. అట్లు గ్రహించలేని స్థితిలోనే ఈ యొక్క శ్లోకం వ్రాయబడియున్నది. ఇందుకు దీటైన వేదవాక్యాన్ని యోహాను 3:16 దేవుడు లోకమునెంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను''.
                ప్రియపాఠకులారా ! ఇక ఈ రెండవ వచనాన్ని ధ్యానిస్తాము. ''తుదకా అగోచర పదార్థమునందే యవియన్నియు లయించును'' అని అంటున్నాడు. ఇట్లు అనుటలో పరమాత్మునిచే రూపించబడి బహుముఖ వ్యాప్తంగా పరపరాగ సంపర్కంబులతో భూమి ఒకదానితో నొకటి లైంగిక క్రియలు జరిగించి వాటిద్వారా సంతానోత్పత్తి జరిగించి క్రియ జరిగిస్తున్నది. ఇది ఒక అదృశ్యశక్తి యొక్క అజమాయిషీలో వున్నదని నరులమైన మనము గ్రహించుటెంతో ఆవశ్యము. ఎందుకంటే భూమియు దానియొక్క క్రియలు నశించును. వినాశము కల్గినపుడు ఆ అదృశ్యమైయున్న ఆత్మలోనే ఇవన్నియు లయమై లీనమైపోవాలి. ఇది క్రీస్తురాకడలో జరుగు సంఘటనను బైల్పరచుచున్న నిగూఢ సత్యము. కొలస్సై 3:3 పైనున్న వాటి మీదనేగాని, భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడియున్నది. ఈ సత్యాన్ని ఈ శ్లోకంలో దాచాడు. అనగా బైల్పరచలేదు. మొదటి యోహాను 2:15-17 ఈ లోకమునైనను లోకములో వున్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలోనుండదు. లోకములో వున్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవికావు. అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించి పోవుచున్నవిగాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును''. ఇందునుబట్టి దృశ్యమైయున్నవి అనిత్యములు, అదృశ్యములో వున్నవి నిత్యములని మనము గ్రహించాలి. ఈ సత్యాన్ని ఈ శ్లోకంలో తెలియపరిచాడు.
                కనుక లోకము దీనికి కలుగబోవు తీర్పు ప్రభువు రాకడ మృతుల పునరుత్థానము, లోకమునకు అంత్యము. క్రొత్తాకాశము క్రొత్త భూమియొక్క నూతనసృష్టి, ''యెరూషలేము'' అను పరిశుద్ధ పట్టణ వైభోగము. ఇవన్నియు క్రీస్తులోనే వున్నవి గనుక సమస్తమునకును ఆధారసంభూతుడు అనగా లోకం పుట్టుకమునుపే నేనున్నానని యేసుప్రభువు ఆనాటి జనాంగంతో మాట్లాడిన మాట యోహాను 8:58 యేసు - అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాననెను''. అనగా సృష్టికి పూర్వమే ఆయన వున్నట్లు ఈ వేదభాగములోను మరియు ఎఫెసీ 1:6 ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి గల్గునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును, నిర్దోషులమునునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకముందే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
                29వ శ్లోకం :- ఆత్మ సర్వమునకు మూలమగుటచే తను ఎంతో ప్రసిద్ధ వస్తువైనను దానిని ఒకానొకడు మిగుల క్రొత్త వస్తువును వలె జూచుచున్నాడు. మరియొకడు దానిని గూర్చి ఆశ్చర్యవంతంగానే చెప్పుచున్నాడు. వేరొకడు దానిని అత్యాశ్చర్య విషయముగనే వినుచున్నాడు. ఇంత వినియును దాని నొకానొకడైన తెలిసికొనజాలడు.
                బైబిలులోని భగవద్గీత అంశములు :- ప్రియపాఠకులారా ! ఈ సందర్భంలో ప్రసంగి గ్రంథమును మనము చదివినట్లయితే ''మన్నైనది వెనుకటి వలెనే మన్నైపోవును - ఆత్మ దానిని అనుగ్రహించిన వాని యొద్దకు చేరు''నని వివరించియున్నాడు. నిజానికి శరీరానికంటే ఆత్మ ముందున్నదని ఆది 1:లో చదువగలము. ఇక ఆదికాండ 2:7లో పరమాత్మ అనగా సర్వానికి మూలమైన ఆత్మ భూసంబంధమైన జడపదార్థంబగు మట్టితో ఆకారమును రూపించి, అందులో పరమాత్మ జీవాత్మను ప్రవేశింపజేసినట్లు చదువగలము. ఇందునుబట్టి ఆత్మ లేనిదే శరీరమునకు నిర్మాణములేదు. అందుకే దేవుడు తానుజేసిన సృష్టియావత్తును చూచి అదంతయు దైవత్వానికెంతో నూతనత్వమగుటచేత అది మంచిదైనట్లు గ్రహించినట్లు బైబిలులో వ్రాయబడియున్నది. అనగా తానుజేసిన సృష్టియంతయు అది ఎంతో మంచిదైనట్లు దీని భావము.
                పరమాత్మ అయితే సృష్టిని చేశాడు. దానిని చూచినాడు, దాని మంచి చెడులు గ్రహించాడు. దానిలోని ప్రాచీన స్వభావమును తీసివేసి నూతనత్వాన్ని ప్రసాదించాడు. అయితే పరమాత్మ యొక్క జీవాత్మను పొందిన నరుడు పరమాత్మ సృష్టియైన ఇహాన్ని అనగా భూలోకాన్ని చూస్తున్నాడేగాని సర్వమునకు సృష్టికర్తయైన ఆత్మను చూడలేకున్నాడు. ఆత్మను చూడాలని ప్రయత్నించే ఆత్మ సంబంధులు లేకపోలేదు. అయినను లోకమన్నది చెడ్డది గనుక నరునియొక్క దేహము లోకసంబంధము గనుక ఆత్మను సమీపించుటకు శరీరుడు అతీతుడగుచున్నాడు. కారణము ఇహలోకవాంఛలే. ఇందునుబట్టి రోమా 3:11లో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునులేడు. దేవుని వెదకువాడెవడును లేడని వ్రాయబడియున్నది. అనగా ఆత్మజ్ఞానముగలవాడులేడు. పరమాత్మను వెదికి కనుగొన్నవాడులేడు. పరమాత్మ కేంద్రమైన పరలోక రాజ్యాన్ని వెదకువాడు లేడని అర్థము.
                ప్రియపాఠకులారా ! సృష్టి మొదలుకొని నేటి వరకును ఎందరో మహానుభావులు దేహవాంఛలను చంపుకున్న యోగులు విశ్వాసులు ప్రవక్తలు యాజకులు రాజులు న్యాయాధిపతులు జ్ఞానులు అపోస్తలులు వేదసాక్షులు వగైరాలు ఎందరో లోకబంధకాలను త్యజించుకొని ఆత్మదేవుని యొక్క సన్నిధి కావాలని ఆత్మదేవుని ప్రసన్నం జేసుకోవాలని ప్రయత్నించి దేహాన్ని చాలించి కనుమరుగైనారు. నేటికిని మన వేదజ్ఞానంతో ఆత్మ సంబంధమైన క్రియాకర్మలను గూర్చియు ఆత్మ మూలంగా జరిగిన సృష్టికార్యమును గూర్చియు మనము తలంచుకున్నప్పుడు అది క్రొత్తగానే వుంటుంది.
                ఇక రెండవ భాగము :- మరియొక్కడు దానిని గూర్చి ఆశ్చర్యవంతంగానే చెప్పుచున్నాడంటున్నాడు. వాస్తవమునకు పరమాత్ముడు సృష్టించిన ఈ సృష్టిలోని క్రియాకర్మలు జననమరణాలు జీవుల ఉత్పత్తి విధానాలు, వాటికి కావలసిన ఆహారములు శీతోష్ణస్థితి వాతావరణము జీవరాసులలో వున్నటువంటి వివిధ రూపములు, వాటి దేహచ్ఛాయ వాటి ఉనికి మనము అవలోకిస్తే ఈ జీవుల సృష్టికి మూలకారకుడైన ఆత్మ ఎంత జ్ఞానవంతుడో ఎంతటి ఆశ్చర్యక్రియా సంపన్నుడో మనకు తెలియగలదు. లోకరీత్యా నరుడు ఏదేని ఒక వస్తువును రూపించాలంటే వానికి సాంకేతిక జ్ఞానము, అందుకు కావలసిన మానసిక తర్ఫీదు తత్సంబంధమైన శాస్త్రజ్ఞానము అవసరమైయున్నది. మరియు జీవాత్ముడు చేయు కార్యములకు జీవముండదు గాని ఇంధనశక్తి విద్యుచ్ఛక్తి అవసరమైయున్నది. మరియు దేహంతో శ్రమించి జీవుడు తయారు చేయవలసిందేగాని మరియొక విధంగా చేయలేడు. అయితే ఆది 1:లో పరమాత్ముడు ఇంత పెద్ద వైశాల్యముగల్గిన భూలోకమును అందులో సృష్టిని పంచభూతాలను నవగ్రహాలను జలరాశులను పర్వతశ్రేణులను, వీటన్నిటితోబాటు జంతుకోటిని కేవలము వాక్శక్తితో సృష్టించాడంటే నిజానికి నరుని జ్ఞానము పరమాత్మునిలో ఏపాటిదో ఆశ్చర్యంగానే వుంటుంది. ఇది ఆత్మదేవుని యొక్క క్రియాకర్మలను ఆయన ఆశ్చర్యకార్యములను చదివిన వానికి గోచరమగుతుంది.
                ఇక మూడవది :- ''వేరొకడు దానిని అత్యాశ్చర్య విషయముగనే వినుచున్నాడు. ఇంత వినియును దాని నొకానొకడైన తెలిసికొనజాలడంటున్నాడు. ఈ సందర్భంలో రోమా 1:20-23 ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదుగాని తమవాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులు యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. మరియు 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడెవడును లేడు. దేవుని వెదకు వాడెవడును లేడు. 1:19 దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది.
                30వ శ్లోకం :- సకల ప్రాణుల యొక్క దేహములందు దానికి సర్వాధికారియై యుండు ఆత్మ చంప శక్యమైనదియేకాదు. కాబట్టి నీవీ ప్రాణులలో నెద్దానిం గూర్చియైన శోకింప నవసరములేదు.
                బైబిలులోని భగవద్గీత పరమార్థము :- ప్రియపాఠకులారా ! ఈ శ్లోకం ప్రకారం సకల ప్రాణులలోను సకల నరజీవులలోను దేవుడు సర్వాధికారియై యుండి శరీరమను గుడారములలో తన జీవాత్మ నుంచి యున్నట్లుగా రెండవ కొరింథీ 5:1లో చదువగలము. కనుక ఈ వేద వాక్యరీతిగా నరదేహము దృశ్యమైనది. శిధిలమగునది గతించి పోవునది. అయితే అందులో నివసించు ఆత్మ నిత్యమైనది అదృశ్యమైనది పరసంబంధమైనది పరమాత్మునిలో పాలుగలది. మరియు పరలోక రాజ్యసంబంధమైనది సజీవమైనది మరణము లేనిది శరీరమునకు కానరానిది.
                కనుక ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపుచున్నాడంటే శరీరాన్నేగాని ఆత్మనుగాదని ఆత్మకు మరణం లేదని మనము రూఢిగా నమ్మవలసియున్నది. ఇందునుగూర్చి శరీరమును చంపువానికి భయపడకుడిగాని ఆత్మను చంపువానికి భయపడుడని ఏసుప్రభువు చెప్పినమాట ఈ సందర్భంలో గమనార్హము. ఎందుకనగా శారీర సంబంధమైన శ్రమలు బాధలు శోకములు బంధాలు ఇరుకులు తాత్కాలికములు అనగా మరణకాలం వరకేను. అయితే ఆత్మ సంబంధమైనవి నిత్యములు కనుక ఆత్మ ననుగ్రహించిన ఆత్మ దేవుడు ఆత్మను శిక్షించునుగాబట్టి ఆత్మ సంబంధమైన శిక్షకు గురికాకుండ ప్రతినరజీవియు, శరీరమునకంటే ఆత్మకెక్కువగా విలువనిచ్చి ఆత్మసంబంధమైన ఈవుల కొరకు ఆశీర్వాదములకొరకు ఆత్మరాజ్య ప్రవేశము కొరకు, నిత్యమైయున్న దైవసన్నిధి కొరకును ఇహలోక జీవితంలో శారీరంతో పోరాడి ఆత్మ సిద్ధి పొంది రానున్న ప్రభువు రాకడకు ఆయత్తమగుటెంతయో అవసరమని ఈ శ్లోకము యొక్క బైబిలు తాత్పర్యము.
                31వ శ్లోకం :- ఇంతేగాక నీ స్వధర్మమును చూచుకొనియైన నీవిట్లు కంపింపజనదు. ధర్మ విరుద్ధముగాని యుద్ధమునకంటె శ్రేయస్కరమైనది క్షత్రియునకు వేరొండుగానరాదు.
                అర్జునునిగూర్చి ధర్మయుద్ధం చెయ్యమని కృష్ణుడు చెప్పిన సామాన్య మానవునికి కూడ ఇది ఒక పాఠం. ప్రతివాడు ఈ అంతర యుద్ధంలో యుద్ధవీరుడే లౌకికాలౌకిక విషయ యుద్ధంలో అర్జునునిగా (స్వచ్ఛమైన మనస్సుగ) ఉండి ధర్మం గురించిన యుద్ధం చెయ్యకపోతే అతడు తన సత్యాన్నే కోల్పోతాడు అని కృష్ణుడు సామాన్యులైన పాఠకులకు వివరిస్తున్నాడు.
                ప్రియపాఠకులారా ! స్వార్ధమనేది ఎంత భయంకర గుణమో ! స్వార్ధమువలన నరునికి వున్న పతనావస్థ ఎట్టిదో ఈ భగవద్గీత రచయిత ఎరుగనట్లున్నది. యుద్ధమన్నది స్వార్ధంతో కూడియుండును. స్వార్ధంవల్లనే లోకనాశనానికి సర్పము కారణమైంది. అసలు స్వార్ధానికి పునాదివేయబడింది మొట్టమొదట ఏశావు యాకోబుల జీవితం. స్వార్ధం మూలంగానే రాహేలు యాకోబుకు మేక చర్మమును గప్పి తన పుత్రుడు యాకోబు తండ్రి దీవెనలతో ఐశ్వర్యవంతుడు కావాలని భర్తను మోసగించింది.
                స్వార్థంతో కూడుకున్నవాడై గేహజీ ఎలీషాకు తెలియకుండ శపితమైన బంగారు నాసించి కుష్ఠురోగి అయ్యాడు. దావీదు వంటి మహారాజు కూడా స్వార్ధ బుద్ధికలవాడై తన సైనికుని భార్య నాసించి ఆమె భర్తను చంపించి దైవచట్టానికి వ్యతిరేకి అయ్యాడు. అదేవిధంగా స్వార్థచింతనతోనే 30 వెండి నాణెములకు ఇస్కరి యోతుయూదా పరమ రక్షకుని కిరాతకునికి అమ్మినాడు. ఈవిధంగా స్వార్థంలో భయంకరమైన గుణాతిశయములు దాగియున్నవి. నేటి ఆధునిక యుగంలో ఈ స్వార్ధమన్నది బహుముఖ వ్యాప్తమై రాజ్యాలను రాజ్యాలేలే ప్రభువులలోను నాయకులలోను వేద విద్వాంసులలోను ఒకరేమిటి ? స్త్రీ పురుష భేదము లేకుండ సకల జనావళిలో ఈ స్వార్ధమన్నది బాహాటంగా క్రియ జరిగిస్తున్నది. స్వార్ధమన్నది నరజీవితమునకేగాక దైవత్వానికి కూడా వ్యతిరేకియైయున్నది. దైవరాజ్యానికి స్వార్ధమన్నది సుదూరమైన గుణము. ఇట్టి స్వార్ధముతో కూడిన యుద్ధమునుండి ఇరుపక్షములవారిని విరమింపజేయుటకు శ్రీకృష్ణుడు అశక్తుడయ్యెను.
                ఇంక రెండవదిగ ధర్మ విరుద్ధముగాని యుద్ధమున కంటె శ్రేయస్కరమైనది క్షత్రియునకు వేరొండు కానరాదంటాడు. దీని అర్థము నిజధర్మాన్ని విడిచి ముఖాముఖిగ పోరాడుటకు బదులు కుయుక్తితో కూడిన యుద్ధము కపటోపాయంతో కూడిన యుద్ధము మోసకరమైన యుద్ధము శ్రేయస్కరమైనదన్నట్లుగా ఇందులోని అర్థము.
                ప్రియపాఠకులారా ! ఒకానొక రాత్రి యాకోబుదేవునితో పోరాడినాడు. యాకోబు దేవునితో పోరాడు సమయంలో ఆయుధము లేదు, డాలు లేదు, సైన్యము లేదు, మంది మార్బలము లేదు, వాహనం లేదు, ఏమీలేదు. అయితే ఎట్లు పోరాడివుంటాడు ? అనిన దానిని గూర్చి మనము తెలిసికోవలసియున్నది. దైవత్వమన్నది ఆత్మీయశక్తి. ఇది కంటికి కానరాదు, అదృశ్యమైనశక్తి. ఇట్టి అదృశ్యశక్తితో పోరాడాలంటే అదృశ్యమైన ఆయుధాలనే ఉపయోగించాలి. ఇందులో కుత్సితముగాని, స్వార్ధమునకుగాని దృశ్యమైయున్న వస్తుసముదాయమునగాని తావులేదు. అయితే యాకోబు తెల్లవార్లూ పోరాడినాడు. ఇది పోరాటమంటే - యాకోబు తన శారీరాత్మలను క్రోడీకరించి ఏకధాటిగా అదృశ్యంలో వున్న పరమాత్మశక్తితో తన శారీరాత్మలను ఏకాగ్రంగా వుంచుకొని ఇహలోక చింతనలు దూరపరచి ఇహలోక గుణాతిశయములను కడగా పెట్టి, దృఢసంకల్పంతో ఏకమనస్సుతో ఏకశరీరం ఏకాత్మతో రెండవ శరీరం రెండవ ఆత్మతో పని లేకుండ, తానే యొక యోధునిగ ఆత్మీయ పోరాటం సాగించినాడు. తత్ఫలితము తన జీవితంలో మరొక అధ్యాయాన్ని స్థాపించినాడు. పేరు మారింది అనగా యాకోబు అంటే మోసగాడు. అట్టి మోసగాడు పేరు మార్చబడి ఇశ్రాయేలుగా పిలువబడినట్లు వేదంలో చదువగలము.
                ఇట్టి ఇశ్రాయేలు జేసిన యుద్ధము ధర్మ యుద్ధము కాదా ? ధర్మయుద్ధము చేయబట్టే దేవునిచేత సెహబాష్‌ అనిపించాడు. 12 గోత్రాలకు తండ్రి అయ్యాడు. ఇతని వంశావళుల నుండి జన్మించిన లోక రక్షకుడే యేసుప్రభువు. ఇంత ఔన్నత్యాన్ని యాకోబు పొందగల్గినాడంటే అతను చేసిన యుద్ధము అధర్మమైనదా ? ధర్మయుద్ధమే జేసినాడు. ఇందును గూర్చి పౌలు ఎఫెసీ 6:10-18లో చదివితే - ధర్మ యుద్ధమునకున్నటువంటి ప్రభావము తన్మూలంగా నరునకు గల్గు సన్మానము జయము జయోత్సాహమును గూర్చి తెలియగలదు. మరియు తాను సాధించవలసిన ధ్యేయమును గూడ నెరవేర్చుకోగలడు. ''ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను, ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారి నెదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్దమనస్సు అను జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నియు గాక విశ్వాసము అను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణముల నన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మవలన ప్రతి సమయమందును ప్రతివిధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. ఆ విషయమై సమస్త పరిశుద్దుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనజేయుచు మెలకువగా నుండుడి.
                అపో 9:లో క్రైస్తవులతో అధర్మమైన అన్యాయమైన హీనాతిహీనమైన పోరాటాన్ని సౌలు సాగించాడు. అంటే అమాయికులు నిష్కళంకులు నిరపరాధులు అయిన క్రైస్తవ విశ్వాసులపై కక్ష సాధింపు చర్యతో ప్రవర్తించి అది చాలదన్నట్లు వారిని బంధించి హింసించి హతమార్చుటకు  కూడా లోకసంబంధమైన అధికారాలకు ప్రాకులాడినాడు. అయితే అతడు పోరాడుచుండినది క్రీస్తుతోనన్నది గుర్తించలేకపోయినాడు. అట్టి అజ్ఞాని వీరుడైన సౌలును దైవత్వమన్నది దమస్క దగ్గర మొత్తి గుఱ్ఱము మీద నుండి పడద్రోసి ఆత్మీయ పోరాటము తన్మూలంగా కలుగు జయాపజయంబులను అధర్మయుద్ధము తన్మూలంగా కలుగు సత్యమును గూర్చినటువంటి పరిజ్ఞానమును దైవత్వంచేత బోధింపబడి, శారీర రీత్యా అంధుడై ఆత్మీయంగా వివేకశూన్యుడు అచేతనుడై అశక్తుడై గుఱ్ఱమునెక్కి వీరోచితంగా ఎన్నో పోరాటాలు పోరాడిన సౌలు ఎన్నోరకములైన ఆయుధ విద్యలలో ప్రావీణ్యతను సంపాయించుకున్న సౌలు, ఎంతోమంది వీరులను హతమార్చి ఎన్నో యుద్ధాలలో లోకసంబంధిత జ్ఞానంతో తంత్రంతో కుయుక్తితో విజయాలు సాధించిన సౌలు, అదే ధర్మ విరుద్ధమైన యుద్ధంలో క్రైస్తవ్యముతో పోరాడి అపజయాన్ని అంధత్వాన్ని అశక్తతను పొంది నిస్సహాయ స్థితిలో తాను నడిచేటటువంటి దారియే కానరాక ఒకరి సహాయము అభ్యర్థించవలసి వచ్చింది.
                ఇట్టి స్థితిలో సౌలునకు తానెక్కిన గుఱ్ఱము తన ఆయుధాలు డాలు తన యుద్ధకవచాలు తనసైన్యము తన సహచరులు తాను ప్రేమించిన ఈ లోకము కూడా తనను విడిచిపెట్టినారు. అయితే శరీర పోరాటము నుండి అపజయము పాలైన సౌలు ఆత్మీయ పోరాటము పోరాడి అనగా ఆత్మీయ ధర్మయుద్ధమును ప్రార్థనా పూర్వకంగా చేసి సత్యరాజ్యమునకు సాక్షియై నూతనత్వమును పొంది, తన జీవితాన్ని తన పేరును మార్చుకొని అపోస్తలుడుగాను ఎనిమిది సంఘములకు లేఖనాలను వ్రాసి గొప్ప రచయితగాను క్రీస్తునేతనలో ఇముడ్చుకున్నటువంటి ఐశ్వర్యమును పొంది నేటి అజ్ఞాన జనాంగానికి నేటి అక్రమ యుద్ధ యోధులకు కనువిప్పు గల్గించు ఆదర్శుడైయున్నాడు. కనుక ఈ భగవద్గీతలోని ఈ శ్లోకము స్వార్ధముతో కూడినదిగాను ధర్మ విరుద్ధమైనదిగాను మానవ జీవితానికి యోగ్యకరముగానిదిగాను దైవత్వానికి అయోగ్యకరమైనదిగాను వున్నదనుట కెట్టి సందేహము లేదు. ఉదా|| విరధుడైన కర్ణుని శ్రీకృష్ణుడు అర్జునుని చేత చంపించుటయును, యుద్ధములో ధర్మరాజు చేత శ్రీకృష్ణుడు అబద్ధము చెప్పించి యుద్ధమును విరమించుకొన్నవానిని చంపించుటయు ఇందులకు ఉదాహరణలైయున్నవి.
                32వ శ్లోకం :- అప్రయత్నంగా తటస్థించినట్టిదియు తెరచిపెట్టబడిన స్వర్గద్వార మనదగినదియునైన ఇట్టి యుద్ధమును క్షత్రియులైనవారు సుఖులై పడయుదురు.
                శ్రీకృష్ణుడు అర్జునుని ఉద్దేశించి స్వర్గద్వారము ఈ యుద్ధక్షేత్రము అని కురుక్షేత్రమును ఉద్దేశించి పల్కినట్లు కనిపించును. కాని, ఈ కురుక్షేత్రము ధర్మక్షేత్రమని మొదటి అధ్యాయములోని మొదటి శ్లోకములోనే నిర్వచించియున్నాడు. ఈ యుద్ధభూమిలో ధర్మము అధర్మముల నడుమ సంగ్రామము జరుగుచున్నది. ప్రతి మానవ శరీరము జీవితము ఒక యుద్ధక్షేత్రమే. ఇందు పరమాత్ముడు నివసించియుండుటవలన ఇది ధర్మక్షేత్రము. ధర్మక్షేత్రంలో భూవాసనల రవాలకు లొంగిన ఐహిక ఇంద్రియవాసనాపీడితులు కురురాజులు. కౌరవ జాతీయులే కౌరవులు అని వ్యుత్పత్తి. కనుక కౌరవ లక్షణం ప్రతి జీవిలోనూ ఉంటుంది. ఐతే ఈ కురవాన్ని (భూవాసనల రవాలను) నాశనం చేసి కృష్ణా శ్రిత బుద్ధిని ధర్మ పరిపాలనా శీలత్వాన్ని పొందడమే ఈ కురుక్షేత్ర రణరంగంలోని అంతరార్థం.
                కనుక శ్రీకృష్ణుడు అంటున్నాడు - ఈ కురుక్షేత్రంలో 'ధర్మంకురు' అని ధర్మపరమైన జీవితాన్ని గడుపు అట్టివానికి స్వర్గద్వారాలు ఈ జీవన పోరాటం అని అంటున్నాడు. కనుక పరమాత్ముడు ఈ దుర్భరమైన భూమియందు జనింపచేసినా ధర్మాధర్మ విచక్షణతో ధర్మ పక్షపాతి అయి ఉంటే ఈ జీవితపోరాటం నీకు స్వర్గద్వారంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాడు.
                ప్రియపాఠకులారా ! ఇది అన్యవేదమైన భగవద్గీతలో నామమాత్రంగా రచింపబడి మానవబుద్ధితో మానవేచ్ఛలతో మానవ జ్ఞానంతో, శారీరయుతమైన తర్కవాదంతో రచింపబడిన సాహిత్యమే యిది. దీనికి దీటు అయిన సత్యమైన నరుడెప్పుడును ఊహించనటువంటి స్థితిలో బైబిలు వేదంలో చక్కగా ఎఫెసీ 6:12లో వివరించబడియున్నది.
                ప్రియపాఠకులారా ! దినమెల్లా రాత్రింపగళ్ళును స్వర్గద్వారములు తెరువబడియున్నట్లుగా కీర్త 14:2 ''వివేకము గల్గి దేవుని వెదకువారు కలరేమోయని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను''. కీర్త 53:2 లోను విధంగా ఆయన నరులకొరకు అనగా తనను వెదికేవారు లోకపోరాటంలో శారీరేచ్ఛలతో సాటి శరీరులతో తర్క వితర్కములతోను వాదములతోను ఆత్మసంబంధ మర్మములనుగూర్చి వాదోపవాదములతో కూడిన పోరాటములతోను పోరాడి శారీరసంబంధుల నెదిరించి వారిని జయించి సత్యదేవునియొక్క సన్నిధిని తెలుసుకున్నవారిని సంఘముగా ఏర్పరచుటకు సమయమందును అసమయమందును ప్రయాసపడి లోకనాధులతో పోరాడి లోకశక్తులను జయించి మానవ జీవితాన్ని సార్ధకంజేసికున్న విశ్వాసులే ఈ యుద్ధవీరులు. వారే ఎఫెసీ 6:14-18లో వివరించబడినట్లు - ఆత్మవల్లనే ప్రతి సమయమందును మెలకువ గల్గి ప్రతివిధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా వుండువారే ఈ యుద్ధవీరులు అనగా క్షత్రియులు. అంతేగాని లోకసంబంధమైన మానవ ప్రమేయంతో మానవ సిద్ధాంతములతో నేర్పరచబడిన లోకసంబంధ క్షత్రియ జాతి కాదు.
                ఈ విధంగా ఆత్మీయ పోరాటము పోరాడిన వారిని దైవత్వమన్నది మొదటి తిమోతి 6:11లో వలె ''దైవజనుడా ! నీవైతే వీటిని విసర్జించి, అనగా శారీర సంబంధమైన మానవ కల్పితమైన జాతి భేదములను అనగా బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య పంచమ అను జాతి భేదములను విస్మరించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును అను ఈ గొప్ప ఐశ్వర్యములను సంపాదించుకొనుటకు ప్రయాసపడుము''. 12వ వచనంలో - ''విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము''. అనగా జాతి మత భేదాలు, రాష్ట్రభేదాలు, భాషాభేదాలు, ప్రాంతీయ భేదాలు విస్మరించి సాటి నరులతో సహజీవనము చేస్తూ - నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమిస్తూ'' సమైక్యతతో కూడిన విశ్వాస సంబంధమైన మంచి పోరాటము స్వార్ధముతో కాక కుత్సితముతోగాక వితర్కముతో కాక దూషణ భేదములతోగాక, సంఘముగా కూడి ప్రార్థన వాక్య ధ్యానము విజ్ఞాపన వగైరా రీతుల విశ్వాస సంబంధమైన పోరాటమును పోరాడి నిత్య జీవము అను యోగ్యతా పత్రమును పొందుము.
                ఇట్టిదానిని పొందుటకు ప్రతి క్రైస్తవ విశ్వాసి పలుకుబడి తనకున్నటువంటి ''అహం'' అను భావమును చంపుకొని క్రీస్తును అనుసరించుటకును ఆయన సువార్తలో పాలు పంపులు పొందుటకును, ఆయన ఆత్మలో పాలిపంపులు పంచుకొనుటకు ఆయన రాజ్యంలో వారసత్వము సంపాయించుకొనుటకు శారీర వైరాగ్యమును పొంది, శారీరంతోను ఆత్మతోను శారీరేచ్ఛలతోను ఆత్మ సంబంధంగా లోకనాధులు దురాత్మ సమూహములు చీకటి అంధకార శక్తులు, ఆశా వ్యామోహములను గూర్చిన పోరాటంలో జయము పొంది దైవత్వంచేత పిలువబడి, అనేక సమాజములలో అనేక దైవ విశ్వాసుల యెదుట మంచి సాక్ష్యాన్ని పొందాలి.
                ప్రభువును గూర్చి ప్రభువు మనకు చేసినటువంటి మేళ్ళను గురించి మనకు సంభవించిన అగ్ని వంటి శ్రమలలో ఇరుకులు ఇబ్బందులలో లోకదూషణ లోక ప్రభుత్వములచేత ఆటంకములు ఆంక్షలు కల్గినపుడు, ప్రభువు మనకు చేసినటువంటి ఉపకారములను గూర్చి కీర్త 103:1-3 లో వలె మానసిక తృప్తితో సంతోష హృదయంతో సంపూర్ణ ఆనందంతో సంఘమెదుటను సమాజముల ఎదుటను మంచి సాక్ష్యయుత పోరాటమును పోరాడాలి. ''నా ప్రాణమా ! యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున నున్న సమస్తమా ! ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ! యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు''. ఇట్టి వారి కొరకే మోక్ష రాజ్యద్వారము తెరచి పెట్టబడియున్నది. అట్టి లోక సంబంధమైన యుద్ధములు చేసినవారే నిజమైన క్షత్రియులు.
                ప్రభువునందు ప్రియపాఠకులారా ! బైబిలు బహుసత్యవేదమని బహు గొప్ప ఆత్మీయ కనువిప్పు కల్గించి నరునియొక్క జ్ఞానమునకు సన్నిహితమై నరునిలో వున్నటువంటి అజ్ఞాన పొరను శస్త్రచికిత్స లేకుండగనే తీసివేయగల బహు పదునుగల శస్త్రముగా బైబిలు వాక్యము చేయగలదని ఈ క్రింది వేదభాగాల ద్వారా తెలిసికోగలము.
                ప్రియపాఠకులారా ! ఈ శ్లోకంలో రచయిత తన రచనలో క్షత్రియులైనవారే యుద్ధములో స్వర్గద్వారమును ప్రవేశించుదురని అంటున్నాడు. నిజమే, ఎవరీ క్షత్రియులు ? వేదములో మనము తెలిసికొందము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడినవాడు అబ్రహాము. అందులో జయించి జయము పొందిన తన కుమారుని బ్రతికించుకొనుటయేగాక గొప్ప రాజవంశాలకు తండ్రి ఆయెను. కాబట్టి క్షత్రియులకు మొట్టమొదటి పితామహుడు అబ్రహాము. రెండవవాడు యాకోబు, ఇతడు దేవునితో తెల్లవారు పర్యంతము పెనుగులాడి పోరాడి - దైవత్వంచేత ఎంపిక చేయబడి జయాన్ని సాధించి విజయుడై యాకోబు అను నామమునకు ప్రతిగా ఇశ్రాయేలు అను దైవిక నామమును పొందాడు. ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలు, ఇది క్షత్రియ సమూహము. ఇందులోని 12 గోత్రాలు 12 రాజ్యవంశాలకు అనగా క్షత్రియ వంశాలకు సాదృశ్యములై యున్నవి.
                ఇక మూడవ క్షత్రియుడు ఇశ్రాయేలు అను జనాంగమునకు నాయకుడుగా దేవునిచేత ఎంపిక జేయబడి 40 సం||లు ఆ జనాంగముతో శ్రమపడుచు ఐగుప్తు అను శతృరాజులతో శారీరయుతముగాను, ఆత్మ సంబంధంగాను మంచి పోరాటము పోరాడి దేవుడు తనకిచ్చినటువంటి ఆ మహాస్త్రమైనటువంటి కఱ్ఱగా వున్న ఆయుధముతో ఫరోసైన్యాలను సముద్రాలను నదులను జయించి, ఆ శస్త్రము ద్వారా సప్తతెగుళ్ళను ఐగుప్తు మీద రప్పించి విజయుడై నిజమైన క్షత్రియునిగా వీరస్వర్గమలంకరించినాడు. ఈ విధంగా యెహోషువ సంసోను గిద్యోను సౌలు దావీదు సొలొమోను పాత నిబంధనలోని రాజవంశములన్నియు ఈ క్షత్రియ వీరత్వమును కల్గి నిజమైన క్షత్రియులుగా దైవత్వంలో ఎన్నికచేయబడి వీరస్వర్గాన్ని పొంది, వారు వేదంలో తమ చరిత్రను సార్ధకం చేసికోగల్గినారు.
                ఇక నూతన నిబంధనలో అలనాటి పాత నిబంధనలో రీతిగా ప్రకటన 5:5 అనగా ఆనాటి నిజమైన క్షత్రియుడైన దావీదు చిగురును యూదా గోత్రపు సింహంగా రూపించబడి ఏసు ఆయన వంశములేగాక, క్రీస్తు ప్రభువు కూడా సింహము అనగా క్షత్రియుడే. ఇతను గూడ ఏడు ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందెనని చెప్పుటలో పరమక్షత్రియుడు యూదా గోత్రపు సింహము దావీదు రాజవంశమైన ఏసుప్రభువును, లోకనాధులను పిశాచి తంత్రములను లోకసంబంధములైన విమర్శలు హేళనలు నిష్ఠూరములను లెక్క చేయకుండ లోకనాధులచేత అన్యాయపు తీర్పుకు గురియై, సత్యవంతుడును నిత్యజీవితుడును నిష్కళంకుడు పరిశుద్ధుడు అయిన ఏసుప్రభువును దోషిగాజేసి రాజద్రోహిగాను దైవదూషకునిగాను దోషారోపణజేసి ఆయనను గాయపరచి సిలువలో కొట్టి చంపినను, మూడవ దినమున సమాధిబండను బ్రద్దలుజేసి మరణ విజయుడై పునరుత్థానుడై అహరోనుడైన మహాపరమ క్షత్రియ వీరుడే ఏసుక్రీస్తు ప్రభువు. ఈయన లోకాన్ని లోకేచ్ఛలను మానవత్వాన్ని మానవ కుతంత్రాన్ని, లోకానికి దాపురించిన పాపాన్ని దానిమూలంగా వచ్చిన దైవశాపాన్ని వాటి జీతమైన మరణాన్ని, నరుల నుండి నిర్మూలించుటకు తానే లోకసంబంధమైన గొప్ప పోరాటమును ఆత్మ సంబంధమైన దురాత్మల సముదాయముతో పోరాటము, అంధకార సంబంధ మరణముతో పోరాడి విజయుడై పరలోకమందును భూలోకమందును ప్రధానత్వమును పొంది, భూలోకంలో ఏడు ఖండాలలోను పరలోకంలో దేవుని రాజ్యమంతటిలోను ఈయన మహిమపరచబడియున్నాడు.
                కనుక ప్రియపాఠకులారా ! ఈ పరమార్ధమును చదివిన మీరును ఇట్టి పరమక్షత్రియుడైన ఏసు ప్రభువు యొక్క చరిత్రలోని నిగూఢ సత్యాలను గ్రహించినవారై మనము చేసిన పాపమునకు పశ్చాత్తాప్తులమై ఆయనను విశ్వసించినట్లయితే మనముకూడా పరమక్షత్రియుల పిలుపులో పాలు పంపులు పొందగలమని మొదటి పేతురు 2:9-10 మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజగా నుండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి, ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడిన వారైతిరి''. ఈ విధంగా మనము పరమ క్షత్రియుల జాబితాలో చేర్చబడుటయేగాక, యేసుప్రభువు యొక్క ఆత్మను పొందుట ద్వారా దేవునిచేత కనికరింపబడి ఆయన ప్రజలుగాను ఆయన సొత్తుగాను జీవించగలము. అనగా పరమక్షత్రియులుగాను పరమాత్ముని బిడ్డలుగాను పరిశుద్ధజనముగాను దేవుని సొత్తయిన వంశములుగా ఏర్పరచబడియున్నట్లు ఈ వేదభాగంలో చదువగలము. అంతేగాని లోకసంబంధమైన క్షత్రియ వంశములు మానవులచేత లోకంచేత ఎంపిక చేయబడియున్నది.
                అయితే నిజమైన క్షత్రియుడు పరసంబంధమైన పోరాటమునకు ఏర్పరచబడినవారని మనము గ్రహించవలసియున్నది. ''మంచి పోరాటము పోరాడితిని - ఇక నా పరుగు కడ ముట్టించితిని - ఇకమీదట నాకు జీవ కిరీటముంచబడియున్నది'' అని పౌలు వక్కాణించి యున్నాడు. ఇట్టి పోరాటంలో పాల్గొని పోరాడిన క్షత్రియ అనగా వీరులు కొర్నేలి, శతాధిపతి, పౌలు వగైరాలు.
                కనుక ప్రియపాఠకులారా ! పోరాటమన్నది భూమికే పరిమితము కాదు. దృశ్యమైన వాటితోనే పోరాడాలనే సిద్ధాంతం కాదు. అదృశ్యంలో వున్న వాటితో పోరాడవలసిన విధి ఎంతయో వున్నది. ఇట్టి పోరాటం పోరాడాలంటే కేవలం దేహ సంబంధమైన క్షత్రియత్వము నిరుపయోగము. ఆత్మసంబంధమైన శక్తివంతమైన పోరాటము నిజమైన క్షత్రియత్వమును బైల్పరచుచున్నట్లు యేసుప్రభువు పోరాడిన పోరాటంలో అనగా లోకనాధులతోను లోక రాజులతోను వేదాంతులు శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు రాణువులని దృశ్యమైన వారితో గెత్సెమనే వనంలో ఆత్మసంబంధమైన ప్రార్థనయుతమైన శోదనపూరితమైన పోరాటమును  పోరాడి, అటుతర్వాత మానవ లోకంతోను మానవ రాజ్యచట్టములతోను సాతాను సమాజముతోను రక్తము కారునంతవరకు పోరాడి మరణవిజయుడై పునరుత్థానుడై నాడు లోకస్థులచేత యూదుల రాజు అని హేళన చేయబడిన ప్రభువు, నేడు ఏడు ఖండాలకు మరియు ఇహపరలోకంబులకు రాజై తన రెండవ రాకడలో రాజులకు రాజుగాను చక్రవర్తులకు చక్రవర్తిగాను ప్రభువులకు ప్రభువుగాను నియమితుడై, లోకమునకు తీర్పు తీర్చుటకు తీర్పరిగా కూడా రాబోవుచున్నట్లు ప్రతియొక్కరము గ్రహించవలసిన నిగూఢసత్యము. ఇది నిజక్షత్రియ ధీరవీర శూరత్వపు ఫలితములు.
                33వ శ్లోకం :- ఒకవేళ నీవీ ధర్మయుక్తమైన యుద్ధమును జేయకుందువేని నీ స్వధర్మమును కీర్తిని సైతము కోల్పోయిన వాడవై పాపము పొందుదువు.
                ఇక్కడ శ్రీకృష్ణుడు - ఈ ధర్మాన్ని నీవు ఆచరించకపోతే స్వధర్మ నిరసంచేత పాపివి అవుతావు, కీర్తిని పోగొట్టుకోవడంవలన ఇతరులకు ఆదర్శప్రాయుడివి కాకపోవడం చేత దుష్కీర్తిని పొందుతావు కనుక ఈ యుద్ధాన్ని చెయ్యి. అని నీ జీవనపోరాటానికి వెరచి పాపభావనలను వృద్ధి పరచుకోవడం వలన నీవు హేయుడవవుతావు. కనుక నీకు ఈ జీవనపోరాటం శ్రేయం ప్రేయం కూడ అని హితవు పలుకుతున్నాడు. ఇది ధర్మంకోసం చేసే పోరాటమేగాని హేయమై ఇతరులను చంపుటకొరకు చేసే పోరాటం కాదు. అధర్మ వినాశక యుద్ధమే ఇది. అధర్మాన్ని ఎదిరించవలసిన బాధ్యత నీకు అర్జునునిగ తెల్లని సత్త్వగుణ సంపన్నునిగ కల్గిఉన్నావు. సత్వగుణం  తాపస గుణాన్ని అధర్మానికి కారణ భుతమైనదాన్ని నశింపచేయడం ప్రధమ కర్తవ్యం కదా !
                దీనినే నీ స్వధర్మమును అని శ్రీకృష్ణుడు అర్జునునికి తెలుపుతున్నాడు.
                బైబిలులోని భగవద్గీత :- ప్రియపాఠకులారా ! ఒకవేళ నీవు ఈ ధర్మయుక్తమైన యుద్ధమును చేయకుందువేని'', అనుటలో ధర్మయుక్తమైన యుద్ధము, అధర్మయుక్తమైన యుద్ధము కపటోపాయంతో కూడిన యుద్ధము కూడా వున్నదని ఇందులోని భావము గోచరిస్తున్నది. ఈ సందర్భంలో బైబిలు రీత్యా ఇట్టి యుద్ధాలను గూర్చి మనము తెలిసికోగలము. అధర్మయుద్ధము:- కయీను జేసిన సోదర హత్య ఇది అక్రమము అన్యాయముతో కూడినది. రెండవది ఆదాములేని సమయంలో హవ్వతో కపటోపాయంతో జేసిన తంత్రయుద్ధము. ఇది యావద్‌ నరకోటికి సంప్రాప్తించిన పాపము శాపము మరణము అను మహోపద్రవమునకు మూలమైనది.
                న్యాయాధి 6:లో గిద్యోను మిద్యానీయులతో చేసిన యుద్ధము దైవజ్ఞానంతో ఆయుధము లేకుండ వీరోచితంగా చిన్న సైన్యంతో చేసిన యుద్ధము - ఇది శతృవులను  శతృవులే హతమార్చుకొనునట్లు జేసి దైవజనాంగమునకు విజయము చేకూర్చినది. ఇశ్రాయేలీయులలో మరణదూత జరిగించిన తొలి చూలి సంహారక యుద్ధము. ఇది నరునికిని లోకానికి అశక్తకరమైన యుద్ధము. ఈ యుద్ధంలో సంహారదూతను ఎదుర్కొను వీరుడు లేకుండాపోయాడు. అనగా సంపూర్ణంగా లోకము అపజయం పాలైంది. దైవసంకల్పము లేకుండా సౌలుజేసిన యుద్ధము దేవుని ఆశీర్వాదము కోల్పోయి కుత్సితంతో కుట్రతో అమర్యాదతో దైవదాసుడైన దావీదుపట్ల వ్యవహరించి అతనిని చంపాలని యత్నించి సమూయేలుచే జరపవలసిన బలియాగము తాను జరుపుటకు నిశ్చయించి తానే జరిగించి, భ్రష్ఠుడై దైవత్వం నుండి వెలివేయబడి యుద్ధంలో సమూలంగా నాశనమైన సౌలు జీవితము ఇది దైవానుగ్రహములేని పోరాటము. మరియు సోదె చెప్పుట ద్వారా పిశాచముల సహాయమార్జించి సంపాయించుకున్న దైవశాపమరణమైన పోరాటము.
                ప్రియపాఠకులారా ! మోషే చేసిన యుద్ధాలు ఇశ్రాయేలుకు జయాన్ని చేకూర్చింది. యెహోషువ చేసిన యుద్ధము దైవజనాంగమునకు దైవత్వానికి కీర్తి గల్గించింది. నూతన నిబంధనలో ఏసుప్రభువు సాతానుతో పోరాడిన పోరాటము దైవ విజయానికి కారణమైంది. ఏసుప్రభువు ఏర్పరచుకున్న అపోస్తలులు వేదసాక్షులు హతసాక్షులు జరిగించిన ఆత్మీయ పోరాటంలో విజయాన్ని సాధించి, నేడు ఏడు ఖండాలలోను వారు గొప్ప యోధులుగా ఎంపిక చేయబడియున్నారు. ఇట్టి ఎంపిక అన్నది పరలోక భూలోకములకు కూడా ఖరారు చేయబడియున్నది.
                ప్రియపాఠకులారా ! రెండవదిగ ధర్మయుక్తమైన యుద్ధము చేయనివాడు స్వధర్మమును కీర్తిని సైతము కోల్పోయి పాపం పొందుతాడని అంటున్నాడు. ఇందునుగూర్చి బైబిలిచ్చు సమాధానమును మనము తెలిసికోగలము. ఈ సందర్భంలో సౌలురాజు జీవితాన్ని ఉదా||గా తీసుకొందము. సౌలు గాడిదలను కాచుకుంటూ తాను పోగొట్టుకున్న గాడిదను వెదకుచు దైవానుగ్రహం పొంది దేవుని పరిశుద్ధ జనాంగమైన ఇశ్రాయేలుకు రాజయ్యాడు. దైవరక్షణ వలయంలో వున్నంతకాలం దేవునికి ప్రీతిగా జీవించి ఎన్నో ధర్మ యుద్ధాలు దైవపక్షంగా జేసి విజయాలు సాధించి సత్కీర్తి పొందినాడు. అయితే ఫిలిస్టీయులతో తనకు యుద్ధము సంభవించినప్పుడు దైవత్వమునకు విజ్ఞాపనజేసి దైవాజ్ఞానుసారంగా అధికారం పొంది దైవ అడుగుజాడలలో నడవవలసిన విధిని వదలిపెట్టి సోదెదాని మాట విని మరణం పాలైనాడు. ఇంకనూ బలిపీఠము దగ్గర యాజకులు చేయవలసిన బలికార్యక్రమాన్ని తనపై వేసికొని దైవాజ్ఞను వ్యతిరేకించి, యాజకులు చేయవలసిన పనికి తాను బూనుకొని బలియర్పించి భ్రష్ఠుడైనట్లు కూడా గ్రంథములో చదువగలము.
                ఇంకనూ వసంతకాలంలో యుద్ధాలు చేయవలసిన సమయంలో దేవుని విధినిబట్టి దైవజనాంగంతో జేరి యుద్ధము చేయవలసిన విధి నిర్ణయముల వదలి, రాజాంతఃపురములో మేడమీద పచార్లు చేస్తూ దావీదు మహారాజు తన స్వధర్మమును విడిచి, వివస్త్రగా స్నానము చేయుచున్న స్త్రీని మేడ మీద నుండి చూచి ఆమెను మోహించి స్వార్ధపరుడై ఆమె భర్తను అన్యాయపు యుద్ధంలో జంపించి, తన ధర్మమును కీర్తిని కోల్పోయినవాడై అక్రమకారుడుగా ఎంచబడినాడు. అనగా పాపిగా దేవుని సమక్షంలో ఎన్నికైనాడు.
                34వ శ్లోకం :- సకల భూతములును ఎన్నటికిని, తరుగని నీ అపకీర్తిని గూర్చి చెప్పకొనుచుండును. లోకముచే సన్మానింపబడువానికి అపకీర్తి మరణముకంటె ఎక్కువైనది.
                అధర్మాన్ని ఖండించవలసిన సమయంలో అధర్మాన్ని ఖండించకపోతే కూడ అధర్మాచరణ చేసినట్లే. కనుకనే అధర్మాచరణ చేసినవారిని ఏవిధంగా లోకం చీదరిస్తుందో అదే విధంగా అధర్మ వినాశకుడు తన కర్తవ్యం చేయనపుడు అతనిని చీదరించుకుంటుంది. ఈ చీదరింపునే అపకీర్తి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. సామాన్యంగా మరణించినవానిని గురించి ఎవరూ పట్టించుకోరు. ధర్మాన్ని వ్యతిరేకించినవారిని కీర్తిమంతునిగా శ్లాఘిస్తారు. ఎవరయితే అధర్మాన్ని ఖండించరో వానిని పిరికివాడని ధర్మరక్షణ విముఖుడని, కార్యనిర్వహణ దక్షతలేనివాడని నిందిస్తారు. ఇదే అపకీర్తి. కనుక ఇట్లా మరణించినవారికి అపకీర్తి రావడం తధ్యం, కీర్తి లేకపోయినా ఫరవాలేదు కాని అపకీర్తి ఉండడం మంచిదికాదు కదా ! ఈ భావాన్నే మరణముకంటే గొప్పది అని అంటున్నారు శ్రీకృష్ణపరమాత్మ.
                భగవద్గీతకు బైబిలురీత్యా పై విధంగా పరాభవం పొందుచున్న దావీదు మహారాజుయొక్క అపకీర్తి నాటి నుండి నేటివరకు బైబిలు గ్రంథంలో ఒక చరిత్రగా నిలబడియున్నది. అదేవిధంగా సౌలురాజు యొక్క అపరాధము కూడా పరిశుద్ధ గ్రంథంలో చారిత్రాత్మకంగా నిలిచిపోయింది.
                ఇక రెండవదిగ లోకముచే సన్మానింపబడువానికి అపకీర్తి మరణముకంటె ఎక్కువైన దంటాడు. అనగా లోకములో గొప్ప పేరు ఆర్జించిన వ్యక్తికి సంభవించు దోషాత్మకమైన అపకీర్తి అతడెన్ని సత్కార్యములు చేసి పుణ్యవంతుల జాబితాలో చేర్చబడినప్పటికిని అతనికి సంభవించిన అపకీర్తి అపకీర్తిగానే వుంటుంది. అనగా మాయని మచ్చగా చరిత్రలో నిల్చి వుంటుందని భావము. ఇట్టి అపకీర్తి కంటె మరణం మేలంటున్నాడు. మరియు సామెతల గ్రంథంలో చచ్చిన సింహము కంటె బ్రతికిన కుక్క మేలన్నట్లుగా బైబిలు చరిత్రలో రాజులుజేసిన దోషకృత్యాలు మరణానికంటె గొప్పవిగా ఎంచబడినట్లు చదువగలము.
                35వ శ్లోకం :- నీవు ఈ యుద్ధము నుండి పిరికితనమునంజేసి తొలగిపోయితివని మహారధులైన వీరులందరును తలంతురు. ఎవ్వరికి నీవింతవరకును సమ్మానపాత్రుడవై యుంటివో వారికే ఇంక చులకనయై పోయెదవు.
                మహారధులయిన వీరందరూ తలుస్తారు అని అంటూ ఈ మహారధులైనవారు ధర్మరక్షణ యుద్ధం చెయ్యనపుడు అందుకు పరిహసించే అధర్మపరులైన కామక్రోధాదులు, ప్రతిపక్షంలో ఉన్న అధర్మపరులైనవారు మాత్రమే చెప్పబడుతున్నారు. అలాకాకపోతే అవతల విపక్షంలో ఉన్న మహారధులు భీష్మాదులు, భీష్మద్రోణ కృపాదులకు అర్జునుని ప్రతాపం, యోద్ధులక్షణం అందరికీ తెలుసు.
                ఈ శ్లోకంలోని మహారధులైన వీరులెవ్వరో మనము వేదరీత్యా తెలిసికొందము. నిజమే, పోరాటంలో విజయాన్ని బదులు అపజయం దాపురించినపుడు పిరికితనమన్నది ఆవరించుట సహజము. మహారధులనగా సొలొమోను ఇట్టివారిలో ప్రధముడు. రథముల సంఖ్యలోను గుఱ్ఱపు రౌతులు గుఱ్ఱముల సంఖ్యలోను మహారధుడై యున్నాడు. ఈయన కేవలం లోకరీత్యా మహారధుడైనప్పటికిని మహాజ్ఞానిగా పరమగీతములు సామెతలు ప్రసంగి విలాపవాక్యాలు అను నాలుగు వేదభాగాలను తనస్వజ్ఞానంతో కాక పరమాత్మ జ్ఞాన శక్తితో రచించి గొప్పజ్ఞానిగా దైవగ్రంథంలో కీర్తిని సంపాదించినాడు.
                మరి ఇట్టివాడు పరిశుద్ధ వేదంలో తన జ్ఞాన సంపత్తి చేత స్వదేశ విదేశాలలో కీర్తిని సంపాదించి తనజ్ఞాన ప్రభావమూలమున షేబాదేశపు రాణివంటి విదేశ వేదాంతులను ఆకర్షించి గొప్ప జ్ఞానిగా ప్రజలయెదుటను రాజులయెదుటను లోకము ఎదుటను దైవసన్నిధిలోను ప్రవేశించినాడు. అయితే తన స్వకీయ దురాశలోపడి పరస్త్రీ వ్యామోహము ఉచితానుచితములు ధర్మాధర్మములను వదలి రాజధర్మమును వీడి దైవ సిద్ధాంతములను విస్మరించి కులముగాని కులము - జాతిగాని జాతి - మతముగాని మతస్థులైన అమ్మోరీయులు మోయాబీయుల వంశపు స్త్రీలను మోహించి వారిని పెండ్లాడి వారితో లైంగిక సంబంధములేర్పరచి, తన కైశ్వర్యమును జ్ఞానమును పరిపాలనాదక్షత ననుగ్రహించిన యెహోవా దేవుని విస్మరించి తుచ్ఛమైన అన్యస్త్రీల యొక్క దేవతలకు బలిపీఠములేర్పరచి, దేవునికి తాను కట్టినటువంటి ఆలయమెదుట బలులర్పించి భ్రష్ఠుడై దైవత్వానికిని మానవత్వానికిని చులకనైపోయినట్లు గ్రంథములో మొదటి రాజులు 11:9-13లో మనము చదువగలము.
                36వ శ్లోకం :- నీ శతృవులు నీ సామర్ధ్యమును నిందించుచు నిన్ను అనగూడని మాటలెన్నేని యందురు. అంతకంటె దుఃఖకరమైనదేమున్నది ?
                ఈ లోకంలో దుఃఖాన్నిచ్చేది బాహ్యవస్తువులు కాదు. శరీరాంతర వస్తువులు మాత్రమే. బాహ్యమిత్రులు శత్రువులు ఈ ప్రాణి నడవడిని బట్టి నడుస్తారు. ప్రాణితనలోని దైవిక శక్తులుఆసురీశక్తుల ప్రాబల్యంవలన ప్రవర్తించి దుఃఖాన్ని కొనితెచ్చుకుంటాడు. కనుక దుఃఖం ఆంతరయుద్ధం వలన ఆసురీశక్తుల ప్రాబల్యంవలన కల్గుతుంది. అవి ఈ ధర్మాచరణ చేసే జీవుని ఆక్షేపిస్తూ ఉంటాయి. అధర్మం చేసే దైవీశక్తులు ఆక్షేపిస్తూ ఉంటాయి. అదే దుఃఖానికి కారణం. దానివలన ప్రాణికి అవసరంలేని క్రోధం కల్గుతుంది. సామర్ధ్యనింద ప్రాణి లౌకిక సామర్ధ్యాన్ని ప్రకోపింప చేస్తుంది.
                ప్రభువునందు ప్రియపాఠకులారా ! ఈ శ్లోకాన్ని గూర్చి బైబిలురీత్యా మనము యోచించవలసియున్నది. నీ శత్రువులు :- నరునికి శత్రువులు ఎవరునులేరు. ఒకరినొకరు కలహించుకుంటేనే తప్ప శత్రుత్వమన్నది ప్రత్యేకించి లేదు. శతృత్వమన్నది గలతీ 5:19-21లో వలె శరీర స్వభావమైయున్నది. శరీర కార్యములు స్పష్టమై యున్నవి. అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టివాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పైవన్నియు చేరితేనేగాని శతృత్వమునకు రూపము లేదు. పైవాటి మూలంగా శతృత్వమును పెంచుకొని దేవునిచే ఏర్పాటు చేయబడిన వ్యక్తులను సైతము సాతానుడు మరణపాత్రులుగా జేసినట్లు వేదంలో మొట్టమొదటగా కయీను పైగుణములచేత తమ్మునిపై కక్షబూని దైవత్వం మీద అలిగి, తన సోదరుని ద్వేషించి చంపినట్లు ఆది 4:లో చదువగలము.
                అదేవిధంగా సౌలును దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా నియమిస్తే తన రాచరికపు పూర్వస్థితిని సౌలు మరచి అనగా గాడిదలు మేపేటటువంటి జీవితంలో వున్న తనను జనాంగమును ఏలునట్టి జీవితమును దేవుడనుగ్రహిస్తే, అట్టి ఔన్నత్యాన్ని విస్మరించి తన అల్లుడును దైవసంభూతుడైన దావీదు మీదికి సాతాను ప్రేరేపణచేత ఈటెను చేతపట్టి దావీదును చంపాలని ప్రతిదినము ప్రతిక్షణము పోరాడినాడు. కాని చంపలేకపోయాడు. అదేవిధంగా దైవజనాంగమైన ఇశ్రాయేలీయులను దైవ విరోధియైన సాతానుడు చిక్కులబెట్టి వారిచేత పాపకార్యములు చేయించి దైవజనాంగమైన ఇశ్రాయేలీయులకును దేవునికిని విరోధాన్ని పుట్టించాడు. అంతేగాకుండ తన సంబంధితులైన ఫరో అనగా ఐగుప్తీయులచే ఇశ్రాయేలీయులను బాధించి ఎన్నో శ్రమల పాల్జేశాడు. ఇదియు అపజయమైంది.
                ఇక క్రొత్త నిబంధనలో ఏసు బాప్తిస్మం పొంది 40 దినములు ఉపవాస ప్రార్థనచేసి లోకసంబంధమైన దైవ విరోధమైన శక్తులతో పోరాడినట్లు లోక విరోధియైన సాతానును జయించినట్లును చదువగలము. అంతియేగాక దైవసంకల్పానుసారం ఏసుప్రభువు మనుష్యుల చేతికి అప్పగించబడి అనేక శ్రమలు పొంది, సాతానుచేత హేళన చేయబడి సిలువ మరణం పొంది మూడవదినమున మరణాన్ని సమాధిని సాతానును కూడా జయించి, పునరుత్థానుడై ప్రత్యక్షమైనపుడు కూడా సాతానుడు ఆనాటి రాజ్యభటులలో జేరి ఏసుప్రభువు లేవలేదని, ఆయన శిష్యులు ఆయనను మోసుకొని పోయారని అబద్ధపు ప్రచారములతో అనగూడని మాటలెన్నియో అన్నట్లుగా వేదంలో మనము చదువగలము.
                ప్రియపాఠకులారా ! ఇంతకూ నేను వివరించు అంశములో మన శతృవులను గూర్చి మనము తెలిసికొనవలసినదేమిటంటే మన శత్రువు లెవరోకాదు. మనలను సృష్టించిన దేవునికి విరోధియే మన శతృవు అనగా మనకు జన్మనిచ్చిన తండ్రికి ఎవరు విరోధియో అతడే మన విరోధి కూడా - ప్రియపాఠకులారా ! మనమేదైనా ఒక మంచి కార్యము అనగా దైవత్వమునకు ప్రీతికరమును మానత్వానికి యోగ్యకరమైనటువంటి కార్యమును తలపెట్టి దానిని కొనసాగించుచున్నప్పుడు, మన శతృవైన సాతాను మన స్వకీయులలోను మన మిత్రులలోను మన సన్నిహితులలోను చేరి హేళన భావంతో అలనాడు నోవహు ఓడను ఏర్పరచుకొని రానున్న జలప్రళయం గూర్చి ప్రవచించునపుడు అతని అల్లుళ్ళు అతనిని హేళనజేశారు.
                అదేవిధంగా లోతును దేవదూతలు సొదమ గొమర్రా పట్టణాన్ని వదలిరమ్మని తొందరజేసినపుడు లోతు అల్లుళ్ళలో సాతానుడు జేరి ఆయనను వెక్కిరింపజేశాడు. అట్లు వెక్కిరించిన నోవహు అల్లుళ్ళుగాని లోతు అల్లుళ్ళుగాని రక్షణానందాన్ని పొందలేక మరణాన్ని చవిచూచి మాయమైపోయారు. కనుక నరునికి లోకంలో శతృవు సాతానని అతడు ఎన్నో కుయుక్తులతో మన సన్నిహితులలోనే చేరి మనలను అనగూడని మాటలను రహస్యంగా నరులచేత అనిపిస్తూ మనదైవిక పురోభివృద్ధికి అడ్డుపడుచుంటాడు. అట్టి సమయంలో అట్టి పరిస్థితి దైవ విశ్వాసులమైన మనకు కల్గినపుడు శోదన బాధ దుఃఖము ఇరుకు ఇబ్బంది కలుగక మానదు. ఇందుకు యోబు దృష్టాంతమైయున్నాడు. యోబు సర్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరకు తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తీరని క్షోభను పొందినాడు. భార్యకును తన ఆప్తులకును హేళనాస్పద మయ్యాడు. అయినను సాతానుతో పోరాడినాడు. తన శత్రువైన సాతానును తాను జయించగల్గినాడు. తాను పొందిన దుఃఖమునకు ప్రతిగా విశేషమైన సంపద సంతానము మంచి ఆయుర్దాయము సుఖశాంతులు పొంది దైవత్వం చేత ఆశీర్వదింపబడి బైబిలు చరిత్రలో తనపేరు సార్ధకం చేసుకొన్నాడు. ఏసుప్రభువునుసిలువమీద నుండి దిగిరమ్మని ఆయనను నిందించుచు అనగూడని మాటలన్నాడు.
                కాబట్టి ప్రతిమానవునికిని శత్రువైన సాతానుతో ఆత్మీయ పోరాట మవసరమైయున్నది. జీవాత్మన్నది పరమాత్ముని సొత్తు. పరమాత్మ పరమరాజ్య సంబంధి. ఆయన నరులమైన మనలో జీవాత్మునిగా వుండగా అలౌకిక ఆత్మ అనగా అపవిత్రాత్మ మరియు అపవాదిగ మనలో క్రియ జరిగిస్తూ - జీవాత్మలైన మనలను భ్రమపెట్టి పరలోక దేవునితో పోరాటానికి ప్రతినిత్యము ప్రేరేపిస్తున్నాడు. ఇందునుగూర్చి పౌలు భక్తుడు - ఎఫెసీ 6:12లో విధంగా అంటున్నాడు. ''ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను, ఆకాశమండల మందున్న దుర్మాతల సమూహములతోను పోరాడుచున్నాము'', కాబట్టి మనము ఆత్మీయంగా మంచి పోరాటం పోరాడాలి.
                37వ శ్లోకం :- చచ్చినచో స్వర్గమును పొందుదువు. గెలిచినయెడల రాజ్యము ననుభవింతువు. కావున యుద్ధము చేయుటకే నిర్ణయించి లెమ్ము.
                ఈ ధర్మయుద్ధంలో చివరికి మిగిలేది మరణమో రాజ్యమో !? విజయం వలన రాజ్యలక్ష్మి ఇది శరీరరాజ్యం. మరణిస్తే అలౌకిక రాజ్యం స్వామి సామ్రాజ్యం అని భావన.
                పరిశుద్ధ గ్రంథ వివరణ :- ప్రియపాఠకులారా ! చచ్చినవాడు స్వర్గాన్ని పొందుతాడన్న ఈ వివరణ కేవలం భ్రమ. చచ్చిన ప్రతియొక్కడు స్వర్గానికి పోయేటట్లయితే యేసుప్రభువు ఈ లోకానికి రావటము వ్యర్ధమే. చావన్నది దేవుడిచ్చిన శాపము. మరియు ప్రతినరజీవికి అదియొక ముల్లు. మరణపు ముల్లు విరిచేందుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చావన్నది శరీరానికే కాదుగాని ఆత్మ మరణము ముఖ్యమైయున్నది. దేహమరణమన్నదేనాటికైనా ఏ స్థితిలోనైనా జరుగక మానదుగాని ఆత్మీయ మరణమన్నది జీవాత్ముని చాలా అధోగతిలోకి పడద్రోయుటకు మూలమైయున్నదని ఎఫెసీ 2:1లో మనము చదువగలము. ''మీ అపరాధముల చేతను పాపములచేతను మీరు చచ్చిన వారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను'' ప్రకటన 14:13 అంతట - ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి పొందు మృతులు ధన్యులు''. అనిన విధంగా ఈ మరణమన్నది ఏసుప్రభువులో ఆయన నామములో ఆయన పిలుపులో సంభవించినట్లయితే అదియే ధన్యకరమని అట్టివారే ధన్యులని అట్టివారికే మోక్షరాజ్య ప్రవేశమని బైబిలు అద్దం పట్టినట్లుగ వివరిస్తున్నది. అంతేగాని లోకసంబంధమైన యుద్ధంలో సాతానుతో చేతులు కలిపి లోకాశలతో కూడిన కుయుక్తికరమైన పోరాటములో పోరాడి మరణించేవారికి కాదు. ఇందునుగూర్చి పౌలు భక్తుడు మరణాన్ని గూర్చి వివరిస్తూ - ''మంచి పోరాటము పోరాడితిని - నా పరుగు తుదముట్టించితిని. ఇకమీదట నా కొరకు జీవకిరీటముంచబడి యున్నది'' అని అంటున్నాడు. ఇదియే పరలోక రాజ్యము.
                ఇక రెండవ అంశంగా గెలిచిన యెడల రాజ్యముననుభవింతువు''. అంటున్నాడు. ప్రియపాఠకులారా ! యాకోబు దైవత్వంతో పోరాడి గెలిచాడు. యోబు సాతానుతో పోరాడి గెలిచాడు. దావీదు దైవజనాంగంతో చేరి దైవ విరోధులతో పోరాడి మహారాజైనాడు. ఆయన కుమారుడైన సొలొమోను రాజ్యపరిపాలనతో పోరాడి దైవజ్ఞానంతో దానిని గెలిచాడు. దానియేలు ప్రార్థనాశక్తితో పోరాడి సింహాలను జయించాడు. యోసేపు దైవానుగ్రహంతో లోకాన్ని జయించి ఫరో సర్వసంపద మీద అధికారి అయ్యాడు. అదేవిధంగా ఏసుప్రభువు గెత్సెమెనులో రక్తస్వేదమును కార్చి ప్రార్థనాపూర్వకంగా శోదనను మరణపాత్రను జయించాడు, బలవంతుడాయెను. పౌలు తన రాచరికాన్ని వదలి ఎనిమిది సంఘాలకు పత్రిక వ్రాసి లోకములో పోరాడి దైవస్థితి పొందినాడు. వీరందరు దైవరాజ్యములో పాలిభాగస్థులును వారసులును అయ్యారు.
                అయితే దైవకుమారుడైన ఏసుప్రభువు మోక్షరాజ్యమును అనుభవిస్తున్నట్లును గొర్రెపిల్ల సింహాసనముగా తానే అయివున్నట్లుగా తండ్రియైన దేవుని సింహాసన కుడి పార్శ్వమున కూర్చుండి సర్వమునకు తానే అధినాధుడుగా యున్నట్లుగాను బైబిలులో చదువగలము. ఇట్లు జయించిన ప్రభువైన ఏసుప్రభువు పరలోకమునకును భూలోకమునకును పాతాళమునకును సమస్తలోకాలకు ఆయన అధిపతియైయున్నట్లు ఎఫెసీ 1:7లో చదువగలము. ''యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తనకోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై యుండవలెనని జగత్తు పునాది వేయబడకముందే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలనేర్పరచుకొనెను. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కల్గియున్నది''. కనుక దైవవిశ్వాసియైన ప్రతియొక్కడును దేహ ఇచ్ఛలతో ప్రతినిత్యము పోరాడవలసియున్నది.
                ఇక చివరిగా - కావున యుద్ధమునకు కృతనిశ్చయుడవు కమ్ము'' అంటున్నాడు. కావున ప్రతి వ్యక్తియు లోకరీత్యా తన శరీరమును ఆత్మను సమన్వయపరచి ముముక్షువులై అనగా మోక్షమందు అపేక్షగలవారై ధర్మయుతమైన దైవత్వమునకు ఒప్పిదమైన యోగ్యకరమైన అపో 10:1లో వలె కొర్నేలి వంటి ప్రార్థనా ధర్మకార్యములను ఆయుధాలతో యధార్థ పోరాటమును పోరాడుటకు కృత నిశ్చయులు కావాలని అట్లు పోరాడినవారికి కొర్నేలి ఇంటికి పగలు 3 గంటల వేళ వచ్చిన దైవదూత దర్శన భాగ్యము తధ్యమని ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథం సవివరంగా మనకు వివరిస్తున్నది. అయితే భగవద్గీతలోని పై శ్లోకంలోని అర్థం లయమై పోయేటటువంటి నరజీవితానికే పరిమితమై లోకానికే పోల్చియున్నదిగాని ఆత్మ సంబంధితముగా వున్నట్లులేదు.
                38వ శ్లోకం :- సుఖదుఃఖముల రెంటిని సమానములుగా పెట్టుకొని లాభనష్టములను, జయాపజయములను గూడనట్లే భావించి పిమ్మట యుద్ధమునకు సన్నద్ధుడవగుము. అట్లయిన పాపమును పొందవు.
                ఈ శ్లోకమునకు ఏకాభిప్రాయంతో కూడిన వివరణ :- ప్రియపాఠకులారా ! ఇందులో మొదటగా సుఖదుఃఖములను గూర్చి ధ్యానిస్తాము. లూకా 16:19లో సుఖాన్ని ధనవంతుడు, దుఃఖాన్ని లాజరు అనుభవించారు. ఎల్లప్పుడు తినుచు త్రాగుచు సుఖాన్నే కోరుకున్న ధనవంతుడు నరక వేదనతో కూడిన మరణాన్ని అనుభవించాడు. మరియు దోషిగా దైవసన్నిధిలో ఎంచబడినాడు. అనగా దైవత్వమును కోల్పోయిన వానిగా ఎంచబడినాడు. అందుకే ఆ ధనవంతుడు పాతాళంలో వేదన ననుభవించాడు.
                ఇక దుఃఖమన్నది ధనవంతుని ఇంటివాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టె ముక్కలు అతడు ఎంగిలి చేసిన పదార్థాలను ఆశిస్తూ నికృష్ట అనిష్ట స్థితిననుభవిస్తూ - దేహమంతయు వ్రణములతో వుండి ఆ వ్రణములను కుక్కలు నాకుచుండగా భయంకరమైన దేహబాధతోను, విషపూరితమైన వాతావరణంలో దేహాన్ని చాలించిన లాజరు తన బాధలను సహించి మరణకాలంలో దేవదూతలచేత తన ఆత్మను మోయించుకొని పరమపదంలో అబ్రహాము ఎదురు రొమ్మున తన ఆత్మ కూర్చున్నట్లుగా పై వేదభాగంలో మనము చదువగలము. ఇందులో సుఖించిన ధనవంతుడు తన సుఖానికి తన భోగభాగ్యాలకు మూలము దేవుడేనని ఆయన లేనిదే మానవ జీవితానికి మనుగడ లేదని గ్రహించలేకపోయినాడు. కనుక ఒక వ్యక్తికి సుఖమన్నది సహజంగానే భావించాలని, సుఖ సౌభాగ్యమన్న జీవితము భగవదనుగ్రహము కాబట్టి ఐశ్వర్యాన్ని ప్రేమించకూడదని ఐశ్వర్యానికి మూలకర్తయైన పరమతండ్రినే దృష్టియందుంచుకోవాలని గ్రహించిన మానవుడు తప్పక ఇహపరలోకంలో ప్రధమంగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలడు. ఇట్టి జాబితాలో యోబు మోషే దావీదు మహారాజు యాకోబు కుమారుడైన యోసేపు దానియేలు వగైరాల జీవితాలు ఆదర్శములై యున్నవి.
                ఇక లాభనష్టములు : యోబు విషయంలో తనయొక్క సంపద యావత్తు తుడిచివేయబడింది. అదేవిధంగా ఇశ్రాయేలు జనాంగము మోషే యొక్క గురుత్వంలో 40 సం||లు సంచారంజేసిన రోజులలో ఎన్నో లాభాలు మేళ్ళు అనగా ఫరోవంటి బానిసత్వము నుండి విముక్తులై దేవునియందు లక్ష్యముంచి ఆహారంగా మన్నాను, మాంసాహారంగా పూరేండ్లనుబండ నుండి పవిత్ర జలాన్ని కడుపార తిని త్రాగి మోషే నాయకత్వం ద్వారా దేవుని యొద్ద నుండి ఎన్నో ఆశీర్వాదాలు పొందగల్గినారు. ఇట్టి సమయంలో ఇదే ఇశ్రాయేలు తిండి మత్తు చేత కొవ్వి మోషే అహరోనుల మీద సణిగి దైవత్వం మీద తిరుగుబాటు జేసినపుడు దేవుని ద్వారా పాముల చేతను ఆయన ఉగ్రత చేతను బాధింపబడి తమ జీవితాలను నిరర్ధకం జేసికొన్నారు.
                ఇక జయాపజయాలు :- దైవజనాంగమైన ఇశ్రాయేలీయులు ఫిలిస్థీయులు ఆరామీయులు మిద్యానీయులు అమ్మోరీయులు వగైరా జనాంగములతో యుద్ధముజేయు సందర్భంలో జయాపజయాలను దేవునిపై పెట్టి ''యుద్ధము యెహోవాదే - విజయము యెహోవాదే'' అనిన ధ్యేయంతో యుద్ధాలు జరిగించినారు. అందువల్ల నేటికిని ఇశ్రాయేలీయులు సంతతి దేవుని జనాంగంగా నిలబడియున్నది. అలనాడు దైవాజ్ఞ ప్రకారంగా దైవసిద్ధాంతము ననుసరించి జీవించిన ఇశ్రాయేలీయులు సుఖదుఃఖాలను లాభనష్టాలను జయాపజయాలను సమానములుగా ఎంచి దేవుని ధర్మశాస్త్ర పరిధిలో జీవించినందువల్ల వారి చరిత్ర నేటికిని నిల్చివున్నది. ఆ జనాంగములో శేషము మిగిలి వుంది. వారికి ఒక రాజ్యము కూడా వుంది. నేటి రాజకీయ ప్రపంచంలో వారికి కూడా రాజ్యమున్నది. నిజదేవుని యొక్క చరిత్ర వారి ద్వారా నిల్చివున్నది. ఇంకనూ సకల నరకోటి పాపపరిహారార్థం దేవుడు ధరించిన నరజన్మ కూడా ఈ జనాంగము నుండియే అవతరించినది.
                కనుక ప్రియపాఠకులారా ! భగవద్గీతలో చెప్పబడిన ఈ శ్లోకం యొక్క అర్థము లోకసంబంధమై యున్నదేగాని పరలోక సంబంధితముగా లేదు. లోక సంబంధమైన యుద్ధము నాచరించి మారణహోమమును జరిగించమన్నదే భగవద్గీతలోని ధ్యేయం. అయితే శరీరేచ్ఛలను లోకేచ్ఛలను వాటి వ్యామోహములను చంపి తత్సంబంధమైన ఆత్మీయ అదృశ్య శక్తులను పోరాడి వాటిని జయించి పరలోక సంబంధిత ఐశ్వర్యాన్ని పొందుమని బైబిలు యొక్క ధ్యేయము.
                39వ శ్లోకం :- ఇంతవరకును నీకు సాంఖ్య బుద్ధి చెప్పబడింది. ఇక యోగబుద్ధిని వినుము. ఈ బుద్ధితో కూడిన వాడవగుదువేని కర్మబంధమును త్రెంపగలవు.
                బైబిలు పరమార్థము :- ప్రియపాఠకులారా ! శరీరము ఆత్మకును - ఆత్మ శరీరమునకును పరస్పరము విరోధములైనట్లు బైబిలులోని గలతీ 5:17లో చదువగలము. దృశ్యమైన ఈ రాజ్యమును జయించుటకు అనగా భూలోకరాజ్యమును జయించుటకు శరీరము ఒక సాధనముగాను పరికరముగాను వాడబడుచున్నది. ఇట్లు యుద్ధములో వాడబడుచున్న సైనిక సమూహములే ఈ పరికరాలు. భూలోక సంబంధంగా ఒకరినొకరు జయించుకొనుటకు శారీరయుతమైన జ్ఞానము యుద్ధములో ప్రావీణ్యత ఆయుధాల ప్రయోగములు యుద్ధ సంబంధమైన విద్యలు ఈ లోకరాజ్యమునకు ఆవశ్యములు.
                అయితే ఆత్మీయ రాజ్యమునకు దృశ్యమైన ఆయుధ సంపత్తిగాని సాధనముగాని క్షిపణులుగాని వస్త్రములుగాని రథములు అశ్వములు లేక నేటి ఆధునిక యుగమును బట్టి తుపాకులు టాంకులు విమానములు క్షిపణులుతో కూడిన ఆయుధ సంపత్తిగాని మంచి సాంకేతిక జ్ఞానముగల్గిన యుద్ధవీరులుగాని నిష్ప్రయోజనము. ఎందుకనగా ఆత్మ పోరాటము దృశ్యమైనది కాదు. ఆత్మ పోరాటము ఆత్మ రాజ్యమునకు పరిమితమై యున్నది. అయితే ఆత్మీయ యుద్ధము చేయాలంటే ఆత్మ సంబంధమైన పోరాటమే పోరాడాలి. ఇట్లు పోరాడాలంటే ఆత్మీయ ఆయుధాలు ఎఫెసీ 6:10-17లో వలె వాడవలసియున్నది. దేవుని మహాబలముతోకూడిన సర్వాంగకవచము, నడుముకు సత్యమను దట్టి నీతియను మైమరువు - పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ద మనస్సు అను జోడు, విశ్వాసమనుడాలు, రక్షణయను శిరస్త్రాణము, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొని దుష్టునియొక్క ప్రతివిధమైన అగ్ని బాణములనన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు''. దీనినే యోగబుద్ధి అందురు. ఇట్టి యోగబుద్ధి అన్నది భక్తి విశ్వాసము ప్రేమ దీర్ఘశాంతము త్యాగము సమర్పణ ప్రార్థనాయుతమైన భక్తి దైవధ్యానము వగైరా సత్క్రియలుతో కూడిన ఆత్మీయ క్రియాకర్మలు మూలమైయున్నవి. ఇట్టి గుణగణాలతో  అదృశ్యంలో వున్న అంధకార దురాత్మ శక్తులను లోకసంబంధమైన భార్యాపుత్రాదులతో కూడిన బంధములతోను, లోక సంబంధమైన ప్రధానులతో నాయకులతోను రాజ్యాంగ చట్టములతోను పరలోక దేవునియొక్క నిబంధనలతోను, ప్రతి జీవాత్ముడు శారీరయుతంగా తెలియని రీతిగా ఆత్మీయయుతంగా తెలిసిన రీతిగాను పోరాడవలసియున్నది.
                ఇట్టి క్రియాకర్మలతో పోరాడువాడు అనగా మానవత్వమన్నదేదో దైవత్వమన్నదేదో గుర్తించి సమయసందర్భముతో ఆత్మజ్ఞానంతో కూడిన పోరాటమును పోరాడినవాడు కర్మబంధమును త్రెంచగలడు. అనగా జన్మ కర్మ పాపములను లోక సంబంధమైన కర్మబంధము సంసార బంధము ప్రభుత్వ బంధము పిశాచబంధము ఐశ్వర్యబంధము త్రాగుడు బంధము చోరబంధము వగైరా బంధముల నుండి త్రెంపబడి సంపూర్ణమైన దైవసిద్ధిని పొందగలడు. అట్లుగానిచో పై బంధములకు పరిమితమై వాటి వ్యామోహంలో తగుల్కొని వాటిలో కలసి లయమై పోతాడని ఇందులోని భావము.
                40వ శ్లోకం :- ఇందు ఉపక్రమ నాశములేదు. దోషాంతర ప్రాప్తియు కలుగదు. ఈ ధర్మము యొక్క అల్పమైన అనుష్ఠానమైనను మహత్తర భయము నుండి రక్షింపగలదు.
                యోగబుద్ధివల్ల నాశనము దోష శిక్ష మరణము - దాని భయము నుండి భగవద్‌ సావాసమూలమున ప్రతినిత్యము ప్రార్థన భగవధ్యానంలో వున్న వ్యక్తికి పై అరిష్టాలవల్ల భయము లేదంటాడు. ఇందుకు బైబిలిచ్చు సమాధానము - యేసుప్రభువు నాయందు విశ్వాసముంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. మరియు ఎఫెసీ 2:1 మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను''. ఈ విధంగా దైవిక విశ్వాసము దైవిక సావాసము దైవిక నిష్ఠాగరిష్ఠతలై నటువంటి మెషగు షద్రగు అబిద్నగోలు దానియేలు జీవితాలు మనము వేదంలో చదివితే - దానియేలుకు సింహాలద్వారా మరణభయము ''మెషగు - షద్రగు - అబిద్నగోలు''  నాశనకరమైన ఉపద్రవకరమైన అగ్నిగుండం నుండి రక్షణ ఇందుకు సాదృశ్యమైయున్నది. కనుక క్రీస్తుయేసు నందున్న వానికి ఏ శిక్షావిధిలేదు. క్రీస్తు ఏసునందుండాలంటే క్రీస్తు సిద్ధాంతాలతో జీవించాలి. క్రైస్తవ యోగము ఆచరించాలి. ఇదియే యోగనిష్ఠకు కావలసిన మూలసిద్ధాంతము.
                41వ శ్లోకం :- ఈ యోగనిష్ఠకు కేవలమొక నిశ్చయాత్మక బుద్ధి మాత్రమే కావలయును. నిశ్చయ స్వభావులు కాని వారి బుద్ధులు పరస్పర భిన్నములును అనంతములునై యుండును.
                ఈ శ్లోకానికి సరియగు బైబిలు నిర్వచనము :- నిశ్చయాత్మక బుద్ధి అనగా ఆత్మను శరీరమును ఐక్యపరచి భగవదాత్మ యొక్క కాపుదలలో లోకాన్ని లోకేచ్ఛలను అలౌకిక శక్తులను ఐహిక విచారములను విస్మరించి, నిశ్చలమైన బుద్ధితో చేసే భవగధ్యానమే స్థిరమైన బుద్ధికి మూలమైయున్నది. ఇట్టి బుద్ధి ప్రమాదమైనను నాశనమైనను తెగులైనను మరణబంధకములైనను మరణాపాయములైనను వేదనల నుండియు కాపాడుటకు మూలమైయున్నది. ఇందునుగూర్చి యోహా 14:1-2 మీ హృదయములను కలవరపడనియ్యకుడీ ! దేవునియందు విశ్వాసముంచుచున్నారు. నాయందును విశ్వాసముంచుడీ''. అనుటలో కేవలం భక్తి అన్నది క్రీస్తు యొక్క విశ్వాసం మీదనే ఆధారపడి యున్నదేగాని దైవేతర క్రియలమీద విశ్వాసముంచి దైవత్వాన్ని అభిలషించాలంటే అది కూడని పని. నిశ్చలమైన బుద్ధిగల వారలగూర్చి పేతురు తన పత్రికలో - ''నిబ్బరమైన బుద్ధి గల్గి మెలకువ గల్గి యుండుడీ ! మీ విరోధియగు అపవాది ఎవరిని మ్రింగుదునాయని సంచరించుచున్నాడు''. అని సాతానును గూర్చి వివరించియున్నాడు. అనగా బుద్ధివక్రించినపుడు ఇహలోక సంబంధమైన అలౌకిక శక్తులు మానవజ్ఞానాన్ని తప్పుడు దారి పట్టించగలవు.
                కనుక యోగనిష్ఠకు మూలము దైవిక విశ్వాసము నిశ్చలమైన భక్తి నిబ్బరమైన మనస్సు ప్రశాంత వాతావరణము. ఇట్లుగాకుండ నిశ్చయ స్వభావులు గాకుండ అనగా దైవవిశ్వాసులుగాని దైవత్వముగాని లేకుండ కేవలం దేహాన్ని అంటిపెట్టుకొని, మానవ వేదాంత సాహిత్యాలను ఆసరాగా జేసుకొని సర్వానికి ఆది సంభూతుడు మూలపురుషుడు సృష్టికర్త ఆద్యంతములులేని పరమాత్మను విస్మరించి, దైవత్వంచేత ఎన్నుకోబడిన ప్రవక్తలను భక్తులను దేవుళ్ళుగాజేసి వారి విగ్రహాలను వారి సమాధులను ఆరాధిస్తూ వారిని కొలిచేటటువంటి ప్రబుద్ధులు ఆత్మ సంబంధులు కారని వారు కేవలం శరీర సంబంధులేయనియు, వారి భిన్నమనస్సు కలవారేయనియు ఇట్టివారి యొక్క వేదసాహిత్యాలు నిరాధారములును మరణమునకు మార్గములును మానవ జీవితానికి గురిలేని నిర్జీవమైన వ్యక్తులుగా ఎంచబడుదురు - ఈ సందర్భంలో ఏసుప్రభువు ''మీరు ప్రవక్తలను చంపి వారికి సమాధులను కట్టి వారిని ఆరాధిస్తారు''. అనిన మాట గమనార్హము.
                42, 43వ శ్లోకాలు :- వివేక హీనులును, వేదవాద ప్రియులును, కామస్వభావులును, కామమున కంటె మించినది వేరొకటి లేదనువారును నైనకొందరు స్వర్గపరాయణులు - భోగైశ్వర్య ప్రాప్తిని గూర్చి జన్మకర్మ రూపములైన ద్వివిధ ఫలములను మాత్రమే ఇచ్చునదియు క్రియా భేదములచే విస్తరించునదియునైన ఈ పుష్పిత (పైకి చూడమనోహరమైన) వాక్కులను పలుకుదురు.
                పరిశుద్ధ గ్రంథంలోని సరియైన నిర్వచనము :- ప్రియపాఠకులారా ! ఇందులో వివేకహీనులు వీరినిగూర్చి బైబిలురీత్యా రోమా 1:21-23 వీరే శరీరసంబంధులు. ''మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదుగాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకార మయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్దిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి.
                వేదవాద ప్రియులు :- రెండవ తిమోతి 3:8 యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్ఠులై సత్యమును ఎదిరింతురు''. ఇట్టివారు స్వార్ధప్రియులు, దూషకులు, కామస్వభావులు - రోమా 1:26-28లో విధంగా కామమునకంటె మించి మరియొకటి లేదని వాదించువారు. అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మము ననుసరించిరి. అటువలె పురుషులు కూడా స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది జేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి.
                కొందరు స్వర్గపరాయణులు భోగైశ్వర్య ప్రాప్తి గూర్చి లూకా 16:19లో వలె ధనవంతునివలెను స్వర్గభోగాలను ఈ లోకంలోనే అనుభవించాలని ఆశించేవారు. అనగా ధనికవర్గము. ఇట్టివారిని గూర్చి ఏసుప్రభువు - సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభము - కాని ధనికుడు దేవుని రాజ్యమును ప్రవేశింపలేడనుచుండగా అందుకు విరుద్ధమైన సిద్ధాంతముల ననుసరించు ప్రబుద్ధులు.
                జన్మకర్మరూపము :- ప్రియపాఠకులారా ! నరుని జన్మకు (1) విగ్రహము (2) పోలిక దాని రూపము దేవునిది (3) కర్మదేవుని క్రియ, ఇంక నాలుగవదిగ ఆత్మ దేవునిది. ఈ మర్మాన్ని క్రియా భేదములచేత అనగా రచనలు పద్యములు గద్యములు సాహిత్యరూపంగా నరకోటి జనబాహుళ్యమునకు  ప్రకటించుటన్నది ఈ విస్తరణము. ఈ క్రియా భేదములు విస్తరించుటకు మూలము అనగా ప్రచారమన్నది మనం గ్రహించాలి''.
                44వ శ్లోకం :- ఆ వేదవాక్కుచే నపహరింపబడుచుండు బుద్ధులు గలవారై భోగైశ్వర్యములయందు దగులుకొని యుండు వారలకు చిత్తస్థైర్యమున నిశ్చయాత్మక బుద్ధి పొసగదు.
                ఈ శ్లోకానికి ఏకాభిప్రాయంతో కూడిన వివరణ :- ప్రియపాఠకులారా ! అలనాటి దైవజనాంగమైన ఇశ్రాయేలీయులు మోషే ధర్మ శాస్త్రము నాచరిస్తూ మూఢముగ ప్రవర్తించి మూర్ఖులుగా తయారై సానుభూతి దయాదాక్షిణ్యము ప్రేమన్నదిలేక కఠినచిత్తులై తప్పుజేసిన కొరడాలతో కఠినంగా శిక్షించుటయు, వ్యభిచరించిన వారిని రాళ్ళతో కొట్టి చంపుటయు, వడ్డీకి ద్రవ్యమిచ్చిన వానికి కఠోరమైన శిక్షలును, కంటికి కన్ను - పంటికి పన్ను'' అను శిక్షలతో అజ్ఞాన దశలో ప్రవర్తించి ధర్మశాస్త్ర సిద్ధాంతమను మూఢాచారములో తగుల్కొని ఇట్టి మూఢాంధకారంలో వున్న జనాంగము యొక్క విస్తరించిన పాపమును పరిహరించుట కవతరించి మూర్ఖులైన యూదాజనాంగము మధ్య నిజదైవత్వమును నిరూపించిన దైవకుమారుడైన ఏసుప్రభువుయొక్క సత్యవాక్కులను సత్యగాధను ఎరుంగనివారై ధర్మశాస్త్రమునకు బంధీలైయున్న వారియొక్క బుద్ధులు ఏసుప్రభువును విస్మరించి - వేషధారణత్వముతోను స్వార్ధముతోను సుఖాసనములతోను భోగైశ్వర్యమందును తగుల్కొని ఏసుబోధలను పెడచెవిని బెట్టి నిలుకడలేని జీవితము జీవించి ఏసుప్రభువును సత్యదేవుని కుమారుడని ఎరుంగక ఆయనను సిలువ వేసి చంపి కిరాతకత్వంతో వ్యవహరించినందున ఇట్టి చిత్తవృత్తిలో జీవించిన వీరికి గల్గిన శిక్ష ఏమిటంటే - వీరు రాజ్యాన్ని కోల్పోయి నానా జాతుల వారికి బానిసలై అనగా బ్రిటన్‌ రష్యా ఫ్రాంసు జర్మనీ వగైరా పాశ్చాత్య దేశాలకును అరేబియా ఐగుప్తు వగైరా మహమ్మదీయ రాజ్యాలకు బానిసలై తీరని క్షోభము పొందారు. వీరి బుద్ధి నిలుకడలేనిది, ఇందుకు కారణము వీరి చంచల స్వభావము అవిశ్వాసమే గనుక ఈ శ్లోకము యుద్ధాలకే పరిమితమై నరులచేత రచింపబడిన వేదసాహిత్యాలను దైవత్వములుగా భావించి వాటి సిద్ధాంతములను ఆచరించు మూఢాచార పరాయణులకు వర్తిస్తుంది.
                45వ శ్లోకం :- వేదములు రజస్సత్వ తమోగుణములనియెడు భిన్న గుణములచే పరస్పర విభిన్న స్వభావులైన మానవులకు దత్తదను రూపములైన కర్మల నిబంధించునవియై యున్నవి. నీవు ఆ త్రైగుణ్యమును వదలిన వాడవై శీతోష్ణాది ద్వందమును సహించువాడవును, నిత్యసత్త్వ ప్రధానుడవును, యోగక్షేమ చింతారహితుడవును నగుము.
                ఇందునుగూర్చి పరిశుద్ధ గ్రంథ వివరణ :- ప్రియపాఠకులారా ! ఇందులో మొదటగా వేదములు సత్వరజస్తమోగుణములు'' అనుటలో నేడు ప్రపంచంలో జనబాహుళ్యంలో దైవత్వమును గూర్చిన వేదధర్మములు పలుపలురీతులుగా అనగా ఒకదానికొకటి పొందికలేక ఆయా మత సిద్ధాంతములనుబట్టి నరులను జాతులుగాను కులములుగాను గోత్రములుగాను విభజించి సత్యదేవుని అసత్యదేవునిగాను అనగా ప్రకాశమానమైయున్న వెలుగైయున్న సృష్టికర్తను విగ్రహరూపంతోను నారసింహము వరాహము నంది సర్పము వగైరా జంతురూపములతోను పోల్చి అవమానించుటన్నది దైవత్వానికి విభిన్న గుణమని ఎంచక, విభిన్న స్వభావులైన నరులు వారియొక్క బుద్ధి బలహీనతనుబట్టి (రెండవ కొరింథీ 4:4) ఈ యుగసంబంధమైన దేవతయొక్క ప్రేరేపణచేత వారి బుద్ధినిబట్టి స్వజ్ఞానంచేత రూపించుకున్న దేవతలు, మానవ కల్పితములైన విగ్రహ దేవతల చరిత్రలు కల్లబొల్లి కాకమ్మ కథలతో రూపించి పై రూపములను దేవతలుగా ఆరాధించుటయేగాక ప్రత్యక్షంగా పిశాచ రూపములైన కాళి, దుర్గ, పోలేరమ్మ, అంకాళమ్మ వగైరా క్షుద్ర రూపములేర్పరచి వాటికి నరులను సైతము బలియిచ్చిన చరిత్రలు కలవు. నేటికిని వీటికి జంతుబలులు ఇస్తున్నారంటే అలౌకిక శక్తియైన పిశాచముయొక్క ప్రభావము నరులమీద ఎంత తీవ్రంగా పనిజేస్తున్నదో మనకు అర్థము కాగలదు.
                ఇక బైబిలులో కూడా ఇట్టి అజ్ఞాన విభిన్న ఆచారాలు ఆచరించినవారిని గూర్చి ఈ సందర్భంలో తెలిసికోవలసియున్నది. ప్రభువునందు ప్రియపాఠకులారా ! బైబిలులోని పాత నిబంధనలో దైవజనాంగమైన ఇశ్రాయేలీయులు నిజదైవత్వాన్ని విస్మరించి అనగా దేవునిపై తిరుగుబాటు జేసి అన్యులతో సాంగత్యము అన్యదేవతల ఆరాధనలు జరిగించి దేవుని మహోగ్రత చేత ఏ విధంగా శిక్షించబడినారో మనకు బాగుగా తెలియగలదు. సీనాయి కొండమీద మోషే దిగివచ్చుటకు ఆలస్యము చేయగా సీనాయి కొండ క్రిందనున్న దైవజనాంగము అహరోనును వేధించి పోతపోసిన దూడ విగ్రహాన్ని సృష్టించి దానికి బలులర్పించి గావుకేకలు పెట్టుచున్నపుడు జరిగిన క్రియ నిర్గమకాండ 32:లో చదువగలము.
                దైవత్వమన్నది మోషే చేత ఆ సందర్భంలో జరిగించినటువంటి మహోగ్రత పూరితమైన కార్యములు కూడా అనగా ఆ బంగారు దూడను కాల్చి పొడిచేసి నీటిలో కలిపి ఇశ్రాయేలీయులచేత త్రాగించుట. ఇక మోషేకు దేవుడనుగ్రహించిన ధర్మశాస్త్రములో కొన్ని విభిన్నమైన ఆచారములను గూర్చి వేదంలో చదువగలము. అనగా సున్నతి, వ్యభిచారముతోను దైవవిరోధమైన కార్యములు జరిగించినపుడు అట్టివారిని ఱాళ్ళతో కొట్టి చంపుట, కుష్ఠు పొడవానిని ఊరిబయట వుంచుట - శుద్దీకరణాచారములు వగైరాలు ఆనాటి ధర్మశాస్త్రములో విభిన్నములైన చట్టాలు. ఈ చట్టమునకు ఇశ్రాయేలీయులు ఆగలేకపోయినారు. ఇవి ఉత్తిత్తివిగాక బహుకఠినంగా దేవునిచేత మోషే చేత అమలు పరచబడినవి.
                ఇక నూతన నిబంధనకాలంలో క్రీస్తు రాకడతో వీటికి ఒక రూపం ఏర్పడింది. అనగా సున్నతికి బదులు బాప్తిస్మము, పాపికి రక్షణ రోగికి స్వస్థత వికలాంగునికి సకలాంగము, బంధకములో వున్నవారికి విడుదల నిజదైవత్వమును తెలిసికొనుటకు మార్గము నిజదేవుని యొక్క సత్యధర్మశాస్త్రము. దైవరాజ్యమునకు మానవుడు వెళ్ళాలంటే మార్గము వగైరా సత్యదైవ వేదాంతమన్నది నరుని కనుగ్రహించబడింది.
                అయితే ఈ శ్లోకంలో ఇందుకు విభిన్నంగా అన్యులు దైవత్వంగా గొల్చు కృష్ణుడే వేదాలపై తిరుగుబాటుజేసి వేదసాహిత్యాన్ని త్యజించి వేడిని చల్లదనమును ఓర్చుకొనుమని నులివెచ్చని తనముతో జీవించమని అర్జునునకు బోధిస్తున్నాడు. ఇందుకు బైబిలిచ్చు సమాధానమేమిటో ప్రకటన 3:5-16. ఇట్టివారిని నోట నుండి ఊసివేస్తానని దైవత్వమంటున్నది''. నీ క్రియల నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను వుండిన మేలు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను వుండక, నులివెచ్చనగా వున్నావుగనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను''. అయితే ఈ శ్లోకంలో నులివెచ్చని జీవితము అనగా చస్తే మోక్ష రాజ్య ప్రవేశమని జయిస్తే లోక రాజ్యవైభోగములని ప్రలోభపెట్టుటయే ఈ నులివెచ్చని జీవితము. ఇట్టి నులివెచ్చని జీవితంలో జీవించి నిత్యసత్త్వ ప్రధానుడవును యోగక్షేమ చింతారహితుడవుగాను ఉండుమన్నట్లుగా ఈ దేవుని బోధ. ఇది ఎంత భిన్నమైన బోధయో మనము ఆలోచించవలసియున్నది. కనుక ఇది సత్యమునకు విరుద్ధము.
                మానవకల్పితమైన మూఢాచారములను రద్దు చేయడమన్నది బైబిలు సిద్ధాంతము. ఇట్టి మూఢాచారములన్నిటిని కూడా సమూలంగా సమాధిజేసి సర్వశక్తిమంతుడైన ఏసుప్రభువు తన బలియాగము ద్వారా దైవిక చట్టములలో మార్పులు, దైవత్వానికి మానవత్వానికి వున్న విరోధమునకు సమాధానమును, సర్వమానవులు దైవరాజ్యమునకు వెళ్ళాలంటే మార్గమును దైవత్వంలో వున్న సర్వ సంపూర్ణత యొక్క నిజరూపమును నిరూపించి, తన నామములో విశ్వాసముంచిన నరజీవునికి వున్న విలువను తత్సంబంధమైన ఔన్నత్యమునుగూర్చి సర్వ మానవాళికి ప్రకటించాడు. ఆ ప్రకటించబడినవే నేడు సువార్తగా క్రియ జరిగిస్తున్నది.
                సాంఖ్య యోగములోని 46వ శ్లోకము :- స్నానపానాదికముల విషయమై జలసమృద్ధి ఎట్టిదైన ప్రయోజనమో - అట్టి ప్రయోజనము సమస్త వేదములయందు మిక్కిలి వివేకియైన బ్రహ్మనిష్ఠునకవసరమై యున్నది.
                భగవద్గీత సాంఖ్యయోగము అను వేదభాగము 46వ శ్లోకములో ఈలాగు వ్రాయబడియున్నది.
                ప్రియపాఠకులారా ! పై శ్లోకములో వెల్లివిరియుచున్న జలసమృద్ధిగల బావి యందు అనగా నిలకడగాను ఆహ్లాదకరంగాను త్రాగుటకును స్నానమునకును శుచికార్యములకు శారీరమాలిన్యము పోగొట్టుకొనుటకును, లోతైన బావియందు విజ్ఞానశాలియగు బ్రాహ్మణునకెంత అవసరమో'', అనుటలో ఇది కేవలము ఒక బ్రాహ్మణునికే సంబంధించి వున్నదిగాని, దైవసృష్టిలో జీవాత్మపూరితుడైన ప్రతి మానవునికి ఇది అవసరమన్న సత్యాన్ని రచయిత గ్రహించనట్లున్నది. శుచిగల దప్పికదీర్చగల దేహ అవసరతలను తీర్చగల బావి నీరు ఒక్క బ్రాహ్మణునికేగాదు ప్రతి నరజీవునికి కూడా అవసరమన్న సత్యాన్ని పాపము ఈ గ్రంథకర్త మరచినట్లున్నది. జలము అన్నది ఏవిధంగా ప్రతి జీవికి అవసరవమైయున్నదో-వివేకము గలిగి దైవత్వమును గూర్చి పరమాత్ముని యొక్క క్రియాకర్మలను గూర్చి పరమాత్ముని ఉనికిని పూర్తిగా తెలిసికొనుటకు శక్తివంచన లేకుండ ప్రయత్నించు ప్రతి జీవాత్మునికి సకలవేదజ్ఞానము ఎంతో అవసరమై యుండగలదు అన్నదే మనము గ్రహించాలి.
                ప్రియపాఠకులారా ! పాండిత్యమన్నది ఒక జాతికి, ఒక మతానికి, ఒక కులానికి పరమాత్ముడు పరిమితము చేయలేదు. ఆయన సర్వసృష్టికిని సకలజీవులకును లోకములోని సర్వజనావళికి తన గాలిని నీళ్ళను భూసారమును దేహమునకు ఉచితముగా అనుగ్రహించియున్నాడు. అందుకే మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా వున్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును'', అని వేదములో యాకోబు 1:5లో వ్రాయబడియున్నది. ఈవిధంగా విజ్ఞానమును గూర్చి పరమాత్మతో ఎవరైతే ప్రార్థనాయుతమైన పోరాటమును జరిగించి దీక్షబూనుతాడో అట్టి వానికి పరమాత్ముని జ్ఞానము దొరకుటయేగాక సకలవేదములందును అతడు పాండిత్యము గలవాడై అంతటితో ఊరుకొనక సత్యవేదమన్నదేదో తెలిసికొనుటకు ప్రయత్నిస్తూ - సత్యాన్ని అన్వేషించి సత్యాన్ని అభిలషించి సత్యకీర్తిగా ఈ అనంతవిశ్వములో జీవించగలడు. సత్యచరిత్రకు సాక్షికాగలడు. ఇట్టివారు పరిశుద్ధ గ్రంథములో పాతనిబంధన కాలములో దైవజ్ఞానమును వరముగా పొంది, తన ప్రార్థనా బలముచేత కీర్తనలు సామెతలు ప్రసంగి విలాపవాక్యాలు పరమగీతాలు అను ఐదు గ్రంథాలను రచయితయైన సొలొమోను - ఈయన వివేకియై పరమాత్ముడు తనకనుగ్రహించిన వివేకము ద్వారా పై గ్రంథాలకు రచయిత అయ్యాడు. అలాగే మోషే పంచకాండలకు గ్రంథకర్త అయ్యాడు. మోషే జీవితంలో మోషే విద్యావంతుడు కాడు, స్పష్టమైన వాక్శక్తి కూడా లేదు. అట్టివానిని పరమాత్ముడే భూమి మీద తన యొక్క ప్రణాళిక కార్యక్రమ ఆచరణకు సాధనంగా మోషేను వాడుచు మోషే చేత పరమాత్మ సృష్టి కార్యములను గూర్చి అనగా లోకము పుట్టినది మొదలు ద్వితియోపదేశ కాండవరకు జరిగిన దైవక్రియాకర్మలను గూర్చిన పూర్తి వివరాన్ని గ్రంథరూపంలో మోషేచేత రచింపజేశాడు. ఇది పాత నిబంధనలో ఇద్దరి ఉదాహరణ, ఇక నూతన నిబంధనలో యేసుప్రభువు శిష్యులు పేతురు యోహాను మత్తయి మార్కు పౌలు వీరందరూ కూడా ఈ వెల్లివిరియుచున్న జలసమృద్ధిగల బావియగు జీవజల ఊటయైన క్రీస్తులో తమ జీవితాలను పవిత్రపరచుకొని తమ యొక్క ఆత్మీయ దప్పికను దీర్చుకొని ఈ జీవజల నిధియైన క్రీస్తు ద్వారా తమ అవసరతలను తీర్చుకొని ఆత్మీయ శుచి శుభ్రతతో వివేకులై పరిశుద్ధ గ్రంథములోని వేదభాగాలకు రచయితలయ్యారు. ఇది భగవద్గీత గ్రంథములో సాంఖ్యయోగము 46వ శ్లోకమునకు దీటైన జవాబు.
                ఇందునుగూర్చి పరిశుద్ధ గ్రంథము జీవాత్ముడైన నరునికి అనుగ్రహించు మరియొక జ్ఞానవాక్కు :- ప్రియపాఠకులారా ! వెల్లివిరియుచున్న జలసమృద్ధిగల బావి యందు విజ్ఞానశాలియగు బ్రాహ్మణునికెంత అవసరమో వివేకియైన వానికి సకలవేదములందును అంత అవసరమై యుండగలదు. ఇందునుగూర్చి వివరంగా తెలిసికొందము. వెల్లివిరిసియున్న జలసమృద్ధిగల బావి - ఇందునుగూర్చి పాతనిబంధన నూతన నిబంధన కాలములలో ఈ జల సమృద్ధిగల బావియను ఈ అనంత విశ్వములో మొట్టమొదటగా బ్రహ్మజ్ఞానమును పూర్తిగా పొందినవాడు ఆదినరుడు'', అను ఆది జీవాత్ముడు. ఇతడు మొట్టమొదటగా ప్రకాశమానమైన దేదీప్యమైనటువంటి పరమాత్మ వెలుగులో రూపించబడి నానావిధాలైన ఫలవృక్షాలు సువాసనలు వెదజల్లుచు వెల్లివిరియుచున్న ప్రకృతిని మైమరపించే ఫల జల సమృద్ధిగల బావియను ఈ యొక్క లోకములో మొట్టమొదటగా విజ్ఞాన శాలియగునట్టి బ్రహ్మరూపుడు బ్రహ్మజ్ఞాని బ్రహ్మ ఆత్మ ఆవేశితుడు అనగా ఆదిదేవుని క్రియ, ఆది దేవుని నిర్మాణము, ఆదిదేవుని సంకల్పము, ఆదిదేవుని యొక్క జీవము - ఆత్మ - వాయువు'' అను త్రివిధశక్తి సంపన్నుడైన విజ్ఞానశాలి ఆదాము,'' అని అనుటలో సందేహములేదు. అనగా ఈ హైందవ వేదసాహిత్యమును బట్టి భూమి మీద ఆదిబ్రహ్మ స్వరూపుడైన నరుడు ఆదామే ! ఆదాము బ్రహ్మజ్ఞాన సంపన్నుడును, బ్రహ్మ ఆత్మలో భాగస్వామియు బ్రహ్మయొక్క స్వాస్ధ్యములో వారసుడును, బ్రహ్మయొక్క సృష్టి - బ్రహ్మయొక్క సంపదయైన ఈ అనంతవిశ్వమునకు హక్కుదారుడుగా బ్రహ్మచేత రూపించబడి మరియు బ్రహ్మచేత సర్వాధికారమును పొంది, ఈ అనంతవిశ్వమునేగాక నవగ్రహాలు మండలాలు నక్షత్ర మండలాలను సైతము నరునికైవసము చేసి నరుని పాదముల క్రింద వుంచినట్లుగ కీర్త 8:లో పూర్తిగ వివరించబడియున్నది. ఇందునుబట్టి ప్రకృతి ఫలభరితమైన ఈ అనంతవిశ్వములో బ్రహ్మజ్ఞానాన్ని పొందిన ఆది ఆదాము బ్రహ్మతత్వములో అనగా శరీరసంబంధమైన ఆడంబరాలు అలంకారాలు ఆహారపానీయ వగైరాలు నిష్టానియమాలను విస్మరించి అనగా స్వయంపాకము అన్నది కూడా ఎరుగని స్థితిలో-ప్రకృతి సంబంధమైన శాకాఫలములను భుజిస్తూ సంపూర్ణ శాకాహారి అనగా పాలు గ్రుడ్డు కూడా ఈ బ్రహ్మజ్ఞాని జీవితములో నిషేధితమై సంపూర్ణంగా శాకాహారియై, సంపూర్ణంగా దైవాత్మను తన సన్నిధిలో వుంచుకొని తనకు దేవుడు అనుగ్రహించిన సంపూర్ణమైన దైవాత్మ ప్రభావమూలంగా నిత్యము దైవసంభాషణజేస్తూ జీవించిన విజ్ఞానశాలియగు బ్రాహ్మణుడే ఈ ఆదాము అనగా బ్రహ్మజ్ఞాన తత్వమును సంపూర్ణంగా పొందినవాడే ఈ ఆదాము అని భావము. ఈ విధంగా వివేకియైన ఈ బ్రహ్మజ్ఞాని నుండి సకల వేదములు అవతరించాయి. వేదములకు పునాదులు ఏర్పడినవి. ఈ విధంగా అనేక వేదములు ఇతని సంతానము ద్వారా రూపించబడినను నిజమైన బ్రహ్మవేదమన్నది పరిశుద్ధ గ్రంథములోని ఆదికాండమే ప్రారంభవేదము.
                47వ శ్లోకము :- పనులు చేయుటయందు నీకు అధికారము కలదు. పనులవలన కలుగు ఫలములను గూర్చి ఆలోచిస్తూ ఏ పనియుచేయవద్దు, ఏ పనియు చేయకూడదను ఆలోచన నీకు కలుగకుండును గాక !
                బైబిలు వివరించు భగవద్గీత పరమార్ధము :- ఆది 2:15 దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో వుంచెను. అయితే తోటలోని ఫలములను సంపూర్ణంగా అనుభవించే అధికారము దేవుడు పూర్తిగా నరునికి ఇవ్వలేదు. చేయు పనులలో దోషము సంపాయించే పనులు, దైవ చట్టాన్ని అధిగమించే పనులు, లోకసంబంధమైన వ్యామోహములతో కూడిన పనులు ఏవియు బ్రహ్మజ్ఞానియైనవాడు చేయకూడదని దీని భావము.
                ఆదామా ! ఈ తోట చెట్ల ఫలములన్నియును నీవు తినవచ్చును. ఈ తోటలోని జీవరాసులన్నిటితోను నీవు నిశ్చయంగా తిరుగవచ్చును. ఈ తోటలో నీకెలాంటి అంతరాయములేదు. నిన్ను అడ్డగించువారులేరు. నీకు తినే తిండి చెట్ల ఫలములలో అన్నియును నీవు తినవచ్చును. నీకు అధికారమున్నది. తోట మధ్యలో వున్నట్టి నేను నిషేధించిన లోకఫలమును నీవు తినకూడదు అనియు దీని భావము. ప్రియపాఠకులారా ! దేవుడు నరునికి భోక్తములుగా అనుగ్రహించిన ఫలములన్నియు వున్నను తన ఆజ్ఞగా నిషేధఫల భక్షణము అను శాసనాన్ని శాసించినట్లుగ తెలుస్తున్నది. అయితే ఈ శాసనాన్ని బ్రహ్మరూపుడైన ఆదినరుడు ఎక్కువ కాలము పాటించలేకపోయాడు. అంటే ఒకానొక దినమున ఒకానొక సమయములో బ్రహ్మ తనకు సాటి సహాయకారిణిగా నరుని నుండియే శల్యమాంస భాగముల ద్వారా రూపించబడిన నారియను మరియొక రూపమునకు ఆకర్షితుడై - ప్రకృతి ఫలము అనగా నరశరీరం నుండి ఉద్భవించిన ఫలము - నారి చేతిలో వున్నటువంటి దైవనిషేధ వృక్ష ఫలము రెండును బ్రహ్మజ్ఞానియు ఆత్మరూపుడైన నరుని ఆకర్షించి తాను చేయకూడని కర్మఫలమునకు లోనై, బ్రహ్మయొక్క చట్టమును నియమమును మరచి దైవచట్టమునకు విరుద్ధమైన నిషేధఫల భక్షణము అను పనిని జరిగించి దోషియై దైవశాపమునకు గురిఅయ్యాడు.
                మనము చేయు పనియందు మాత్రమే నీకు అధికారము ఉండునుగాక ! అనుటలో చేసే పనియందు ఆ పనిచేసే దినమునందు, ఆ పని జరిగించు సమయమందు మాత్రమే నీకు అధికారము కలదు అని అంటున్నాడు. ఇందుకు యేసుప్రభువు ఇచ్చిన జవాబు - మనము చేసే పనియందు అనగా అది ప్రార్థనాకార్యముగాని, ఆరాధన కార్యముగాని వేదాధ్యయనముగాని ధర్మకార్యముగాని ఆ చేసే కార్యము ఎలాంటిదైనను ఆ కార్యక్రమమును నిర్వహించు అజమాయిషీ నరునికి వుంది. అనగా తన సారధ్యములో నరుడు తాను జరిగించు క్రియాకర్మలు జరిగించుటకు అధికారము వుండునుగాని దాన్ని గూర్చినటువంటి ఫలాన ఫలితమునుగూర్చి ఆలోచించుట బుద్ధిహీనత. ఆ విధంగా ఆలోచించు వ్యక్తి చేయు క్రియాకర్మల యొక్క సాఫల్యత యొక్క ఫలము నరుడు పొందలేడు. దానికి బదులుగా పరమాత్ముని సన్నిధిలో అట్టివాడు స్వార్ధపరుడుగా ఎంచబడుచున్నాడు, కర్మక్రియాసక్తి కారణంగా అందులోని ఫలమును ఆశించి క్రియాకర్మలు జరిగించు వ్యక్తి జనబాహుళ్యములో రాణించడు, ఫలాభిలాషి ఈలోకములో స్వార్ధపరుడుగ నీచమైన బిరుదును సంపాదించుకుంటాడు. కనుక ఆత్మసంబంధమైన పరమాత్మునియొక్క సన్నిధికి యోగ్యుడైన జీవాత్ముడు క్రియాకర్మల విషయాలలో ప్రతి చిన్నపనిలోను ప్రతి విషయములోను ఫలమును ఆశించకుండ అనగా చేసిన పనిని దైవార్పితంగా భావించి దాని ఫలితమును దృశ్యంగా కాకుండ అదృశ్యములో పరమాత్ముని ద్వారా పొందువాడే విరాగి. అనగా ఫలాపేక్షలేనివాడు, కనుక తాను చేయు ప్రతి క్రియాకర్మలను పరమాత్మ అర్పితం చేసి లోకములో క్రియ జరిగించువాడే ధన్యుడని ఇట్టివానిని గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తిని మనము ఉదా||కు తీసుకొంటే యోబు యొక్క జీవితము ఇందుకు సరిపోతుంది. యోబు తనకున్న ఐశ్వర్యమును గూర్చి అతిశయించినవాడు కాదు. తన స్థితిగతులు తన సంపద తన ఐశ్వర్యము తన భూఫల సాయములను గూర్చి చింతించినవాడు కాదు. ఒకానొక దినమున పరమాత్ముని పరీక్షలో యోబు యొక్క సర్వసంపద తుడిచిపెట్టుకొని పోయినపుడు లోకవైరాగియై పరమాత్మునికి అతి ప్రీతిపాత్రుడైన యోబు చెప్పినమాట ''యెహోవా ఇచ్చెను - యెహోవా తీసికొనిపోయెను'', అనిన శ్రేష్ఠమైన మాట పరిశుద్ధ గ్రంథములో లోకవ్యామోహితులను కండ్లు తెరిపిస్తున్నది. ఈ సందర్భములో యోబు చరిత్రను చదువుము.
                48వ శ్లోకము :- తగులు పాటును వదలి యోగనిష్ఠుడవై సాఫల్యవైఫల్యముల యందు అనగా ప్రాప్తాప్రాప్తములందు సమచిత్తుడవగుచు కర్మలను చేయుము. అట్టియా సమచిత్తత్వమే యోగమనబడుచున్నది.
                యోగనిష్ఠుడైన వాడు తగులుబాటును వదలి అనగా లోకసంబంధమైన బంధాలు :- సతీబంధము పుత్రబంధము, ఋణబంధము, స్వజన సాంగత్యము, బంధుప్రీతి ఆస్థిపాస్థులమీద వ్యామోహము పదవీవ్యామోహము వగైరా అనేక విధములైన భూసంబంధంగా తగుల్గొని దీనివలన కలిగే వేదనలు వదలి యోగనిష్ఠుడవై అనగా లోక వైరాగ్యమును పొంది దైవయోగము మీద ఆత్మీయ దృక్పధాన్ని వుంచి అట్టి దైవయోగ నిష్టుడవై, పరమాత్ముని క్రియయందే మనోదృక్పధమును నిల్పి ఆత్మసంబంధమైన కార్యసాఫల్యతలోను వైఫల్యత అనగా ఆత్మ సిద్ధి పొందుటలోను, ఒకవేళ కర్మనుబట్టి ఆ ఆత్మక్రియ విఫలమైనపుడు అధైర్యపడక సహనంతో అనగా ఏకచిత్తంగా యదావిధిగ క్రియాకర్మలు జరిగించమని అట్టి యా సమచిత్తత్వంతో జీవించే మనస్తత్వమే యోగమని అనబడుచున్నదని దీని భావము. ఈవిధంగా జీవించినవాడు మోషే - మోషే దైనజనాంగముతో జీవిస్తూ లోక సంబంధమైన భోగభాగ్యాలను విసర్జించి ఐగుప్తురాజైన ఫరో యొక్క రాజకుమార్తె సంరక్షణలో ఐగుప్తు ధనముచేత పోషింపబడి, ఫరోకుమార్తె కుమారుడు అని అనిపించుకొనుట కంటే దైవప్రజలతో చేరి కష్టములను అనుభవించుట మహాభాగ్యమని దైవత్వమునకు సమర్పించుకొని, దేవుని పర్వతమైన యోరేబులో బ్రహ్మదర్శనము అనగా దేవుడైన యెహోవా అను పరమాత్ముని యొక్క దర్శనమును, మండుచు కాలిపోని పొదగా దర్శనమును చూచి అంతేగాకుండ ఆ పర్వతము మీద బ్రహ్మవాక్కులకు విధేయించి, తను మేపుచున్న గొర్రెలమందను తన దేహము యొక్క చింతనలు తనకున్న లోకబంధాలు, లోకసంబంధమైన బాంధవ్యాలు ఒకటేమిటి ? సర్వమును వదలుకొని దైవయోగనిష్ఠుడై దైవజనాంగము మీద పరిపాలకుడును సాఫల్యతను పొందుటయేగాక నలుబది సంవత్సరములు వారిమీద పరమాత్ముని చిత్తానుసారంగా పరిపాలన చేస్తూ తన దైవయోగ బలముచేత అనేక కార్యాలు సాఫల్యపరచినను లోకమన్నది మోషేను అడ్డుకొని తన శక్తులను ప్రయోగించి, మోషే ఏ జనాంగము మీద పరిపాలకుడుగా వున్నాడో ఆ జనాంగము చేతనే మోషే మీద తిరుగుబాటు చేయిస్తూ - ఒకసారి భోజనము లేదని మరొకసారి మాంసము లేదని వేరొక సమయంలో నీళ్ళు లేవని ఈవిధంగా అనేకమార్లు ఇశ్రాయేలు అను పరమాత్ముని జనాంగము ఆత్మీయ జ్ఞానము కోల్పోయి, తాము పరమాత్ముని బిడ్డలు అను ఇంగితజ్ఞానమును మరచి పశువాంఛతో మోషేపై తిరుగబడి మోషే యొక్క దైవయోగమును చెడగొట్టుటకు కూడా ప్రయత్నించగా, అట్టి తరుణములో మోషే దైనజనాంగమును గూర్చి పరమాత్మునికి విన్నవించి సహనముతోను ఓర్పుతోను ఆ జనాంగము పట్ల క్రియ జరిగించినవాడుగ బైబిలు నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశ కాండము వరకు వేదములో చదువగలము. అట్టి సమచిత్తత్వము మోషే నుండియే ప్రారంభమైనట్లుగా క్రైస్తవ కోటి గ్రహించవలసియున్నది. అంటే యోగము యోగసిద్ధి యోగసమాధి, యోగము యొక్క ప్రయోగము కర్మక్రియలు, అట్టి యోగమునకు కావలసిన సమచిత్తము తత్వము వగైరాలు పరమాత్ముడు మోషేకు అనుగ్రహించినట్లుగా తెలుస్తున్నది.
                పరమాత్ముని చిత్తమును బట్టి మరియు సంకల్పమునుబట్టి మరియు ఆయన సన్నిధిలో ఈ అనంతవిశ్వములో రాజుల ఎదుటను సకల జనుల ఎదుటను చేసిన బ్రహ్మయోగ నిష్టసంబంధిత ఫలకర్మలు :- 1. కర్రను నేలపడవైచి పాముగా చేయుట, 2. మరల పాము తోకను పైకెత్తి యదావిధిగ కర్రగా మార్చుట ఈ అనంత విశ్వమును పరిపాలించుటలో - లోకము లోకసంబంధియైన ఫరో ఎదుట తండ్రియైన దేవుడు మోషే చేత దైవిక బ్రహ్మయోగకర్మలు ఏడు తెగుళ్ళు ఏడు కర్మలు ఏడు అరిష్టాలు వీటిని మోషే యోగ సిద్ధిలో జరిగించిన క్రియా కర్మలు. అలాగే దైవజనాంగమును దైవచిత్తానుసారంగా పరమాత్మునియొక్క ప్రణాళిక సంకల్పమునుబట్టి ఐగుప్తు చెర నుండి మరియు బానిసత్వము నుండి దైవజనాంగమును విడిపించుటలో మోషేకు సాటి సహాయంగా ఎవరును లేరు, పరిచారకులు లేరు, అంగరక్షకులు లేరు, లోకసంబంధమైన ఏ యొక్క సాధనము మోషే కోరలేదు. దానిని ఆచరించనులేదు. మోషే యొక్క ఆత్మీయ దృక్పధంలోను మోషేయొక్క జ్ఞానములోను మోషే యొక్క ఆచరణలోను దైవ సంకల్పము దైవచిత్తము దైవశాసనము ఈ మూడును క్రియ జరిగించినందువల్ల ఈ త్రివిధ క్రియాకర్మలనుబట్టి మోషే లక్షల జనాభాయైన ఇశ్రాయేలు అను పరిశుద్ధ పరమాత్మ జనసందోహమును భీకరమైన జలస్థంభన అను దైవయోగమును జరిగించుటకు దేవుని చిత్తమును వేడి తాను దైవచిత్తానుసారంగా ఐగుప్తుచెర నుండి విడిపించుకొని వస్తున్న దైవజనాంగమును నడిపించుటకు తన మార్గమునకు అడ్డు నిలిచిన ఎర్ర సముద్రమును దాటించుటకు మోషే ప్రార్థనా క్రియతో దైవసంకల్పమును కోరి తన చేతనున్న కర్రతో సముద్రజలమును తాకి రెండు పాయలుగా చీల్చి జలమధ్యములో ప్రశాంతమైన కఠినమైన మార్గమును రూపించినాడంటే మోషేలోవున్న దైవయోగము యొక్క ప్రభావమెంత బలీయమైనదో మనము ఆలోచించవలసియున్నది. ఇందునుబట్టి మోషే పరమాత్ముని సన్నిధానములో ఆయన గృహమంతటికిని నమ్మకస్థుడుగాను పరమాత్మునికి ఇష్టుడుగాను పరమాత్ముని క్రియను నెరవేర్చువాడుగాను ప్రవక్తగాను, ఆది నిర్గమ లేవీయ సంఖ్య ద్వితీయోపదేశ అను పంచకాండలకు గ్రంథకర్తగా దైవజ్ఞానంతో రచించినాడంటే ఇంతటి దైవ నిష్టుడైన యోగసిద్ధుడు ఎక్కడైన ఎప్పుడైన ఏ వేదములోనైనను వున్నాడా ?
                ప్రియపాఠకులారా ! యోగనిష్ఠుడు తగులుబాటును అనగా లోకసంబంధ బంధకాలను వదలవలెనని అంటున్నాడు. ఇందునుగూర్చి మొదటి యోహాను 1:15-16 ఈ లోకమునైనను లోకములో వున్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో వుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంభమును పరమాత్మవలన పుట్టినవి కావు. అవి లోకసంబంధమైనవే ! ఈ విధంగా లోకసంబంధమైన బంధకాలలో తగుల్కొనకుండ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన లేఖన భాగాలలో వివరించిన రీతిగా లోక వ్యామోహమునకు చిక్కుకొనకుండ ఈ లోకమాయ నుండి  తప్పు కొనువాడును దీనియొక్క తుచ్ఛమైన అస్థిరమైన ఆత్మీయంగాను శరీరముగాను నిరుపయోగమైన క్రియాకర్మలకు అతీతుడై, తన శీలమును తన ఆత్మను తన ఇహలోక జీవితాన్ని ధన్యవంతం చేసికొన్నవాడే యోగి - ఇట్టి యోగి రాజభోజనాలు ఉన్నత ఆసనాలు, సున్నితమైన పడకలు, విలాసవంతమైన, జీవితము, మద్యము స్త్రీతో కూడిన వ్యసనాలు ఐహిక విచారములతో కూడిన నేత్రాశ ధనాశ వగైరాలు వీటికి సంబంధించిన దురాలోచనలు, కుత్సితమైన వ్యామోహాలు వగైరాలతో ఆత్మీయ శారీర జీవితాలను పాడుజేసుకోక, ఆత్మకు కళంకము దేహానికి ఆటంకము కల్గించుకొనక ఇహలోక జీవితమును ధన్యవంతంగా సాగించువాడే యోగియనియు, ఇంకను దైవత్వమునుగూర్చి తనవరకు తానే ఆకళింపుజేసుకొని తనలో అణచుకోకుండ ఇతరులకు దైవిక సంబంధమైన సాహిత్యాలను ఉపదేశిస్తూ - పరమాత్ముని యొక్క అదృశ్య లక్షణములు జగదుత్పత్తి నుండి నేటివరకు జరిగించిన మరియు జరిగిస్తున్న క్రియాకర్మమును గూర్చి ఆత్మీయ దృక్పధంలో అవలోకించి ఎదుటివాని క్షేమము లోకశాంతి సమాధానమును గూర్చి కాంక్షిస్తూ - ఎల్లవేళలా ధర్మోపదేశము చేయువాడు మహాయోగి. ఇంకను ఇంకొకమాట చెప్పాలంటే సామాన్య నరుడు కాదు. కామక్రోధమదమాత్సర్య భూయిష్టమైన ఈ యొక్క లోకవ్యామోహమున తగుల్గొనకుండ కేవలము ఆత్మ సంభూతుడును తత్సంబంధమైన శరీరధారియునైన నరరూపియగు పరమాత్ముడు పరమయోగి అనబడును. ఈ పరమయోగియే ఈ సందర్భంలో యోహాను సువార్త 1:11-14 చదివితే ఇట్టి పరమ యోగి యొక్క చరిత్ర సంపూర్ణంగా మనకు తెలియగలదు. అదేమనగా ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను'', అనుటలో ఆయన అనగా ఈ అనంత విశ్వమునకు సృష్టికర్త తన స్వకీయుల యొద్దకు వచ్చెను''. అనుటలో పరమాత్ముని హస్తక్రియయైన నరుడు పరమాత్మునికి స్వకీయుడే, అందులో పరమాత్ముడు తన స్వకీయజనంగా ఏర్పరచుకొన్నవారు ఇశ్రాయేలీయులు అనగా ఈ అనంత విశ్వములో తనకంటూ ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని యున్నాడని, ఆ జనాంగమే ఇశ్రాయేలు అని వేదరీత్యా తెలిసికొనియున్నాము. అంతేగాకుండ యోగి అను ఆయనను ఆయన స్వకీయులు అంగీకరించలేదు''. అనుటలో దైవత్వమును గూర్చిన నిజస్వరూపమును గూర్చిన పరిజ్ఞానము దేవుని బిడ్డలకు కూడా కనుమరుగైనట్లుగ అనగా వారు గ్రహించనట్లుగ తెలుస్తున్నది. అనగా దేవుడు భూమి మీద ఏర్పరచుకొన్న జనాంగము దేవుని యొక్క సంపూర్ణతను గ్రహించలేని వారుగానే ఇందునుబట్టి తెలుస్తున్నది. అయితే యోహా 1:12లో విధంగా పరమాత్ముడు తనను ఎందరంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను''.
                కనుక ప్రియపాఠకులారా ! యోగి అనువాడు పరమాత్ముని యొక్క దైవత్వమును ఆయన యొక్క అదృశ్యలక్షణములను ఆయనలో వున్న సంపూర్ణత్వమును పూర్తిగా ఎరిగియుండాలని తెలియుచున్నది. అలాగున్న పక్షంలో యోగిగా వున్న జీవాత్ముడు పరమాత్మునిలో లీనమగుటకు అవకాశమున్నట్లుగా యోహా 1:12-14 లో మనము తెలిసికోవచ్చును. ఎలాగంటే ''తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు వారికి అధికారమును అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారేగాని రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కాదు. ఆ వాక్యము శారీరధారియై, కృపా సత్యసంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.  తండ్రివలన కల్గిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి,'' అని వ్రాయబడియున్నది.
                49వ శ్లోకము :- బుద్ధిని ప్రాప్తాప్రాప్తములయందు సమభావము కల్గియుండవలెను. లభించినపుడు సంతోషించడము దొరకనపుడు బాధపడకుండుట ఉత్తమమైనది. కర్మప్రారంభించింది మొదలు దాని ఫలితమును గూర్చి ఉవ్విళ్ళూరుట నికృష్టమైనది. కావున బుద్ధిని నిలకడగా వుంచుము. ఫలములయందు ఆసక్తిగలవారు శోచనీయులు - ఇందునుగూర్చి వేదరీత్యా తెలిసికొందము.
                బైబిలు వివరించు భగవద్గీత పరమార్ధము :- ప్రియపాఠకులారా ! 48వ శ్లోకములో యోగనిష్ఠను గూర్చి యోగ సాఫల్యతనుగూర్చి వైఫల్యమును గూర్చి సమచిత్తుడుగా వుండి కర్మల చేయుమని అట్టి సమచిత్తత్వమే యోగమని వ్రాసియున్నాడు. అయితే ఈ 49లో సమచిత్తత్వమున కంటె కామ్యకర్మ అన్నది నికృష్టమైనదని కాబట్టి బుద్ధియందే సమస్తము ఇమిడి యున్నదని, బుద్ధి - అనగా జ్ఞానము. ఈ జ్ఞానమన్నది మానత్వానికి మానవ మనుగడకు మానవ జాగృతానికి సార్ధకమైనదిగా వుండుటయేగాక బుద్ధిలోనే కొన్ని సద్గుణములు గుప్తమైయున్నట్లుగ తెలియుచున్నది. ఎలాగంటే బుద్ధిజ్ఞానము లేని నరుడు పశువుతో సమానుడు. అనగా పశువాంఛలతో పాశవిక గుణములతో ఈలోకములో జీవిస్తాడు. కనుక జ్ఞానమునకు చాలా ప్రాధాన్యత మానవ జీవితములో వున్నట్లుగ పరిశుద్ధ గ్రంథములోని ఈ వేదభాగాల ద్వారా తెలిసికొందము. యాకోబు పత్రిక 3 : 13-18లో ఈవిధంగా వ్రాయబడియున్నది. ''జ్ఞాన వివేకములు గలవాడెవడు ? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము, తన యోగ్యప్రవర్తనవలన తన క్రియలను కనబరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవిగాని మత్సరమును వివాదమును వుంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ వుండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును వుండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచిఫలములతోను నిండుకొన్నది. పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదైయున్నది.
                కనుక ప్రియపాఠకులారా ! ఇపుడు 49లో వివరించబడిన వ్యాఖ్యానములో బుద్ధియందే శరణు పొందమంటాడు. అంటే జ్ఞానములోనే దైవత్వమున్నదని దీనిభావన. జ్ఞానమన్నది దేవునిలోనే గుప్తమైయున్నది. ఆ గుప్తమైయున్న జ్ఞానమును లోకనరజీవులైన దావీదు కుమారుడైన సొలొమోను ఒక్కడే తన యొక్క ప్రార్థన తపోబల శక్తి ద్వారా దైవత్వమును వేడి జ్ఞానిగా జీవించి, తాను మహారాజైయున్నను అనగా లోకసంబంధియైయున్నను దానిని వదలుకొని దైవత్వాన్ని అభ్యర్థించి పరలోకదైవజ్ఞానాన్ని పొంది జ్ఞానియైన సొలొమోను'' అనిన బిరుదును పొందినాడు. కనుక ఇట్టి ఘనత సొలొమోనుకు దైవజ్ఞానాన్ని ఆశ్రయించబట్టే కల్గింది. కనుక లోసంబంధ ఫలములను పదవులను సంపదలను ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కోరువారు శోచనీయులును అస్థిరులును అయోగ్యులుగాను దైవత్వమునకును ఆయన సన్నిధికిని ఎంచబడుచున్నారు.
                50వ శ్లోకము :- చిత్తశుద్ధి - సమబుద్ధిగలవాడు పుణ్యపాపముల రెంటిని ఈ లోకమునందే వదలి వేయుచున్నాడు. కావున నీ సమబుద్ధి రూపమైన యోగమునకు సంసిద్ధుడవగుము. యోగమన్నది కర్మానచరణమందలి నైపుణ్యమే సుమా ! ఏలయనగా బుద్ధిమంతులైనవారు నిష్కామ కర్మమువలన కల్గెడి ఫలమును విడిచి - జన్మబంధము నుండి విడువబడినవారై - ఉపద్రవరహితమైన పదమును పొందుచున్నారు.
                బైబిలు వివరించు భగవద్గీత పరమార్ధము :- ప్రియపాఠకులారా ! సమబుద్ధి - చిత్తశుద్ధితో కూడియుండువాడు నీతిని - భక్తిని, పాపము - పుణ్యమును ఈ రెండింటిని లోకానికి వదలి వేస్తున్నాడు. ఎలాగంటే ఈ సమబుద్ధి అన్నది అనగా దైవత్వము తన కుమారునిగా పంపబడిన వానిద్వారా జరిగించింది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు పవిత్రుడు. ఏ దోషము లేనివాడు. దైవకుమారుడు దేవుడు - అట్టి పరమాత్ముడు నరకోటి మీదనున్న ప్రేమతో అనగా పరలోకమును భూలోకమును కూడా సమానమైన స్వభావముతో క్రియ జరిగించిన దేవుడు అనగా పరిపాలించిన దేవుడు పాపము అని పుణ్యమన్నది నరకోటికి వివరించుటకు తానే నరావతారియై నారీగర్భం ద్వారా జన్మించి అనగా పాపములేకుండ పుణ్యస్థితిలో - మానవరీత్యా నరశరీరముతో నరుల మధ్య అనగా పాపులమధ్య ఈ పవిత్రుడైన దేవుడు పుణ్యకార్యాలు, మహత్కార్యాలు, స్వస్థతక్రియలు దైవమహిమాన్విత యోగశక్తుల మహాత్మ ్యములు అను క్రియాకర్మల మూలంగా ప్రయోగాత్మకంగా జేసి నరులమీద తనకున్న ప్రేమనుబట్టి తానే నరపాపమును తనమీద వేసికొని వానిపాపమును నేరమును తనపై వేసికొని నరుడు పొందవలసిన మరణశిక్షను తాననుభవించి, మూడవదినమున మహిమ పునరుత్థానుడై పరమాత్ముని యొక్క చిత్తానుసారంగా ఆయన సంకల్పమునుబట్టి లోకములో జీవించిన నరుడు పుణ్యమార్గంలో పరమాత్ముని రాజ్యప్రవేశం చేసి, పరమాత్మ సన్నిధిలో మరణము శ్రమ వేదన బాధ వగైరా అరిష్టములు అంటక నిత్యజీవిగా సజీవుడైన పరమాత్మ సన్నిధిలో నిరంతరము జీవించగలడు''. అనిన సత్యాన్ని దైవకుమారుడైన క్రీస్తు తనయొక్క చరిత్ర ద్వారా నిరూపించి యున్నాడు. కనుక క్రైస్తవులమైన మనము ఈ సమబుద్ధి రూపమైన యోగమును అలవరచుకోవాలని ఈ హైందవ పురాణంలో వివరించబడిన ఈ యొక్క శ్లోకమును గూర్చి బైబిలు వివరిస్తున్నది.
                ప్రియపాఠకులారా ! యోగమన్నది హైందవ సంబంధమైనదికాదు, యోగమన్నది పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము నుంచి నూతన నిబంధనలోని ప్రకటన గ్రంథములో సైతము బైబిలులో అనేక చోట్ల ఆయా సందర్భాలనుబట్టి నానా విధాలుగా క్రియ జరిగించియున్నది. యోగములు నానావిధాలుగ నానారీతులుగ వున్నవి. దైవత్వములో వున్న యోగాలు వేరు, పైశాచిక సంబంధ యోగాలు వేరు, శరీర సంబంధయోగాలు వేరు, ఆత్మసంబంధమైన యోగము వేరు. జీవయోగము వేరు నిర్జీవయోగము వేరు. జీవాత్ముడైన నరుడు పరమాత్మునియొక్క అదృశ్య లక్షణములను ఆయన యొక్క జగదుత్పత్తి కార్యాలను గూర్చి ఆత్మీయ పరిశోధన చేయుటయే ఆత్మయోగము. ఈ ఆత్మయోగములో పరమాత్ముడు నరునికి అనుగ్రహించిన జీవాత్ముడు బహు అప్రమత్తుడై అనగా మెలకువ కలవాడై గొప్ప మెలకువతో వుండి పరమాత్మ కార్యములలోని ప్రతి అణువును గూర్చిన మర్మాన్ని క్షుణ్ణంగా పరిశీలించుట, ఈ పరమాత్మునితో జీవాత్ముడు మొట్టమొదటగా భూమి మీద జరిగించిన ఈ పరిశోధన యోగములో ఘనవిజయాన్ని సాధించిన వ్యక్తులలో మొదటి వాడు ఆదాము 2వవాడు హనోకు.
                ప్రియపాఠకులారా ! ఆదాము ఆత్మ యోగసిద్ధుడు. కాబట్టి పరమాత్మునితో ముఖాముఖిగ మాట్లాడగల్గినాడు, ఆదాము పరమాత్ముని యొక్క హస్తక్రియ అనగా చేతిపనియై అంతమాత్రమేగాక పరమాత్ముని యొక్క ఆత్మాణువులో భాగస్వామియై, పరమాత్ముని యొక్క అంశములో భూలోకములో నరకోటి అవతరణలో ప్రధమఫలంగా భూగర్భం నుండి రూపించబడినవాడు. వాస్తవమునకు ఆదాము ఆత్మ యోగియేగాని, లోకములో అలౌకిక బంధము అను క్రియద్వారా శాకాఫలముద్వారా తన నుండి రూపించబడిన నారి ద్వారా లోకబంధములో చిక్కుకొని దైవాత్మయోగమునకు దూరమై సంసారబంధము పుత్రపౌత్రాదుల బంధము, లోకసంబంధ భూఫలముల గూర్చిన చింతన, ప్రకృతి వైపరీత్యమును గూర్చి భయాలు, అన్నిటికంటె ముఖ్యంగా దైవసన్నిధిని పోగొట్టుకొన్న పతనావస్థకు దైవయోగమును పోగొట్టుకొని ఆదాము దిగజారాడు.
                ఒక్కమాటలో చెప్పాలంటే పాతనిబంధనలో హనోకు మోషే ఏలియా ఈ ముగ్గురు పాపపుణ్యముల రెంటిని లోకానికి వదలివేసి దైవచిత్తమును గూర్చి యోచించి, తమ ఆత్మశరీరములను దైవ చిత్తమునకును ఆయన కార్యములకును ఆయన చట్టమునకును తమయొక్క శరీర ఆత్మీయ శక్తులు ధారబోసి క్రియాకర్మల ద్వారా యోగసిద్ధులైన వారు. క్రీస్తుకు తర్వాత నూతన నిబంధనలో పరమాత్మ శక్తిని తన తపోబలంద్వారా పొందుటయేగాక పరమాత్ముని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆత్మను తనలో నివసింపజేసుకొన్నవాడు పరిశుద్ధ పౌలు. ఇందునుగూర్చి పౌలు 1 కొరింథి 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి, అనుటలో పౌలులోని క్రీస్తును జనబాహుళ్యమునకు కనబరచాడు. అయితే పౌలు కూడా సౌలుగా వున్నపుడు పాపములో జీవించి పాపమునకు ప్రాధాన్యతనిచ్చి అందులో ప్రత్యేకంగా క్రైస్తవ్యాన్ని క్రైస్తవ సాహిత్యాన్ని క్రీస్తు రాజ్యాన్ని అంతమొందించాలని, అంతేగాకుండ క్రీస్తు సంబంధులను బంధించుటకు చరపెట్టుటకు చంపుటకును లోకపరిపాలకులచేత అధికార పత్రములు పొంది విచ్చలవిడిగా పాపముతో ఏకీభవించి హత్య దోపిడి అరాచకమునకు ముందు నడిచాడు. అయితే ఈ జీవితము సౌలులో ఎక్కువ కాలము జరుగలేదు, ఒకానొక దినమున దైవరాజ్యాధిపతి పాపవిమోచకుడు, సృష్టికర్త స్వరూపమైన క్రీస్తుద్వారా మొత్తబడినవాడై అంధుడై తాను జరిగించిన పాపపుణ్య క్రియాకర్మలు అనగా లోకరీత్యా సౌలుగా వుండి సౌలు చేసిన పాపమునకు మూలమైన మరియు తనలోని అహంభావమును అధికారమును ఆధిక్యతను, శరీర సంబంధములైన బలాతిశయములను రేకెత్తించి సౌలును సంపూర్ణమైన పాపములోకి దించిన అతనికి ఆనాటి ప్రభుత్వము అనుగ్రహించిన హోదా అధికారము అతని కత్తిడాలు యుద్ధ వస్త్రాలు ఆయుధాలు తనకు ప్రభుత్వము అనుగ్రహించిన అంగరక్షకులు సైనిక సమూహము, ఇట్టి భూలోక ఉన్నత ఆధిపత్యంలో జీవించిన సౌలు అహంభావముతో జరిగించిన పాపకార్యములు క్రీస్తు యొక్క ప్రత్యక్షత మూలంగా పాపక్రియను వదలి అనగా తన ఇహలోక భోగభాగ్యాలు వస్తువాహనాలు సైనిక సముదాయములు డమస్కు అధికారపత్రాలు సమస్తమును వదలి క్రీస్తు తాకిడికి శరీర అంధత్వము పొంది ఆత్మీయ దృష్టిని కలిగి పాపమేదో పుణ్యమేదో రెంటిని తెలిసికొని, పాపపుణ్యములకు మూలకార్యాలకు దేహమును దేహవాంఛలను వదలి అనగా ప్రియపాఠకులారా ! పౌలు చెప్పిన మాట'', నేను క్రీస్తు విషయమై లోకమును పెంటగా ఎంచుకొనుచున్నాను'', అను ఈ సందర్భములో మనము గ్రహించుకోవాలి. ఈ విధంగా పాపపుణ్యముల రెంటిని లోకమందే వదలి, క్రీస్తును పోలి నడిచి ఎనిమిది సంఘాలకు అమూల్యమైనటువంటి సందేశములతో కూడిన లేఖలు వ్రాసి, ఆనాడు సౌలుగా నుండి పౌలుగా మారిన మహాశయుడు ఆయన యొక్క ప్రవచనాలు నేటికిని పరిశుద్ధ గ్రంథములో గొప్ప ప్రాధాన్యతను సంతరించుకొని ప్రతి ఆరాధన స్థలములో బలిపీఠము మీద ప్రతి బోధకుని నోట ప్రవచింపబడుచున్నాడంటే పౌలు పాపపుణ్యముల రెంటిని ఈ లోకములో వదలి వేయకుంటే పౌలు దైవ యోగికాలేడు.
                ప్రియపాఠకులారా ! అన్య పురాణాలు ఎలాగున్నను క్రైస్తవ వేదములో పౌలునకు ఒక ప్రత్యేకమైన స్థానమున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు మహా ఋషి, పౌలు తన ప్రార్థనా శక్తి ద్వారా మృతులను బ్రతికించాడు, దయ్యాలు వెళ్ళగొట్టినాడు, యేసుక్రీస్తు నామములో అనేక విధములైన సూచక క్రియలు చేశాడు, దైవసిద్ధిని పొందినాడు, దైవరాజ్యమునకు సాక్షి అయ్యాడు, దైవసువార్తకు మూలపురుషుడయ్యాడు. అపొస్తలులలో లోకరీత్యా చివరివాడైనను తాను క్రీస్తులో లోతులో జీవించుటను బట్టి లోతైన అనుభవాలు కలిగి యుండుటనుబట్టి, లోకమునకును లోకస్థులకును దూరుడై యుండి దైవత్వానికి సమీపస్థుడై సత్యసువార్త సాక్షి అయ్యాడు. ఈ విధంగా పాపపుణ్యముల రెంటిని అనుభవించిన పౌలు - పాపములో సౌలుగాను, పుణ్యకార్యములలో పౌలుగాను నామాంతరము పొంది అటు క్రీస్తుకును ఇటు క్రైస్తవులకును మధ్యవర్తి అయ్యాడు. ఇది సమబుద్ధి రూపమైన యోగములో కర్మాచరణ ద్వారా కలిగిన నైపుణ్యమే అని మనము గుర్తించనగును.
                సమబుద్ధితో కూడిన యోగము - మేలు కల్గినపుడు సంతోషించకయు కీడు కల్గినపుడు దుఃఖించకయు, పొగడ్తలందును దూషణలందును సమబుద్ధి కల్గినవాడు - తాపత్రయపడని నైపుణ్యము కల్గినవాడని ఈ శ్లోకము వివరిస్తున్నది. సమబుద్ధి గల్గినవాడు పుణ్యపాపముల రెంటిని ఈ లోకమునందే వదలి వేయుచున్నాడని శ్లోకవివరణ, అయితే పరిశుద్ధ గ్రంథములో అనేకచోట్ల ఎవని క్రియల చొప్పున వారికి తీర్పు కల్గుననియు, దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను చెడ్డవైనను దేహము విడిచిన ఆత్మతో పయనించునని ప్రక 20:12 & 22:12లో చదువగలము. పై వివరించిన శ్లోకమునుబట్టి పాపపుణ్యములు రెంటిని ఈ లోకమునందే వదలి వెళ్ళుననియు, అయితే బైబిలు గ్రంథంలోని పై వచనాలు, దేహముతో జరిగించిన పాపపుణ్యక్రియలు దేహం విడిచిన ఆత్మతో అంటిపెట్టుకొని యుండుననియు వ్రాయుటనుబట్టి ఆలోచిస్తే ఇది కేవలం అమాయికతతో కూడినట్టి నిరాధారమైన అసత్యాన్ని బయల్పరుచుచున్నట్లు ఈ క్రింది వేదసాహిత్యం ద్వారా తెలుస్తున్నది. దైవత్వము యొక్క నిజరూపము ప్రభావితమును శక్తివంతము తేజోమయమై యున్నట్లు పరిశుద్ధ గ్రంథములో దైవత్వము యొక్క పూర్తి మర్మములు ఈ అనంత విశ్వమునకు ఈ క్రింది విధముగా వెల్లడి పరచుచున్నది. ప్రక 14:13 ఇప్పటి నుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసలుమాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును'', అని ఈ వాక్యము మూడు భాగాలుగా వ్రాయబడియున్నది. ఈ మూడు భాగాలు మూడు భావాలను జీవాత్ముడైన నరునికి వివరిస్తున్నది. ఇందులో మొదటి భాగము ప్రభువునందు మృతినొందుట, అంటే పరమాత్మునిలో నిద్రించుట, పరమాత్మునిలో ఏకమగుట, పరమాత్మునిలో విలీనమగుట. ఇట్టి స్థితి జీవాత్మకు ధన్యకరమని ఇందులో వ్రాయబడియున్నది. అయితే ఈ లోకమాయలో తగుల్కొని ఇందులో మృతిచెందిన వానిమాటేమిటి ? అంటే వానిని గూర్చి ఈ వేదభాగములో వ్రాయబడలేదు. ఎందుకంటే పరమాత్మునికి కావలసినదంతయు కూడా తాను భూమిమీద నరదేహములో ప్రతిష్ఠించిన జీవాత్మ యొక్క క్రియాకర్మలు శారీర కార్యములతోగాని శరీరసంబంధములైన మాయలతోగాని పరమాత్మునికి సంబంధములేదు. ఎందుకంటే లోకమాయ వేరు, దైవ మాయ వేరు, నారీ గర్భ మాయ వేరు.
                ప్రియపాఠకులారా ! ఈ సందర్భములో మార్కు 10:14-16 పరమయోగియైన ఏసుక్రీస్తు తన ఎదుట వుంచబడిన చిన్నబిడ్డలను ఎత్తుకొని ఎవడైనను ఈ చిన్నబిడ్డవంటివాడు కాకపోతే వాడు ఎంతమాత్రము దేవుని రాజ్యములో ప్రవేశించలేడు,'' అని పరమయోగియైన యేసుక్రీస్తు తన ఎదుటనున్న సర్వజనాంగమును త్యజించి కేవలము చిన్నబిడ్డలనే ఎందుకు మాదిరికరంగా చూపాడు? అనినిదానికి గొప్ప పరమార్ధమున్నది. తల్లి గర్భపు మాయలో వున్న శిశువు పాపపుణ్యాలుగాని ఐహిక విచారములుగాని కుట్రకుత్సితముగాని ఏవియు ఎరుగడు, అనగా తల్లిగర్భమును తప్ప తనకొరకు చేసియున్న బాహ్యప్రపంచాన్ని గూర్చి ఏమియు ఎరుగడు, అంటే ఏమియు ఎరుగని ఆత్మ గుణాతిశయములు కలవాడే పరమాత్ముని రాజ్యప్రవేశము చేయగలడు. ఇది నారీగర్భపు మాయలో దాగియున్న మర్మము. లోకమాయలో వున్న వాడు లోకసంబంధమైన గుణాతిశయములకు అలవరచబడినవాడై లోకమాలిన్యమును అంటుకొని, లోకసంబంధమైన నేత్రాశ, ధనాశ, స్త్రీ వ్యామోహము, పదవీ వ్యామోహము. 1 యోహా 2:15-17 లో వలె లోభత్వము కుటిలత్వము వగైరా అరిష్టాలలో తగుల్కొని భూగర్భమాయలోనే కొట్టుమిట్టాడుచు శరీరమనే జీవాత్ముడు లోకముతో ఏకమై లోకములలో కలసిపోతున్నాడు. ఇట్టివానికి పరలోక సామ్రాజ్యములో స్థానములేదు. ఇట్టివాడు పై లోకమునకు దగ్గరగా భూగర్భములో పాతాళలోకములోని చీకటి వాతావరణములో బంధీయై పరమాత్మునితో ఎలాంటి సంబంధములేక వేదన పూరితమైన వాతావరణములో వుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే పాతాళములోని నరక కూపములో పడతాడు.
                హెబ్రీ 12:14-15 పరిశుద్ధత లేకుండ ఎవడును దేవుని చూడలేడు. కనుక బుద్ధియందును జ్ఞానమందును క్రియాకర్మలయందును ఎంతో జాగ్రత్త వహించి వాటియందే తన మనస్సును నిలుపుచు వాటిని గూర్చి తాను ఈ లోకములో జీవిస్తు సిద్ధమనస్సుగలవాడు, పాపము పుణ్యము అను వాటికి సుదూరుడై ''పాపమును లోకానికిని పుణ్యమును దైవత్వానికి వదలి, దైవత్వముపై తన ఆత్మీయతను తన బుద్ధిని లగ్నముజేసి దైవధ్యానములో నిమగ్నుడైనవాడును ధ్యానసమాధిలో జీవించువాని కర్మాచరణన్నది నైపుణ్యంగా ఈ సందర్భములో లూకా 23:39-43 ఈ నైపుణ్యమే భగవద్‌ ఆకర్షణకు యేసుప్రభువునకు కుడివైపున సిలువ వేయబడిన దొంగ - లోకరీత్యా ఇతను తాననుభవించుచున్న వేదనలో అనగా మరణశిక్ష లోకము అమలు జరుపుకాలములో సిలువను అధిరోహించియున్న పరమాత్మ రూపముచే ఆకర్షింపబడి, తాను ఈ లోకరీత్యా దృశ్యమైన శరీరంతో జరిగించిన పాపకృత్యములు దోషాపరాధములు తన్నావరించిన లోకసంబంధమైన మలినములను గూర్చి పశ్చాత్తాప్తుడై, తన అతిక్రమ క్రియలకు పరితాపము చెంది దైవత్వముచేత ఆకర్షింపబడి, నేడే నీవు పరడైసులో వుంటావన్న పరమాత్ముని యొక్క అభయవాక్కును బట్టి పరమాత్ముని విశ్రాంతిలో ప్రవేశించగల్గినాడు.
                51వ శ్లోకము :- సమబుద్ది యుక్తులైన వివేకులు కర్మ జనితమైన ఫలమును వదలి జన్మరూపమైన బంధము నుండి విడివడిన వారగుచు నిర్దోషమైన మోక్షపదమును చేరుదురు.
                సమబుద్ధి - వివేకములు అనగా పౌలువలె రెండు విధములైనట్టి లోకానుభవములు అనగా లోకసంబంధ వ్యామోహములో చేసిన క్రియాకర్మలు మోక్షమందు అభిలాష కలవారై చేయు పుణ్యకార్యాలను గూర్చిన అనుభవముల ద్వారా పొందిన వివేకులైనవారు. లోకరీత్యా కర్మసంబంధమైన ఫలమును అనగా ఒక నరునికి తన కృషి మూలంగా జరిగించిన కృషి ఫలమును ఏవిధంగా అనుభవించునో అట్టి అనుభవము సమబుద్ధి వివేకయుక్తులైనవారిలో కలుగదు. ఆ మాటనే ఈ శ్లోకములో వాడుచున్నాడు. ఈ విధంగా కర్మజనితమైన ఫలమును విడిచిన వ్యక్తి జన్మరూపమైన బంధము నుండి అనగా జన్మకర్మ పాపముల యొక్క ఉపద్రవముల నుండి విడుదల పొందినవాడై, పరిశుద్ధమును పవిత్రమును మరణము లేనట్టి మోక్ష సామ్రాజ్యమును ఏలగలడు. ఇట్టివాని గుణాతిశయములు కలవానికి తప్పక మోక్షరాజ్య ప్రవేశమున్నదనుటకు సందేహము లేదు. ఉదా|| సమరయస్త్రీ యోహా 14:1-45 వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ యోహా 8:3-11 మగ్దలేనె మరియ లూకా 16:9 జక్కయ్య లూకా 19:2-9 సిలువమీది దొంగ లూకా 23:39-43 వీరందరు కర్మజనితమైన ఫలమును వదలి అనగా దేహసంబంధమైన ఆశలు, సుఖానుభవము, తన మన అనుభేదము, సాంసారిక వగైరా బంధకాల నుండి విడుదల పొంది పరమపదమనెడి మోక్షమును పొందినవారు.
                52వ శ్లోకము :- ఎప్పుడు నీ బుద్ధి - ''అజ్ఞానమనెడు మోహ కాలుష్యమును దాటి పోగలదో అప్పుడు నీవింతకు ముందు వినియుండినట్టియు, ఇకమీద వినదలచినట్టియు విషయముల యెడ లోకవైరాగ్యమును పొందగలవు. లోకసంబంధమైన మాటలు నిష్ప్రయోజనములను భావము కల్గును.
                బైబిలు వివరించు భగవద్గీత పరమార్ధము :- ప్రియపాఠకులారా ! ఈ సందర్భములో ప్రసంగి వ్రాసిన సాహిత్యములో ప్రసంగి అను సొలొమోను - ''దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానముతో అనుభవ పూర్వకంగా అనుభవించి, వాటి నుండి విరాగియై వ్రాసిన మాటలు 2:18-21 సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిలో నా తరువాత వచ్చువారికి నేను విడిచిపెట్టవలెనని తెలిసికొని నేను వాటియందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము కలవాడై యుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవనికి తెలియును ? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును. ఇదియును వ్యర్ధమే ! కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశవిడిచిన వాడనైతిని,'' 5:13-16 ఆస్తిగల వాడొకడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనెను. అయితే  ఆ ఆస్తి దురదృష్టమున నశించిపోవును. అతడు పుత్రులు కలవాడైనను అతని చేతిలో ఏమియు లేకపోవును. వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే, తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలిపోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో దిగంబరిగానే ఏదైనను చేతపట్టుకొనిపోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలిపోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివలన లాభమేమి? తాను లోకమే స్థిరమని నమ్మి అన్యాయంగా సంపాదించినది అంతయు నిష్ప్రయోజనము అను భావము అనగా లోకవైరాగ్యము దేహవైరాగ్యమును పొందగలడని భావము. పౌలు కూడా ఈ విధంగా లోకవైరాగ్యమును పొంది, లోకమును పెంటగా ఎంచుకొన్నాడు.
                53వ శ్లోకము :- అనేకమైన విషయాలు వినుటచే విరుద్ధ భావములతో వికృతమైయున్న నీ బుద్ది ఎప్పుడు సమాధియందు నిశ్చలమై నిలుచునో అప్పుడే నీవు యోగమును బడయువాడ వగుదువు''.
                బైబిలు వివరించు భగవద్గీత పరమార్ధము :- లోకసంబంధమైన నమ్మశక్యముగాని జీవాత్మునికి అయోగ్యకరమైన విరుద్ధభావముతో కూడిన విశేషములను, నమ్మశక్యముగాని మాటలవలన బుద్ధిని వక్రమార్గంలో నడుపకుండ సమాధియందు కూడా అనగా నిశ్చలమైన ప్రార్థనాస్థితిలో దేహాన్ని లోకాన్ని మరిచి, దైవాత్మతో జీవాత్ముని కేంద్రీకరించి చేయు ప్రార్థన సమస్తమును జయింపగలదు.
                54వ శ్లోకము :- కృష్ణా సమాధిచే నిశ్చలుడైయున్న యా స్థితప్రజ్ఞుని అనగా నిలిచిన బుద్ధిగలవీని యొక్క లక్షణమేమి ? స్థితప్రజ్ఞుడేమి సంభాషించును ? ఎట్లు కూర్చుండును ? ఎట్లు నడుచును?
                స్థితప్రజ్ఞుడనగా స్థిరమైన బుద్ధిగలవాడు, దైవత్వములో విలీనమైయున్నవాడు, తన ఆత్మీయ ధ్యానము, తన శరీర గుణసంపత్తిని పూర్తిగా పరమాత్మునికే యోగ్యకరమైన స్థితిలో వుంచుచు ఆత్మసంబంధిత నిష్ఠ నియమాలు పాటిస్తూ అన్నపానములలో మితభక్షకుడై అనగా మాంసాహారముతో కూడిన రాజభోజనముగాక సృష్టిలో ఆదినరుడైన ఆదామువలె శాకాహార భుక్కుడై, మితసంభాషియు సజ్జన సావాసము భక్తకూటమితో సహజీవనము, వేదపారాయణంలో ఆసక్తి, ఇరుగుపొరుగు యెడ ప్రేమ కరుణ సానుభూతి కలిగి మరి ముఖ్యంగా జీవహింస సహించనివాడై జీవులయెడ దయగలవాడై, సర్వసృష్టిని సమానత్వంతో ప్రేమిస్తూ - తన ఇరుగుపొరుగుతోను తనతత్వమునకు అనుకూలురుతోను ప్రేమపూరితమైన కుశలములను విచారిస్తూ సాదరంగా సంభోదించును. ఇది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు - వాని భోజన నియమములు అతడు చేయు సంభాషణల యొక్క వివరణ.
                ఇక అతడు ఎట్లు కూర్చుండును ? అనుటలో స్థిరబుద్ధిగలవాడు తనవలె స్థిమితమైన మనస్సాక్షి, స్థిరమైన బుద్ధిగలవారి ఇంట కూర్చుండి పరమాత్మ సంబంధమైన సంభాషణలు, మోక్షరాజ్యము యొక్క వైభోగమును గూర్చిన మాటలు - అట్టి రాజ్యములో వారసత్వము పొందుటకు కావలసిన యోగ్యతలను గూర్చి సంభాషిస్తూ పరమాత్మునిలో లీనమై వేదపారాయణ చేయు గృహాలలో ఎక్కువగా కూర్చుంటాడు. కాలము వెళ్ళబుచ్చునని దీని భావము. ఈ సందర్భంలో 133వ కీర్తనలో వివరించబడిన సావాసమునే ఎల్లప్పుడును కోరును''. సహోదరులు ఐక్యతగల్గి నివసించుట ఎంత మేలు ? ఎంత మనోహరము. అది తలమీదపోయబడి అహరోను గడ్డము మీదుగా దిగజారిన పరిమళ తైలమువలె వుండును, సీయోను కొండమీదకు దిగివచ్చు హెర్మోను మంచువలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట వుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు.
                స్థితప్రజ్ఞుని లక్షణములకు తార్కాణంగా ఈ సందర్భంలో దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా నీకు ఒక్కగానొక్క కొడుకైన ఇస్సాకును తీసికొని వెళ్ళి మోరియా పర్వతం మీద దహనబలిగా అర్పించుమని చెప్పెను. అబ్రహాము తనకుమారుని వధించుటకు తనచెయ్యి చాపి కత్తిపట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి పిలిచి ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. నీకు ఒక్కడైయున్న నీకుమారుని నాకియ్య వెనుదీయలేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని తెలియుచున్నది. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశనక్షత్రముల వలెను సముద్రతీరమందలి ఇసుకవలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసెదను. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని, సెలవిచ్చెను''. పై అధ్యాయములో వ్రాయబడిన వేదభాగంలో దేవుడు అబ్రహామును పరిశోధించిన  విధానము ఆది 22:1-19లో వివరంగా మనము చదువగలము. ఈ విధంగా అబ్రహాము దేవుని పరిశోధనలో స్థిరబుద్ధితో నిలిచినవాడై అనగా నిలకడయైనటువంటి బుద్ధితో దైవత్వమునందు లక్యముంచిన వాడైనట్లు వేదరీత్యా చదువగలము.
                అయితే అట్టివాని లక్షణమేమి ? అనుటలో ఇతను పరమాత్ముని విశ్వాసి. ఇట్టి విశ్వాసమునుబట్టి ఇతను లోకములోని విశ్వాసులకు తండ్రిగా పరమాత్మునిచేత పిలువబడినాడు. తాను చేయు ప్రతి కార్యములో పరమాత్మ యొక్క చిత్తాన్ని అనుసరించాడు. పరమాత్ముని సెలవులేనిదే ఏ క్రియాకర్మను జరిగించినవాడు కాదు. అయితే ఇతను వృద్ధుడై యుండి నూరు సంవత్సరముల వయస్సులో తన భార్య 90 సం||ల వయస్సు కలిగి ముదిమిలో వున్నపుడు కూడా తన బుద్ధి నిశ్చలతలో కుడికిగాని ఎడమకుగాని తొలిగినవాడుకాదు. వాక్కులో కూడా తప్పిపోయిన వాడుకాదు. పరమాత్మునియొక్క సన్నిధిలో లోకజనాభాలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అబ్రహాము పొందగల్గినాడు. అంతేగాకుండ ఆనాడు పరమాత్ముని సన్నిధిలో నిశ్చలమైన బుద్ధితో వ్యవహరించిన అబ్రహాము యొక్క నామము అతని వంశావళియైన జనము అతని నుండి వెలువడినటువంటి పరమాత్మ సంతానము, నేటికిని ఇశ్రాయేలు అను నామధేయముతో ఈ యుగము వరకును నిలిచియున్నారంటే అబ్రహాము పరమాత్మపట్ల కనబరచిన స్ధిరబుద్ధియే కారణమని మనము గ్రహించవలసియున్నది. ఇంకను స్థిరబుద్ధి గలవానియొక్క  కొన్ని లక్షణాలు - ఇతను మితభాషి, ధైర్యవంతుడు, పరమాత్ముని కార్యాలలో ఎట్టి సంకోచములేనివాడు. పరమాత్మునిపై తాను నిల్పిన తన మనస్సు యొక్క స్థిరత్వాన్ని క్రియామూలకంగా ప్రదర్శిస్తూ మోరియా పర్వతముపై తన ఒక్కగానొక్కడైయున్న కుమారుని కాళ్ళు చేతులను త్రాటితో కట్టి బంధించి పేర్చిన కట్టెలపై పరుండబెట్టి, నరకుటకు కత్తినెత్తినటువంటి ఖచ్చితమైన దైవకార్యాచరణ పరాయణుడుగా దైవసన్నిధిలో వ్యవహరించాడు. అందుకే నాటి అబ్రహాము యొక్క కీర్తి ఆనాటి నుండి నేటి వరకును మరియు ఈ అనంత విశ్వము గతించిపోవు దినము అనగా లోకాంత్యము సంభవించు వరకును అబ్రహాము యొక్క త్యాగశీల బుద్ధి నిశ్చలతన్నది సకల జనావళికి ఆదర్శంగా నిలిచియుంటుందని ఇందునుబట్టి తెలుస్తున్నది.
                ఇక స్థితప్రజ్ఞుడు ఏమి సంభాషించును ? అనుటలో ఇందుకు జవాబు - మోషే, ప్రియపాఠకులారా ! మోషే దైవత్వంతో బహుధైర్యంగా ఆయా సందర్భమునుబట్టి పరమాత్ముని చిత్తప్రకారముగా తనతపోశక్తి ద్వారా సంభాషిస్తూ పరమాత్ముడు తనకు అనుగ్రహించిన జనాభాను నడిపించుటకును వారిని పోషించుటకు పరమాత్ముడు తన జనాంగమునుబట్టి మోషేకిచ్చిన బరువు బాధ్యతలు నెరవేర్చుటకును, మోషే పరమాత్మునితో సంభాషించిన విధానము స్థలములయొక్క వివరములను తెలిసికొందము.
                మొట్టమొదటగా మోషే పరమాత్మునిచేత ఎన్నిక చేయబడుసందర్భములో హోరేబు అను పరమాత్ముని పర్వతము మీద పరమాత్మ దర్శనము పొందుట. ఆ దర్శనంలో మోషేను దీవించి తన జనాంగానికి నాయకునిగ నియమిస్తున్నట్లు అభయమిచ్చి, అందుకు కావలసిన రక్షణను కర్ర ద్వారా అనుగ్రహిస్తూ - పరమాత్మునియొక్క శక్తి ప్రభావములను మోషే యొక్క చేతికర్రలో బయల్పరచుచు, ఆ కర్రను సర్పముగాను కర్రగాను మరియు కార్యాచరణ  జరిగించు ఆయుధముగాను అనగా దైవదండంగా మార్చినట్లు ఈ యోరేబు అను పర్వతముపై మోషేను తన జనాంగానికి నాయకునిగాను నిర్వాహకునిగాను ప్రవక్తగాను హెచ్చించి, నలుబది సంవత్సరములు పరమాత్ముడు మోషేతో ఆయా సందర్భాలలో ఆయా రీతులుగ ఆయా వాతావరణములో ఆయా స్థలములలో సంభాషించినట్లును, మోషే యొక్క కార్యదక్షత స్థయిర్యముతో కూడిన మనోస్థితికి పరమాత్ముడు తన్మయుడై ఇశ్రాయేలు అను తన జనాంగమును పరిపాలించుటకును దైవక్రమములో నడుచుటకును సీనాయి అను పర్వతము మీద మోషేతో ముఖాముఖిగ మాట్లాడిన పరమాత్ముడు - పరమాత్మ సంబంధమైన చట్టములను శిలాశాసనాలుగ మోషేకు అనుగ్రహించి, ఆ చట్టప్రకారము దైవజనాంగాన్ని మోషే నడుపుటకు ఆ శిలాశాసనాలకు ధర్మశాస్త్రంగా నామధేయము చేసి పరమాత్మునియొక్క శక్తి తేజస్సు ఆ శిలాశాసనముల నుండి ప్రకాశించి క్రియ జరిగించినట్లు మనము మోషే చరిత్ర నుండి తెలిసికోగలము. ఈవిధంగా స్థితప్రజ్ఞుడైన మోషే - మనుష్యులతో కాకుండ ఎక్కువగా దేవునితో సంభాషించాడు.
                ఇక మోషే కూర్చున్న ఆసీనుడైన స్థలాలను గూర్చి మనము ఆలోచిస్తే - మోషేకు లోకములో దేవునికి తప్ప నరుల ఎదుట కూర్చుండి తాను ముచ్చటించినట్లు మోషే చరిత్రలో ఎక్కడ వ్రాయబడలేదు. మోషే తాను జీవించినంతకాలము దైవజనాంగమును నడిపించుటకే తన యొక్క దేహయాత్రను జరిగించాడేగాని ఒక్కచోట స్థిరంగా కూర్చుండి ప్రశాంతంగా దేవుడు తనకిచ్చిన జనాంగముతో మాట్లాడినట్లుగాని దేవుడు తనకు అనుగ్రహించిన విధి నిర్వహణను వదలి ఖాళీగా కూర్చుండి దైవజనాంగముతో ముచ్చటించినట్లుగాని వ్రాయబడలేదు. ఎందుకంటే మోషే నిలుచుండినను కూర్చుండినను పండుకొన్నను ఈ మూడు క్రియలు ప్రభువుమధ్య జరిగించాడు. కాని మనుష్యుల మధ్యలో జరిగించలేదు. ఆనాటి ఐగుప్తురాజు యొక్క రాజ ఆసనాల మీద కూర్చున్నవాడు కాదు. ఈవిధంగా మోషే దైవావేశితుడై సంభాషించినట్లును సంచరించినట్లును దైవసన్నిధిలో కూర్చుండినట్లును మోషే చరిత్ర వివరిస్తున్నది.
                ఇక స్థితప్రజ్ఞుడు ఎట్లు నడచును ? అని ఈయొక్క శ్లోకములో చివరన వ్రాయబడియున్నది. నడకలో కూడా దేవునితో మోషేను సమానంగా నడిపిస్తూ - సుఖదుఃఖాదులు ప్రమాదములు యుద్ధాలు శతృవలయములు కరువులు తెగుళ్ళు వగైరాలలో కూడ మోషే నడిచినట్లుగా మోషే చరిత్రలో మనము కొన్ని ఘట్టాలను గూర్చి తెలిసికొందము.
                ప్రియపాఠకులారా ! దైవచిత్తములో నిలుకడగా నిలిచిన వీరుడు ప్రజ్ఞాశీలి స్థిరచిత్తుడైన మోషే నడిచినట్టి మార్గాలను మనము గమనిస్తే సామాన్య మానవునికిది అసాధ్యమనియే అనిపిస్తుంది. మోషే తాను ఒక్కడే  దైవత్వముతో నడిచినవాడే కాకుండ లక్షల జనాభాయైన ఇశ్రాయేలులను కూడా తనతోబాటు దైవమార్గంలో నడిపించాడు. ఆవిధంగా నలుబది ఏండ్లు దైవజనాంగముతో మోషే నడిచాడు. సముద్రమును రెండు పాయలుగ చేసి, పరమాత్మునిచేత ఆరిననేల సృష్టింపజేసి సముద్రమధ్యమున తాను ముందుండి దైవ జనాంగాన్ని నడిపించాడు. పరమాత్ముని చిత్తాన్ని ఆయన ప్రణాళికను సమూలంగా నెరవేర్చి పరమాత్ముని నోట మోషే ''దేవుని ఇల్లంతటిలో నమ్మకస్థుడు'' అనగా స్థితప్రజ్ఞుడు - స్థిరబుద్ధిగలవాడన్న ఖ్యాతిని పరిశుద్ధగ్రంథ చరిత్రలో పొందినాడు. హెబ్రీ 3:5 మోషేకు కల్గిన ఈ మహాభాగ్యము - పరమాత్ముని చిత్తమును నెరవేర్చుటయు, ఆయనకు యోగ్యకరంగా జీవించుటయు, ఆయనలో సంపూర్ణంగా లీనమై ఆయనతో నడచుటయే దీనికి కారణము. ఈవిధంగా స్థితప్రజ్ఞుడైన మోషే దైవమార్గంలో పరమాత్ముని యొక్క ఆజ్ఞానుసారంగా తానేగాకుండ పరమాత్ముడు తనకు అనుగ్రహించిన జనాన్ని కూడా దైవమార్గంలో నడిపి సంపూర్ణుడయ్యాడు.
                55వ శ్లోకము :- ఎప్పుడైతే తన మనస్సునందుండు కోరికలనెల్ల విడిచినవాడై, తాను తనయందే సంతుష్ఠి చెందుచున్నాడో - అప్పుడు వాడు స్థితప్రజ్ఞుడని ఆతని దేహమే దేవుని ఆలయంగా చెప్పబడుచున్నాడు.
                బైబిలు వివరించు భగవద్గీత పరమార్ధము :- జీవాత్ముడైన నరుడు తనమనస్సున నుండు కోరికలనెల్ల విడిచిపెట్టి అనగా లోకవ్యామోహాలను జయించి, లోకములో ఏదియు తనదికాదని ఎంచి తాను ఎప్పుడైతే లోకవైరాగి అవుతాడో - అట్టివాడు స్థితప్రజ్ఞుడు, సంపూర్ణమైన దైవత్వమును కల్గినవాడు అను ఈ శ్లోకములోని సారాంశమైయున్నది.
                పరిశుద్ధ గ్రంథంలో ఈ కోవకు చెందిన లక్షణాలుగలవారు అపొస్తలుడైన పౌలు నందున్నవి. ఎందుకనగా క్రీస్తు విషయమై నేను లోకమును పెంటగా ఎంచుకొనుచున్నాను, చావైతే లాభము - బ్రతుకుట క్రీస్తే, పై శ్లోకమునుబట్టి పౌలును రెండు విధములైన జీవితాలకు పోల్చవచ్చును. ప్రియపాఠకులారా ! పౌలు సౌలుగా వున్నప్పుడు ఎన్నో కోరికలతో ఎన్నో ఆశయాలతో ఎన్నో పదవులతో అనుభవించిన భోగభాగ్యాలు రాచరికపు మర్యాదలు రాజభోజనము రాజాసనాలు ప్రశస్తమైన రాజవస్త్రాలు, ఉత్తమ రాజాశ్యవాహనము, పట్టాకత్తి ఈటె డాలు విలువైన శిరస్త్రాణము నడుముకు దట్టి ఖరీదైన జోడు, స్థూలమైన శరీరము, మంచి దేహదారుఢ్యము ఇవన్నియుగాక లోకాధిపత్యము మీద వ్యామోహము కల్గినవాడై, బలమైన భటులయొక్క కాపుదల, అభేద్యమైన ఆయుధాలు ధరించి వీటితో నిండుకొని లోకసంబంధియై లోకాన్ని అంటిపెట్టుకొని లోకమే స్థిరమని సౌలు అను పేరుతో దైవ విశ్వాసులకు సింహస్వప్నంగా నిలిచాడు. ఇట్లు శరీర సంబంధమైన ఉన్నతమైన కోరికలతో విర్రవీగి లోకాన్ని హత్తుకొని ప్రేమించి ఒకానొక దినమున పరమాత్ముని శక్తియైన యేసుప్రభువు యొక్క ఆత్మీయ వెలుగుతాకిడికి అనగా ఆయనచేత మొత్తబడి అంధుడై - తాను ఏ రాచరికములో ఏ అధికారంతో ప్రయాణిస్తున్నాడో ఆ వాతావరణమును అప్పటి పరిస్థితిలో తానున్నటువంటి స్థితి అనగా తన పూర్వసుఖానుభవములు సుఖాసనాలు సుఖవిలాసాలు లోకసంబంధ భోగభాగ్యాలు మరియు తన అంగరక్షకులు తానెక్కిన అశ్వము తానుధరించిన యుద్ధ వస్త్రాలు, తాను చేతపట్టిన కత్తి డాలు తన లోకాధికారపత్రాలు ఇవన్నియును కోల్పోయి నేలను పడి అంధుడై కనుచూపును కూడా పోగొట్టుకొని అశక్తుడైనట్లు పౌలు చరిత్ర వున్నది. అదే సౌలు పౌలు అయిన తర్వాత లోకమును శరీరేచ్ఛలను జయించి తన తపోశక్తి ప్రభావమున దైవానుగ్రహమును పొంది పౌలుగా పేరు మార్చుకొని సంపూర్ణ మానవత్వాన్ని పరిపూర్ణ దైవత్వాన్ని పొంది పాతనిబంధన ఋషులలో అగ్రగణ్యుడై ''నేను క్రీస్తు పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి, 1 కొరింథి 11:1 అని మాట్లాడుటలో పౌలు స్థితప్రజ్ఞుడని సంపూర్ణమైన మానవత్వమును దైవత్వమును పొందియున్నాడని అతని మాటలనుబట్టి అతని క్రియలను బట్టి మనము తెలిసికోవలసియున్నది. ఇది స్థితప్రజ్ఞుని గూర్చిన సంపూర్ణ వివరణ. ఇట్టివానికి లోకము మీదగాని, లోకకార్యాలమీదగాని లోకసంబంధమైన సుఖదుఃఖాలుగాని ఐశ్వర్యముగాని ఒకటేమిటి ? లోకములో వున్న వాటి అన్నిటి మీదను ఎలాంటి కోరిక వుండదు, ఇట్టివాడు అన్నపానములు లేకుండ నిరాహారంగా తన ప్రార్థనా శక్తితో లోకసంబంధమైన భోజ్యములకు దూరమై దైవకార్యాలను నెరవేర్చగలడు, అంతేగాకుండ ఇట్టి మహాపురుషుడు తన వాక్శక్తి చేత జరిగినవి జరుగుచున్నవి జరుగబోవు సంఘటనలను గూర్చి ఖచ్చితంగా చెప్పగలడు, మరియు ఇట్టివాని వాక్‌శక్తితో రోగాలు భూత పిశాచములు తొలగిపోగలవు. మరణించినవారు సజీవులుగా లేపబడుదురు, స్థితప్రజ్ఞుడైన ఇట్టి సంపూర్ణ నరుడు పరమాత్ముని యొక్క సన్నిధాన వైభోగమును, తాను మరణించకముందే క్రీస్తును దర్శించగలడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇతడు మహాయోగి - ఇట్టి బిరుదు పౌలు పొందియున్నాడు.
                56వ శ్లోకము :- దుఃఖములు సంభవించినప్పుడు కటకటంబడని మనస్సు గలవాడును, సుఖములు ప్రాప్తించినప్పుడు వాని యెడ ఆదరము చూపనివాడును, ప్రేమ భయము కోపము ననువానికి వశపడని వాడును అగు పురుషుడే స్థితప్రజ్ఞుడనియు, ముని - అట్టివాడు తనయందున్న దేవుని ఆత్మయందు సంతృప్తి చెందువాడు.
                ఇందులో వివరించబడిన లోకసంబంధమైన దుఃఖములు అవాంతరాలు శోధనలు బాధలు రోగాలు కరువుకాటకాలు ప్రమాదములు జరిగినపుడు, తన మనోనిబ్బరంతో వాటిని ఎదుర్కొని వాటివశపడని అనగా భీతి చెందని వాడును మరియు ద్వేషము ఈర్ష్య పగ భయము కోపము అను వాటికి వశపడని వాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడని లేక మునియని ఈ శ్లోకములోని అర్థమైయున్నది.
                అపో 27:లో పౌలు చేసిన సముద్ర ప్రయాణములలో జరిగిన వైపరీత్యము అవాంతరాలు అందులోని చేదు అనుభవాలను గూర్చి అపొస్త 27 మరియు 28 అధ్యాయాలలో చదివితే స్థితప్రజ్ఞుడైన పౌలు యొక్క మనోస్థయిర్యమును గూర్చి తెలిసికోగలము. ఇందునుబట్టి పౌలు పరమాత్మునిలో ఆయన ఎన్నుకొన్న అపొస్తలులలో ఒక ఉన్నత స్థానాన్ని పొంది లోకాన్ని పెంటగా ఎంచుకొని పరమాత్ముని యొక్క నామమును స్వాస్థ్యముగా పొందినట్లుగ ఇందునుబట్టి తెలుస్తున్నది.
                57వ శ్లోకము :- ఎల్లయెడల నెవ్వడు స్నేహరహితుడై ఆయా శుభాశుభములను పొందినప్పుడు, సంతోషముగాని ద్వేషమునుగాని చెందడో వాని ప్రజ్ఞయే స్థిరపడినది.
                బైబిలు వివరించు పరమార్ధము :- పరమాత్ముడు స్థిరచిత్తుని పరిశోధించు పరీక్షలో తట్టుకొని నిలువగల్గి, అటు దుఃఖముగాని భయముగాని విచారముగాని లేక తనకు పరమాత్ముడు అనుగ్రహించిన ఫలమును బట్టి సంతోషమును అహంభావమును పొందక స్థిరమైన విశ్వాసము స్థిరమనస్సాక్షితో జీవించిన వాని యొక్క ప్రజ్ఞయే స్థిరమైనదని అంటాడు. ఇట్టివాని గూర్చి పరిశుద్ధ గ్రంధములో అబ్రహాము యొక్క జీవితము ఇందుకు సరియైన జవాబు ఇస్తుంది. ఎలాగంటే ప్రియపాఠకులారా ! అబ్రహాము తనకు నూరు సంవత్సరముల జీవితములోను, తన భార్యయైన శారా యొక్క తొంబయి సంవత్సరముల జీవితములోను సంతానహీనులై జీవించినపుడు అబ్రహాము పొరబాటున కూడా తనకు సంతానము కలుగలేదని, తననుగూర్చి తాను నిందించుకోవడంగాని తన భార్యయైన శారాను సంతానహీనురాలిగా నిందించుటగాని తుదకు తన దాంపత్య జీవితములో సంతాన సౌభాగ్యాన్ని ప్రసాదించలేదని దైవత్వాన్ని నిందించినట్లుగాని అబ్రహాము చరిత్రలో వ్రాయబడలేదు. అంతేగాకుండ పరమాత్ముడు అబ్రహాము యొక్క విశ్వాస పరీక్షలో నిలిచి సంతానమును ప్రసాదించగా ఆ సంతానమును గూర్చి అబ్రహాము సంబరపడలేదు. కాని అది దేవుడు ఇచ్చిన కానుక అని తృప్తిపడినాడు. అయితే మరియొక సందర్భంలో అబ్రహామును దేవుడు పరిశోధిస్తూ నీకు ఒక్కడైయున్న నీకుమారుని నాకు దహనబలిగా అర్పించమన్నప్పుడు అప్పుడుకూడా పరమాత్ముని ఆజ్ఞను గూర్చి అబ్రహాము సంకోచించలేదు. ఆ కార్యము నెరవేర్చబూనుకున్నాడు, అనగా తన కుమారుని పరమాత్ముని ఆజ్ఞానుసారము ఆయన ఉద్దేశించిన స్థలములో బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి తన కుమారుని  బంధించి కట్టెలమీద నుంచి నరకుటకు సాహసించాడంటే, అబ్రహాము యొక్క ప్రజ్ఞ దైవసన్నిధిలో ఎంత గొప్ప స్థానాన్ని పొందిందో ఇందునుబట్టి మనకు తెలియుచున్నది. అందుకే నేటి విశ్వాసులకు అబ్రహామును తండ్రిగా పరమాత్మునిచేత ప్రవచించబడినాడు, నేటి క్రైస్తవ విశ్వాసులకందరికి అబ్రహాము ఆదర్శప్రాయుడయ్యాడు. మరియు నేటి అగ్రరాజ్యాల మధ్య ఒక రాజ్యముగానున్న యూదులు ఇశ్రాయేలు అను జనాంగమునకు మూలపురుషుడునై యున్నట్లు పరిశుద్ధ గ్రంథ చరిత్ర నిర్ధారిస్తున్నది.
                58వ శ్లోకము :- తాబేలు తన అవయవములవలె ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి ఎల్లవేళల నెప్పుడు ముడుచుకొనునో వాని ప్రజ్ఞయే చక్కగా నిలిచియుండును''.
                ఇందునుగూర్చి పరిశుద్ధ గ్రంథ వివరణ :- ప్రియపాఠకులారా ! తాబేలును ఉదాహరణగా తీసికొని తనకేదైన ఆపద సంభవించినపుడు, లేదా శతృవు యొక్క జాడ తెలిసినపుడే అది తన వీపుననున్న చిప్పలలో ముడుచుకొంటుంది. అప్పుడు దానియొక్క శతృవు దాన్ని స్పర్శించి దానిని రాయిగానో లేక ఏదేని ఒక నిర్జీవమైన వస్తువుగానో భావించి వదలివేయును. అలాగే స్థిరబుద్ధిగల జ్ఞానియైన దైవవిశ్వాసి తానున్న దైవ రక్షణవలయములో జీవిస్తున్నప్పటికిని ప్రజాబాహుళ్యంలో లోకసంబంధితమైన తనయొక్క వ్రతమునకు ఆత్మీయతకు విరుద్ధమైన ఏ కార్యముపట్లను, ఏదేని ఒక సమస్య ఏర్పడినప్పుడు అటువంటి సంఘటన జరిగినప్పుడు తాబేలు వలె తానేమియు ఎరగనన్నట్లు తాను నిర్దోషినని తనకు పట్టనట్లుగ తటస్థంగాను ముభావముగాను వుండిపోతాడు. అనగా ఏ వర్గమునకు సంబంధించినవాడు కాకుండ తటస్థంగా వుంటాడు, ఇదియే స్థిరచిత్తుని యొక్క లక్షణములు. అనగా ఇంద్రియముల విషయముల నుండి ఇంద్రియములు జరిగించు కార్యములలో అన్ని విధముల ఎప్పుడు నరుడు స్వాధీనపరచుకొని ప్రవర్తించునో అట్టివానిని ప్రజ్ఞావంతుడంటున్నాడు.
                ప్రియపాఠకులారా ! ఇందుకు దీటైన సమాధానము దావీదే ! తాను రచించిన మొదటి కీర్తనలోని వివరములు ఇందుకు సరిపోవును. అదేమనగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనగా దుర్గార్గుల యొక్క దురాలోచనలలో సహకరింపక వారికి సలహాలివ్వక వారితో ఏకీభవించక  వారిని అనుసరింపక వారి మార్గమును అవలంబించక దుష్కార్యములు చేయువారును అపహాసకులు అనగా అవహేళన గుణాతిశయములతో ఎల్లవేళల జీవించే దౌర్భాగ్యుల పంక్తిలో కూర్చుండక ''యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు'' అనుటలో ఇది క్రైస్తవునికి ఇవ్వబడిన అమూల్యమైన మరియు పరిశుద్ధమైన గ్రంథమని దీనిని పఠిస్తూ దివారాత్రులు దానిని ధ్యానిస్తూ తన పంచేంద్రియములను తన స్వాధీనము నందుంచుకొనువాడు ధన్యుడు - ధన్యుడు అంటే స్థితప్రజ్ఞుడు. 1:3 అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె వుండి - అతడు చేయునదంతయు సఫలమగును''. అనగా ఇట్టి స్థితప్రజ్ఞుడు చేయు సమస్తకార్యములు సఫలీకృతమగును.
                కనుక నీతిమంతుని యొక్క జీవితము తాబేలు తన యొక్క అవయవములను ఏవిధంగా తనకివ్వబడిన కవచములో ముడుచుకొంటుందో ఆవిధంగా స్థితప్రజ్ఞుడైనవాడు లోకసంబంధమైన కార్యములకు సుదూరుడగుచు పరమాత్ముని చిత్తమును నెరవేర్చుటలో తన ఇంద్రియములను స్వాధీనమందుంచుకొని ప్రవర్తిస్తాడు'', అని దీని భావము.
                59వ శ్లోకము :- విషయములను గైకొనని శరీరికి ఆ విషయములు మాత్రము దూరమగును. కాని వానికి అందుండెడి అభిరుచి వానిని విడిచిపోదు. అనగా ఆహారము లేకుండ తపమొనర్చెడు పురుషునకు ఇంద్రియములు ప్రవర్తింప శక్తి లేనివేయగును. కాని అందున్న అభిరుచిపోదు. కాని ఆత్మస్వరూపము అనగా పరమాత్మ తత్త్వదర్శనము తెలిసికొన్న పిమ్మట కోరికలు సమసిపోవును.
                ప్రియపాఠకులారా ! ఇందునుగూర్చి సరియైన నిర్వచనము ఏమిటంటే లోకసంబంధమైన కోర్కెలను అనుభవించిన నరుడు మనస్సును నిగ్రహించుకొని వాటిని అభ్యసించుట మాని తన పంచేంద్రియములను వశపరచుకొని జీవించుటకు ప్రయత్నించును. కాని తాను అనుభవించినట్టి ఆ యొక్క కార్యములను గూర్చిన ఆసక్తి ఆ జీవిని వెంటాడుటచే ఆ కార్యమును గూర్చిన అభిరుచి విడువలేడు. అది అతనికి సంపూర్ణమైన ఆత్మీయ దర్శనము ఆత్మీయ క్రమశిక్షణ ద్వారా అనగా పరమాత్ముని యందు తన మనస్సును లగ్నపరచుట మూలంగా పరిమితము కాగలదని దీవి భావము.
                ఇందుకు బైబిలులో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు జీవితమును ఉదాహరణగా తీసికొందము. ఇతడు తన తల్లిదండ్రుల యొక్క ముదిమి దశలో దేవునిచేత వరపుత్రునిగా జిన్మించుటయేగాక పరమాత్ముని చిత్తప్రకారంగా తన శరీరాత్మల యొక్క జీవితాన్ని క్రమబద్దము చేసికొంటూ ఈ లోకయాత్ర సాగించాడు. ఇట్టి మహావ్యక్తి దైవత్వములో దైవచిత్తంలో పరమాత్మునియొక్క నిబంధనలో జీవించినను అతనికి లోకసంబంధంగా వున్నటువంటి భూఫలమైన మాంసాహారయుతమైన అభిరుచి జిహ్వాచాపల్యము అతనిని శోధించింది. ఇట్టి  శోధనలో ఇస్సాకు తన ముదిమిలో చాలా కాలము ఆయుస్సు కల్గినవాడై తనను దృష్టి పూర్తిగా మరుగైనంతవరకు ఆయుర్ధాయం కల్గియున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్సాకు యొక్క జీవితము అప్పటిలో దైవత్వమునకు సన్నిహితమై దైవత్వములో లీనమై దైవరాజ్య ప్రవేశము చేయవలసిన ఆత్మీయ స్థితిగల్గిన ఇస్సాకునకు, లోకసంబంధమైన మందదృష్టి ఏర్పడగా తనకు పుట్టిన కుమారులలో జ్యేష్ఠుడు ఎవడో ద్వితీయుడెవడో ఎరుగని స్థితిలో వుంటూ ఉన్నట్లుండి ఒకదినము తన జ్యేష్ఠకుమారుని చేతిద్వారా వేటాడిన జంతు మాంసమును ఆశించినవాడై, తనకున్న మాంసాహార అభిరుచి అన్నది ఇస్సాకు యొక్క ఉద్దేశాన్ని ఆశయాన్ని వమ్ముచేసింది. అనగా తల్లియొక్క ప్రోద్భలముచేత ఇస్సాకు కుమారుడైన యాకోబు అన్నను అభినయించి అన్నవలె రోమములతో కూడిన మేక చర్మమును ధరించి, అన్నయొక్క మర్యాదలో తండ్రిని కలుసుకొని వేట మాంసమునకు బదులుగా మేక మాంసముతో తండ్రికి విందు చేసి తండ్రియొక్క ఆశీర్వాదాన్ని సంపూర్తిగా యాకోబు పొందగల్గినాడు. ఈ విధంగా ఇస్సాకు తన జిహ్వ చాపల్యముచేత తన కార్యసిద్ధిలో అపజయం పొందినాడు.
                ప్రియపాఠకులారా ! ఈ సందర్భంలో మరియొకరి జీవితాన్ని కూడా మాదిరికరంగా మనము తీసుకోవచ్చును. సంసోను విషయములో దైవోద్దేశ్యమును నెరవేర్చవలసిన వాడైయుండగా లోకసంబంధంగా స్త్రీ వ్యామోహములో తగుల్కొని దైవప్రతిష్టకు భంగము కల్గించి, దేవుడు తన కనుగ్రహించిన బలాధిక్యతలను గూర్చిన మర్మమును వేశ్యమీదనున్న మమకారముచేత దానికి బయల్పరచి చెరసాలపాలై బంధీయై అంధుడై అన్యదేవతా ఆలయములో హతుడయ్యాడు.
                60వ శ్లోకము :- యోగసాధన కలవాడు సమస్తములైన ఇంద్రియములను చక్కగా వశపరచుకొని నాయందలి ఆసక్తమైన చిత్తము కలవాడై యుండవలెను. అర్జునా ! ప్రయత్నశీలుడును పండితుడునైన పురుషుని యొక్క మనస్సును కూడా కలత చెందించు స్వభావముగల ఇంద్రియములు బలవంతముగా హరించును''.
                ఇందునుగూర్చిన బైబిలు వివరణ :- అర్జునా ! ప్రయత్నశీలుడు అంటే కార్యదక్షత, ఆత్మస్థయిర్యము గలవాడు మరియు పండితుడు, అనుటలో విద్యావంతుడు వేదవిద్వాంసుడు ఒక్కమాటలో చెప్పాలంటే వేదజ్ఞానియు దైవజ్ఞానియు దైవశాస్త్రమును కూలంకషంగా ఎరిగిన వాడైన పురుషుని యొక్క మనస్సు కూడా చలిస్తూ - చలించునటువంటి స్వభావమునకు అతని పంచేంద్రియములు బలవంతంగా ఏదోయొక హేయకార్యమును జరిగించి అతనియొక్క ఆత్మీయ జీవితాన్ని హరిస్తాయి, అనగా భంగపరుస్తాయి, లేక లయపరుస్తాయని భావము. మరి ఇట్టి కోవలో పరిశుద్ధ గ్రంధములో అనేకులున్నారు. కాని ఉదాహరణగా ఒక్కరి జీవితాన్ని గూర్చి మనము ధ్యానిస్తాము.
                దావీదు కుమారుడైన సొలొమోను పరమాత్ముడైన యెహోవాకు భూమి మీద మందిరము కట్టుటకు పరమాత్ముని చేతనే యోగ్యతను పొంది ఎన్నిక చేయబడి, ఆ విధంగా ఎన్నిక చేయబడుటయేగాక భూమిమీద యెరూషలేము అను దేవాలయమును పరమాత్మునికి మందిరము నిర్మించుటకు అహర్నిశలు కృషిజేసి, నానావిధ వస్తు సంబారములతోను నానాదేశాల నుండి సేకరించిన మణులు మాణిక్యాలు కలపసామగ్రి వేలమంది పనివారు, పరమాత్ముడు తనకు అనుగ్రహించిన నమూనానుబట్టి దైవమందిర కార్యమును సంపూర్ణంగా నెరవేర్చినవాడును, ఇంతేగాకుండ పరమాత్ముడు తనకు అనుగ్రహించిన భూలోకసంబంధంగా ఇచ్చిన సంపదను అనుభవించిన ఐశ్వర్యమును గూర్చి బైబిలు వేదములో చదివితే విశేషమైనటువంటి, నాటి రాజులలో ఎవ్వరికిని లేనటువంటి గుర్రములు రౌతులు రధములు, రాచభవనములో విశేషమైన సంపద, వెండి, బంగారు, లోహసంబంధ అలంకారాలు, దాసదాసీజనము, బహుపత్నీ జీవితము, విశేషమైన అనగా ఒక రాజు పరిపాలించుటకు శక్తిలేనంత విస్తీర్ణమైన సామ్రాజ్యమును, పరమాత్ముడు సొలొమోనుకు అనుగ్రహించియుండగా - సొలొమోను వీటన్నిటిని పరిపాలించుటకు తనకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించమని పరమాత్ముని గూర్చి తపస్సు ఆచరించి అనగా ప్రార్థనజేసి, తనయొక్క తపోశక్తి మూలంగా పరమాత్మ సిద్ధి పొంది, ఆయన దర్శనం పొంది, ఆ దర్శనములో తనకున్న సంపదనంతను తనకు పరమాత్ముడు అనుగ్రహించిన విశాల సామ్రాజ్యమును పరిపాలించుటకు న్యాయపరిపాలన జరిగించుటకు కావలసిన జ్ఞానాన్ని పరమాత్ముని అడుగుట - ఆ విధంగా పరమాత్ముని మెప్పించిన సొలొమోను ఆయన చేత పరమజ్ఞానాన్ని పొంది పరమజ్ఞానిగా భూలోకంలో జీవించుటయేగాక అనేకులైనటువంటి రాజులను రాణులను ఆకర్షించి, అనేక విధములైన విదేశ వస్తుసంబారములను మణులు మాణిక్యాలు వెండి బంగారమును కానుకలుగాను బహుమానాలుగాను పొంది పరమాత్ముడు తనకిచ్చిన జ్ఞానముతో విశ్వవిఖ్యాతిని పొందిన సొలొమోను తన దేహాన్ని తన పంచేంద్రియములను స్వాధీనపరచుకోలేక వాటి అభిరుచుల ద్వారా లోకమాయలో తగుల్కొని లోకమాయకు గురియై, స్త్రీ వ్యామోహము రగుల్కొని దైవత్వమునకు ప్రతికూలుడై దైవమందిరముపై తిరుగుబాటుజేస్తూ దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుటకు బదులు తనకు వేలసంఖ్యలో వున్న భార్యలు ఉపపత్నులు యొక్క చిత్తమునుబట్టి ప్రవర్తించి తాను ఏ దేవునికి మందిరము కట్టినాడో ఆ మందిరమునకు జరుపవలసిన దైవ ఆరాధనలకు బదులు తాను కట్టిన దైవ మందిరానికి అభిముఖంగా అన్యదేవతా బలిపీఠములు కట్టి బలులర్పిస్తూ - లోకసంబంధంగా తుచ్ఛమైన శరీరులైన స్త్రీలకు తనయొక్క జ్ఞానాన్ని తపోశక్తిని పవిత్రతను ధారపోసి, దైవత్వము యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. అయితే సొలొమోను జ్ఞాని అని వేదములో వ్రాయబడుటలో సొలొమోను దైవాత్మ ఆవేశితుడై కీర్తన గ్రంథములో కొన్ని భాగాలు సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథము పరమగీతాలు విలాప వాక్యాలు వగైరా పరిశుద్ధ గ్రంథములోని వేదభాగాలకు గ్రంథకర్తయై యుండి, తన వేదపాండిత్యము చేత ఈ నాటికిని లోకానికి మార్గదర్శియైయున్న ఈ సొలొమోను యొక్క జీవితములో అతని పంచేంద్రియములే అతని యొక్క ఆత్మీయ జీవితమును హరించి వేయుటకు కారణమైనట్లు పై శ్లోకములో వ్రాయబడిన వివరములు మనకు జ్ఞాపకము చేస్తున్నవి.
                61వ శ్లోకము :- యోగసాధన కలవాడు సమస్తములైన ఇంద్రియములనన్నింటిని చక్కగా వశపరచుకొని, నా యందలి ఆసక్తమైన చిత్తము కలవాడై గ్రహించి తదేక ధ్యానపరుడై ఊరక కూర్చుండవలెను. ఇంద్రియములు ఎవ్వని వశము నందుండునో వాని ప్రజ్ఞయే సుప్రతిష్ఠితమైనది.
                ఇందుకు బైబిలిచ్చు సరియైన నిర్వచనము :- ప్రియపాఠకులారా ! పంచేంద్రియములన్నవి దేహానికి సాధనములు. పంచేంద్రియములన్నవి దేహానికి అంగములు. ఇందులో జ్ఞానేంద్రియమన్నది సారధి - దేహమన్నది రథము, హృదయమన్నది ఈ రథమునకు కేంద్రస్థానము. ఈ విధంగా అమర్చబడిన పరమాత్ముని యొక్క రూపమైన నరుని యొక్క శరీరము ఒక చలనాత్మకమైన మరియు రక్తమాంసములతో కూడిన, పరమాత్మునిచే రూపించబడిన యంత్రమని చెప్పవచ్చును. లోకరీత్యా నరునిచే రూపించబడిన యంత్రమునకు ఇంధనము గాలి నీరు మరియు సాంకేతిక పరిజ్ఞానము విద్యుశ్చక్తి అవసరమైయున్నట్లు ఉదాహరణ - ఒక మోటారు వాహనాన్ని తీసుకొందాము. ఇందులో దీనికి నాలుగు చక్రాలు ముందు భాగంలో యంత్రము, దాని పరిమాణమును బట్టి శరీర నిర్మాణము, అందులో ప్రయాణీకులు కూర్చునుటకు ఆసనాలు, వాహనము నడుపు చోదకుడు కూర్చుండు కేంద్రస్థానములో వాహనాన్ని క్రమబద్దీకరణ చేయు స్టీరింగు చక్రము, మరియు ఆ యంత్రమునకు కావలసిన చమురు ఇంధనము, అంతేగాకుండ యంత్రమునకు సహాయముగా విద్యుశ్చక్తి, వాహనానికి నాలుగు చక్రాలలో గాలి, వాహనములోని యంత్రము వేడి చెందక వుండునట్లు క్రమబద్దీకరణ చేయుటకు నీరు వగైరా అన్ని యంత్ర భాగములతోబాటు వాటి వాటి క్రమంగా పనిజేయుటకు ఒకదానినొకటి జతపరచు రాగి తీగెలు, వయర్లు - వీటన్నిటితోబాటు ఈ వాహనము నడచుటకు తిన్నని మరియు మెట్టపల్లములు లేక గుంటలు లేక సజావుగా సాగిపోయేందుకు మంచిమార్గము. ఇన్ని అవసరమై యున్నట్లుగానే జీవాత్ముడైన నరునియొక్క శరీరానికి కూడా పైవిధమైనట్టి వాహనానికి సమతుల్యమైయున్నది.
                ప్రియపాఠకులారా ! లోకసంబంధమైన చలనాత్మకమైన వాహనమును రూపించుటకు నరుడు కార్యకర్తయైయున్నాడు. అలాగే నరునియొక్క నిర్మాణమునకు పరమాత్ముడు నిర్మాణకర్తయైయున్నాడు. నరుని పరమాత్ముడు ఎలాగో సజీవమైన యంత్రంగా మాంసము ఎముకలు నరములు శ్వాసకోశాలు గుండె ప్రేగులు ఉదరము వగైరా అంతర్భాగములలో కాళ్ళు చేతులు నేత్రములు నాలుక ముక్కు చెవి మెదడు వగైరా ప్రధానమైన అంగభాగములతో వీటితోబాటు పరమాత్ముడు తనయొక్క విద్యుశ్చక్తి కంటె ప్రభావితమైన ఆత్మీయశక్తిని నరునిలో ప్రవేశింపజేసి నరుని యొక్క దేహమును ఒక యంత్రంగా భూమిపై చలింపజేస్తున్నాడు. ఈ క్రియ పరమాత్మ సంబంధమైనదే, కనుక దేవుడు చేసినట్టివియైన మన శరీరములోని  పంచేంద్రియాలను అంతరేంద్రియాల యొక్క కాలగతులను చలన విధానమును వాటి పనితీరును ప్రతినిత్యము తదేకముగా ధ్యానిస్తూ తన దేహ కోర్కెలకు పంచేంద్రియముల యొక్క కదలికను తన స్వాధీన మందుంచుకొని వాటిని శరీరమునకు ఆత్మదాతయైన పరమాత్మునియొక్క చిత్తానుసారంగా వాటిచే పనిచేయించువాడు యోగి. ఇంకను పవిత్రంగా వాటిని వుంచుకొన్న వానిని పరమయోగియని ఋషియని స్థితప్రజ్ఞుడని అనుటకు సందేహము లేదు.
                అయితే ఈ శ్లోకములో యోగియైనవాడు ఊరకయే కూర్చోవాలని వ్రాసియున్నాడు. ప్రియపాఠకులారా ! ఇది కేవలము పొరబాటు, పరమాత్ముడు జీవాత్ముడైన నరుని లోకములో పుట్టించినప్పుడు పరమాత్మయొక్క చిత్తానుసారంగా ఆయన కార్యములన్నిటిని ఆయనశక్తి ఆయన తేజము ఆయన ప్రభావము ఆయన మహిమ వివరాన్ని మరియు ఆయన రాజ్యసంబంధమైన విధులనుగూర్చి, లోకములో వున్నటువంటి సకల శరీరులకును అనగా తన ఇరుగుపొరుగులకు పరమాత్ముని గూర్చినటువంటి పరమ సత్యాలను సువార్త రూపంగా ప్రకటిస్తూ సంచార జీవితమును సాగిస్తూ పరమాత్ముని చిత్తము నెరవేర్చువాడై యున్నాడేగాని, ముప్పూటలు కడుపునిండా మెక్కి కన్నులు మూసికొని మూలకూర్చుండవలసిన స్థితిలో నరుని పరమాత్ముడు సృష్టించలేదు.
                పరిశుద్ధ గ్రంథములో ఇందుకు ఉదాహరణగా కొందరి యోగులైన వారిని గూర్చి తెలిసికొందము. ఏలీయా భగవద్‌ శక్తితో తన పంచేంద్రియాలను తన స్వాధీనమందుంచుకొని పరమాత్మునితో కూడిన వాక్శక్తి గలవాడై తనలోని దైవాత్మ యొక్క శక్తి ప్రభావమున ఆనాటి రాజ్య పరిపాలకుడైనట్టి ఆహాబు అతనని భార్యయైన యెజెబెలును శపించుట. ఆ శాపమూలముగ మూడున్నర సంవత్సరము వర్షము వర్షింపకుండునట్లుజేసి ఆనాటి ఆహాబు పరిపాలనలో గొప్ప కరువును పుట్టించాడు. అంతేగాకుండ కరువు కాలములో తాను బసచేసిన విధవరాలి కుమారుని బ్రతికించాడు. ఆ ఇంటిలో ఆ కరువు కాలములో ఆమె ఇంటిలోని పిండిని ఆమె సీసాలోని తైలమును తరగకుండ చేశాడు. మరల తన తపోశక్తి ప్రభావమున భూమిమీద వర్షమును కురిపించాడు. అటు తర్వాత దేవునికి బల్యర్పణగా వుంచిన నైవేద్యమును లోక సంబంధమైన అగ్ని లేకుండగనే తన వాక్శక్తితో పరమాత్ముని యొద్ద నుండి దైవాగ్నిని రప్పించి బలి అర్పణను దహించుట.
                ప్రియపాఠకులారా ! మహాయోగియైన ఏలియా తన పంచేంద్రియములను స్వాధీనమందుంచుకొని, ముండమోపి విధవరాలివలె మూలకూర్చుని వుంటే దైవత్వములో - ఏ విధంగా దైవత్వమును గూర్చిన మహత్కార్యములను, దేవుని మహిమను జనాంగమునకు ఏవిధంగా ప్రకటించగలడు ? ఏలియా తన యొక్క పంచేంద్రియాలను తన స్వాధీనము నందుంచుకొని వాటిని దైవార్పితంగా అర్పించి తద్వారా దైవశక్తి పూరితమైన ఆశ్చర్య మహిమాన్విత కార్యాలను చేయగల్గినాడంటే ఆయనలోని పరమాత్ముని యొక్క శక్తి ప్రభావమెట్టిదో వేదములో మనము చదువగలము. కనుక యోగియైనవాడు అనగా ఆత్మసిద్ధి పొందినవాడు ఊరకయే కూర్చుండుటన్నది అవివేకము మరియు అనేకమైన లోకసంబంధమైన శోదనలకు అనుకూలమని మనము తెలిసికోవాలి. దైవసిద్ధి పొందినవాడు ఏ పనియు చేయక దైవధ్యానమంటూ మూలకూర్చుంటే అట్టివాడు అనేకమైన లోకసంబంధమైన అవాంఛనీయమైన సంఘటనలకు గురికాగలడనుటకు మరియొకరి జీవితాన్ని మనము బైబిలులో దృష్టాంతంగా తీసికొందము. ఈ సందర్భంలో 2వ సమూ 11:1-4 చదివితే ప్రవక్తయు కీర్తనాకారుడు దైవాంశ సంభూతుడు నిత్యము దైవధ్యానము దైవపారాయణ చేసేటటువంటి ప్రవక్తయు మరియు మహారాజైన దావీదు విషయములో జరిగిన సంఘటన దావీదు చేసిన తప్పు పూర్తిగా మనకు బయల్పరచుచున్నది. అదేదనగా దైవజనాంగముతో కూడి దైవపక్షంగా లోకసంబంధమైన శతృమూకలతో పోరాడవలసిన దైవసంభూతుడైన దావీదు మహారాజు దైవజనాంగమును యుద్ధ భూమిలోకి పంపించి, తాను పరమాత్మునికి విరుద్ధంగా ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీది నుండి లేచి రాచనగరు మిద్దెమీద పచారు చేయుటయు అట్టి సమయములో దావీదు యొక్క నేత్రములో భూలోకము యొక్క మాయ ఆకర్షణకు గురియగుటకు అనగా దావీదు రాజు తాను పచార్లు చేయుచున్న మిద్దెమీద నుండి వివస్త్రగా స్నానము చేస్తున్న స్త్రీయొక్క అంగసౌష్ఠవము సౌందర్యమునకు ముగ్దుడగుటకు అతని నేత్రమే అతనిని ఆకర్షింపజేశాయి. దావీదు మహారాజు మాత్రమేగాక మహాయోగియని కూడా వేదములో ఉన్నటువంటి ఆయనను గూర్చిన చరిత్ర వివరిస్తున్నది. అట్టివాడు ఊరక ఉండబట్టే తన పంచేంద్రియాలలో ఒక అంగమైన అతని కన్నులు అతనిని తప్పుడు దారి పట్టించాయి.
                కనుక ప్రియపాఠకులారా ! పంచేంద్రియాలను స్వాధీన మందుంచుకొన్నవాడు ప్రతివాటిని ప్రతిరోజు పరమాత్మ సంబంధమైన ఏదోయొక పనికి వాటిని సాధకపరచుచుండవలెను. ఆ విధంగా వున్నవాడే జీవాత్ముడైన నరుడు పరమాత్ముని సన్నిధిలో సంపూర్ణుడును ప్రతిష్ఠితుడును అగుతాడు. ఎందుకంటే నరజీవుడు ఉదయము లేచింది లగాయతు అస్తమాన కాలములో అతని పంచేంద్రియాలు ఏదోయొక పనిని చేయవలసిన బాధ్యత వాటికున్నది. అయితే జ్ఞానేంద్రియము మాత్రము విరామము లేకుండ తన పనిని నానా రీతులుగ కళ్ళెములేని గుర్రమువలె జరిగిస్తుంటుంది. ఇట్టివాటిని ఎవడైతే స్వాధీనమందుంచుకొని వాటిని సరియైన క్రమములో నడిపించి క్రమశిక్షణలో వుంచుకొంటాడో అట్టివాడు పరమయోగి - ఇట్టి జాబితాలో అపొస్తలుడైన పౌలును చేర్చవచ్చును. ఎందుకంటే పౌలు లోకాన్ని అనుభవించి దానిని వదలివేసి పరలోకము పరమాత్ముని సన్నిధానమును అభిలషించి, అందునుగూర్చి తన పంచేంద్రియాలను తన శరీరమును తన జీవాత్మను తన మనఃసాక్షిని తన సర్వస్వమును పరమాత్మునికి కైంకర్యము చేస్తూ లోక నరకోటిపై సవాలు చేస్తూ - ''1 కొరింథి 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలినడుచుకొనుడి,'' అనిన మాటను ప్రవచించియున్నాడు. ఇది పరమాత్మ ప్రతిష్ఠితమైనటువంటి పరిపూర్ణుడైన జ్ఞానియొక్క వాక్కు.
                62వ శ్లోకము :- ఇంద్రియ విషయములను ధ్యానించుచుండు పురుషునికి వానియందు తగుల్కొనుట తటస్థించును. ఆ తగుల్కొనుటవలన కామము ఉదయించును, ఆ కోరికలవలన క్రోధముపుట్టును''.
                ఈ శ్లోకమునుగూర్చి ఏకాభిప్రాయంతో కూడిన బైబిలు వివరణ :- జీవాత్ముడైన నరుడు లోకమును గూర్చి పరిశోధిస్తూ జీవించుచున్నపుడు - అట్టి పురుషునికి లోకసంబంధమగు ఇష్టుల మూలంగా బంధకము ఏర్పడుతుంది. ఆ బంధకమువలన కామము దానివలన క్రోధము పుడుతుందని ఈ శ్లోక వివరణ. అంతేగాకుండ ప్రియపాఠకులారా ! దైవ విశ్వాసియు దైవభక్తుడైనవాడు పరమాత్మ సంబంధమైన కార్యాలను గూర్చి ధ్యానించునపుడు అట్టివానిని లోకము తనవలలో అనగా తనకార్యములలో ఇరికించుటకు ప్రయత్నించును. ఆవిధంగా లోకమాయలో తగుల్కొన్న విశ్వాసిలో కామము అను బీజము ఏర్పడును. దానిలో నుండి క్రోధము పుట్టును, అని పై శ్లోకము యొక్క అర్థమైయున్నది. ఏది ఏమైనప్పటికిని ఈ శ్లోకానికి కూడా దీటైన సవాలు బైబిలులో దావీదు యొక్క జీవితము, ఆయన కుమారుడైన సొలొమోను జీవితాలు ఇందుకు దీటుగాను సవాలుగాను వున్నవి. మొట్టమొదట దావీదును గూర్చి నేర్చుకొందము.
                దావీదు మహారాజేగాక కీర్తనాకారుడును ప్రవక్తయు, దైవత్వమునకు అత్యంత ప్రేమపాత్రుడై యుండి లోకసంబంధంగా దావీదు జరిగించిన యుద్ధ పోరాటాలలో తనకు కల్గిన విజయావకాశముచే అనగా దావీదు విజయము యెహోవా విజయమన్న నినాదముతో తన ఇహలోక సంపదను రాచరికాన్ని యావత్తును దైవత్వమునకు అర్పితంజేసి ప్రజా పరిపాలన చేశాడు. పరిశుద్ధ గ్రంథములో దావీదుకున్న ప్రత్యేకత ఎవరికిని లేదనియే చెప్పవచ్చును. ఎందుకంటే అట్టడుగు దశలో బాలుడై యుండి లోకరీత్యా ఎన్నుకొన్న తన తండ్రియైన యెష్షయికిని తనకంటె పెద్దవారైన ఏడుగురు అన్నదమ్ములలో ఎన్నిక లేనివాడును గొర్రెలు మేపుకొనేటటువంటి నికృష్ట జీవియై బాలుడై యున్న దావీదును ప్రత్యేకించి, పరమాత్మ తన ప్రవక్తయైన సమూయేలు ద్వారా ఎన్నిక చేయించి అతనిని అభిషేకించి ప్రతిష్ఠించి తన జనాంగమైన ఇశ్రాయేలునకు పరిపాలకునిగా అనగా రాజుగా ఏర్పరచినట్లు 2వ సమూ 16:11-13 లో దావీదు చరిత్రను చదువగలము. ఇట్టి వాతావరణములో దేవుని ఎంపికలో నిలిచినవాడై దైవత్వమునకు ప్రీతికరమైన కార్యములు అనేకములు చేసినవాడై, అనేక పోరాటములు సాగించినవాడును, తన వాయిద్య సముదాయముతో తన చక్కని కంఠారావముతో సృష్టికర్తను గూర్చినటువంటి అనేక విధములైన వర్ణనలలో గానాలాపము చేస్తూ - తన జీవితమును దైవత్వమునకు అంకితము చేసి జీవిస్తున్న దావీదు యొక్క ప్రశస్తమైన ఆత్మీయ జీవితము, లోకమాయలో ఒకానొక దినమున తగుల్కొన్నట్లు 2వ సమూయేలు గ్రంథము 11లో చదువగలము. లోకమాయ నానావిధములైయున్నది. నరునికి లోకము ఎరగా చూపేది 1. ధనము, 2. ఐశ్వర్యము, 3. పదవి, 4. స్త్రీ, 5. అధికారము, 6. భూసంబంధంగా సృష్టికర్తకు బదులు భూమినే ఆరాధించే స్థితికి నరుని దిగజార్చుట. దైవత్వమునుండి తొలగించి ఈ భూమియే నరునియొక్క శరీర జీవితమునకు బాధ్యత వహించినట్లుగ తన సంబంధిగా నరుని మార్చుకొని వానియొక్క శరీరమును తన గర్భంలో చేర్చుకొని జీర్ణింపజేసుకొనుట. ఇది భూమికున్నటువంటి ఏడు లక్షణాలు. ఈ ఏడు గుణాలకు అతీతుడుగా వున్నవాడే అనగా వీటి వశముకానివాడే పరమయోగి. అయితే దావీదు పరమయోగిగా తన జీవిత పటిష్ఠతను కాపాడుకొంటున్న తరుణంలో లోకము దావీదును లోకసంబంధమైన యుద్ధ సమయములో దావీదు ఆదమరచియున్న సమయము కనిపెట్టియున్న ఈ లోకము, తన మాయకు వశముగాని దావీదును స్త్రీమాయలో పడవేసింది. ఎందుకంటే ప్రియపాఠకులారా ! దావీదుకున్న సకలైశ్వర్యాలు దేవుడే ఇచ్చినవని దైవసంబంధముచే అని భావిస్తు - తన ఆత్మీయ జీవితాన్ని నడుపుకొంటున్నాడేగాని, ఏనాడు లోకసంబంధంగా భావించలేదు. లోకము తనకిచ్చినటువంటి బహుమానాలను ఏనాడు దావీదు అనుకొన్నవాడు కాదు. దావీదుయొక్క జీవితములో దేవుడు తనకనుగ్రహించిన సమస్తమును దైవార్పితములు దైవానుగ్రహములని భావించాడు. కాని అవి లోకసంబంధములని తలంచినవాడు కాదు. అట్టి మనోస్థిరత గల్గిన దావీదు ఒకానొక అస్తమానకాల సమయంలో వివస్త్రగా వుండి స్నానమాచరిస్తున్న స్త్రీయొక్క మాయలో తగుల్కొని కామోద్రేకము కలవాడై, అంతేగాకుండ ఆ స్త్రీ యొక్క భోగట్టాను తెలిసికొని ఆమెను తనయొద్దకు రప్పించుకొని ఆమెను అనుభవించుటయే గాక అనగా స్త్రీ మాయలో తగుల్కొనుటయేగాక, తన సైనికులలో ఒకడైన మరియు నమ్మకస్థుడైన, తనయందు వినయము విధేయత భక్తి కలవాడైన సైనికునికి ఆమె భార్యయని తెలిసికొని తాను చేసిన ఈ అపరాధమును కప్పిపుచ్చుటకు బహు కుయుక్తిగా ప్రవర్తించి, తన కుయుక్తి పారనందుకు క్రోధావేశంతో స్త్రీయొక్క భర్తను చంపించే ఉద్దేశ్యంతో యుద్ధరంగ మధ్యమునకు పంపించి నిష్కపటి సద్గుణ పరాయణుడైన, ఆ అభాగ్యుడైన స్త్రీ భర్తను చంపించుట క్రోధాదిగుణములతో కూడిన క్రియ, ఈవిధంగా దావీదు లోకమాయలో స్త్రీ మాయలో తగుల్కొని పరమాత్మునికిని ఆయన చట్టమునకును ప్రతికూలుడై తన కామక్రోధ గుణాతిశయముల మూలంగా దైవసన్నిధిలో దోషియైనాడు.
                ఈలాగుననే ఈయన కుమారుడైన సొలొమోను కూడా దైవజ్ఞానమును కోరి తనకున్న లోకసంబంధమైన రాచరిక సంబంధమైన ఐశ్వర్యాలను పెంటగా ఎంచుకొని దైవధ్యానమును కోరి, దైవమును ప్రార్థించి దైవప్రసన్నతను పొంది, దైవత్వముచేత దైవజ్ఞానమును సంపదగా పొంది తన ఇహలోక జీవితములో ప్రకాశమానమైన జ్యోతిగా వెలిగిన సొలొమోను తన జ్ఞానంతో అనేక దైవగ్రంథములు వ్రాసిన ఈ జ్ఞాని లోకమాయ స్త్రీమాయలోను తగుల్కొని అజ్ఞానియై తన జీవితానికి కళంకము తెచ్చుకొన్నాడు.
                63వ శ్లోకము :- క్రోధము వలన సమ్మోహనము కల్గును. సమ్మోహనము వలన స్మృతి భ్రంశమగును - అనగా మతిభ్రమ కల్గును. స్మృతి తప్పుటవలన బుద్ధి నశించును. బుద్ధినాశము వలన తుదకు తానే నశించును.
                ఇట్టి స్థితిలో దీనికి దీటైన సవాలు పరిశుద్ధ గ్రంథములో వున్నది. అదేమనగా ఎస్తేరు గ్రంథమును మనము చూచినట్లయితే అహష్వేరోషు సంస్థాన ఆస్థానములో హామాను అనువానిని రాజు ఘనపరచి హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటె ఎత్తుగా నుండెను,'' కనుక రాజసేవకులందరును రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళూని హామానునకు నమస్కరించిరి. ఎస్తేరు 3:1-2 ఇది రాజు హామానునకు ఇచ్చిన ఆధిక్యత. అంతేగాకుండ 3:10లో రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హామానునకిచ్చి - ''ఆ వెండి నీకియ్యబడియున్నది''. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడియున్నారని రాజు సెలవిచ్చుట'', ఆ అధికారముతో దైవజనాంగమైన యూదులను నిశ్శేషంగా వధించుటకు హామానునకు రాజు అధికారమిచ్చుట, ఈ విధంగా క్రోధాది గుణములతోను, అటుతర్వాత రాజుతో కపటంగాను ప్రవర్తించి రాజును రాచరికాన్ని తన కైవసము చేసుకొనుటకు హామాను పన్నాగము పన్నుట. అట్టిస్థితిలో హామానుయొక్క బుద్ధి వికటించి రాజసింహాసనమును, రాజాశ్యమును రాజు ఆయుధమును రాజవస్త్రాలను రాచరికపు మర్యాదను తానే పొందుటకు రాజును హత్యచేయాలని హామాను కుట్ర పన్ని తుదకు తానే మొర్దెకైకి మరణశిక్ష విధింపజేసి వానికి తన ఇంటిముందే మరణశిక్ష అమలుపరచునట్లుగా ఉరికొయ్యను నాటించి సిద్ధపరచి - క్రోధాదిగుణములతో కూడుకొన్నవాడై మొదట మొర్దెకైని  అటుతర్వాత రాజును చంపి తానే అహష్వేరోషు సామ్రాజ్యమునకు రాజుగాను షూషనుకోటకు అధికారిగాను వుండాలని, రాణియైన ఎస్తేరును కూడా అనుభవించాలని కామేచ్ఛగలవాడై తుదకు తనను ఆవరించిన కామక్రోధాది గుణముల మూలంగా చేటు తెచ్చుకొని - తాను ఏ వ్యక్తినైతే మరణశిక్ష విధించాలని అందుకు అవసరమైన సన్నాహాలు చేశాడో అదేస్థితిలో అదే వాతావరణములో తాను సిద్ధపాటు చేయించిన ఉరికంబమందుతానే ఉరితీయబడినాడు. ఇది 62వ శ్లోకానికి దీటైన జవాబు.
                మరియొక ఉదాహరణ - అబ్షాలోము యొక్క జీవితము కూడా ఇందుకు జతపరచవచ్చును, అబ్షాలోము దావీదు కుమారుడై యుండి, తండ్రిపై తిరుగుబాటు చేస్తూ క్రోధ గుణములచేత తండ్రి సింహాసనమును ఆక్రమించాలని, తండ్రిపై తిరుగుబాటు చేసి బుద్ధి-జ్ఞానము వికటించి అనగా కన్నతండ్రి అనిన జ్ఞానాన్ని వివేకాన్ని మరచి, ఉన్మాద బుద్ధితో తండ్రిపై సైనిక తిరుగుబాటుజేసి, తాను జరిగించిన పితృ ద్రోహ కార్యమునకు పరమాత్ముడు ఉగృడై అబ్షాలోము ఎక్కిన గాడిద చేతనే అబ్షాలోమును చెట్టుకు వ్రేలాడదీయించి చంపించినట్లు అబ్షాలోము యొక్క చరిత్రలో మనము చదువగలము. 2వ సమూ 18:9 ఈ విధంగా అబ్షాలోము తనకు తానే నాశనాన్ని సంపాదించుకొని తుదకు తనను తానే నశింపజేసుకున్నాడు.
                64వ శ్లోకము :- లోకసంబంధమైన రాగద్వేషములు రెండును లేక అనగా వీటియందు లక్ష్యముంచక తనకు స్వాధీనములైయున్న పంచేంద్రియాల ద్వారా తనయొక్క ఇహలోక జీవితమును పరమాత్మునకును లోక న్యాయచట్టమునకును అనుగుణంగా తన పంచేంద్రియాలను తాను స్వాధీనమందుంచుకొనినపుడే వినీత హృదయుడు అవగా నీతిమంతుడు లేక పునీతుడైనవాడు చిత్తశాంతిని, పరమాత్ముని యొక్క కటాక్షమును ఆయన సన్నిధానమును ఆయన ప్రసన్నతను పొందు యోగ్యతను కలిగి - పరమాత్మనే తనలో చేర్చుకొని తానే పరమాత్మకు ప్రతిరూపంగా జీవించగలడు.
                ప్రియపాఠకులారా ! ఇందుకు బైబిలు పాత నిబంధనలో యాకోబు కుమారుడైన యోసేపు లోకవైరాగి. లోకములో దేనిని ఆసింపక తన పంచేంద్రియాలను, తన స్వాధీనమందుంచుకొని ఇంద్రియ నిగ్రహణతో తన సోదరులు తనకు చేసిన అపకారము నుండి భగవద్‌ కటాక్షము చేత తప్పించబడినవాడై, అటుతర్వాత బానిసగా తాను అమ్మబడినట్టి జీవితంలో తన యజమానికి అత్యంత ప్రేమపాత్రుడుగాను, అటు తర్వాత ఐగుప్తురాజునకు ప్రేమపాత్రుడై యున్న వాతావరణములో అలౌకిక శక్తియైన అపవాది యోసేపునకు వ్రతభంగము కల్గించుటకు క్రియ జరిగిస్తూ - స్త్రీ మూలంగా యోసేపు యొక్క వ్రతాన్ని భంగము చేయుటకు సంకల్పించగా యోసేపు చలించని ఆత్మ విశ్వాసముతో పరమాత్ముని నియమమునకు కట్టుబడియున్న తనయొక్క శారీర ఆత్మీయ జీవితాలకు భంగము రానీయక, కళంకము లేక తనకు స్త్రీమూలంగా కల్గిన శోధనకు నిలిచినవాడై తద్వారా కల్గిన చెరసాల శిక్షను అనుభవిస్తూ ఒకానొక దినమున పరమాత్ముని కటాక్షము ద్వారా ఐగుప్తు ప్రభువైన ఫరోకు కల్గిన స్వప్న దర్శనమును బట్టి, ఆ స్వప్నంలో వున్న వివరాలను యోసేపు తన యొక్క పరమాత్మ జ్ఞానసంపత్తితో ఫరోయొక్క కలను వివరించిన విధానము యోసేపు యొక్క ముఖవర్చస్సులో కనబడిన దైవిక ప్రకాశము ఇవన్నియు ఐగుప్తు ప్రభావమును ఆకర్షించగా పరమాత్ముని యొక్క కృప, లోకనాధుడైన రాజు యొక్క దయకును పాత్రుడై యోసేపు ఫరో గృహంలో అత్యధికంగా హెచ్చించబడి, ''పేరునకు మాత్రమే ఫరో రాజు, కాని ఫరో యొక్క సర్వసంపద రాచరికము సింహాసనములో అర్థభాగము, ఫరో యొక్క సమస్తములో ఆధిపత్యము ఫరో యొక్క ఆసనములలో 2వ ఆసనము, ఫరో అధిరోహించు రథము ప్రక్కనే 2వ రథముపై యోసేపు ఆసీనుడగుట. ఆది 41:లో యోసేపు పరమాత్మ అనుగ్రహము పొంది ఏడు సంవత్సరములు కరువు కాటకాలలో ఐగుప్తు సామ్రాజ్యమును సుభిక్షమైన వాతావరణములో వుంచి అనగా ఏలాంటిలోటు పాట్లు లేక కరువు వాతావరణాన్ని ఎదుర్కొనినట్లు యోసేపు చరిత్రలో మనము చదువగలము. నూతన నిబంధన కాలములో పరమాత్మ సిద్ధి పొందినవారు యేసుక్రీస్తు యొక్క శిష్యులు మరియు అపొస్తలుడైన పౌలు.
                65వ శ్లోకము :- ఈ విధంగా దైవప్రసన్నత అన్నది చిత్తశుద్ధిగల దైవభక్తుడైనవానికి అన్ని విధములైన దుఃఖముల నుండి ఉపశాంతి అనగా ఉపశమనము నెమ్మది కలుగుననియు, దైవప్రసన్న చిత్తుడైనవానికి వెంటనే బుద్ధి - దైవప్రతిష్ఠిత కల్గునని ఇందులోని భావము.
                ఇందునుగూర్చి  బైబిలు ఇచ్చు వివరము - ఇది కూడా యోసేపు చరిత్రకు సమతుల్యమై యున్నది. ఎలాగంటే యాకోబు కుమారుడైన యోసేపు పుట్టుక నుండియే దైవభక్తి లోకవైరాగ్యము ప్రేమానురాగము, నిర్మలమైన మనస్సాక్షి, దైవత్వము నందు భయము భక్తి విధేయత, దైవధ్యానము, దైవయోగములోని జ్ఞానసిద్ధిని పొందుటకు తన పిన్నవయస్సు నుండియే అభ్యాసము చేసినవాడు. యాకోబు కుమారులందరిలో ఇట్టివాడు లేడు అని చెప్పవచ్చును. ఇట్టి స్థిరభక్తి గల్గిన యోసేపునకు తన అన్నలే శతృవులై వానిని పరమాత్మసిద్ధికి ఓర్వలేక కించపరచి హేళనచేసి, ఒకానొక దినమున యోసేపు అన్నలందరు ఏకమై కుట్రజేసి కపటోపాయము చేత అతనిని వంచించి కాళ్ళు చేతులు బంధించి నీరు లేని గోతిలో పడవైచి చంపుటకు ప్రయత్నింపగా యోసేపును ఆవరించి క్రియ జరిగిస్తున్న దైవశక్తి - ఆతని అన్నల యొక్క హృదయమును ఆలోచనలను మార్చి యోసేపును చంపితే ఏమియు ప్రయోజనము లేదని అతనిని బానిసగా అమ్మితే వెండి నాణెములు లభించునను ధనాశపరులై - అట్టి ఆశను పరమాత్ముడు యోసేపు అన్నలు లోకసంబంధులను ఆశావ్యామోహితులైన యోసేపు సహోదరులకు ద్రవ్యమును ఎరగా చూపి, యోసేపుకు గోతి నుండి తప్పించిన పరమాత్ముడు ఎంతటి శక్తిమంతుడో ఈ సందర్భంగా మనము ఆత్మీయంగా ఆలోచించాలి. ఆది 37:28.
                ఈ విధంగా అన్నలు పడవేసిన గోతి నుండి పరమాత్మ శక్తి యోసేపును తప్పించింది. అలాగే ఫరో భార్యయొక్క కుటిల ప్రవర్తనకు యోసేపు చెరపెట్టబడగా - ఆ చెర నుండి కూడా పరమాత్మ శక్తిచేత యోసేపు విడుదల పొందినాడు. ఈవిధంగా విడుదల పొందిన యోసేపుకు దైవ ప్రసన్నత దైవప్రతిష్థిత అందుమూలంగా లోకరీత్యా రాజ్యపరిపాలకులందరిలో హెచ్చింపు  అనగా ఉన్నత స్థానము పొందుటయేగాక, యేసు ప్రభువునకు జన్మనిచ్చిన తల్లియైన మరియ భర్తకు తండ్రిగా యాకోబు - యోసేపు గోత్రము నుండియే లోక రక్షకుడైన ప్రభువు అవతరించుటకు స్థానమును సంపాదించుకున్నాడు.
                66వ శ్లోకము :- మనోనిగ్రహము అనగా నిలుకడ కల్గిన మనస్సు లేనివానికి శుద్ధమైన మనస్సు - బుద్ధి వుండదు. ఆత్మజ్ఞానమందు ప్రవేశము కలుగదు. సద్భావనయు కలుగదు, భావన లేనివానికి శాంతియుండదు. శాంతి లేనివానికి సుఖము దేనివలన కల్గును ?
                ప్రియపాఠకులారా ! మనస్సు నిలకడలేని వానికి బుద్ధి వుండదు అన్నాడు. ఇందుకు యేసుక్రీస్తును యూదులకు పట్టిచ్చిన యూదా మనస్సు ఇందుకు సరిపోతుంది. ఎలాగంటే యేసుప్రభువు శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరి యోతు నిలకడలేని మనస్తత్వము కలవాడనుటకెట్టి సందేహము లేదు. ఎలాగంటే జీవముగల దేవుని కుమారునికి శిష్యరికం చేస్తూ - యేసుక్రీస్తులోని దైవత్వమును పరిశుద్ధతను పవిత్రతను - మహిమ శక్తి ప్రభావములను కండ్లారా చూచి ఆయనలో పాలివాడై యుండియు బుద్ధిని కోల్పోయాడు, ఆ విధమైన అజ్ఞానదశలో బుద్ధిస్ధిరతను కోల్పోయి, చంచలమైన మనోస్థితి పొంది, నెమ్మదిలేని మనస్సుకలవాడై తాను ముప్పది వెండినాణెములకు శతృమూకకు విక్రయించిన పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కళంకుడైన దైవకుమారుని యొక్క ఆత్మ ద్వారా పూర్తిగా మనశ్శాంతిని కోల్పోయి, ఉరిబెట్టుకొని ఆత్మహత్య చేసుకొన్నాడంటే బుద్ధి నిలకడ లేనివానికి పరమాత్ముడు ఇచ్చు బహుమానము మరణమేనని ఇందునుబట్టి మనకు తెలుస్తున్నది.
                67వ శ్లోకము :- పంచేంద్రియములు పనిచేయునపుడు, మనస్సు అనేది ఇంద్రియముల క్రియానుసారంగా నడిస్తే - అట్టి మనస్సు గల వ్యక్తి యొక్క ప్రజ్ఞను ఘనతను - ''నీటిలో పయనించే ఓడను తుఫాను గాలి హరించివేసినట్లగును. అనగా ఒక వ్యక్తి యొక్క పంచేంద్రియములు పరమాత్మునియొక్క చిత్తానుసారంగా సన్మార్గములో నడిపించకుండా లోకసంబంధంగా లోకసంబంధమైన భోగభాగ్యాలకు అనుగుణ్యమైన మనస్సాక్షితో ఆ నరునియొక్క జీవితాన్ని నడిపిస్తాయో - అట్టి మనస్సు ఆ వ్యక్తి యొక్క జీవితమనే ఓడను భద్రం చేయుటకు సుడిగాలివలె శతృవుగా వుంటుందని ఇందులోని భావము. ఇదియే ఇందులోని భావమునకు పరిశుద్ధ గ్రంథమిచ్చు సరియైన వివరణ.
                68వ శ్లోకము :- అర్జునా ! కావున ఎవ్వని ఇంద్రియాలు తమ విషయములనుండి అన్ని విధముల నిగ్రహింపబడునో వాని ప్రజ్ఞ సుప్రతిష్ఠితమైనది.
                ఎవ్వని ఇంద్రియములు తమ కార్యముల నుండి నరుని సుస్థిరమైన మనస్సుతో నిగ్రహించబడి పంచేంద్రియములు వాటి ఇష్టానుసారంగా నరునియొక్క ఆత్మ వికాసము, నరునిలోని దైవ ఆసక్తిని బట్టి క్రియ జరిగిస్తాయో అట్టివాని జీవితము లోకములో ఒక ప్రత్యేక స్థానమును పొందుటయేగాక దైవత్వముచేత అట్టి వ్యక్తి ప్రతిష్ఠితుడగుతాడు. ఇందుకు కూడా పరిశుద్ధ గ్రంథములో సమూయేలు చరిత్ర ఋజువైయున్నది. బాల్యము నుండి సమూయేలు పెద్దల యందును గురువుల యందును యాజకుల యందు, అంతేగాకుండ సమస్తమునకు మూలమైన సృష్టికర్తయైన పరమాత్మునియందును వినయము విధేయత, భక్తి శ్రద్ధ ఆత్మ నిగ్రహణము, బాల్యము నుండియే మంచి సాక్ష్యమును పొందుటయేగాక దేవుని బలిపీఠమునకు యాజకుడుగాను, దేవుని యొక్క రాజ్యపరిపాలనచేసే వ్యక్తులను అభిషేకించు ప్రవక్తగాను, దైవచిత్తానుసారంగా ఆయన వాక్కునుబట్టి, వినయవిధేయతలు గల్గిన ఒక మంచి వాక్శుద్ధిగల గొప్ప దైవ సంభూతునిగ పరిశుద్ధ గ్రంథములో లిఖించబడియున్నాడు.
                69వ శ్లోకము :- సకల ప్రాణులకు నేదిరాత్రియో ఆత్మను దర్శించుచున్న బుద్ధిశాలికి అది పగలుగా నుండును. సకల ప్రాణులు ఎందు మెలకువగల్గి యుండునో బుద్ధిశాలియగు సంయమశీలుడైన మునికి అది రాత్రి యగుచున్నది. అనగా ఆత్మజ్ఞానికి ఏది పగలుగా వుండునో - అజ్ఞానికి అది రాత్రిగా నుండును.
                ఈ శ్లోకభావమునకు బైబిలు సమాధానము కీర్తన 1:1-2 దీటైన దృష్టాంతములై యున్నవి. అనగా ''దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇందులో దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నిలిచి అపహాసకులు కూర్చుండుచోట కూర్చును వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికది చీకటి వాతావరణమని అర్థము. అయితే ఆత్మ సంబంధియైనవాడు ఆత్మజ్యోతిలో వెల్గించబడిన దేవుని ధర్మశాస్త్రము నందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానిస్తుండుటను బట్టి అట్టివాడు దేవుని సన్నిధిలో ధన్యుడు. అంతేగాకుండ బుద్ధిశాలియైన అట్టివాని జీవితము కీర్తన 1:3లో వలె ''నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండుటయేగాక అతడు చేయు పనియంతయు కూడా సఫలీకృతమగుచున్నది. ఇది ఈ శ్లోకానికి దీటైన వివరణ.
                70వ శ్లోకము :- అన్ని ప్రదేశములను నిండుచు ఎల్లప్పుడును హెచ్చుతగ్గులు లేకుండ నిలిచియున్న సముద్రములో జలములు ఎట్లు ప్రవేశించునో అట్లే అఖిల ఇష్టార్థ కామములు అనగా సమస్తమైన కోరికలు బ్రహ్మనిష్ఠుని యందు అణిగిపోవుచు శాంతిని పొందుచున్నాడు, కాని కోరికలపై కోరికలు గలవాడు శాంతిని పొందజాలడు.
                ఇందుకు బైబిలు ఇచ్చు దీటైన జవాబు కీర్తన 125:1-2 యెహోవా యందు నమ్మిక యుంచువారు - కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టు పర్వతములున్నట్లు - యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలచుట్టూ వుండును''.
                ఈ విధంగా దైవరక్షణ వున్నవానికి లోకసంబంధమైన కామక్రోధ మదమాత్సర్యములనే టటువంటి అరిష్ట గుణములు వానిని అంటవు. అనగా అట్టివానిని ఇతను తన ఆత్మశక్తి ద్వారా నిరోధించి ఎల్లప్పుడు శాంత స్వభావముగలవాడై విశాలమైన ఘోషలేనటువంటి జలరాశినివలె నిశ్శబ్దమైన వాతావరణమును పోలి, ప్రశాంతమైన మనోస్థితిగలవాడై నిత్యసంతోషాన్ని అనుభవిస్తాడు. అయితే లోక సంబంధమైన కోరికలపై కోరికలు అనగా విపరీతమైన కోరికలు కలవాడు శాంతిని పొందలేడు.
                ప్రియపాఠకులారా ! ఈ సందర్భములో మత్తయి సువార్త 2వ అధ్యాయము మనము చదివినట్లయితే - ''రాజైన హేరోదు దినములలో యూదయా దేశపు బేత్లెహేములో పరమాత్మ సుతుడైన యేసు పుట్టిన పిమ్మట ఆయన జన్మవార్తను, ఆయన నక్షత్రం ద్వారా ఎరిగిన నక్షత్ర శాస్త్రజ్ఞులును తత్సంబంధమైన ముగ్గురు జ్ఞానులు యెరూషలేములో ప్రవేశించి, అప్పటి యెరూషలేము పరిపాలకుడైన హేరోదుతో యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింపవచ్చితిమి,'' అని అన్నపుడు ఆనాటి యెరూషలేము రాజైన హేరోదు అతని అనుచరులు కలవరపడినట్లు వ్రాయబడియున్నది. ఇందునుబట్టి మనము తెలిసికోవలసినదేమనగా హేరోదువలె దీర్ఘకాలము రాజ్యమును పరిపాలించే కాంక్ష, జీవితం మీద వైరాగ్యము కంటె దాన్ని గూర్చి ఎక్కువ కాలము దీర్ఘాయుష్మంతుడుగా వుండాలని, ఎల్లకాలము తాను పరిపాలించుచున్న రాజ్యము తనకే పరిమితమై నానావిధమైన కోర్కెలతో లోకవాంఛలను అనుభవించాలని, లోకాన్ని సుదీర్ఘంగా పరిపాలించాలని అనుకుంటున్న వానికి మనశ్శాంతి వుండదని హేరోదు పొందిన కలవరపాటు మనకు బయల్పరచుచున్నది. అనగా హేరోదు లోకసంబంధి - మరియు కఠినవైఖరి గల వ్యక్తి కౄరుడు జిత్తులమారి కుటిలుడు ఈర్ష్యాద్వేషములు కలవాడు. హత్యజేయుటకును చంపుటకును వెనుకాడని వ్యక్తి అనగా కుటిలుడు. ఇట్టి కుటిలత్వము గలవానికి కోరికలమీద కోరికలు అతనిని కలవరపెట్టుచు అతనికి మనశ్శాంతి లేకుండ చేస్తుంటాయని దీని భావము.
                71వ శ్లోకము :- ఏ పురుషుడు సకల కామములను వదలి నిస్పృహుడును, మమకార అహంకారాలను వదలి సంచరించునో వాడే శాంతి పొంది, దుఃఖనివృత్తి రూపమైన మోక్షమును పొందును.
                ప్రియపాఠకులారా ! ఇందులోని భావమేమిటంటే ఏ వ్యక్తియైనను లోకసంబంధమైన దేహసంబంధమైన కామక్రోధ మదమాత్సర్యములు అను అరిషడ్వర్గములను వదలి ఇంద్రియ నిగ్రహణ స్వభావము గలవాడు లోకము మీద మమకారము, భార్యాపుత్రాదుల మీద వాంఛలు, లోకసంబంధమైన భోగభాగ్యాలను త్యజించి పరమాత్మునిలో మనస్సును లగ్నపరచి, నిరాడంబరముతో సౌమ్యంతో, హృదయశుద్ధితోను ప్రశాంతమైన మనస్సాక్షితోను, వేద పఠనము ప్రార్థనను ఆచరించువాడెవడో అట్టివానికి సంపూర్ణ మనశ్శాంతి పొందునని ఇందులోని భావము.
                ప్రియపాఠకులారా ! ఈ సందర్భములో బైబిలు వేదము నుండి పాతనిబంధనలో ఒకరిని, నూతన నిబంధనలో ఒకరిని ఉదాహరణగా తీసికొందము. ఆది 5:21-24 మనము చదివితే ఆదాము కుమారుడైన హనోకు సంసారబంధము కలిగియున్నను దాదాపు 300 ఏండ్లు దైవమార్గములో ప్రయాణం చేస్తూ - ఇటు సంసార చట్టాన్ని పాటిస్తూ - కుమారులను కుమార్తెలను కంటూ హనోకు తన ఆయుష్కాలమును 365 ఏండ్లుగా జేసుకొని పరమాత్మునితో నడుస్తూ - తర్వాత పరమాత్ముడు అతనిని తనలో లీనముజేసికొని కొనిపోయెను గనుక అతడు శరీరులైన లోకనరులకు కనుమరుగై అదృశ్యుడాయెను. శరీరముతో పరమాత్మునిలో లీనమైనట్లుగ ఇందులోని భావము. ఇందును బట్టి ప్రియపాఠకులారా ! హనోకు వలె సకల విధములైన లోకేచ్ఛలను శరీర గుణాతిశయములను త్యజించి, మమకారము అహంకారము అహంభావము, ఈర్ష క్రోధాది గుణములను వదలి దైవత్వాన్ని అభిలషిస్తాడో వాడే శాంతిస్వభావుడని ఈ భగవద్గీతలోని ఈ శ్లోకానికి పరిశుద్ధ గ్రంథములో హనోకు చరిత్ర సవాలుగ వున్నది.
                ఇక నూతన నిబంధనలో అపొస్తలుల కార్యము ఈ సందర్భములో 9:లో సౌలుగా జీవించిన పౌలు యొక్క చరిత్ర. ప్రియపాఠకులారా ! పౌలులో రెండు విధములైన జీవితాలు మనకు కనబడుచున్నవి. పౌలులో ఉన్న రెండు విధములైన జీవితాలనుబట్టి పౌలు యొక్క పేరు కూడా రెండు విధములుగా వున్నది. దైవత్వమునకు దూరుడైయున్నపుడు అనగా దైవత్వమునకు కేంద్రమైయున్న యేసుక్రీస్తు యొక్క మార్గమునకును, ఆయన యందు విశ్వాసముంచి ఏర్పరచబడిన భక్తసందోహమునకు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించు పరిచారకులకు అడ్డుబండగాను వుంటూ లోకమును లోకప్రభుత్వమును లోక అధికారమును లోకచట్టమే తనకు ప్రాణాధారమైనట్లు కఠినచిత్తుడై - అహంకారము క్రోధముగలవాడును స్థూలకాయుడును, మహాధైర్యశాలియు రాజ్యాధికారము పొందినవాడును, ఆయుధధారియు సైనిక వర్గమును ధరించినవాడును, రాజాశ్వమును వాహనంగా పొంది, రాజ్యాధికారమును పొంది, సకల విధములైన ఆధిపత్యములతో గర్వాంధుడై అంతేగాకుండ తాను ప్రత్యేకించి మరెక్కువ అధికారమును పొందుటకు దమస్కులోని పరిపాలకుల వద్ద నుండి ప్రత్యేకమైన అధికారాలకు ప్రాకులాడుచు, లోకములో తనను ఎదిరించువారు లేనట్లుగానే దైవబిడ్డలలో కూడా తనను ఎదిరించువారు ఉండకూడదని అనగా ఒక్కమాటలో చెప్పాలంటే దైవత్వముతోనే సవాలుచేస్తూ - లోకాధికార బలముతో దైవత్వముతోనే పోరాడుటకు ఉద్యుక్తుడయ్యెను.
                ఈవిధంగా అహంకార వాతావరణములో కఠినమైన గుణాతిశయములతో ఒకానొక దినమున దైవత్వమునకు వ్యతిరేకమైన మార్గములో ఈ సౌలు అశ్వారోహితుడై బలాఢ్యులైన సైనిక కాపుదలలో రాజాశ్వము నెక్కి, రొమ్ము విరిచి గుర్రపు స్వారీ చేయుచున్న తరుణములో పరమాత్ముని యొక్క శక్తి ఘాతమునకు గుర్రమును తన ఆయుధములను కోల్పోవుటయేగాక తుదకు తన దేహమునకు అతి ముఖ్యమైనట్టి కంటి చూపును కూడా కోల్పోయి అంధుడై దైవపుత్రులను బంధించి వారిని చెరపెట్టి హింసించి చంపుటకు అధికారమును సంపాయించిన ఈ వ్యక్తి - నిస్సహాయుడును అంధుడును నిరాదరణ పరుడునై తనకున్న సర్వస్వమును కోల్పోయినవాడై అశక్తుడుగ పరమాత్ముని సన్నిధిలో ఒక దోషిగా పిలువబడి తానున్న లోకజీవితమును తాననుభవించిన శారీర గుణాతిశయములను తన ఐహిక గుణములను విసర్జించి నాటి నుండి అనగా దైవ వెలుగును పొందిన నాటి నుండి తనలో వున్నటువంటి దేహవాంఛలను, దేహ సంబంధమైన గుణాతిశయములను, తుదకు రాజభోజన పదార్ధములను ఖరీదైన వస్త్రాలను లోకాధికారములను, తన బలమును తన శక్తిని తన సేవను తన ఊడిగమును కూడా లోకము వైపుగాకుండ, తను లోక సంబంధంగా జరిగించిన ప్రతి క్రియను విసర్జించి తన శరీర జీవితమును పరమాత్మునివైపు నడిపించి పరమాత్ముని జ్ఞానదీక్షతో, సౌలుగా లోకసంబంధిగా జీవించిన ఆ వ్యక్తి శరీర జీవితము నుండి ఆత్మీయ జీవితమునకు మరల్చబడి పేరు మార్పిడి మూలంగా పౌలుగా జీవించాడు. అంతేగాకుండ నూతన నిబంధనలో అపొస్తలులుగ పిలువబడిన వారందరిలో అగ్రగామి అయ్యాడు. అంతేగాకుండ పరలోక పట్టణానికి అధిపతియైన క్రీస్తును ధరించుకొని 1 కొరింథి 11:1లో వలె లోకాన్ని సవాలు చేస్తూ - ''నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి,'' అని పలికాడు. ప్రియపాఠకులారా ! ఇట్టివాడు శాంతి వర్తనుడును అనగా సంపూర్ణ మనశ్శాంతిని పొందిన వాడని బైబిలు వేదము ప్రకటిస్తున్నది.
                72వ శ్లోకము :- అర్జునా ! ఇదియే బ్రహ్మనిష్ఠ అనబడును. దీనిని పొందినవాడు మోహపాశములను తగుల్కొనడు. అంత్యకాలమందైనను అనగా మరణకాలమందైనను ఈ నిష్ఠ అలవడినను వాడు బ్రహ్మానందమును పొందును.
                కనుక ప్రియపాఠకులారా ! పౌలుగా మారిన సౌలు పొందిన దైవానుభవమును బట్టి ఆత్మీయ ఆనందమును బట్టి ఆత్మ సిద్ధినిబట్టి క్రీస్తును ధనముగా పొందిన పౌలు 1 కొరింథి 11:1లో వలె పౌలు క్రీస్తును ధరించుకొని, క్రీస్తుయొక్క  ఆత్మీయానందమును పొంది - లోకసంబంధమైన వాటిని పెంటగా ఎంచుకొన్నట్లుగా వేదములో చదువగలము. కనుక ఒక్కసారి లోకసంబంధమైన అనుభవము నుండి దైవత్వముచేత మలచబడి, దైవాత్మను పొందినవాడై, మరల వెనుకటి స్థితికి మరలుటన్నది దుర్లభమనియే ఇందునుబట్టి మనకు తెలియుచున్నది.
                పాఠక మహాశయులకు ఈ సందర్భములో గ్రంథకర్త ప్రకటించు సత్యదేవుని గూర్చిన సత్యవేద ప్రవచనములు.
                మూలము : అపోస్తలుల కార్యములు 17:24-31 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడుకాడు. మరియు యావద్భూమి మీద కాపుముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని, తనను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా వుండువాడు కాడు. మనము ఆయన యందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె మనము ఆయన సంతానమై యుండి బంగారు వెండి రాతితో చేయబడి మనుష్యుల చమత్కార కల్పనలతో మల్చబడిన విగ్రహాలను దైవత్వము పోలియున్నదని తలంపకూడదు. ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా వుండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పుదీర్చబోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలో నుండి సశరీరుడుగా ఆయన లేచినందున నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసియున్నాడు.

ఇది భగవద్గీతలోని సాంఖ్యయోగ భాగము సమాప్తము.

No comments :

Post a Comment